సంపాదకీయం

వెలుగుల విప్లవ వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకర సంక్రాంతి ఖగోళంలో సంభవించే వెలుగుల విప్లవానికి ప్రతీక. ఈ వెలుగుల విప్లవం సూర్యుని చుట్టూ భూమి తిరగడంవల్ల ప్రతి సంవత్సరం నియతంగా ప్రస్ఫుటిస్తున్న పునరావృత్తి! సృష్టిగత వాస్తవాలు మానవ జీవన సంస్కృతిగా సమాజస్థితం కావడం అనాదిగా కొనసాగుతున్న హైందవ జాతీయ ప్రస్థానం. భారత ఖండపు భౌతిక సాంస్కృతిక పరిధికి ఆవల ఉన్న మానవులు చాలా ఆలస్యంగా గుర్తించిన ఈ వెలుగుల విప్లవం గురించి భారతీయులకు అనాదిగా తెలుసు. ఈ వాస్తవ ధ్యాస ప్రాతిపదికగానే ‘మకర సంక్రాంతి’ మన దేశంలో అనాదిగా జరుగుతోంది. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడంవల్ల పనె్నండు సంక్రాంతులు ఏర్పడుతున్నాయి. వీటిలో మకర సంక్రాంతికి కర్కాటక సంక్రాంతికి అధికాధికమైన ప్రాముఖ్యం ఉంది. కర్కాటక సంక్రాంతి నుంచి ఆరు నెలలపాటు- భూమికి సాపేక్షంగా- సూర్యుడు క్రమక్రమంగా దక్షిణం వైపు జరుగుతాడు. అందువల్ల భూమిపై ఉత్తరార్థగోళం క్రమంగా వెలుగు తగ్గుతుంది. పగటి నిడివి తగ్గుతుంది, రాత్రి కాలవ్యవధి పెరుగుతుంది, చీకటి పెరుగుతుంది. ఉత్తరార్థగోళంలోని ప్రజలకు అందువల్ల ఈ ఆరునెలల ‘దక్షిణాయనం’ అంత ఇష్టంకాదు. చీకటి సమయం సగం కంటె ఎక్కువ కాబట్టి. మకర సంక్రాంతికి ముందురోజున ఉత్తరార్థగోళంలో ఈ వైపరీత్యానికి పరాకాష్ఠ! ‘మకర సంక్రాంతి’ ఏర్పడడంతో- భూమి నుండి గమనించినప్పుడు సాపేక్షంగా- సూర్యుని ఉత్తర దిశాప్రస్థానం మొదలవుతుంది. భూమధ్య రేఖకు దక్షిణంగా ఇరవై మూడున్నర అక్షాంశ ‘్భగ’- డిగ్రీ-ల దూరంలో మకర రేఖ నెలకొని ఉంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఇరవై మూడున్నర ‘్భగ’ల దూరంలో ‘కర్కాటక’ రేఖ నెలకొని ఉంది. కర్కాటక రేఖ మన దేశంలోని గుజరాత్ మధ్యప్రదేశ్ ఝార్‌ఖండ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా ఈశాన్య ప్రాంతంవరకు కొనసాగుతోంది. కర్కాటక రేఖ నుంచి మకర రేఖ వరకు ఆరునెలలు సూర్యుని ప్రస్థానం దక్షిణాయనం. మకర రేఖనుంచి కర్కాటక రేఖవరకు సూర్యుని ఆరు నెలల ప్రస్థానం ఉత్తరాయణం! ఉత్తరాయణం ఆరంభం కావడంతో మకర సంక్రాంతినుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉత్తరార్థ గోళంలో క్రమంగా రాత్రి నిడివి తగ్గుతుంది, చీకటి సమయం సగానికంటె తక్కువస్థాయికి తగ్గుతుంది. పగటి సమయం పెరుగుతుంది, వెలుగు వికసిస్తుంది, విస్తరిస్తుంది. ఉత్తరార్థం గోళంలో వెలుగుల విస్తరణకు ఆరంభం మకర సంక్రాంతి! మన దేశం ఉత్తరార్థగోళంలో ఉంది! అందువల్లనే క్రమంగా, చీకటి పెరగడానికి ప్రతీక అయిన కర్కాటక సంక్రాంతిని మనం ఉత్సవంగా జరుపుకొనడం లేదు. క్రమంగా వెలుగును పెంచే సూర్యుని ఉత్తరాయణానికి శుభారంభమైన మకర సంక్రాంతి ఈ దేశంలో అనాదిగా ఉత్సవమైంది. ఈ వెలుగుల విప్లవగతి దక్షిణార్థగోళంలోను, ఉత్తరార్థగోళంలోను పరస్పరం వ్యతిరేకగతిని సంతరించుకొని ఉండడం సృష్టిగతమైన ఖగోళ వాస్తవం!
