సంపాదకీయం

ఇనే్నళ్లు పట్టింది..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిక్కులను ఊచకోత కోయించిన అభియోగంపై కాంగ్రెస్ నాయకుడు సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించడం- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ పదవీ బాధ్యతలను స్వీకరించడానికి విచిత్రమైన నేపథ్యం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలోనే సోమవారం ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం సజ్జన్‌కుమార్, మరో ముగ్గురు నిందితులు దోషులని నిర్ధారించింది. ముప్పయి నాలుగేళ్లపాటు సజ్జన్‌కుమార్ శిక్షను తప్పించుకోగలగడం న్యాయ విలంబన ప్రక్రియకు ఘోరమైన నిదర్శనం. ఇప్పుడు కూడ సజ్జన్‌కుమార్‌ను శిక్షించే ప్రక్రియ ముగిసిపోలేదు. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయ యాచిక - అప్పీల్-ను నివేదించనున్నట్టు సజ్జన్‌కుమార్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుండడం ఇందుకు కారణం! 1984 అక్టోబర్ ముప్పయి ఒకటవ తేదీన అప్పటి ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ హత్యకు గురి అయిన వెంటనే ఢిల్లీలోను, దేశవ్యాప్తంగాను అమాయకులైన వేలాది సిక్కులను సాంఘిక బీభత్సకారులు హత్యచేయడం చరిత్ర.. ‘‘ఈ హంతకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారన్నది, కాంగ్రెస్ నాయకులు హంతకులను ప్రోత్సహించారన్నది’’ కొనసాగుతున్న అభియోగం! ఇందిరాగాంధీని హత్యచేసిన సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్ అనే బీభత్సకారులు సిక్కు మతానికి చెందినవారు కావడం మాత్రమే- ‘కాంగ్రెస్‌కు చెందిన హంతకులు’ సిక్కులను ఊచకోత కోయడానికి ఏకైక కారణం. ముప్పయి నాలుగు ఏళ్లుగా ఈ హంతకులలో అత్యధికులు తప్పించుకొని తిరుగుతుండడానికి కారణం కేంద్రంలో పెత్తనం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం. దర్యాప్తు చేసిన ప్రభుత్వ నేర పరిశోధక సంస్థలు సాక్ష్యాధారాలను సేకరించడంలోను, న్యాయస్థానాలకు నివేదించడంలోను ఘోరమైన, అమానవీయమైన నిర్లక్ష్యం వహించడం వల్ల న్యాయ ప్రక్రియ కుంటుపడింది, నత్తనడక నడిచింది. నిందితులుగా నమోదైన జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్ వంటి ఘరానాలు ఇనే్నళ్లుగా శిక్షలను తప్పించుకోవడానికి కారణం ఈ నేర పరిశోధక సంస్థల నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వాల ఒత్తిడికి లొంగిన ఈ ‘సంస్థలు’ సజ్జన్‌కుమార్, జగదీశ్ టైట్లర్ వంటి ‘నిందితులు’ నిర్దోషులని పదే పదే నిర్ధారించడం చరిత్ర. ఈ నిర్ధారణలను న్యాయస్థానాలను తోసిపుచ్చడం, వీరిపై మళ్లీమళ్లీ అభియోగాలు నమోదుకావడం కూడ చరిత్ర. ఈ అభియోగాలు పునరుద్ధరణ కావడం కారణంగానే జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడం చివరి క్షణంలో తప్పిపోయింది. వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది!
ఈ ముప్పయి నాలుగేళ్లలో సాక్ష్యాధారాలు మాసిపోయి ఉండవచ్చు. కొందరు నిందితులు మరణించి ఉండవచ్చు. 1984లో యువ కాంగ్రెస్ నేతలుగా హత్యాకాండను ఉసిగొల్పినవారు ఇప్పుడు వృద్ధులు. 2013 మే నెలలో, 1984నాటి హత్యాభియోగాన్ని విచారించిన ప్రత్యేక న్యాయస్థానం వారు సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించి అభియోగ విముక్తిడిని చేయడానికి ‘‘ఇలా సాక్ష్యాధారాలు లభించకపోవడం’’ కారణం. దర్యాప్తుచేసిన కేంద్ర నేర పరిశోధక మండలి- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ- వంటి సంస్థలు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారినప్పుడల్లా మాటమార్చడం కూడ ఈ ముప్పయి నాలుగేళ్ల వైపరీత్యంలో భాగం.. 1984 నవంబర్ ఒకటవ తేదీనుంచి నాలుగవ తేదీ వరకు కొనసాగిన ఊచకోత, సజీవ దహనం వంటి పైశాచిక కాండ ఫలితంగా దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మంది సిక్కులు ప్రాణాలను కోల్పోయినట్టు అనధికార కథనం. ఢిల్లీలో మాత్రమే రెండువేల ఏడువందల ముప్పయి ముగ్గురు సిక్కులను దుండగులు హతమార్చినట్టు సోమవారం తీర్పుచెప్పిన ఢిల్లీ ఉన్నత న్యాయమూర్తులు ఎస్.మురళీధర్, వినోద్ గోయల్ నిర్ధారించారు. 1984 నవంబర్ ఒకటవ తేదీన ఢిల్లీ శివారులోని రాజ్‌నగర్ ప్రాంతంలో ‘ఒక కుటుంబానికి చెందిన ఐదు మందిని హతమార్చి ఒక ‘గురుద్వార’ను దగ్ధం చేయించిన’ అభియోగం ఇప్పుడు ధ్రువపడింది. 2013లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇప్పుడు హైకోర్టు రద్దు చేసింది. కానీ 1984 నుంచి ఇప్పటివరకు సజ్జన్‌కుమార్ వంటి దుర్మార్గులు శిక్షకు గురికాకపోవడం మన రాజ్యాంగ వ్యవస్థను నిలదీసిన, నిలదీస్తున్న వైపరీత్యాలలో ఒకటి మాత్రమే!
డెబ్బయి మూడేళ్ల సజ్జన్‌కుమార్ కనీసం ముప్పయి ఏళ్లకింద ఈ ‘యావజ్జీవ నిర్బంధ శిక్ష’కు గురి అయి ఉండాలి. దానివల్ల ‘శిక్ష’కు సార్ధకం ఏర్పడి ఉండేది. ఇప్పుడు ఇతగాడు సర్వోన్నత న్యాయస్థానానికి అభియోగాన్ని నివేదించినట్టయితే, నిజ నిర్ధారణ జరగడానికి మరో ఐదేళ్లు పట్టవచ్చు! ఎక్కువ కాలం పట్టినప్పటికీ ఆశ్చర్యపోనక్కరలేదు. ఈలోగా ‘శిక్ష’ అమలు జరుగకుండా తాత్కాలిక న్యాయాదేశం వెలువడవచ్చు! ఇలా ముప్పయి తొమ్మిదవ ఏట ఘోరమైన పాశవికమైన మారణకాండ జరిపించిన సజ్జన్‌కుమార్ వంటి దుర్జనులు శిక్షకు గురి అయినప్పటికీ వారు నిర్బంధంలో గడపవలసిన సమయం తగ్గిపోతోంది. ఈలోగా సజ్జన్‌కుమార్, ఇలాంటి ‘‘హంతకులు’’ పార్లమెంటుకు ఎన్నికయి ప్రజాప్రతినిధులుగా చెలామణి కాగలిగారు. ‘కటకటాల’కు వెనుక నిలబడవలసిన ‘‘దుర్జన’’కుమార్‌లు జగదీశ్ టైట్లర్‌లు సార్వజనిక, అధికార వేదికలెక్కి ‘నాగరిక’ అభినయం చేయగలగడం రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న వికృతులకు నిదర్శనం. న్యాయ విలంబనం కావడానికి దోహదం చేస్తున్న రాజకీయం ప్రధానమైన వికృతి. ‘‘ఆ..! అభియోగం ధ్రువపడిన నాటిమాట కదా!’’అన్న వికృత చిత్తవృత్తి విష కీటకంగామారి దాడిచేస్తోంది, పైశాచిక దంష్టల్రతో మానవ మాంసాన్ని మెక్కుతోంది, అమాయకుల రక్తాన్ని బొక్కుతోంది! 1947లో భయంకరమైన హత్యాకాండ జరిగింది. అఖండ భారత్ విభజన జరిగింది. ఆ సమయంలో అనేక లక్షల మంది హత్యకు గురి అయ్యారని ముప్పయి ఏడు ఏళ్ల తరువాత వేలాది సిక్కులు ప్రాణాలను కోల్పోవడం మరో భయంకర విషాదమని ఢిల్లీ ఉన్నత న్యాయమూర్తులు సోమవారం వ్యాఖ్యానించారు. ‘‘సిక్కులను పాశవికంగా చంపారు.. వారి ఇళ్ళను ధ్వంసం చేశారు. ఢిల్లీ వెలుపల కూడ వేలమంది సిక్కులు హతమైపోయారు..’’అన్నది ఉన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ! సజ్జన్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు ఒక బీభత్స ఘటనకు సంబంధించిన అభియోగం మాత్రమే ధ్రువపడింది. మరో నాలుగు అభియోగాలు ఇంకా విచారణలో ఉన్నాయి. ఇలాంటి ఘోర నేరాలు జరిగినప్పుడు వాటిని దర్యాప్తుచేయడానికి విచారించడానికి కచ్చితమైన సమయ నిర్ధారణ జరగాలి! ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పిన తరువాత సమీక్షా యాచిక- అప్పీల్-ను ఉన్నత న్యాయస్థానానికి కాక- హైకోర్టునకు కాక- నేరుగా సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీం కోర్టు- వారికి నివేదించే విధంగా ఇప్పుడైనా చట్టాన్ని సవరించాలి...
గత నవంబర్ ఇరవయ్యవ తేదీన ఢిల్లీలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం 1984లో హత్యలు చేసిన ఒక నేరస్థుడికి మరణశిక్ష విధించింది, మరొకనికి యావజ్జీవ నిర్బంధ శిక్షను విధించింది. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం సజ్జన్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురిని శిక్షించింది. కానీ వందల మంది నిందితులను శిక్షించేదెప్పుడు? బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు?? ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కమల్‌నాథ్ కూడ 1984లో హంతకులను ఉసిగొల్పాడన్నది కొనసాగుతున్న ఆరోపణ.. అయితే ఆయనకు వ్యతిరేకంగా అభియోగం నమోదు కాలేదట!