సంపాదకీయం

ఎన్నికల వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార, విపక్షాల పరస్పర దూషణలు పరాకాష్ఠకు చేరడం తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ‘అధికార కార్యక్రమ’-నోటిఫికేషన్- ఆవిష్కరణకు అనధికార నేపథ్యం. తెలంగాణలో నామాంకన పత్రాలు దాఖలు చేసే కార్యక్రమానికి శ్రీకారం జరగడంతో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల సమరం కూడ పరాకాష్ఠకు చేరింది. ఉత్సాహం, విశ్వాసం దాదాపు అన్ని రాజకీయ పక్షాలలోను తాండవిస్తూ ఉండడం ప్రచారమవుతున్న మహా విషయం. కొన్ని పార్టీల విజయ విశ్వాసానికి తార్కికమైన ప్రాతిపదిక ఉంది. మరికొన్ని రాష్ట్రాల విజయ విశ్వాసానికి తార్కిక ప్రాతిపదిక లేదు. తార్కిక ప్రాతిపదిక లేని విజయ విశ్వాసాన్ని ఆర్భాటంగా ప్రదర్శిస్తున్న ‘పక్షాల’ మేకపోతు గాంభీర్యంలోని డొల్లతనాన్ని జనం గ్రహించారు, గ్రహిస్తున్నారు. ఈ తార్కిక విజయ విశ్వాసం, మేకపోతు గాంభీర్యం అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రచారంలోను ప్రస్ఫుటమైంది, ప్రస్ఫుటవౌతోంది. తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ఆధికారికంగా ఆరంభవౌతున్న సమయంలోనే ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం ‘మతదానం’- పోలింగ్- జరగడం అంచెలంచెల కార్యక్రమంలో భాగం. ఈ ఐదు ప్రాంతాల శాసనసభల ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్- నామాంకన పత్రాల సమర్పణ- అక్టోబర్ 16న వెలువడింది. డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇలా దాదాపు రెండు నెలల పాటు అంచెలంచెలుగా పోలింగ్ జరగడం దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల స్థితికి సంకేతం. ఎన్నికలు జరుగుతున్న అన్ని శాసనసభలకూ ఒకే రోజున పోలింగ్ జరిపించక పోవడానికి కారణం శాంతిభద్రతల దుస్థితి అన్నది జరుగుతున్న ప్రచారం. 1980లో లోక్‌సభ ఎన్నికలు జరిగినపుడు దేశమంతటా కేవలం రెండు దశల- జనవరి మూడవ, ఆరవ తేదీల-లో పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ జరిపించగలిగింది. దేశమంతటా ఒకే దశలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగే ఆదర్శస్థితి అవతరించనున్నదన్న విశ్వాసం అప్పుడు వెల్లివిరిసింది. కానీ ఆ తరువాత పోలింగ్ ప్రక్రియ వివిధ దశలకు విస్తరించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏడు రోజులలో జరగడం ఈ వైపరీత్యానికి పరాకాష్ఠ. జిహాదీ బీభత్సకాండ, మావోయిస్టుల హత్యాకాండ నిరంతరం పెరిగిపోవడం తరువాతి చరిత్ర. అందువల్ల ప్రతి ప్రాంతంలోను, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత అవసరమైంది. భద్రతా దళాలను మరింత విస్తృతంగా వినియోగించవలసి వస్తోంది. అందువల్లనే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను, శాసనసభల పోలింగ్‌ను దశలవారీగా విస్తరించి పోలింగ్ జరిపిస్తున్నారు. ఒకే రోజున పోలింగ్‌ను జరిపించవలసి వస్తే అన్ని చోట్లా భద్రతా దళాలు తగినంతమంది లభించడం కష్టం. చిన్న రాష్టమ్రైన ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12, నవంబర్ 20న రెండు దశలుగా పోలింగ్ జరుగుతుండడానికి కారణం రాజ్యాంగ ప్రక్రియను భగ్నం చేయడానికి చైనా ప్రేరిత మావోయిస్టులు బీభత్సకాండ జరుపుతుండడం...
ఎన్నికల ప్రక్రియను మావోయిస్టులు వ్యతిరేకిస్తుండడం- ‘2050 నాటికి బహుళపక్ష భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థను మార్చివేసి, ఏకపక్ష నియంతృత్వ మావోయిస్టు మహా వ్యవస్థను స్థాపించాల’న్న బీభత్స కార్యక్రమంలో భాగం. మావోయిస్టు, మార్క్సిస్టు సిద్ధాంతాలకు రెండున్నర దశాబ్దుల క్రితమే తిలోదకాలచ్చిన చైనా ‘పెట్టుబడిదారీ’ రాజకీయ ఏకపక్ష నియంతృత్వాన్ని ఏర్పాటు చేసుకొంది. అయినప్పటికీ మన దేశాన్ని బలహీనపరచడం, బద్దలు కొట్టడం లక్ష్యంగా చైనా కమ్యూనిస్టు పార్టీ వారు సాగిస్తున్న ‘వ్యూహాత్మక దురాక్రమణ’- స్ట్రాటజిక్ అగ్రెషన్-లో భాగంగా చైనా ఉసిగొల్పుతున్న మావోయిస్టులు మన దేశంలో పేట్రేగుతున్నారు. మావో సేటుంగ్, కార్ల్ మార్క్స్ వంటి వారి పేర్లు చెప్పుకుని బీభత్సం సృష్టిస్తున్న మావోయిస్టుల అసలు లక్ష్యం చైనా ఆధిపత్యాన్ని విస్తరింపజేయడం. ప్రజాస్వామ్య ప్రక్రియను భంగం చేయడం ఈ విస్తరణలో భాగం. ఈనెల ఎనిమిదవ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో మావోలు జరిపిన పేలుళ్లకు ఐదుగురు అనుబంధ సైనికులు, పౌరులు బలైపోయారు. పోలింగ్‌కు ముందురోజున పదకొండవ తేదీన కూడ మావోలు సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక అధికారిని పొట్టన పెట్టుకున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో సైతం వీరు హింసాకాండకు పాల్పడడం కొనసాగుతున్న ప్రమాదం. అందువల్లనే ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల పోలింగ్ అనివార్యమైంది. కానీ మిగిలిన నాలుగు రాష్ట్రాలలోను ఎన్నికల కమిషన్ వారు ఛత్తీస్‌గఢ్ పోలింగ్‌తో సమాంతరంగా ఏదో ఒకరోజున ఒకే దశలో పోలింగ్ జరిపించి ఉండవచ్చు! అది జరగకపోవడమే ఆశ్చర్యకరం...