వెలుగులను పంచుతున్న సూర్యుడు, వెలుగులను పెంచుతున్న భూమి పరిభ్రమణం ‘మకర సంక్రాంతి’కి ప్రాతిపదిక! సూర్యుని ప్రాధాన్యం గుర్తించిన భారతీయులు అనాదిగా సూర్యుని ఆరాధిస్తున్నారు!! ‘సౌరశక్తి దేశాల కూటమి’- ఇంటర్ నేషనల్ సోలార్ అలియన్స్-ని ఏర్పాటుచేయడం ద్వారా మన ప్రభుత్వం సూర్యుని ప్రాధాన్య ధ్యాసను మరింత పెంచగలిగింది. అమెరికా బ్రిటన్ రష్యా చైనాలు సహజంగానే ఈ కూటమిలో లేవు. ఎందుకంటె ఈ దేశాలన్నీ సౌరశక్తి మండలానికి ఉత్తరంగా నెలకొని ఉన్నాయి. మకర రేఖ నుంచి కర్కాటక రేఖ వరకు విస్తరించిన ‘్భగోళం’మాత్రమే సౌరశక్తి మండలం. ఈ సౌరశక్తి మండలం మానవ నిర్మితం కాదు, ఇది ప్రకృతిలో సహజంగా నిహితమై ఉన్న అనాది వ్యవస్థ!... సంపన్న అగ్ర రాజ్యాలను ఈ కూటమినుంచి తొలగించడానికి ప్రకృతి ఇలా సహకరించింది. ఈ కూటమికి మన దేశం నాయకత్వం వహించగలగడం ఇలా ప్రకృతి సిద్ధమైన పరిణామం! ప్రకృతిలో మానవాళి మాత్రమేకాదు సమస్త జీవజాలం భాగం. మకర సంక్రాంతి సందర్భంగా ప్రకృతికి పూజలు చేస్తున్న భారతీయులు అనాది ఈ ‘అద్వైత’ వాస్తవాన్ని గుర్తించారు. సృష్టి, సృష్టికర్త వేఱు వేఱుకాదు. సృష్టి సృష్టికర్త ఒకటే! ప్రకృతి పరమాత్మ వేఱు వేఱు కాదు, ఒకటే! ఈ అద్వైత స్థితిని గుర్తించిన భారతీయులు ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానం చేసుకున్నారు. ‘‘ప్రకృతిని ఆరాధించడం’’అంటే ప్రకృతిని పరిరక్షించడమే! ఇలా ప్రకృతిని పరిరక్షించడం మానవులు తమనుతాము పరిరక్షించుకోవడం! పంటలు ఇంటికి చేరేవేళ ‘మకర సంక్రాంతి’ని ఉత్సవంగా జరుపుకొనడం ద్వారా ప్రకృతికి ప్రాతిపదిక అయిన భూమాతకు అంజలి ఘటిస్తున్నాము. భూమి మిగిలిన ప్రాకృతిక శక్తులయిన నీరు, నిప్పు, గాలి, ఆకాశాలకు ఆధారం అన్నది సనాతన జీవన సత్యం... అందువల్లనే పుడమితల్లిని పూజించడం ‘మకర సంక్రాంతి’ ఉత్సవం...!
