సంపాదకీయం

ప్రాతినిధ్య సమన్వయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైష్పత్తిక ప్రాతినిధ్యం వల్ల వివిధ రాజకీయ పక్షాలకు లభిస్తున్న ‘వోట్ల’కు, ‘సీట్ల’కు మధ్య పొంతన కుదరగలదన్నది మన దేశంలో మాత్రమే కాదు, వివిధ ప్రజాస్వామ్య దేశాలలో జరుగుతున్న ప్రచారం. ఆస్ట్రియా, స్విట్జర్‌లాండ్, ఇజ్రాయిల్ వంటి దేశాలలో ఈ ‘నైష్పత్తిక ప్రాతినిధ్య’- ప్రపోర్షనల్ రెప్రజెంటేషన్- పద్ధతిని ఎన్నికల ప్రక్రియలో పాటిస్తున్నారు. నేపాల్‌లో కూడ ఈ ‘దామాషా’ పద్ధతిని పాక్షికంగా పాటిస్తున్నారు. అంటే పార్లమెంటులో దాదాపు మూడవ వంతు స్థానాలను వివిధ పార్టీలకు- వాటికి లభించిన ‘వోట్ల’ నిష్పత్తికి అనుగుణంగా కేటాయిస్తున్నారు! కానీ దేశంలో రెండు పార్టీలు మాత్రమే ఉన్నప్పుడు ఈ ‘దామాషా’ పద్ధతిని పాటించినట్టయితే ఏదో ఒక పార్టీకి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. రెండు కంటె ఎక్కువ పార్టీలు ఏర్పడి ఉన్న దేశాలలో ‘దామాషా’ పద్ధతిని పాటించినట్టయితే ఏ పార్టీకీ పార్లమెంటులో కాని జాతీయ శాసనసభలో కాని మెజారిటీ రాని ‘త్రిశంకు స్థితి’ ఏర్పడుతుంది. మన దేశంలో ఈ ‘దామాషా’ పద్ధతి అమలు జరిగి ఉండినట్టయితే 1952నుండి కూడ ఏ పార్టీకి కూడ లోక్‌సభలో ‘మెజారిటీ’ సీట్లు వచ్చి ఉండేవి కాదు. 1952లో లోక్‌సభలో మూడింట రెండువంతుల స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు నలబయి ఐదు శాతం వోట్లు వచ్చాయి. ‘దామాషా’ పద్ధతి అమలుజరిగి ఉంటే కాంగ్రెస్‌కు ఆ ఎన్నికలలో లోక్‌సభలో నలబయి ఐదుశాతం సీట్లు మాత్రమే వచ్చి ఉండేవి. అంటే అప్పటి మొత్తం 489 లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్‌కు రెండువందల ఇరవై ఒక్క స్థానాలు వచ్చి ఉండేవి. ఇదే పద్ధతిలో 1957, 1962, 1967, 1971, 1980, 1984వ సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో సైతం కాంగ్రెస్‌కు ‘మెజారిటీ’ లోక్‌సభ స్థానాలు వచ్చి ఉండేవి కాదు. కానీ ‘దామాషా’ పద్ధతిలోకాక ఏకసభ్య నియోజకవర్గం- సింగిల్ మాన్ కాన్‌స్టిట్యూయెన్సీ- పద్ధతిలో ఎన్నికలు జరిగినందువల్ల కాంగ్రెస్‌కు 1967లో తప్ప మిగిలిన ఆ సంవత్సరాల నాటి ఎన్నికలలో లోక్‌సభలో మూడింట రెండువంతుల స్థానాలు లభించాయి. 1967లో నలబయి ఒక్క శాతం వోట్లు సాధించిన కాంగ్రెస్ 518 స్థానాల లోక్‌సభలో 283 స్థానాలు గెలిచింది. అంటే యాబయి నాలుగు శాతం ‘సీట్లు’ కాంగ్రెస్‌కు దక్కాయి. 2014లో 543 స్థానాల లోక్‌సభలో గెలిచిన భారతీయ జనతాపార్టీకి 283 స్థానాలు లభించాయి. అంటే యాబయి రెండు శాతం సీట్లు వచ్చాయి. కానీ 2014లో ‘్భజపా’కు దక్కిన ‘వోట్లు’ ముప్పయి ఒక్క శాతం! ‘దామాషా’ పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే ‘్భజపా’కు 2014లో 189 సీట్లు మాత్రమే వచ్చి ఉండేవి! ఇప్పుడు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించి 119 స్థానాల సభలో 88 స్థానాలను- డెబ్బయి ఐదు శాతం స్థానాలను- దక్కించుకున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’- తెరాస-కి లభించిన ‘వోట్లు’ శాతం నలబయి ఏడు శాతం. ఒకవేళ ‘నైష్పత్తిక ప్రాతినిధ్యం’ పద్ధతి అమలుజరిగి ఉండి ఉంటే ‘తెరాస’కు సభలో ‘మెజారిటీ’ లభించి ఉండేది కాదు..
నైష్పత్తిక ప్రాతినిధ్యం గొప్ప ఆదర్శం. కానీ ఈ ‘ఆదర్శం’ వెనుకనుంచి అస్థిరత తొంగిచూస్తోంది. నైష్పత్తిక ప్రాతినిధ్యం అమలుజరిగి ఉంటే 1952లోనే లోక్‌సభలో ఏ పార్టీకీ ‘మెజారిటీ’ రాని దుస్థితి దాపురించి ఉండేది. ఇలాంటి దుస్థితి దాపురించని రీతిలో కేంద్రంలోను ప్రాంతీయ స్థాయిలోను చట్టసభలలో ‘వోట్ల’ నిష్పత్తికి అనుగుణంగా వివిధ పార్టీలకు ‘సీట్ల’ను కేటాయించే సమన్వయ పద్ధతిని ఏర్పాటుచేసుకోవడం ప్రజాస్వామ్య ‘పరిణత’కు రాజ్యాంగ విజ్ఞతకు ప్రతీక కాగలదు. ఇందుకు ఎన్నికల పద్ధతిలో విప్లవాత్మకమైన ‘సంస్కరణ’ను చేయగలగాలి. ప్రజాప్రాతినిధ్యపు చట్టంలోనేకాక మన రాజ్యాంగంలోనే వౌలికమైన సంస్కరణలు జరగాలి. ఈ సంస్కరణలు లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలుల స్వరూప స్వభావాలకు సంబంధించినవి! ‘ఏకసభ్య నియోజకవర్గం’ పద్ధతి వల్ల ‘వోట్ల’కూ ‘సీట్ల’కూ మధ్య పొంతన కుదరడం లేదు. ‘ఏకసభ్య నియోజకవర్గం’ పద్ధతిని కొనసాగించి ‘ఎన్నికల ప్రక్రియలో ‘వర్తుల’-ఆవృత్తి- రౌండ్- పద్ధతిని ప్రవేశపెట్టవచ్చు. ఒక నియోజకవర్గంలో మొదటి ‘రౌండ్’ ఎన్నికలో మొదటి రెండు స్థానాలను పొందిన ఇద్దరు అభ్యర్థులు రెండవ ‘రౌండ్’ ఎన్నికలో పోటీచేయడం ఈ పద్ధతి. దీనివల్ల ప్రతి నియోజకవర్గంలోను రెండవ ‘వర్తులం’లో గెలిచిన అభ్యర్థికి ‘మెజారిటీ’ వోట్లు వస్తాయి. కానీ దీనివల్ల మొత్తం సభలో వోట్లకు సీట్లకు మధ్య పొంతన కుదురుతుందన్న ‘హామీ’ లేదు. ‘నైష్పత్తిక ప్రాతినిధ్యం’ వల్ల ఏ పార్టీకి ‘మెజారిటీ’ రాని అస్థిరత్వం నెలకొంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేయడానికి వీలుగా జాతీయస్థాయిలోను ప్రాంతీయ స్థాయిలోను ‘రెండు సభల’ను వ్యవస్థీకరించాలి! ఇందుకు రాజ్యాంగంలోని సంబంధిత అనేక అధికారాలను సవరించవలసి ఉంది..