తెలంగాణలో నామాంకన- నామినేషన్- ఘట్టం మొదలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ‘మహాకూటమి’ స్వరూప స్వభావాలు స్పష్టం కాకపోవడం విచిత్రమైన పరిణామం. యథావిధిగా అంటే గత ఎన్నికల చరిత్రకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బహుశా నామినేషన్ల చివరి రోజు వరకూ అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉండవచ్చు.. తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా నూట నాలుగు అభియోగాలతో బృహత్ పత్రాన్ని రూపొందించిన భారతీయ జనతాపార్టీ కూడ ఇంతవరకూ అభ్యర్థులందరినీ ప్రకటించలేదు. అధికార తెరాస కూడ ఇంతవరకూ నూట ఏడుగురు అభ్యర్థులకు మాత్రమే నామాంకన పత్రాలు దాఖలు చేయడానికి అనుమతినిచ్చిందట! అంటే ఏ పార్టీ కాని, కూటమి కాని నామినేషన్ల మొదటి రోజునాటికి అభ్యర్థుల ఎంపికను ‘సమగ్రం’ చేయలేదు. అన్ని పార్టీలలోనూ అసంతృప్తి సెగలు, నిరసన జ్వాలలు కొనసాగుతుండడం ఈ ‘నిర్ణాయక అలసత్వాని’కి కారణం. సిద్ధాంతాలు, కార్యక్రమాలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. రాజకీయ పక్షాలలో అభ్యర్థులు కాదలచుకున్నవారు తమకు అభ్యర్థిత్వం దక్కకపోతే పార్టీకి జరిగిపోగల నష్టాలను గురించి బాహాటంగా చర్చిస్తున్నారు. ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాల తరఫున ప్రచారం చేయడానికి విదేశాల్లో ఉన్న ‘ప్రవాస భారతీయులు’- నాన్ రెసిడెంట్ ఇండియన్స్- భారీగా తరలివస్తున్నారట! ఇదంతా వ్యక్తుల ప్రాబల్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం. ఐదేళ్లుగా పార్టీకి ‘నిరుపమానమైన సేవ’ చేసినవారికి గాక నిన్న మొన్న పార్టీలోకి దూరిన వారికి దాదాపు అన్ని రాష్ట్రాల్లోను ‘టిక్కెట్లు’ కేటాయిస్తున్నారట! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగని చోట్లకెళ్లి ప్రచారం చేస్తుండడం సమాంతర పరిణామం. బెంగళూరుకు, మదరాసుకు, ఢిల్లీకి వెళ్లి ఆయన ‘కూటమి’ ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారు. అమరావతికి వచ్చిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన చేస్తుండడం ముందు జాగ్రత్తకు చిహ్నం, ముదావహం! తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం కంటె వారికి లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రధానమన్నది ఇలా ధ్రువపడుతోంది. ఎన్నికల సంరంభం కొనసాగుతున్న సమయంలో కేంద్రమంత్రి అనంతకుమార్ హఠాత్తుగా మరణించడం ఊహించని వైపరీత్యం. ఆర్భాటం లేని అమలిన రాజకీయ వేత్త, జాతీయతా భావ నిష్ఠుడు అనంతకుమార్.
అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలను అధికార పక్షం విమర్శించడం సహజం. కానీ ఈ విమర్శల వల్ల వౌలిక వాస్తవాలు తారుమారు కారాదు. గొర్రెల పెంపకం వల్ల, ఆవుల అభివృద్ధి వల్ల గ్రామీణ ప్రజల సంక్షేమం సిద్ధిస్తుంది. ఈ పథకాలలో అక్రమాలు జరిగితే విమర్శించవచ్చు. కానీ గ్రామీణులకు గొర్రెలు, బర్రెలు, ఆవులను పంపిణీ చేసే పథకాలను వ్యతిరేకించడం, యద్దేవా చేయడం సరికాదు. ఈ పథకాలను వ్యతిరేకించడం అన్యాయం, అతార్కికం! కొన్ని రాజకీయ పక్షాల వారు ఇలాంటి పథకాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?