సంపాదకీయం

చారిత్రక న్యాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వం కంటె రాజకీయం అధికతర ప్రాధాన్యం సంతరించుకొనడం నడచిపోతున్న ప్రజాస్వామ్య వైపరీత్యం. కేంద్ర ప్రభుత్వం 2016లో రూపొందించిన ‘పౌరసత్వ సవరణ విధేయక’- సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ బిల్-ను కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడం ఇందుకు సరికొత్త సాక్ష్యం. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, అధికార భారతీయ జనతాపార్టీకి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న శివసేన, ఐక్య జనతాదళ్ వంటి రాజకీయ సంస్థలు సైతం ఈ ‘విధేయక’ను వ్యతిరేకించడం విచిత్రమైన వ్యవహారం. ఈ ‘బిల్లు’వల్ల అస్సాంలోని స్థానిక ప్రజలకు కలుగబోని నష్టం ‘‘కలుగనున్నట్టు’’ ప్రచారం చేస్తున్న ‘అస్సాం గణపరిషత్’- అగప- భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ‘‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’’- నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్- ఎన్‌డిఏ-నుంచి వైదొలగిపోవడం మరో విపరిణామం. అప్ఘానిస్థాన్ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురి అయిన అల్పసంఖ్య మతస్థులకు మన దేశపు పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను ప్రతిపాదించింది. ఈ మూడు దేశాలలోను ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఈ దేశాలలో ఇస్లామేతర మతస్థులు అల్పసంఖ్యాకులు. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న దేశాలలో అత్యధిక శాతం ‘ఇస్లాం మత రాజ్యాంగ’ వ్యవస్థలు ఏర్పడి ఉన్నాయి. ఇలా ‘ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడడం సర్వమత సమభావ- సెక్యులర్- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అయినప్పటికీ ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ’లు అనేక దేశాలలో ఏర్పడి ఉండడం వర్తమాన వాస్తవం! ఇలాంటి దేశాలన్నింటిలోను ‘జిహాదీ’లు ప్రబలి ఇస్లామేతర మతస్థులను నిర్మూలించడానికి యత్నిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోను, అప్ఘానిస్థాన్‌లోను, పాకిస్తాన్‌లోను ఇలా అల్పసంఖ్య మతస్థులను నిర్మూలించే కార్యక్రమం దశాబ్దుల తరబడి కొనసాగుతోంది. అందువల్ల ఈ దేశాలలోని అనాది మతాలవారు- హిందువులు- ఈ దేశాల నుంచి మన దేశానికి తరలి రావలసిన దుస్థితి ఏర్పడి ఉంది. విదేశాల నుంచి వ్యాపించిన యూదు, పారశీక, క్రైస్తవ మతాలకు చెందిన వారిపై కూడ ఈ దేశాలలో దాడులు జరుగుతున్నాయి. అందువల్ల ఈ మతాలవారు కూడ అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుండి పారిపోతున్నారు. వీరిలో అత్యధికులు మన దేశానికి వచ్చి స్థిరపడి ఉన్నారు. ఇలా ఈ మూడు దేశాల నుంచి నిర్వాసితులైన, బలవంతంగా గెంటివేతకు గురి అయిన ఈ ‘అల్పసంఖ్య మతాల’వారికి మన దేశంలో ఆశ్రయం కల్పించడం, పౌరసత్వం కల్పించడం ప్రభుత్వం నిర్వహించవలసిన మానవీయ విధి. ఈ విధిని కేంద్ర ప్రభుత్వం నిర్వర్తిస్తోంది! అందువల్ల రాజకీయ సంకుచిత ప్రయోజన ప్రాతిపదికగా ఈ ‘బిల్లు’ను వ్యతిరేకించడం అమానవీయ చర్య!
పాకిస్తాన్ నుంచి 2011 నుంచి దాదాపు ముప్పయివేల మంది అనాది మతాలకు- వేద మతాలకు- చెందిన హిందువులు మన దేశానికి వచ్చేశారు. అప్ఘానిస్థాన్‌లో అమెరికా దాడులు పెరగడం వల్ల పాకిస్తాన్‌లోకి చొరబడిన ‘తాలిబన్’ ‘అల్‌ఖాయిదా’ జిహాదీలు హిందువులపై దాడులు చేస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్‌లో క్రీస్తుశకం 1947 ఆగస్టు నుంచి కూడ ‘జిహాదీ’లు హిందువులను నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు- ఫలితంగా 1947లో మొత్తం పాకిస్తాన్ జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉండిన హిందువుల సంఖ్య ఈ శతాబ్ది ఆరంభంనాటికి ఒకటిన్నర శాతానికి పడిపోయింది. ఈ అవశేష హిందువులను సైతం నిశే్శషం చేయడానికి పాకిస్తానీ, అప్ఘానీ ‘జిహాదీ’లు కలసికట్టుగా బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. అందువల్ల పాకిస్తాన్ నుంచి మన దేశంలోని ‘అవశేష హిందువుల’ వెల్లువ కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాలో 1947లో హిందూ వనవాసీ ప్రజల సంఖ్య తొంబయి శాతం. కానీ జిహాదీల దాడుల ఫలితంగా ఈ ‘చక్మా’ల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. రెండు లక్షల మందికి పైగా ‘చక్మా’లు ఈశాన్య ప్రాంతంలోకి వచ్చేశారు. వీరిలో నలబయి ఏడు వేల మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తులు పెట్టి ఉన్నారు. వీరందరికీ భారతీయ పౌరసత్వం లభించినప్పటికీ అందరూ అస్సాంలో స్థిరపడబోరు, ఈశాన్యంలో స్థిరపడబోరు, దేశమంతటా వీరు విస్తరిస్తారు. దాదాపు రెండుకోట్ల మంది అక్రమ ప్రవేశకులు దేశమంతటా ఉన్నారు. అస్సాంలోనే నలబయి లక్షల మంది బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకులు తిష్టవేసి ఉన్నట్టు గత ఏడాది వెలువడిన ‘జాతీయ పౌర సూచిక’- నేషనల్ రిజిష్టర్ ఫర్ సిటిజెన్స్- ఎన్‌ఆర్‌సి- ద్వారా ధ్రువపడింది.
