సంపాదకీయం

పిడకల వేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలోని ఒక ‘హోటల్’లో స్వచ్ఛంద నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కర్నాటక శాసనసభ్యులు చెల్లిస్తున్న ‘అద్దె’- కిరాయి- గురించి బుధవారం గొప్పగా ప్రచారమైంది. ఒక ‘గది’కి రోజునకు పదునాలుగు వేల రూపాయలు ‘కిరాయి’ చెల్లించడం రాజకీయ పరిణామక్రమాన్ని కుతూహలంతో గమనిస్తున్న ఉత్కంఠగ్రస్తులకు చర్చనీయాంశమైంది. హోటల్ గదుల కిరాయి- ఒక్కొక్కదానికి- పదునాలుగువేల నాలుగువందల రూపాయలన్నది జీఎస్‌టీ ధ్యాస ఉన్న మాధ్యమాలవారు మరింత నిక్కచ్చిగా నిగ్గుదేల్చిన మహావిషయం. ‘రామాయణం’కంటె ‘పిడకల వేట’కు ప్రాధాన్యం పెరగడం నడచిపోతున్న రాజకీయం. పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి వీలుగా రాజ్యాంగంలోని నూటరెండవ, నూట తొంబయి ఒకటవ అధికరణాలలోను, పదవ అనుబంధంలోను నిర్దేశించిన నియమావళిని దాదాపు అందరూ మరచిపోవడం నడుస్తున్న చరిత్ర. ఈ నియమావళిని ఉల్లంఘించి సొంత పక్షం నుంచి ఇతర రాజకీయ పక్షాలలోకి ఫిరాయిస్తున్న పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తమ పదవులను కోల్పోకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి అనేక ఏళ్లుగా జరుగుతున్న విఘాతం. తెలుగు రాష్ట్రాలలో ఇలా నియమావళికి విరుద్ధంగా పార్టీలను ఫిరాయించినవారు అనేకమంది ఆ తరువాత కూడ శాసనసభ్యులుగా కొనసాగారు, కొనసాగుతున్నారు. పార్టీలలో ‘చీలిక’ ఏర్పడినప్పుడు మినహా, మిగిలిన సందర్భాలలో సొంత పార్టీని వదలినవారు తక్షణం తమ పార్లమెంటు సభ్యత్వాన్ని, శాసనసభ్యత్వాన్ని కోల్పోతారన్నది రాజ్యాంగంలోని పదవ అనుబంధంలోని నిర్ధారణ. చట్టసభలలో ఒక పార్టీకి ఉన్న మొత్తం సభ్యులలో కనీసం మూడవ వంతు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసినప్పుడు మాత్రమే ‘పార్టీ’లో చీలిక ఏర్పడినట్టు ధ్రువపడుతుంది. కానీ తెలుగు రాష్ట్రాలతో సహా దాదాపు అన్ని రాష్ట్రాలలోను ఇందుకు విరుద్ధంగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు- ఇలా ‘మూడవ వంతు కంటె తక్కువ సంఖ్యలోని’ శాసనసభ్యులు పార్టీలను ఫిరాయిస్తూనే ఉన్నారు. ఇలాంటి ‘ ఫిరాయింపు’దారులు శాసనసభ్యత్వాలను కోల్పోయిన సందర్భాలు తక్కువ. ఇలా ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కూడ దక్కిపోతున్నాయి. కర్నాటకలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ బేరసారాలకు ఇదంతా నేపథ్యం. తమిళనాడులో అన్నా డీఎంకే నుండి విడివడిన శాసనసభ్యులు పదవులను కోల్పోడం మాత్రమే ఈ ఫిరాయింపుల వైపరీత్యానికి ఇటీవలి కాలంలో ‘అపవాదం’. పార్టీకి చెందిన సభ్యులలో మూడవ వంతు లేరన్న కారణంగా టీటీవీ దినకరన్‌కు విధేయులైన పద్దెనిమిది మంది శాసనసభ్యుల సభ్యత్వాలను సభాపతి పి.ధనపాల్ 2017 సెప్టెంబర్ 18న రద్దుచేశాడు. దీనిని మద్రాసు ఉన్నత న్యాయస్థానం ధ్రువీకరించింది. కానీ ‘మూడవ వంతు’తో నిమిత్తం లేకుండా ఒక పార్టీనుంచి మరో పార్టీకి ఫిరాయించవచ్చునన్న ‘్ధమా’ ప్రజాప్రతినిధులలో పెరిగిపోతుండడం ప్రస్తుతం కర్నాటకలో జరుగుతున్న రాజకీయ నాటకానికి ప్రాతిపదిక. వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యుల ‘హోటల్’ నిర్బంధాలకు అవుతున్న ఖర్చు గురించి జరుగుతున్న ప్రచారం ‘పిడకల వేట’ మాత్రమే. కానీ కర్నాటకలో నడుస్తున్న ‘బేరసారాల’ రాజకీయం మాత్రం రామాయణం కాదు. దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న ‘పొత్తుల’ ‘కూటముల’ రాజకీయంలో ఈ కర్నాటక కాండ ఒక అంశం మాత్రమే. కర్నాటకకు చెందిన ‘భారతీయ జనతాపార్టీ’ శాసనసభ్యులను ఢిల్లీకి సమీపంలోని గురుగావ్‌లోని హోటళ్లలలో ఎందుకు నివసింపచేస్తున్నారన్నది ‘కర్నాటక కాండ’లోని మరో కుతూహల ఘట్టం. కాంగ్రెస్ నుంచి కొంతమంది జారుకున్నట్టయితే కాంగ్రెస్ మద్దతుతో మనుగడ సాగిస్తున్న ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి పదవీగండం ఏర్పడడం ఖాయం. అందువల్ల ఆయన కొంతమంది ‘భాజపా’ శాసనసభ్యులను తమ ‘కూటమి’లో చేర్చుకొనడానికి యత్నిస్తున్నాడన్నది జరుగుతున్న ప్రచారం. లౌకిక జనతాదళ్ అధినేత కుమారస్వామి గత మే నెలలో ముఖ్యమంత్రి కావడానికి కారణం కాంగ్రెస్ చేసిన గొప్ప త్యాగం. రెండువందల ఇరవై నాలుగు స్థానాల శాసనసభలో నూట నాలుగింటిని గెలిచిన ‘భాజపా’కు అధికారం దక్కకుండా నిరోధించడానికి కాంగ్రెస్ గత మే నెలలో ఇలా ‘చారిత్రిక త్యాగానికి’ పూనుకొంది. డెబ్బయి ఎనిమిది స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ముప్పయి ఎనిమిదింటిని కైవసం చేసుకున్న లౌకిక జనతాదళ్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ఈ త్యాగం. ఇలా ‘విరోధికి అపశకునం కలిగించడానికై కాంగ్రెస్ తన ముక్కును కోసుకోవడం’వల్ల లౌకిక జనతాదళ్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తమను కుమారస్వామి తిట్టిన తిట్లను మరచిపోలేని, మంత్రి పదవులను పొందలేని కాంగ్రెస్ శాసనసభ్యులు కొందరు సందు చూసుకొని ‘గోడ దూకడానికి’ భాజపా ‘ప్రాంగణంలోకి’ చేరిపోవడానికి సిద్ధంగా ఉండడం ప్రచారమవుతున్న ‘రహస్యం’.
