సంపాదకీయం

‘తైతక్కలాట’ కాదు..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి తదితర ప్రదేశాలలోని ‘నృత్యశాలల’- డ్యాన్స్ బార్స్-పై మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ‘అతార్కిక’ నియంత్రణలను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తొలగించడం నవ నాగరిక జీవన వికాసానికి కొత్త ఊపు.. ఈ ఆంక్షల తొలగింపు వల్ల వ్యక్తవౌతున్న హర్షోల్లాస అనుభూతులకు ఎక్కువ ప్రచారం జరుగుతోంది. నొచ్చుకుంటున్నవారి మనోభావాలకు మాధ్యమాలలో పెద్దగా ఆవిష్కరణ లేదు. సర్వోన్నత న్యాయస్థానం వారి నిర్ణయం శిరోధార్యం కాబట్టి మహారాష్ట్ర అంతటా మాత్రమేకాక ఇతర ప్రాంతాలలో సైతం ఈ ‘డ్యాన్స్ బార్’లు బస్తీబస్తీలో గల్లీగల్లీలో పుట్టుకొని రావడానికి అవకాశం ఏర్పడింది. ‘డ్యాన్స్’ అన్న ఆంగ్ల పదాన్ని భారతీయ భాషలలోని ‘నృత్యం’, ‘నాట్యం’ వంటి పదజాలంతో నిర్దేశించడం బహుశా కృతకమైన ప్రయత్నం. ఎందుకంటె ‘్భరత నాట్యం’ ‘కూచిపూడి’ ‘కథక్’ ‘కథక్కలీ’ ‘మణిపురీ’ వంటి జాతీయ సంప్రదాయానికి అనుగుణమైన ‘నృత్య ప్రదర్శన’లకు ముంబయి వంటి చోట్ల ఏర్పడిన ‘డ్యాన్స్ బార్’లలో జరిగే తైతక్కలాటలకు సంబంధం లేదు. భారతీయ నృత్యాల పేర్లు సైతం వినని కళాకారులు, కళాకారిణులు ఈ ‘బార్’లలో తైతక్కలాటలు ఆడుచుండడం ప్రచారవౌతున్న వాస్తవం. అందువల్ల ‘బార్’లలోని ‘డ్యాన్స్’ అన్న పదాన్ని ‘డ్యాన్స్’ అని భారతీయ భాషలలో కూడ నిర్దేశించడం మేలు. మన జాతీయ సంస్కృతి శతాబ్దులుగా విదేశీయ వికృతులతో సంకరమైంది. అందువల్ల భారతీయ భాషలు కూడ ఆంగ్ల పదాలతో అలరారుచుండడం సహజమైపోయింది. కృత్రిమత్వమే ‘సహజం’గా మారి ఉండడం అసలు సంగతి.. ఈ ‘డ్యాన్సింగ్ బార్’లలో జరిగిపోతున్న కలాపాలను నియంత్రించడానికి, నిరోధించడానికి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నించిన సమాచారం లేదు. ప్రయత్నించిన మహారాష్ట్ర ప్రభుత్వం చేతులు కాల్చుకుంది. నైతిక భ్రాంతులకు గురి అయిన మహారాష్ట్ర ప్రభుత్వం ‘డ్యాన్సింగ్ బార్’లను నియంత్రించడానికి యత్నించిందని సర్వోన్నత న్యాయస్థానం వారు వ్యాఖ్యానించడం గుర్తుంచుకోదగిన అంశం. అందువల్ల ఈ తీర్పు ‘డ్యాన్స్‌బార్’ల నిర్వాహకులకు, ‘డ్యాన్స్’ చేసే వారికి గొప్ప విజయం. ఈ ‘బార్’లలో యథాపూర్వంగా ఇక తైతక్కలాటలు జరిగిపోవచ్చు. ఈ ‘డ్యాన్స్’ కేంద్రాలలో మద్యం కూడ సరఫరా చేసి తీరవలసిందేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది..
