సంపాదకీయం

అమెరికా అనుమతి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరాన్ నుంచి ‘ఇంధన తైలం’ కొనుగోలు చేయడానికి వీలుగా మన ప్రభుత్వానికి తాత్కాలిక అనుమతిని ప్రసాదించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనం. ఈ ఆధిపత్య ఉన్మాదాన్ని అమెరికా ప్రజలు సైతం నిరసిస్తుండడం నడుస్తున్న చరిత్ర.... అమెరికాకు దాదాపు వంద ఏళ్లుగా సన్నిహిత మిత్రదేశాలుగా ఉంటున్న ఐరోపాకు చెందిన ప్రభుత్వాలు సైతం ఇరాన్ పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న ‘అనవసర’ వ్యతిరేకతను నిరసిస్తున్నాయి. మన ప్రభుత్వం ‘నిరసన’ను తెలపడం సైతం నిరర్ధకమని భావిస్తోంది, అమెరికా ఇరాన్‌కు వ్యతిరేకంగా విధించిన వాణిజ్యపరమైన ఆంక్షలను పట్టించుకోరాదన్నది మన ప్రభుత్వ విధానం.... నిరంతరం మారుతున్న అంతర్జాతీయ రాజకీయ ఆధిపత్య వైపరీత్యాల దృష్ట్యా అమెరికాతోను ఇరాన్‌తోను మనం మైత్రిని పాటించవలసిన అనివార్యం ఏర్పడి ఉంది. కానీ ఇరాన్‌తో మన మైత్రిని, వాణిజ్య సంబంధాలను నిర్ణయించుకోవలసి మన ప్రభుత్వం.... తన అభీష్టానికి అనుగుణంగా మన ప్రభుత్వం ఇరాన్‌తో మన సంబంధాలను నిర్ణయించాలన్నది దశాబ్దికి పైగా అమెరికా ప్రభుత్వ విధానమైంది. ఈ అమెరికా విధానం మన విదేశాంగ నీతిని నిర్దేశించడానికి యత్నించడం అక్రమ ప్రమేయం! ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రచారంచేస్తున్న అమెరికా ప్రభుత్వం తన ఆధిపత్యానికి లోబడి ఈ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని భావించడం విచిత్రమైన వ్యవహారం. మన దేశపు అంతర్గత వ్యవహారాలలో ఇలా అక్రమంగా జోక్యం కల్పించుకొనడానికి యత్నిస్తున్న అమెరికా ప్రభుత్వం ‘సార్వభౌమ దేశాల మధ్య సమానత్వం’అన్న వౌలిక దౌత్య సూత్రాన్ని ఉల్లంఘిస్తోంది. ఈ ‘ఉల్లంఘించడం’ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయిన తరువాత ఉన్మాదంగా మారింది! ‘‘మద్యం తాగి మత్తెక్కిన మర్కటం’’వలె డొనాల్డ్ ట్రంప్ అంతర్గతంగాను, అంతర్జాతీయంగాను గంతులు వేస్తున్నాడు. ట్రంప్‌కు పూర్వం అమెరికా అధ్యక్షుడుగా ఉండిన బర్రాక్ హుస్సేన్ ఒబామా కాలంలో అమెరికాకు ఇరాన్‌కు మధ్య సంధి కుదిరింది, ‘సమష్టి సమగ్ర కార్యాచరణ పథకం’- జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్- జెసిపిఓఏ- కుదిరింది. ‘ఇరాన్ ఒప్పందం’గా పేరుపడిన ఈ పథకంలో ‘ఐరోపా సమాఖ్య దేశాలు’ అనేక ఇతర దేశాలు భాగస్వాములు. ఈ ఒప్పందంమేరకు ఇరాన్ ప్రభుత్వం అణ్వస్త్ర ఉత్పత్తి కార్యక్రమాన్ని రద్దుచేసుకొంది. తమ దేశంలోని అణు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ‘అంతర్జాతీయ అణుశక్తి మండలి’ ప్రతినిధులు తనిఖీ చేయడానికి కూడ ఇరాన్ అంగీకరించింది! కానీ ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది మే నెలలో ట్రంప్ ఏకపక్షంగా రద్దుచేశాడు. కానీ ‘ఐరోపా సమాఖ్య’ దేశాలు మాత్రం ఇరాన్‌తో ఒప్పందాన్ని కొనసాగించడానికి నిర్ణయించాయి. ట్రంప్ ‘చిందులు’తొక్కుతుండడానికి ఇది మరో కారణం!! తమ ‘శత్రువు’ ప్రపంచానికి శత్రువు, తమ ‘మిత్రుడు’ ప్రపంచానికి మిత్రుడు- అన్నది అమెరికా విధానం. ఇరాన్ నుంచి వివిధ దేశాలు ‘చమురు’ను ‘ఇంధన వాయువు’ను కొనుగోలు చేయరాదన్నది అమెరికా ‘‘ఆదేశం....’’
