సంపాదకీయం

రాజకీయం.. రాజ్యాంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వ నిర్వాహక పక్షమైన ‘భారతీయ జనతాపార్టీ’ సోమవారం సంధించిన ‘రాజ్యాంగ’ వ్యూహానికి, వివిధ విపక్షాలు రూపకల్పన చేస్తున్న ‘రాజకీయ’ అస్తశ్రస్త్ర సమాహారం సమీప నేపథ్యం! నాలుగు నెలలలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో ‘భాజపా’ను గద్దెదించడం లక్ష్యంగా వివిధ ప్రతిపక్షాలు వివిధ వ్యూహాలను విరచించాయి, విరచిస్తున్నాయి. వోట్ల, సీట్ల నిష్పత్తి, వివిధ ప్రాతిపదికలపై వోటర్ల సమీకరణ అధికార, విపక్షాల విభిన్న, విరుద్ధ వ్యూహాల మధ్య నెలకొని ఉన్న ‘విచిత్ర సమానత్వ’మన్నది నిరాకరింపజాలని నిజం. రాజకీయ పక్షానికి సమీప లక్ష్యం అధికారాన్ని హస్తగతం చేసుకొనడం.. తదుపరి లక్ష్యం అధికారాన్ని- జారిపోకుండా- నిలబెట్టుకొనడం! పదవీచ్యుతికి గురి అయిన పక్షాలు మళ్లీ అధికారాన్ని పొందడానికి యత్నించడం.. ఇదీ మన దేశంలో కాని వివిధ దేశాలలో కాని కొనసాగుతున్న ప్రజాస్వామ్య ‘క్రీడ’ స్వభావం! అధికారం చేపట్టడం లక్ష్యం కాదన్నది నిజానికి ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ నిర్దేశిస్తున్న శాశ్వత సూత్రం.. అధికారం చేపట్టడం, ప్రభుత్వాన్ని నిర్వహించడం ప్రజాస్వామ్య ప్రక్రియలో కేవలం మాధ్యమం..! లక్ష్యం సర్వజనహిత సాధనం! కానీ ‘మాధ్యమం’ లక్ష్యంగా మారిపోయి ఉండడం అధికాధిక రాజకీయ పక్షాల ప్రవృత్తిగా ప్రస్ఫుటిస్తోంది! అందువల్ల లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ‘్భజపా’ను గద్దెదింపడం ఏకైక లక్ష్యంగా ప్రతిపక్షాల పొత్తుల రాజకీయం ఊపందుకుంది! ఉత్తరప్రదేశ్‌లో ‘బహుజన సమాజ్ పార్టీ’కి, ‘సమాజ్‌వాదీ పార్టీ’కి మధ్య పొత్తు కుదరడం ‘్భజపా’కు వ్యతిరేకంగా సంభవిస్తున్న రాజకీయ పరిణామక్రమంలో అత్యంత ప్రధానమైనది! ‘ప్రధానమైనది..’ అన్న ప్రచారం ఉద్ధృతంగా నడుస్తోంది. మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల- 543-లో పదిహేను శాతం-80- ఉత్తరప్రదేశ్‌లో నెలకొని ఉండడం ఈ ప్రాధాన్యానికి ప్రాతిపదిక! కాంగ్రెస్ పార్టీకి, జాతీయతా కాంగ్రెస్ పార్టీకి మధ్య మహారాష్టల్రో సైతం పొత్తు కుదిరిందట! ఇదంతా ‘భాజపా’కు వ్యితిరేకంగా రూపుకడుతున్న పొత్తుల రాజకీయం! ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ‘సపా’-, బహుజన సమాజ్‌వాదీ పార్టీ- బసపా- కలసికట్టుగా పోటీచేసినట్టయితే అత్యధిక స్థానాలలో ‘భాజపా’ ఓడిపోతుందన్నది జరుగుతున్న ప్రచారం. 2014లో జరిగిన ఎన్నికలలో ‘్భజపా’కు లోక్‌సభలో ‘సంఖ్యా బాహుళ్యం’- మెజారిటీ- పొందడానికి కారణం ఉత్తరప్రదేశ్‌లోని ఎనబయి స్థానాలలో ఆ పార్టీకి డెబ్బయిమూడు లభించడం! అందువల్ల ఉత్తరప్రదేశ్‌లో భారీగా నష్టపోయినట్టయితే ‘భాజపా’కు, లోక్‌సభలో ‘సంఖ్యా బాహుళ్యం’ సిద్ధించదు. అందువల్ల ‘్భజపా’ నాయకత్వంలోని ‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’-నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్- ఎన్‌డిఏ-లోని ప్రాంతీయ పక్షాలు ప్రాబల్యం పెరుగుతుంది. మిశ్రమ మంత్రివర్గ, సంకీర్ణ రాజకీయ చరిత్ర మళ్లీ మొదలైపోతుంది. ఆర్థికంగా వెనుకబడిన కులాల- ఎకనమికల్లీ బాక్‌వర్డ్ కాస్ట్స్- వారికి ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసంస్థలలోను పదిశాతం ‘ఆరక్షణలు’ కల్పించాలన్న సోమవారం నాటి కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ఈ ‘సంకీర్ణ’ రాజకీయాన్ని నిరోధించడానికై బహుశా ‘్భజపా’ సంధించిన రాజ్యాంగ శస్త్రం..