మహారాష్టల్రో ‘డ్యాన్స్ బార్’లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం 2005 ఆగస్టులో ఆదేశించినప్పటి నుంచీ ఈ వివాదం న్యాయస్థానాల పరిశీలనలో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘డ్యాన్స్‌బార్’లపై విధించిన నిషేధం చెల్లదని 2006 ఏప్రిల్‌లో బొంబాయి హైకోర్టు తీర్పుచెప్పడంతో ‘డ్యాన్స్ బార్’లు మళ్లీ బార్లా తెరుచుకున్నాయి. 2013 జూలైలో సర్వోన్నత న్యాయస్థానం కూడ హైకోర్టు తీర్పును సమర్ధించింది. 2014 ఏప్రిల్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘డ్యాన్స్ బార్’ల క్రమబద్ధీకరణ ‘బిల్లు’ను శాసనసభ ఆమోదించడంతో మళ్లీ వివాదం మొదలైంది. ‘డ్యాన్స్‌బార్’లలోను, హోటళ్లలోను, రెస్టారెంటులలోను, ‘బార్’గదులలోను ‘అశ్లీలకరమైన’ డ్యాన్స్‌లు చేయరాదని నిర్దేశిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో మహిళా మర్యాదల పరిరక్షణ నియమావళిని రూపొందించింది. ఇప్పుడు ‘డ్యాన్స్’లు చేయడానికి అనుమతినిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం అశ్లీలమైన అసభ్యకరమైన ‘డ్యాన్స్’లను మాత్రం చేయరాదని నిర్దేశించింది. ప్రేక్షకులలో మితిమీరిన లైంగిక కామోద్రేకం- ప్రూరియంట్ ఇంటరెస్ట్- కలుగడానికి దోహదం చేసే ‘డ్యాన్స్’లు అశ్లీలమైనవని సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఏకె సిక్రీ, అశోక్ భూషణ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర చట్టంలోను, భారతీయ శిక్షాస్మృతిలోను ఇదే సృష్టీకరణ ఉందని కూడ ‘్ధర్మాసనం’ వారు నిర్ధారించారు. కానీ ఏ ‘రెస్టారెంట్’-బార్-లోని ఏ ‘డ్యాన్స్’ అశ్లీలకరమైనది? ఏది కాదు? అన్న నిర్ధారణ ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుంది? ఈ ‘డ్యాన్స్’లు జరిగేచోట్ల ‘అంతర్గత చిత్రీకరణ’ నిఘా- సీసీటీవీ సర్వివలెన్స్- వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిబంధనను కూడ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ‘డ్యాన్స్’లకు మరో విజయం.
ఇలా మన దేశంలో ‘సరికొత్త జీవన సంప్రదాయాలు’ కొలువు తీరుతుండడం నడచిపోతున్న నాగరికం. ఈ నాగరికాన్ని ప్రజలు స్వచ్ఛందంగా అలవర్చుకుంటున్నారా? లేక రాజ్యాంగ వ్యవస్థల ‘నిర్వాహకులు’ జనం నెత్తికెత్తుతున్నారా? అన్నది ‘మీమాంస’.. జీవన సంస్కారాలకు అర్థాలు మారిపోతున్నాయి! ఏవి జాతీయ జీవన సంస్కారాలు? ఏవి విదేశాల నుంచి వ్యాపించిన వికృతులు? అన్నది కూడ ‘మీమాంస’! భారతీయతకు సంబంధించిన ప్రతి అంశం గురించి, ప్రతి సంస్కారం గురించి, ప్రతి వికృతి గురించి, ప్రతి దృక్పధం గురించి, సమష్టి అనుభూతి సహజంగా ఏర్పడడం తరతరాల వాస్తవం. కానీ కొన్ని తరాల క్రితం అంకురించిన ‘కృత్రిమ తత్వం’ ప్రస్తుతం మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించింది. ఈ ‘కృత్రిమతత్వం’ జాతీయ సహజ సాంస్కృతిక తత్త్వాన్ని ‘దిగమింగుతోంది! కృత్రిమ తత్వమే సహజతత్త్వమన్నది మరోవైపు కొనసాగుతున్న వాదం. కృత్రిమ సిద్ధాంతాలను నిర్మించినవారు సహజ జాతీయతత్త్వాన్ని నిరసిస్తున్నారు, అభిశంసిస్తున్నారు, నిందిస్తున్నారు, నిప్పులను కక్కుతున్నారు. దేవాలయాల గోడలపై సహస్రాబ్దుల నాటి శిల్పకళను నిరసించినవారు, ఎమ్‌ఎఫ్ హుస్సేన్ వంటి బౌద్ధిక బీభత్సకారుల చిత్రాలను ‘గొప్ప కళాఖండాలని’ ప్రశంసించడం సహజత్వాన్ని కృత్రిమతత్త్వం దిగమింగిన చరిత్రకు ఒక ఉదాహరణ మాత్రమే! దేవాలయాల కుడ్య చిత్రమాలికలలో అసభ్య శృంగారం ఉన్నదన్నది కృత్రిమ నాగరిక సిద్ధాంత రాద్ధాంతకారులు వినిపించిన వాదం. ఎమ్‌ఎఫ్ హుస్సేన్ కనిపించని దేవతల రూపాలను మాత్రమే కాదు, కనిపించే పరమదేవత భరతమాత రూపాన్ని సైతం వికృతంగా చిత్రీకరించి వెళ్లాడు. ఇక్కడ పుట్టిపెరిగి అన్ని సుఖాలు సదుపాయాలు అనుభవించి ‘కతార్’ దేశానికి పారిపోయాడు. సమష్టి జీవన సంస్కృతికి భిన్నమైన ‘వికృతి’ సమాంతరంగా కొనసాగుతుండడం యుగాల చరిత్ర. కానీ ఈ ‘వికృతి’కి ఆదరణ లభించలేదు, అధికాధిక జనం అంగీకరించలేదు. ఇప్పుడు కూడ ‘వికృతి’కి అధికాధిక ప్రజాదరణ లేదు. ఈ దేశంలోని ప్రజలలో అధికాధికులు జాతీయ జీవన సంస్కార సమాహారమైన ‘సంస్కృతి’ని పాటిస్తున్నారు. ‘వికృతి’ని ప్రేమిస్తున్న కృత్రిమ సిద్ధాంతకర్తల సంఖ్య చాలా తక్కువ! కానీ ‘వికృతి’ని అధికాధిక ప్రజలు అంగీకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది, నేలకు నింగికి చిల్లుపడేలాగా ఆర్భాటం జరుగుతోంది. ఇదీ ప్రవర్ధమాన జాతీయ వైపరీత్యం.. ‘డ్యాన్స్ బార్’లో జరిగిపోతున్న తైతక్కలు ఈ వైపరీత్యంలో భాగం. ఈ తైతక్కల వల్ల మాతృమూర్తి స్వరూపమైన మహిళ అవమానానికి గురి అవుతోందన్న మహారాష్ట్ర ప్రభుత్వ వాదాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అందువల్ల ‘డ్యాన్స్’ చేయడం తైతక్క లాడడం కాదని, మహిళల గరిమకు భంగకరం కాదని అంగీకరించవలసిందే! సర్వోన్నత న్యాయ శాసనం శిరోధార్యం..
గతంలో దేవాలయాలలో మహిళలు నృత్యం చేసేవారు. సృష్టికర్త నుంచి సృష్టి వేరు కాదన్న సనాతన వాస్తవానికి అంటే శాశ్వత సత్యానికి ఆ నృత్యం ప్రతీక! సృష్టిలో భాగమయిన ప్రతి మానవుడు, ప్రతి జీవం , ప్రతి అణువుకూడ సృష్టికర్త ప్రతిరూపం. ఇదీ భారతీయ జీవనం. అందువల్లనే ‘‘శిరోభూత్వాశివం యజేత్’’- శుభకర తత్త్వంగా మారి శుభకర తత్త్వాన్ని ఆరాధించాలి- అన్నది యుగయుగాల జాతీయ జీవనమైంది. ఈ భావంతోనే భారతీయుడు దేవుడికి ‘నృత్యం దర్శయామి’- నాట్యం చూపిస్తున్నాను- అని చెప్పాడు, చెపుతున్నాడు. కానీ, ఇలా దేవుడికి నృత్యం చేసి చూపడం మహిళల మర్యాదకు భంగకరమని ప్రచారం జరిగింది. దేవాలయాలలో మహిళలు నృత్యం చేయడం ఆగిపోయింది. ‘దేవుని ఎదుట నాట్యం చేయడం అశ్లీలం, అనుచితం’ అన్నది నాగరికం అయింది. ‘డ్యాన్స్’లను ‘బార్ల’లో చేయవచ్చునన్నది నాగరికం! సర్వోన్నత న్యాయస్థానం ఈ నాగరికాన్ని ఆమోదించినప్పుడు ‘కాదని’ ఎలా అనగలం? ‘డ్యాన్సు’లు జరిగే చోట్ల ‘డాన్స్’ కేంద్రాల ద్వారాల వద్ద ‘సీసీటీవీ’లను ఏర్పాటు చేయరాదట. అలాచేస్తే ‘ఏకాంత స్వేచ్ఛ’-ప్రైవసీ-కి భంగమట.. సార్వజనిక స్థలాలలో ‘ఏకాంత అధికారం’ ఏమిటన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న.. ‘డ్యాన్స్‌బార్ల’లో మద్యం సరఫరా జరుగకుండా నిరోధించరాదని కూడ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.. జాతీయ శాశ్వత వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థ భాగం!! రాజ్యాంగం సమష్టి జన మానస ప్రతిబింబం.. అందువల్ల..!