ఈ ఆదేశాన్ని అతిక్రమించి ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలకు వ్యతిరేకంగా చర్యలను తీసుకుంటామని ట్రంప్ గత మే నెల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ చర్యల స్వరూప స్వభావాలు ఏమిటన్నది స్పష్టంకాని విషయం. అయినప్పటికీ అమెరికా ప్రభుత్వంవారి ‘చర్యల’కు భయపడిన అనేక ఐరోపా సంస్థలు ఈ ఆరు నెలల కాలంలో ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను తగ్గించి వేశాయి. మన దేశానికి సైతం ఇరాన్ చమురు దిగుమతులు తగ్గిపోయాయి. కానీ ఇందుకు కారణం మన ప్రభుత్వం అమెరికా బెదిరింపులకు లొంగిపోవడం కాదు. ‘్ధర’ను ‘డాలర్ల’లో కాక రూపాయలలో చెల్లించాలన్న ప్రతిపాదనపై కొనసాగిన విభేదాలు మాత్రమే ఈ తగ్గింపునకు కారణం. పెట్రోలియం ఉత్పత్తులను తగ్గించాలన్న ‘పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి’- ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్- నిర్ణయం మరో కారణం! ఈ నేపథ్యంలో ఎనిమిది దేశాలకు మాత్రం ఇరాన్‌నుంచి పెట్రోలియం కొనుగోలు చేయడానికి ట్రంప్ దొరగారి ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతిని ప్రదానం చేయడం ‘మేకపోతు గాంభీర్యం’... మన దేశంతోపాటు చైనా, ఇటలీ, గ్రీసు, టర్కీ, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ ప్రభుత్వాలకు కూడ అమెరికా ‘అనుమతి’ని ప్రసాదించింది. ఈ ‘తాత్కాలిక అనుమతి’కి ఎలాంటి ‘కాలపరిమితి’లేదు కాబట్టి ఇది ‘శాశ్వత అనుమతి’కానుంది. ఈ ఎనిమిది దేశాలు ఎలాగూ అమెరికా ఇరాన్‌కు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను పాటించవు. అందు అనుమతిని ప్రసాదించినట్టే అభినయించడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ లేని అధికారాన్ని ఉన్నట్టుగా చాటుకొనడానికి యత్నిస్తున్నాడు!!