‘ఆరక్షణలు’ అనేవి అట్టడుగు స్థాయివరకు అభ్యుదయం వికేంద్రీకృతం కావడానికి దోహదం చేయాలన్నది రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన లక్ష్యం! కానీ వివిధ రాజకీయ పక్షాలు ఈ ఆరక్షణల- రిజర్వేషన్‌ల-ను కులాల వోట్లను మూక ఉమ్మడిగా కొల్లగొట్టడానికి మాత్రమే ఉపయోగించుకొంటుండడం నడుస్తున్న చరిత్ర. ఉత్తరప్రదేశ్‌లోను బిహార్‌లోను ‘కుల సమీకరణలు’ ప్రధానంగా వివిధ రాజకీయ పక్షాల గెలుపోటములను నిర్ధారిస్తున్నాయి. 2007 వరకూ అగ్ర కులాలను ద్వేషిస్తూ ప్రసంగాలు చేసిన ‘బహుజన సమాజ్ పార్టీ’- బసపా- అధినేత్రి మాయావతి 2007 నాటి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా వ్యూహం మార్చడం చరిత్ర. ‘తిలక్’- బ్రాహ్మణ-, ‘తల్‌వార్-’ క్షత్రియ-, ‘తరాజ్’- వైశ్య- కులాల ‘‘ఆగడాలను’’అంతవరకూ ఎండగట్టిన మాయావతి 2007లో ‘‘బ్రాహ్మణ్ జోడో’’అన్న ఉద్యమాన్ని ఆరంభించింది. తమ పార్టీలో విరివిగా బ్రాహ్మణులను చేర్చుకుని వారిని ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబెట్టింది. ఆ ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించింది. కానీ ఐదేళ్ల తరువాత ఈ ‘‘కులవ్యూహం’’ బెడిసి కొట్టింది! అయినప్పటికీ బాహాటంగా కులాలను సమీకరించడానికి వివిధ పక్షాలు చేస్తున్న యత్నాలు విస్తరిస్తూనే ఉన్నాయి. ‘లింగాయత్‌ల’ను కూడగట్టడానికి కర్నాటకలో కాంగ్రెస్ చేసిన యత్నం కుల రాజకీయాలకు మతం రంగును సైతం పులిమింది. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘సమాజ్‌వాదీ పార్టీ’- సపా- అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్న ‘‘గణాంకాల’’- అర్తమెటిక్- ప్రాధాన్యంలో కూడ కులాల సమీకరణ ప్రస్ఫుటిస్తోంది! ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి ‘ఆరక్షణలు’ కల్పించాలన్న ‘భాజపా’ వ్యూహం ప్రత్యర్థుల వ్యూహానికి బహుశా ప్రతివ్యూహం కావచ్చు!!
