సంపాదకీయం

‘మ్యాగీ’ మాయ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీసపు విష రసాయన ధాతువులు కలసిన ‘మ్యాగీ’ సేమ్యాలను చిన్నపిల్లలు ఎందుకు తినాలన్నది సర్వోన్నత న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ గురువారం సంధించిన ప్రశ్న.. తినరాదన్నది న్యాయమూర్తి ప్రశ్నలో నిహితమై ఉన్న సమాధానం. కానీ ‘మోనో సోడియం గ్లటుమేట్’- ఎమ్‌ఎస్‌జి- అన్న కృత్రిమ రసాయన ‘సీసం’-లెడ్-తో సంకరమైన ‘మ్యాగీ’ సేమ్యాలను దశాబ్దుల తరబడి పిల్లలు తింటూనే ఉండడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ కొనసాగిస్తున్న ఆర్థిక బీభత్సకాండకు ఒక ఉదాహరణ మాత్రమే.. ఈ వాణిజ్య బీభత్సకాండకు ఉదాహరణలు కోకొల్లలు. ‘నెజల్’-నెస్‌లే-అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ఉత్పత్తిచేసి మన నోళ్లకెత్తుతున్న అనేకానేక అనవసర కృత్రిమ ఆహార పదార్థాలలో ఈ ‘మ్యాగీ’ ఒకటి మాత్రమే. ‘ఎమ్‌ఎస్‌జి’ విష రసాయనం రుచిని పెంచడమేకాక ఈ ‘మ్యాగీ’ సేమ్యాలు- నూడుల్స్- అతి త్వరగా ‘ఉడికి’పోయి ఆవురావురమని ‘ఆబ’గా ఆరగించడానికి వీలైన ఆహారంగా రూపొందడానికి దోహదం చేస్తోందట. అందువల్ల ‘మ్యాగీ’ సేమ్యాలను చూసి పిల్లల కంటె ముందు పెద్దలకు ‘ముక్కులు ఊరడం’ ఆరంభమైంది. కృత్రిమ రుచుల సౌరభాలను నాలుక కంటె ముందు ‘ముక్కు’ ఆఘ్రాణిస్తుందట! అందువల్ల అనారోగ్యాన్ని పెంచే ఆహారాలను ‘ఆబ’గా తినడంలో నోటికంటె ముందు ‘ముక్కు’ పనిచేస్తుందని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1959లో వ్రాసిన తన ‘దమయంతీ స్వయంవరం’ అన్న నవలలో వివరించి ఉన్నారు. ఆ వివరణకు వాస్తవ రూపమైన దృశ్యాలు చిత్ర విచిత్రంగా ఆవిష్కరణవౌతుండడానికి ‘మ్యాగీ’ సేమ్యాల వంటి ‘అమిత రుచికరమైన’ కృత్రిమ రసాయన విషాలు దోహదం చేస్తున్నాయి. ‘కల్తీకి రుచి ఎక్కువ..’ అన్నది ఆధునిక నాగరిక జీవన వాస్తవం! దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ ‘నెజల్’కంపెనీ వారి సీసపుగుట్టు రట్టయినప్పుడు ‘మ్యాగీ’ సేమ్యాలు ‘అమిత రుచి’ని కుక్కలు సైతం అసహ్యించుకున్నాయి. కుక్కలు సైతం తినడానికి నిరాకరించిన ‘మ్యాగీ’ సేమ్యాల ‘గుట్టలు’ మురికి కాలువల పక్కన దర్శనమిచ్చాయి. ‘్భరత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ’- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- ఫ్యాయ్- వారు 2015 జూన్‌లో ఈ ‘మ్యాగీ’ సేమ్యాల అమ్మకాలను నిషేధించారు. కొన్ని వారాలపాటు మూతపడిన మ్యాగీ సేమ్యాల విక్రయాలు ఆ తరువాత 2015 నవంబర్ నుంచి యథావిధిగా పుంజుకున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నత్తనడకతో పోటీపడుతున్న న్యాయప్రక్రియ ఇలా పుంజుకొనడానికి కారణం.. వీటికంటె అతి ప్రధానమైన కారణం మన దేశంలోని వినియోగదారుల ‘ముక్కులు ఊరడం..’
ఈ ‘సేమ్యా’లను మాత్రమే గాక విష రసాయనాలతో కల్తీ అయిన అన్నిరకాల ‘డబ్బాల’ ‘సీసాల’ ‘పొట్లాల’ నిలువ ఉన్న ఆహారాలను మనం, ప్రధానంగా మధ్య తరగతి జనం విపరీతంగా కొనుగోలు చేస్తుండడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- చొరబాటు విస్తరించడానికి కారణం. ‘నెస్లే’ వంటి సంస్థలు తయారు చేస్తున్న ‘ఐస్‌క్రీమ్’లు ‘చాక్లెట్లు’, కేకులు, పిజ్జాలు, బర్గర్‌లు, శీతల పానీయాలు ‘‘మానవులు తినకూడని, తాగకూడని, చప్పరించకూడని’’ రకరకాల కృత్రిమ రసాయన పదార్థాలతో కలుషితమై ఉండడం ప్రపంచమంతటా ప్రచారం అవుతున్న వాస్తవం! ఈ వాస్తవం దేశ విదేశాలలోను న్యాయస్థానాలలోను న్యాయస్థానాల బయట అనేకసార్లు ధ్రువపడింది. అయినప్పటికీ మన దేశంలోని ‘పెద్దలు’ ఈ అనారోగ్యకరమైన తిండి పదార్థాలను కొంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దుల క్రితం వరకు వేయించిన సెనగపప్పు, బఠాణీలు, మరమరాలు- బొరుగులు-, బెల్లం, కారం పట్టించిన రకరకాల పప్పులు, పల్లీలు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, గోడంచి- జీడిపప్పు-, అటుకులు, పేలాలు, వంటి ‘చిరు తిండి’ని పిల్లలకు పెద్దలు తినిపించేవారు, కొనిపించేవారు. కొబ్బరి నీళ్లు, రకరకాల పండ్లు, చెఱకు రసం, పానకం వంటి పానీయాలను సేవించారు. కానీ ఆధునికత పేరుతో పాశ్చాత్య నాగరికత పెరిగిన తరువాత ఇవన్నీ మూలపడినాయి. ఐస్‌క్రీమ్‌లు, బర్గర్‌లు, వేఫర్‌లు, సాండ్‌విచ్‌లు, కట్‌లెట్‌లు, జామ్‌లు ‘కోకో’, ‘పెప్సీ’ పానీయాలు పిల్లల కడుపులలో వారిని కొవ్వెక్కిస్తున్నాయి, లావెక్కిస్తున్నాయి! ఇళ్లలో సైతం ఆరోగ్యకరమైన సంప్రదాయపు వంటలు, పిండి వంటలు మూలపడినాయి. కృత్రిమ రసాయన విషాలు కలసిన రకరకాల రంగులు వేసిన వంటలు, పిండి వంటలు తయారవుతున్నాయి. ప్రజలు ప్రధానంగా మధ్యతరగతి వారు తమ పిల్లలకు మొదట ఈ కృత్రిమ పానీయాలను, తినుబండారాలను మప్పుతున్నారు, ఆ తరువాత పిల్లలు నిపుణులుగామారి నిరంతరం ‘అంగడి పదార్థాలు’ డబ్బాల ఆహారాలు తెగ మెక్కుతున్నారు.. నెస్లే వంటి సంస్థల విస్తరణకు ఇదీ నేపథ్యం..
శుద్ధిచేసి నిలువచేసే ప్రక్రియ పేరుతోనూ, ‘‘కరకర’’లాడించడం పేరుతోను, ఘుమ ఘుమ లాడించడం పేరుతోను ప్రతి తిండి పదార్థంలోను కొంత శాతం మేర కృత్రిమ రసాయనాలను కలపడానికి ప్రభుత్వం అనుమతిస్తుండడం వౌలికమైన వైపరీత్యం. ప్రపంచీకరణ వ్యవస్థీకృతమై ఇలా ‘తిండి’లో రసాయనాలను కలపడం మరింతగా వ్యవస్థీకృతమైంది. ఇలా ప్రభుత్వం, ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాధికార సంస్థలు అనుమతించిన పరిమాణం కంటె ఎక్కువ పరిమాణంలో ఆహార శుద్ధి ప్రక్రియ- ఫుడ్ ప్రాసెసింగ్- పరిశ్రమల వారు - రసాయనాలను ఆహారంలో కలపడం చట్టవిరుద్ధం. కానీ దాదాపు ప్రతి ‘డబ్బా తిండి’- పాకేజ్డ్ ఫుడ్-లోను అనుమతించిన పాళ్లలోకంటె ఎక్కువ పాళ్లలో ఈ రసాయనాలను కలిపి వేస్తున్నారు. పట్టుబడిన నేరస్థులైన సంస్థల వారి పదార్థాలను కొన్ని రోజులపాటు నిషేధిస్తున్నారు. మళ్లీ యథాప్రకారంగా ఈ పదార్థాల ఉత్పత్తి, వినిమయం జరిగిపోతూనే ఉంది. ఘుమ ఘుమలాడే నెయ్యికి అది సహజ పరిమళం కాదు, రసాయనాలతో కల్పించిన కృత్రిమ సుగంధం అది. ఈ రసాయనాలు మన కడుపులలో చేరి క్రమంగా శరీరాలను విష పూరితం చేస్తున్నాయి. ‘నెజల్’ సంస్థవారు ఇలా ప్రభుత్వం అనుమతించిన ‘శాతం’కంటె ఎక్కువ శాతం ‘సీసాన్ని’ మ్యాగీ సేమ్యాలలో కలిపినట్టు 2016లో బయటపడింది. ఇలా కొంత శాతం మేర రసాయనాలతో ఆహారాన్ని ‘కల్తీ’ చేయడానికి ప్రభుత్వం అనుమతించడం ఏమిటి? ఎలాంటి రసాయన విషాలను కలుపకుండా ఆహారాన్ని శుద్ధిచేసి నిలువ ఉంచలేమా?? అన్న ప్రశ్న అనేక ఏళ్లుగా వినబడుతోంది. సర్వోన్నత న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్, హేమంత గుప్తా ఈ ప్రశ్నను మరోసారి సంధించారు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి!
ఆర్భాటం లేకుండా ‘శుద్ధిప్రక్రియ’ మన ఇళ్లలోను, కుటీర, గ్రామీణ పరిశ్రమలలోను వేల ఏళ్లుగా కొనసాగడం చరిత్ర. ఇలా ఆహారాన్ని సంప్రదాయ పద్ధతిలో శుద్ధిచేసి నిలువ ఉంచడానికి భారతీయులు ఎలాంటి కృత్రిమ రసాయనాలను వాడలేదు. కొన్ని సందర్భాలలో ప్రకృతి సిద్ధమైన అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ఆహారాన్ని శుద్ధిచేసి నిలువ ఉంచడానికి ఉపయోగించారు. అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఉప్పేరి, పచ్చళ్లు, పిండి వంటలు, తాండ్ర, బెల్లం పాకం, ఔషధాలు... ఇలా వందల రకాలను సంప్రదాయ పద్ధతిలో- ఎలాంటి కృత్రిమ రసాయనాలు లేకుండా- శుద్ధిచేసి నిలువ చేయడం భారతీయ చరిత్రలో భాగం..