కానీ ‘విలక్షణ సైద్ధాంతిక నిబద్ధతను అనుశాసన నిష్ఠను కలిగి ఉన్న ‘భాజపా’వారు తమ శాసనసభ్యులను గురుగావ్‌లో ఎందుకని ‘మంద’పెట్టినట్టు? అంటే తమ పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు ‘ఫిరాయించి’ కుమారస్వామి కూటమిలో చేరిపోగలరని ‘భాజపా’ నాయకత్వం భయపడుతోందా? నిజంగా అలా జరిగినట్టయితే సైద్ధాంతిక నిబద్ధత ప్రజాస్వామ్య నిష్ఠ ఈ ఫిరాయింపుదారులకు లేనట్టు ధ్రువపడుతుంది. అలాంటి వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం నాయకత్వ వైఫల్యానికి నిదర్శనం. కానీ నిష్కారణంగా సైద్ధాంతిక నిష్ఠ ఉన్న తమ శాసనసభ్యులను వారి ‘సౌశీర్యాన్ని’ శంకించి ఇలా మందపెట్టి ఉన్నట్టయితే అది వారిపట్ల నాయకత్వం ప్రదర్శిస్తున్న అవమానకరమైన వైఖరికి నిదర్శనం. ఇలా తమను అవమానించిన నాయకత్వానికి, ప్రధానంగా కర్నాటకలో పార్టీని నడిపిస్తున్న బీఎస్ యెడియూరప్పకు ఈ శాసనసభ్యులు నిరసన తెలపడం సహజం. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలోగా కర్నాటకలో కాంగ్రెస్, లౌకిక జనతాదళ్‌ల మధ్య ‘మైత్రి’ రద్దయిపోవచ్చునన్నది జరుగుతున్న ప్రచారం. అందువల్ల ‘కూటమి’కూలిపోయి కుమారస్వామి మంత్రివర్గం కూలిపోతే శాసనసభకు మళ్లీ ఎన్నికలు జరగడం ఖాయం. నూటనాలుగు మంది సభ్యులున్న భాజపా గత మే నెలలో ఎన్నికలు ముగిసిన వెంటనే- ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ ‘సభ’లో ‘సంఖ్యాధిఖ్యం’- మెజారిటీ లేకపోవడంతో ముఖ్యమంత్రి యెడియూరప్ప ప్రభుత్వం మూన్నాళ్లకే ముగిసింది. కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడింది. ‘భాజపా’ మిన్నకున్నట్టయితే ఇలా మధ్యంతరంగా ఎన్నికలు జరుగవచ్చు. అలా ఎన్నికలు జరిగితే‘భాజపాకు మెజారిటీ లభించవచ్చు కూడా. కానీ వేచి చూడకుండా ఫిరాయింపులను ప్రోత్సహించి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి యత్నించినట్టయితే ‘అప్రతిష్ఠపాలు కాగలదు.
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ‘భాజపా’ వ్యతిరేక పక్షాల కూటముల ఏర్పాటుకు జరిగిపోతున్న ఆర్భాటం దేశ రాజకీయాలలోని ప్రస్తుత ప్రధాన అంశం! కాంగ్రెస్‌తో కూడిన ‘భాజపా’ వ్యతిరేక కూటమి ఏర్పాటుకోసం ఒకవైపు, కాంగ్రెస్ లేని ‘భాజపా’ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మరోవైపు చురుకుగా చర్చలు జరుతున్నాయి. తెరాసకూ, వైఎస్‌ఆర్‌సీపీకి మధ్య బుధవారం జరిగిన చర్చలు కాంగ్రెస్ లేని ‘భాజపా’ వ్యతిరేక కూటమికి మద్దతు ఊపందుకొంటోందనడానికి నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌లో ఇదివరకే కాంగ్రెస్ లేని ‘భాజపా’ వ్యతిరేక కూటమి ఏర్పడిపోయి ఉంది. ఇలా జాతీయ రాజకీయం ఆసక్తికరంగా రాజుకుంటున్న తరుణంలో మొదలైన ‘కర్నాటక ప్రహసనం’ సరికొత్త పిడకల వేట.