అక్రమ ప్రవేశకులను దేశం నుండి వెళ్లగొట్టడానికి ప్రభుత్వం ప్రారంభించిన చర్యలను వ్యతిరేకిస్తున్న కొన్ని ప్రతిపక్షాల వారు శరణార్థులై మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన సక్రమ ప్రవేశకులకు పౌరసత్వాన్ని కల్పించడాన్ని కూడ వ్యతిరేకిస్తున్నారు. అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టడం వల్ల అంతరంగిక భద్రత పెరుగుతుంది. సక్రమ ప్రవేశకులకు ఆశ్రయం ఇవ్వడంవల్ల, వారికి పౌరసత్వం కల్పించడం వల్ల అఖండ భారత విభజన వల్ల వారికి జరిగిన అన్యాయానికి విరుగుడు లభించినట్టు కాగలదు. అందువల్ల మంగళవారం లోక్‌సభ ఈ ‘పౌరసత్వ సవరణ’ బిల్లును ఆమోదించడం 1947 నాటి దేశ విభజన బాధితులకు జరిగిన చారిత్రక న్యాయం. క్రీస్తుశకం 712నుంచి అఖండ భారత్ పై జరిగిన ‘జిహాదీ’ల దాడులు శతాబ్దుల పాటు కొనసాగిన కారణంగా అప్ఘానిస్థాన్ అఖండ భారత్ నుంచి విడిపోయింది. 712నాటికి ‘గాంధార’, ‘యోన’, ‘ఉత్తర జ్యోతిష’, ‘రామఠ,’ ‘హార’వంటి రాజ్యాలతో కూడి ఉండిన నేటి అఫ్ఘాన్ ప్రాంతం ఆనాటికి భారత్‌లో భాగం. 712నుంచి జిహాదీలు దాడిచేసి భారతీయ మతాల వారిని ఇస్లాంలోకి బలవంతంగా మార్చడం వల్ల అఫ్ఘానిస్థాన్ భారత్ నుంచి విడిపోయింది. బ్రిటన్ దురాక్రమణదారులు ఈ విభజనను శాశ్వతం చేశారు. నేటి పాకిస్తాన్ ప్రాంతంలోను, బంగ్లాదేశ్ ప్రాంతంలోను కూడ 712నాటి మొత్తం జనాభా అనాది హైందవ మతాలకు చెందినవారే! ఇస్లామేతర మతాలను నిర్మూలించి ప్రపంచమంతటా ‘ఇస్లాం’ను ఏకైక మతంగా ప్రతిష్ఠించాలన్న లక్ష్యంతో జిహాదీలు జరిపిన బీభత్సకాండ ఫలితంగానే నేటి పాకిస్తాన్ ప్రాంతంలోను బంగ్లాదేశ్ ప్రాంతంలోను అనాది మతాలకు చెందిన స్వజాతీయ హిందువులు 1947 నాటికి అల్పసంఖ్యాకులుగా మారారు, ఇస్లాం జనబాహుళ్యం ఏర్పడింది. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను అఖండ భారత్ నుంచి విడగొట్టి 1947లో పాకిస్తాన్‌గా ఏర్పాటు చేయడం ‘సర్వమత సమభావ వ్యవస్థ’-సెక్యులర్ ఆర్డర్-కు జరిగిన చారిత్రక విద్రోహం! అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ కొనసాగిన భారత ప్రాంతాలలో, ఆ ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడిన తరువాత ‘సర్వమత సమభావం’ హత్యకు గురి అయింది, ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది!
ఇలా ఈ మూడు దేశాల నుంచి హిందువులు శరణార్థులై మన దేశంలోకి- అవశేష భారత్‌లోకి- తరలిరావడం అఖండ భారత విభజనతో ముడివడి ఉన్న చారిత్రక వైపరీత్యం. అఖండ భారత్ విభజన జరుగకపోయి ఉండినట్టయితే, దేశం 1947 నాటికి పూర్వం వలెనే కొనసాగి ఉండినట్టయితే ఇప్పటి పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను కూడ ‘సర్వమత సమభావ’ వ్యవస్థ యథాపూర్వం వలె ఏర్పడి ఉండేది. అన్ని మతాలవారు సమానంగా హాయిగా జీవించి ఉండేవారు! దేశ విభజన జరిగినందువల్లనే అప్పటినుంచీ ఇప్పటివరకూ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అల్పసంఖ్యాకులైన హిందువులు శరణార్థులై మన దేశానికి వస్తున్నారు. మన దేశంలో అనాదిగా నెలకొన్న సర్వమత సమభావ వ్యవస్థ 1947 తరువాత కూడ కొనసాగుతోంది! అందువల్ల ఇక్కడ అన్ని మతాలవారు సమానంగా జీవించగలుగుతున్నారు.. ఏ మతం వారు కూడ వేధింపులకు గురై దేశం నుండి పారిపోవడం లేదు!! ‘బిల్లు’ను వ్యతిరేకించినవారు గ్రహించవలసిన భారత జాతీయ జీవన వాస్తవం ఇది...