కుల ప్రాధాన్యం ప్రాతిపదికగా మాత్రమే కాక ప్రాంతీయ ప్రాధాన్యం ప్రాతిపదికగాను, మత ప్రాతిపదికగాను సంకీర్ణ రాజకీయం మరోసారి పుంజుకుంటోంది! 1989లో కేంద్రంలో మొదలైన రాజకీయ చరిత్ర 2014వరకూ పాతికేళ్లు కొనసాగింది! ఈ పాతికేళ్ల కాలంలో రాజ్యాంగ ప్రక్రియ కంటె రాజకీయ ప్రహసనం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక వాణిజ్య రక్షణ రంగాలలో అస్థిరత నెలకొనడం ఈ పాతికేళ్ల రాజకీయ ప్రహసనం ఫలితం! సాంస్కృతిక రంగంలో సైతం వైపరీత్యాలు చోటుచేసుకొనడం ఆ పాతికేళ్ల చరిత్ర! ‘ప్రపంచీకరణ’ మన నెత్తికెక్కి ‘్భరతీయత’ను దిగమింగడం ఈ పాతికేళ్ల వైపరీత్యం! ప్రాంతీయ పార్టీలు, చిన్న చిన్న పార్టీలు జాతీయ పక్షాలను ఆడించాయి, పీడించాయి, ఒత్తిడి తెచ్చాయి! 1998లో ఏర్పడిన అటల్ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏడాది తరువాత కూలిపోవడం సంకీర్ణ రాజకీయాల వైపరీత్యానికి పరాకాష్ఠ! అప్పటి ‘అన్నా డిఎమ్‌కె’ అధినేత్రి జయలలిత అనూహ్య ప్రవర్తన ఈ కూలిపోవడానికి కారణం! 2004వ 2014వ సంవత్సరాల మధ్య మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతి ప్రహసనాలకు ఆలవాలం కావడానికి ఒక ప్రధాన కారణం సంకీర్ణ రాజకీయం. అతి పెద్ద అవినీతి ప్రహసనాలు- ద్వితీయశ్రేణి దూరవాణి తరంగాల అమ్మకంలో అక్రమాలు, బొగ్గు బొరియల కేటాయింపులో అక్రమాలు- ఈ సమయంలోనే పుట్టలు పగిలాయి! రక్షణ రంగంలో ‘తాత్రా’ శకటాల కొనుగోలు అవినీతి, అగస్టా గగన శకటాల కొనుగోలు అవినీతి బద్దలయింది! తమ పార్టీ ప్రభుత్వం హయాంలో ఇన్ని అవినీతి కలాపాలు జరిగాయన్నది రాహుల్ గాంధీకి తెలిసిన నిజం. అందువల్లనే కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రస్తుత ప్రభుత్వం ‘రాఫెల్’ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడినట్టు ప్రచారం చేస్తున్నాడు! ఈ ప్రచారాన్ని ప్రతిఘటించడానికై ‘్భజపా’ చేస్తున్న యత్నంలో భాగం బహుశా సోమవారం నాటి నిర్ణయం..
శతాబ్దుల పాటు దమనకాండకు గురి అయిన అనుసూచిత కులాల వారికి, అనుసూచిత వన సమువదాయాల వారికి ఆరక్షణలు కల్పించడం సామాజిక సమానత్వ సాధనలో భాగం! ఈ శతాబ్దుల కాలంలో విదేశీయ దురాక్రమణకు, బీభత్సపాలనకు బలి అయిన మొత్తం భారత జాతి దళిత..! ఈ కులాలవారు, ఈ వనవాసీ ప్రజలు మరింతగా దళితులు! అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు ఈ దళితులు ప్రగతి ప్రక్రియలో సమాన భాగస్వాములు కావడానికి వీలుగా ‘ఆరక్షణల’ను ఏర్పాటు చేశారు! కానీ ఈ ‘ఆరక్షణ’ల ఫలితాలను నిజమైన దళితులకు దక్కకుండా ‘‘నకిలీ దళితులు’’ బొక్కడం కూడ దశాబ్దుల వైపరీత్యం! క్రమంగా ‘ఆరక్షణల’ పేరుతో ‘వోటు బ్యాంకుల’ను నిర్మించుకొనడానికి రాజకీయ పక్షాలు యత్నించడం, యత్నిస్తుండడం రాజ్యాంగ స్ఫూర్తిని నీరుకార్చుతున్న రాజకీయం! మతం పేరుతో 1947లో అఖండ భారత్ విభజన జరిగింది. ఈ చరిత్ర నుంచి పాఠం నేర్చుకొనడానికి సిద్ధంగా లేని రాజకీయ పక్షాలు కొన్ని మతం పేరుతో ‘ఆరక్షణలు’ కల్పించడానికి యత్నిస్తున్నాయి! ఆర్థిక ప్రాతిపదికగా పదిశాతం ‘రిజర్వేషన్లు’ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇదంతా నేపథ్యం! అందువల్ల ఈ నిర్ణయం కూడ భిన్నభిన్న విశే్లషణలకు గురికావడం ఖాయం! ‘‘మాకు ఆరక్షణలు వద్దు..’’- అని దేశ ప్రజలందరూ చెప్పగల రోజు రావాలన్నది 2007లో సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాట..