సంపాదకీయం

సింహళ సంక్షోభం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహళ ద్వీపం- శ్రీలంక-లో చెలరేగుతున్న రాజకీయ సంక్షోభం ‘ప్రభుత్వ విహీన స్థితి’ని సృష్టించింది. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన తన మాజీ రాజకీయ ప్రత్యర్థి మహేంద్ర రాజపక్షతో చేతులు కలపడం ఈ సంక్షోభానికి కారణం. రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన మహేంద్ర రాజపక్షను సిరిసేన అక్టోబర్ 26న ప్రధానమంత్రిగా నియమించడం కొనసాగుతున్న ‘సింహళ’ సంక్షోభానికి కారణం! ఈ ప్రక్రియలో భాగంగా సిరిసేన అప్పటివరకు ప్రధానమంత్రిగా ఉండిన రణల్ విక్రమసింహను పదవి నుంచి తొలగించాడు. ఈ తొలగింపును పార్లమెంటు స్పీకర్ కారు జయసూర్య అంగీకరించలేదు, పార్లమెంటులోని ‘సంఖ్యాధిక్య’- మెజారిటీ- సభ్యులు అంగీకరించలేదు. అందువల్ల సిరిసేన పార్లమెంటును రద్దుచేశాడు. ఈ ‘రద్దు’ను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. స్పీకర్ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటుచేశాడు. సిరిసేన నియమించిన ‘‘కొత్త ప్రధానమంత్రి’’ మహేంద్ర రాజపక్షకు పార్లమెంటులో ‘సంఖ్యాధిక్యం’లేదని మూడుసార్లు ధ్రువపడింది. అయినప్పటికీ రాజపక్ష గద్దె దిగలేదు, ఆయన ప్రధానమంత్రిత్వాన్ని పార్లమెంటు గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో పదవీచ్యుతికి గురి అయిన రణల్ విక్రమ సింహ గత పనె్నండవ తేదీన పార్లమెంటులో తనకు సంఖ్యాధిక్యం ఉందని ఋజువుచేశాడు. ఆయన ప్రతిపాదించిన ‘‘విశ్వాస తీర్మానాన్ని’’ నూట పదిహేడు మంది సభ్యులు బలపరిచారు. పార్లమెంటు మొత్తం సభ్యుల సంఖ్య 225. ఇలా ‘మెజారిటీ’ ఉన్న విక్రమసింహను సిరిసేన అక్టోబర్ 26న తొలగించాడు. సంక్షోభం రాజుకొనడానికి ఇదీ కారణం. ప్రధాని గద్దెనెక్కిన రాజపక్షకు నూట ఆరుమంది కంటె ఎక్కువ సభ్యుల బలం లేదని మూడుసార్లు ధ్రువపడింది. పార్లమెంటును రద్దు చేయడం చెల్లదని గురువారం- డిసెంబర్ 13వ తేదీన- సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు అధ్యక్షుడు సిరిసేనకు అభిశంసన వంటిది! అందువల్ల పార్లమెంటు యథాతథంగా కొనసాగనుంది. పార్లమెంటులో స్పష్టమైన ‘మెజారిటీ’ ఉండిన రణల్ విక్రమసింహను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడం ద్వారా, ‘మెజారిటీ’ లేని రాజపక్షను ప్రధానమంత్రిగా నియమించడం ద్వారా, ప్రభుత్వానికి స్పష్టమైన ‘మెజారిటీ’ ఉన్న సమయంలో ప్రధానమంత్రిని, విక్రమసింహను సంప్రదించకుండా ‘సభ’ను రద్దుచేయడం ద్వారా అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించాడన్నది గురువారం శ్రీలంక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాట..
శ్రీలంక వ్యవహారాలలో చైనా అక్రమ ప్రమేయం కొనసాగుతుండడం ఈ సంక్షోభానికి విచిత్రమైన నేపథ్యం. మహేంద్ర రాజపక్ష 2015 జనవరి వరకు సింహళ అధ్యక్షుడిగా కొనసాగాడు. అధ్యక్ష పదవికి మూడవసారి పోటీచేసిన రాజపక్షను ఆయన మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన మైత్రిపాల సిరిసేన 2015 జనవరిలో జరిగిన ఎన్నికలలో ఓడించాడు. ఎనబయి రెండు శాతం వోటర్లు వోట్లు వేసిన ఆ ఎన్నికలో మైత్రిపాల సిరిసేన గెలవడానికి కారణం రణిల్ విక్రమసింహ నాయకత్వంలోని అప్పటి ప్రతిపక్షం ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’- యుఎన్‌పి- ఆయనకు మద్దతునివ్వడం. 2010 నాటి అధ్యక్ష ‘వరణం’- ఎలక్షన్- లో సైతం విక్రమసింహ నాయకత్వంలోని ఈ పార్టీ తరఫున అభ్యర్థి నిలబడలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సైనిక దళాల- మాజీ- అధిపతి శరత్ ఫోన్‌సేకాను ‘యుఎన్‌పి’ సమర్ధించింది. ఆ ఎన్నికలలో మహేంద్ర రాజపక్ష రెండవసారి ఎన్నికయ్యాడు. 2015లో మాత్రం మైత్రిపాలను గెలిపించడం ద్వారా విక్రమసింహ పార్టీ మహేంద్ర రాజపక్ష నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ- ‘ఎస్‌ఎల్‌ఎఫ్‌పి’-పై విజయం సాధించింది. 2015లో ఓడిన రాజపక్ష 2005లో మొదటిసారి అధ్యక్షుడుగా ఎన్నికయినప్పుడు ఓడిన ప్రధాన ప్రత్యర్థి రణిల్ విక్రమసింహ. అంతకుముందు 1999లో చంద్రికా కుమారతుంగ అధ్యక్షురాలిగా ఎన్నికయినప్పుడు ఆమెతో పోటీచేసిన ప్రధాన ప్రత్యర్థి కూడ విక్రమసింహ. 2001-2004 సంవత్సరాల మధ్య, అంతకు పూర్వం 1993-1994లోను కూడ విక్రమసింహ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 2015 రణిల్ విక్రమసింహ మద్దతుతో గెలిచిన సిరిసేన విక్రమసింహను ప్రధానిగా నియమించాడు. 2015 ఆగస్టులో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో విక్రమసింహ నాయకత్వంలోని ‘యుఎన్‌పి’ విజయం సాధించింది. 2015 జనవరి నాటి ఎన్నికలలో ఓడిపోయి అధ్యక్ష పదవిని కోల్పోయిన మహేంద్ర రాజపక్ష ఈ ఎన్నికల్లో ‘యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్స్’- యుపిఎఫ్‌ఏ- ఐక్య ప్రజాతంత్ర కూటమి-ని ఏర్పాటుచేశాడు. ఈ కూటమి గెలిచినట్టయితే తాను ప్రధానమంత్రి కావాలన్నది మహేంద్ర రాజపక్ష ఆకాంక్ష!!