ఈ సమన్వయ పద్ధతి ప్రకారం జాతీయ స్థాయిలో సమాన సంఖ్యలో సభ్యులుండే రెండు సభలు ఏర్పాటు అవుతాయి. మొదటిది ‘వౌలిక’ సభ, రెండవది ‘ప్రాతినిధ్య సభ’. అంటే ఇప్పుడున్న రాజ్యసభ స్థానంలో ‘వౌలిక’ సభ ఏర్పడుతుంది. ప్రస్తుతం ‘లోక్‌సభ’కు జరుగుతున్న పద్ధతిలో అంటే ‘ఏకసభ్య నియోజకవర్గం’ పద్ధతిలో ఈ వౌలిక సభకు ఎన్నికలు జరగాలి. ప్రతి ఐదేళ్లకొకసారి లేదా నిర్ధారిత కాలవ్యవధి నాలుగేళ్లు అయితే ప్రతి నాలుగేళ్లకోసారి ఈ వౌలిక సభలోని ప్రతినిధులను వోటర్లు ఎన్నుకుంటారు. లోక్‌సభలో లేదా ప్రాతినిధ్య సభలో ప్రస్తుతం ప్రతినిధుల సంఖ్య ఐదువందల నలబయి మూడు. ఇంతే సంఖ్యలో సభ్యులు నియోజకవర్గాలు ఏర్పడబోయే వౌలిక సభలో ఉంటారు. అంటే ప్రస్తుతం లోక్‌సభను ఎన్నుకుంటున్న పద్ధతిలో ఈ వౌలిక సభను ఎన్నుకుంటారు. ప్రస్తుతం పరోక్ష పద్ధతిలో ప్రతినిధులు ఏర్పడుతున్న రాజ్యసభ శాశ్వతంగా రద్దయి, దాని స్థానంలో ఈ కొత్త వౌలిక సభ ఏర్పడుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఇప్పటి లోక్‌సభ ‘వౌలిక సభ’గా మారుతుంది. ఈ వౌలిక సభ మొదటి సభ లేదా ఎగువ సభ! ఈ సభకు జరిగే ఎన్నికలలో దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పక్షాలు, స్వతంత్రులు పోటీచేయవచ్చు! ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత 543 మంది సభ్యులు ఐదేళ్లపాటు వౌలిక ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. గడువు ముగిసేలోగా ఈ సభ రద్దుకాదు. ఈ సభకు జరిగిన ఎన్నికలలో- ఎన్ని పార్టీలు, ఎంతమంది స్వతంత్రులు పోటీ చేసినప్పటికీ- మొదటి రెండు స్థానాలను దక్కించుకునే రెండు పార్టీలను ఎంపికచేయాలి. సీట్ల ప్రాతిపదికగా కాక ఆయా పార్టీలకు దేశవ్యాప్తంగా లభించిన వోట్ల ప్రాతిపదికగా ఈ మొదటి రెండు పార్టీలు నిర్ధారణ అవుతాయి. అలా నిర్ధారణఅయ్యే రెండు పార్టీలు మాత్రమే ప్రాతినిధ్య సభకు లేదా లోక్‌సభకు జరిగే ఎన్నికలలో పోటీచేస్తాయి. ఈ ఎన్నికలు అభ్యర్థుల ప్రాతిపదికగాకాక రాజకీయ పక్షాల ప్రాతిపదికగా జరుగుతాయి. రెండు పార్టీలకు ఎన్నికలలో సీట్లను కేటాయిస్తారు. రెండు పార్టీలు మాత్రం పోటీచేస్తాయి. అందువల్ల ఒక పార్టీకి యాబయి శాతం కంటె ఎక్కువ వోట్లువస్తాయి. ఇలా ‘మెజారిటీ’ వోట్లతో మెజారిటీ సీట్లను రెండవ సభ- దిగువ సభ- లోక్‌సభ- ప్రాతినిధ్య సభలో పొందే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రభుత్వం, ఈ సభ కూడ ఐదేళ్లపాటు నిర్ణీత వ్యవధివరకు కొనసాగుతుంది. మొదటి సభ ఎన్నికలకు, రెండవ సభ ఎన్నికలకు మధ్య అంతరం మూడు నెలలు ఉండవచ్చు, ఆరు నెలలు ఉండవచ్చు లేదా సంవత్సరం ఉండవచ్చు. ఒకసారి నిర్ధారితమైతే దాన్ని రాజ్యాంగబద్ధం చేసినట్టయితే ఈ వ్యవస్థ శాశ్వతం అవుతుంది. ఇదే పద్ధతిలో ప్రతి రాష్ట్రంలోను రెండు సభలను ఏర్పాటుచేయాలి!
దీనివల్ల మధ్యంతరంగా ఎన్నికలు జరగడం, సభలు మధ్యలో రద్దుకావడం వంటి వైపరీత్యాలు తప్పిపోతాయి. ఏకకాలంలో జాతీయ ‘వౌలిక సభ’కు రాష్ట్రాల వౌలిక సభలకు ఎన్నికలు జరుగుతాయి. ఏక కాలంలో ‘కొత్త’ లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఆర్థిక బిల్లులు, బడ్జెట్ మినహా సకల వ్యవహారాలలోను ఉభయ సభలకు సమాన అధికారాలు ఉంటాయి. దీనివల్ల ‘నియంత్రణ.. ‘సమన్వయం’- చెక్స్ అండ్ బాలెనె్సస్- అన్న ప్రజాస్వామ్య సూత్రం మరింత అర్థవంతమవుతుంది!