ఇరాన్ నిజానికి మనకు మిత్ర దేశం కాదు. మైత్రిని అభినయిస్తోంది! గతంలో ఇరాన్ మనపట్ల నయ వంచనకు పాల్పడింది. ప్రస్తుతం కూడ చైనాకూ మనకూ మధ్య, పాకిస్తాన్‌కూ మనకూ మధ్య ‘సమదూరం’ పాటిస్తున్నట్టు అభినయిస్తోంది. కానీ ‘ఇస్లాం మత రాజ్య కూటమి’లోని అత్యధిక దేశాల వలెనే ఇరాన్ పాకిస్తాన్‌కు సహజ మిత్రదేశం! ఇరాన్‌నుంచి పాకిస్తాన్ మీదుగా మన దేశానికి గొట్టపు మార్గాన్ని నిర్మించే పథకం మూల పడడానికి ఇరాన్ మతోన్మాద ప్రభుత్వం పదేళ్లపాటు చేసిన నయవంచన కారణం! ఈ గొట్టపు మార్గం- పైప్‌లైన్- ద్వారా ఇరాన్‌లోని గనులనుంచి ఇంధన వాయువును మన దేశానికీ, పాకిస్తాన్‌కూ సరఫరాచేయాలన్నది 2003నుంచి కొనసాగిన ప్రతిపాదన. ‘‘అదుగో ఇదుగో...’’అంటూ ఇరాన్ తొమ్మిదేళ్లపాటు ఈ పథకాన్ని అమలుజరుపకుండా కాలయాపన చేసింది. చివరికి 2012 మార్చిలో ఈ పథకం నుంచి మన దేశాన్ని తొలగించారు, పాకిస్తాన్ ఇరాన్‌ల మధ్య ఈ ‘పైప్‌లైన్’ ఒప్పందం కుదిరింది! ఇరాన్ అణ్వస్త్రాలను తయారుచేయరాదని, చేసినట్టయితే అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలని 2006లో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని మన దేశం బలపరిచింది. ఇందుకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. కానీ మన విధానాన్ని, అంతర్జాతీయ అభిప్రాయాన్ని 2014 తరువాత ఇరాన్ సైతం అంగీకరించింది. ఇరాన్‌లో ‘కరడుకట్టిన జిహాదీ’ల ప్రభావంతగ్గి ఉదార విధాన సమర్ధకుల ప్రభావం పెరగడం ఇందుకు కారణం. అణ్వస్త్ర ఉత్పత్తికి ఇరాన్ స్వచ్ఛందంగా స్వస్తిచెప్పింది. ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ పథకం’ ఒప్పందం కుదరడానికి ఇదీ నేపథ్యం. ఇరాన్‌లోని ‘చౌబహార్’ ఓడరేవు అభివృద్ధి పథకం మన దేశానికి దక్కడానికి ఇదీ నేపథ్యం! కానీ ‘చౌబహార్’ ప్రాంగణంలోకి చైనాను కూడ చేర్చాలని ఇరాన్ ఈ ఏడాది ఆరంభంలో నిర్ణయించడం మన దేశానికి వ్యతిరేకంగా జరిగిన పరిణామం....
ఏమయినప్పటికీ ఇరాన్‌పట్ల మన విధానాన్ని నిర్ణయించుకోవలసింది మన ప్రభుత్వం.... మన ప్రభుత్వాన్ని ‘‘తాను నడుపుతున్నట్టు’’ అభినయించడానికి ట్రంప్ అభినయించ యత్నిస్తున్నాడు. ఈ అభినయంలోని డొల్లతనం ప్రపంచానికి ఎప్పటికప్పుడు తేటతెల్లవౌతూనే ఉంది! ప్రజల వోట్లలో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కంటె తక్కువ వచ్చినప్పటికీ 2016లో ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. అమెరికాలోని ‘సమాఖ్య’ - ఫెడరల్- స్ఫూర్తికి అనుగుణమైన విచిత్రమైన ఎన్నికల పద్ధతి ఇందుకు కారణం! ఇలా ఊహించని రీతిలో అధికారం లభించినప్పటినుంచి ట్రంప్ ‘‘నోటిలో కాలు పెట్టుకునే’’ విధానాలను అనుసరిస్తున్నాడు. మిత్ర దేశాలను సైతం శత్రుదేశాలుగా మార్చుకుంటున్నారు. ఇరుగుపొరుగు దేశాలైన మెక్సికోతోను కెనడాతోను అకారణంగా విరోధాన్ని పెంచుకుంటున్న ట్రంప్‌ను అమెరికన్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. మంగళవారం అమెరికా ప్రతినిధుల సభ- మన లోక్‌సభ వంటిది-కు జరిగిన ఎన్నికలలో ట్రంప్ నాయకత్వంలోని ‘రిపబ్లికన్ పార్టీ’ పరాజయం పాలుకావడం, ప్రత్యర్థి ‘డెమొక్రాటిక్ పార్టీ’ విజయం సాధించడం ఈ నిరసనకు నిదర్శనం!