సంపాదకీయం

సేంద్రియ చికిత్స..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదస్సులు జరుగుతున్నాయి, అంతర్జాతీయ అవగాహనలు కుదురుతున్నాయి, విభేదాలు విస్తరిస్తున్నాయి, మళ్లీ మళ్లీ సయోధ్యలు కూడ ఏర్పడుతున్నాయి. కార్యాచరణ పథకాలు రూపొందుతూనే ఉన్నాయి. పరిసరాలు మాత్రం కలుషితం అవుతూనే ఉన్నాయి. పర్యావరణం నిరంతరం మరింతగా వేడెక్కిపోతోంది.. కాలుష్యం వేడిమిని పెంచుతోంది, పెరిగిన ఉష్ణోగ్రత ‘హిమాలయ’ శ్రేణులను సైతం కరిగించి వేస్తోంది, సముద్రాలను మరింతగా ఉప్పొంగ చేస్తోంది, ఉప్పొంగుతున్న సముద్రాలు అనేక ద్వీపాలను శాశ్వత జల సమూహాలుగా మార్చివేయనున్నాయి. ఇలా సముద్ర మధ్యంలో ఉన్న అనేక చిన్న దేశాలు - ద్వీపాలు- అంతరించిపోవడం ఖాయమన్నది జరుగుతున్న ప్రచారం. ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన సంఘం’- ఇంటర్ గవర్నమెంటల్ పానల్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్- ఐపిసిసి- వారు రూపొందించిన నివేదిక ఈ భయాందోళనలకు సరికొత్త ధ్రువీకరణ. ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతున్న తీరు ఇలాగే కొనసాగితే 2030-2052 సంవత్సరాల మధ్యకాలంలో ప్రపంచ పర్యావరణం మరో రెండు డిగ్రీల- సెల్సియస్- మేర వేడెక్కిపోగలదన్నది ‘ఐపిసిసి’ వారు కనిపెట్టిన కాలుష్య ప్రభావం తీరు! ఇలా ఉష్ణోగ్రత సగటున రెండు డిగ్రీల సెల్సియస్ మేర పెరగకుండా నిరోధించడానికి వీలుగా కర్బన- బొగ్గు- వ్యర్థాలను పర్యావరణంలోకి వదలకుండా నిరోధించాలని, కనీసం నియంత్రించాలని అంతర్జాతీయంగా అన్ని దేశాల వారు మిగిలిన అన్ని దేశాలవారినీ కోరుతుండడం నడుస్తున్న ‘నాటకం’. చైనా, అమెరికా వంటి భారీ కాలుష్య కారక దేశాలు తమ దేశాల నుండి వెలువడుతున్న భారీ కర్బన కాలుష్యాన్ని నియంత్రించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం లేదన్నది అంతర్జాతీయ సమాజం ఎరిగిన వాస్తవం. చైనా సువిశాలమైన టిబెట్‌లో దశాబ్దులపాటు అపురూప ఖనిజ ధాతువుల- రేర్ అర్త్ మినరల్స్- కోసం, అటవీ సంపదను కొల్లగొట్టడం కోసం జరిపిన తవ్వకాల వల్ల కాలుష్యం పెరిగింది. కాలుష్యంతో పెరిగిన వేడిమి వల్ల యాబయి ఏళ్ల కాలవ్యవధిలో హిమాలయాల ‘మంచు శకలాలు’ పదమూడు శాతం కరిగిపోయాయి, రాళ్లగుట్టలు బయటపడినాయి. ఫలితంగా మన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరఖండ్ వంటి ప్రాంతాలను అకాలపు వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరఖండ్‌లో ఐదేళ్ల క్రితం సంభవించిన బురద వరదలు విస్తరించిపోయిన కాలుష్యానికి ప్రతీకలు.. ఉష్ణోగ్రత పెరుగుదలను ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్ స్థాయికి నియంత్రించినప్పటికీ ప్రమాద తీవ్రత తగ్గగలదన్నది ‘ఐపిసిసి’ వారు చెబుతున్నమాట! అర్ధ డిగ్రీ సెల్సియస్ సగటు ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ పర్యావరణ సంతులనం కొంతమేర పెరుగుతుందట. అర్ధ డిగ్రీ ఉష్ణోగ్రత సగటున పెరగడం వల్ల కూడ మానవ ఆరోగ్యస్థితి దెబ్బతిని జబ్బులు పెరగడం ఖాయమన్నది ‘ఐపిసిసి’ నిర్ధారణ. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల మన దేశం రకరకాల ప్రాకృతిక వైపరీత్యాలకు గురికాక తప్పదట. వచ్చే వేసవిలో వడగాల్పుల తీవ్రత మరింత పెరగగలదన్న హెచ్చరిక ఒక ఉదాహరణ మాత్రమే!
ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుములను బిగించి ఉండడం హర్షణీయ పరిణామం. సేంద్రియ పద్ధతిలో రూపొందుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు ఇరవై శాతం కనీసపుమద్దతు ధరను అదనంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఇది నిర్ణయంగా మారి, కార్యరూపం ధరించినట్టయితే సేంద్రియ వ్యవసాయ విస్తరణకు మరింత దోహదకారి కాగలదు. ఐదారు దశాబ్దుల క్రితం వరకు మన దేశంలోని మొత్తం వ్యవసాయం సేంద్రియ పద్ధతిలోనే జరిగేది. కృత్రిమ రసాయన విషాలతో తయారైన ఎఱువులను, క్రిమిసంహారక ఔషధాలను వాడకుండా పొలాన్ని పండించడం సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం ప్రాకృతికమైనది. రసాయన విషాలను ఎఱువులుగాను, క్రిమికీటక నాశనులగాను వాడి సేద్యం చేయడం కృత్రిమ వ్యవసాయం. ఈ కృత్రిమ వ్యవసాయం కారణంగా లక్షల కోట్ల రూపాయల విలువైన రసాయన విషాలు ప్రతి ‘కారు’- సీజన్-లోను భూమిలో కలుస్తున్నాయి. ప్రతి ఎకరానికి పంటనుబట్టి ప్రతి కారులో పది నుండి ముప్పయివేల రూపాయల ‘రసాయనాలు’ అవసరమవుతున్నాయి. ఈ రసాయన విషాల వల్ల నిరంతరం ప్రకృతి ప్రధానంగా భూమి కాలుష్యగ్రస్తమై విషపు ఆవిరులను కక్కుతోంది. ఇది పర్యావరణం వేడెక్కడానికి దోహదం చేసింది, దోహదం చేస్తోంది. ‘వానపాములు’- ఎఱలు- అర్త్‌వార్మ్స్- భూమిపై పొరలను నిరంతరం తమ ‘శరీర చాలనం’తో దున్ని పరిపుష్టం చేస్తున్నాయి. ఇది అనాదిగా జరుగుతున్న ప్రక్రియ. దీనివల్ల భూమి పదే పదే సారవంతం అవుతోంది. కానీ గత నాలుగైదు దశాబ్దులలో సంప్రదాయమైన సేంద్రియమైన ఎఱువుల వాడకం తగ్గిపోయింది. కృత్రిమ విష రసాయనపు ‘ఎఱువుల’ వాసనలతో వానపాములకు ఊపిరి ఆడడం లేదు. అందువల్ల ఈ విష ప్రభావం నుంచి తప్పించుకొనడానికై ‘వానపాములు’ భూమిలో ఇరవై ముప్పయి అడుగుల లోతునకు వెళ్లి దాక్కున్నాయి. అంత లోతున అవి భూముని దున్నడం వల్ల పంటలకు ప్రయోజనం లేదు..
ఇలా దశాబ్దుల తరబడి రసాయన విషాలు భూమిని, పర్యావరణాన్ని కాలుష్యగ్రస్తం చేశాయి. కాలుష్యం వేడి. ఈ ‘కృత్రిమ వ్యవసాయాన్ని’ రద్దుచేయడం వల్ల సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల వ్యవసాయ వ్యయం ఎనబయి నుంచి తొంబయి శాతం తగ్గిపోతుంది, భూమి, పర్యావరణం కాలుష్యం నుంచి విముక్తమై ‘వేడిమి’ క్రమంగా తగ్గిపోతుంది. ‘ఐపిసిసి’ వారు కేవలం ‘అర్ధ డిగ్రీ సెల్సియస్’ వేడిమిని తగ్గించడమే కష్టమని భావిస్తున్నారు. కానీ సేంద్రియ వ్యవసాయాన్ని సర్వసమగ్రంగా పునరుద్ధరించడంవల్ల ‘రెండు డిగ్రీల’ సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరగకుండా నిరోధించడం మాత్రమే కాదు, మరో రెండు డిగ్రీల మేర ‘వేడిమి’ని - కాలుష్యాన్ని- తగ్గించవచ్చు కూడ! ఎందుకంటె సేంద్రియ వ్యవసాయానికి ఎఱువులు, క్రిమినాశక ఔషధాలు దేశవాలీ ఆవుల నుంచి అడవుల నుంచి లభిస్తాయి. సేంద్రియ వ్యవసాయం దేశమంతటా విస్తరించినట్టయితే అడవుల విస్తీర్ణం కూడ సమాంతరంగా విస్తరించాలి, దేశవాలీ ఆవుల సంఖ్య కూడ గణనీయంగా పెరిగి తీరాలి. ఎందుకంటె అడవులలో లభించే పచ్చి ఆకులు సారవంతమైన మన్ను, దేశవాలీ ఆవుల నుంచి లభించే పేడ, మూత్రం ఇతర ‘గవ్యాలు’ సేంద్రియ వ్యవసాయానికి సహజమైన ఎఱువులు.. ఈ ఎఱువులు లభించాలంటే అడవులను ఇతోధికంగా పెంచాలి, దేశవాలీ ఆవులను సంరక్షించాలి. వాటి సంఖ్యను ప్రస్తుతం ఉన్న సంఖ్యకంటె కనీసం ఐదారు రెట్లు పెంచాలి! ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పరిణామం కాగలదు. సిక్కిం ప్రాంతం ఇప్పటికే సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ సీమగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ ఈ సేంద్రియ ప్రతిజ్ఞను చేసింది. ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తులకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచనున్నదట..
ఆవుపేడ, గోమూత్రం వంటి ‘గవ్యాల’- గోఉత్పత్తుల- వాసన సోకగానే ‘వానపాములు’ పులకించి పరవశించి పోతాయట.. రసాయన విష వాసనలకు జడిసి లోతులకు వెళ్లిన ‘వానపాములు’ ‘గవ్యాల’ సుగంధాల కోసం మళ్లీ భూమి పైపొరలలోకి చేరి బిలబిలమంటూ వచ్చి చేరుతున్నాయి. వానపాముల ‘శరీర చాలనం’ భూమికి పరిపుష్టి, జీవం, జవం.. సేంద్రియం వల్ల మానవ ఆరోగ్యం, ప్రకృతి ఆరోగ్యం పెరుగుతాయి, కాలుష్యం తగ్గుతుంది, వేసవి తాపం కూడ..