నీరు, గాలి, ఆకాశం, భూమి కాలుష్యగ్రస్తం అయిపోతుండడం నడచిపోతున్న వైపరీత్యం. భూమిని సహజంగా దున్ని సారవంతంచేస్తున్న వానపాములు- ఎఱలు- ప్రాకృతిక పరిపుష్ట వ్యవస్థలో భాగం, ఈ వానపాములకు ఆహారమైన ఆవుల పేడ పశువుల పేడ ఆకులు అటవీ ఉత్పతుతలు వ్యవసాయాన్ని పోషించాయి. అందువల్లనే ‘గోమాత’ ఈ దేశ ప్రజలకు అనాదిగా ఆరాధ్యం అయింది. అడవి, ‘కనుమ’ పర్వతము పూజనీయతకు ప్రతీకలయ్యాయి. కనుమను పర్వతాన్ని అనాదిగా భారతీయులు పూజించారు. ద్వాపర యుగంలో బలరామకృష్ణుల ఆధ్వర్యంలో జరిగిన ‘గోవర్ధనగిరి’ పూజ కనుమ పండుగకు ఒక ప్రతీక మాత్రమే! చరిత్రలో అసంఖ్యాక ఉదాహరణలు. కనుమల నుంచి పర్వతాల నుంచి ప్రభవిస్తున్న వాగులు, ఏఱులు, నదులు మహాప్రవాహాలుగా మారి వివిధ పద్ధతుల ద్వారా పంట భూములను పండిస్తున్నాయి, మానవులకు జంతువులకు, వృక్షాలకు జీవ జవాలను ప్రసాదిస్తున్నాయి. ఇలా పర్వత నిసర్గజీవన జలాలు అమృతము! అందువల్లనే పర్వతాలు మాతృదేవికి మాతృభూమికి స్తనమండనం’ - వక్షస్థలమైంది. ఈ వక్షస్థలం నుంచి పాలను, నీళ్లను పొందుతున్న ‘జన సముదాయాలు’ ఈ భూమి పట్ల మాతృభావాన్ని కలిగి ఉండడం సహజం! జన సముదాయం కానీ అనేక జన సముదాయాలు కానీ ఒక జాతిగా ఒకే జాతిగా వికసించడానికి ఈ మాతృ మమకారం వౌలికమైన ప్రాతిపదిక! భారతీయులు అనాదిగా ఒకే జాతిగా జీవనప్రస్థానం సారించడానికి ఇదీ కారణం. ఈ సృష్టిగత వాస్తవం సమాజ స్థితం కావడమే అనాదిగా వైదిక జీవనం, సనాతన సంస్కృతి, భారతీయత... హైందవ జాతీయతత్త్వం! పుడమి పరిరక్షణ మకర సంక్రాంతి పూజలకు, ఉత్సవాలకు ఫలశ్రుతి....
ఇలాంటి సనాతన జీవన స్వచ్ఛతకు దశాబ్దుల తరబడి అపవాదం ఏర్పడింది! ఈ అపవాదం- ఎక్సెప్షన్- సాధారణ నియమం- జనరల్ రూల్-గా మారిపోవడం శతాబ్దుల విదేశీయ దురాక్రమణ ఫలితం! భౌతిక దురాక్రమణ నుంచి విముక్తమైన భారతావని ఆర్థిక దురాక్రమణకు బలిఅవుతుండడం నడుస్తున్న చరిత్ర. గోసంతతిని హత్యచేశారు, అడవులను నరికివేశారు. సంప్రదాయ సిద్ధమైన ‘ఎఱువులు’ మృగ్యం అయ్యాయి. కృత్రిమ రసాయనాలతో కలుషితమైన పుడమి, ప్రకృతి గాయపడడం నడుస్తున్న చరిత్ర. వానపాములు, ఉడుతలు, పిచ్చుకలు హరించుకొనిపోతున్నాయి, హననం అవుతున్నాయి! మన పంటలకు ‘బి.టి.’ - బాసిలస్ తురిన్ జెన్సిస్- తెగులు సోకడం కాలుష్యానికి పరాకాష్ఠ! పత్తిని ‘ప్లాస్టిక్’దిగమింగింది! భారతీ గగన వీధులలో చైనావారి ‘పతంగు’లు - గాలిపటాలు- ఎగురుతుండడం ‘మకర సంక్రాంతి’ని నిలదీస్తున్న వికృత దృశ్యాలు! ఈ ఆర్థిక దురాక్రమణ తొలగి మన సీమలలో స్వచ్ఛమైన మధుర సంక్రాంతి శోభలు కొలువుతీరేదెప్పుడో....??