కానీ ఆ ఎన్నికలలో ఇతగాడి ‘కూటమి’ ఓడిపోయింది. కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ రాజపక్ష ప్రధాని కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అధ్యక్ష పదవిని రెండుసార్లు నిర్వహించిన రాజపక్ష ప్రధానమంత్రి పదవికి పోటీ పడడం నైతికమైన రాజకీయమైన దిగజారుడుతనానికి నిదర్శనం. కానీ చైనా ప్రభుత్వం తెరవెనుక నుంచి నడిపిస్తున్న నాటకంలో రాజపక్ష పాత్రధారిగా మారి ఉండడం అసలు కథ. రాజపక్ష అధ్యక్షుడిగా ఉండిన తరుణంలో మైత్రిపాల సిరిసేన కేవలం మంత్రి. అప్పటి మంత్రి ఇప్పుడు అధ్యక్షుడు. అలాంటి అధ్యక్షుని వద్ద ప్రధానమంత్రిగా పనిచేయడానికి రాజపక్ష సిద్ధపడిపోయాడు. పార్లమెంటులో ‘బలం’, ‘మద్దతు’ లేదని నవంబర్‌లో మూడుసార్లు ఋజువు అయినప్పటికీ ప్రధాని పదవిని పట్టుకొని వేలాడుతున్న రాజపక్షకు శుక్రవారం శ్రీలంక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు చెంపపెట్టు.. రాజపక్ష ప్రధానిగా బాధ్యతలను నిర్వహించరాదని కింది న్యాయస్థానం జారీచేసిన ఉత్తరువును తాత్కాలికంగా నిలిపివేయడానికి శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించిందట.. ఫలితంగా రాజపక్ష శనివారం తన పదవికి రాజీనామా చేయనున్నాడట..
రాజపక్ష 2010వ 2015వ సంవత్సరాల మధ్యకాలంలో అవలంబించిన భారత వ్యతిరేక, చైనా అనుకూల విధానాలు శ్రీలంక ప్రజలకు నచ్చలేదు. అందువల్లనే 2015నాటి అధ్యక్షుని ఎన్నికలోను, ఆ తరువాత 2015 ఆగస్టులో జరిగిన పార్లమెంటు ఎన్నికలోను అతగాడు పరాజయం పాలయ్యాడు. తమ ఓటమికి భారతీయ ‘నిఘా’ వర్గాల వారి కుట్ర కారణమని మహేంద్ర అనుయాయులు భావిస్తున్నట్టు 2015లో పాశ్చాత్య దేశాల ‘మాధ్యమాలు’ ప్రచారం చేశాయి. ఈ ప్రచారం చైనా చేయించింది. అయితే ఈ ప్రచారాన్ని 2015 జనవరి 18న మన దేశానికి వచ్చిన అప్పటి కొత్త విదేశాంగ మంత్రి మంగళ సమరవీర నిరాకరించాడు. తనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దశాబ్దికి పైగా కుట్రచేసినట్టు 2015లో పదవీచ్యుతుడైన తరువాత రాజపక్ష స్వయంగా ఆరోపించాడు. రాజపక్ష అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు లంకలో నౌకాదళ స్థావరం ఏర్పడడానికి రంగం సిద్ధమైంది. గత అక్టోబర్‌లో పూర్వపు రాజకీయ విరోధులైన సిరిసేన, మహేంద్ర మిత్రులు కావడం కూడ చైనా ప్రమేయం ఫలితమన్న అనుమానం అతార్కికం కాదు. విక్రమసింహ తొలగింపును, రాజపక్ష నియామకాన్ని చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ స్వయంగా ప్రశంసించడం సింహళ రాజకీయాలలో చైనావారి అక్రమ ప్రమేయాన్ని మరోసారి ధ్రువపరిచిన విపరిణామం...