సంపాదకీయం

వికటిస్తున్న ‘వ్యవస్థ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగ నిబంధనలు నీరుకారిపోతున్నాయనడానికి ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం. రాజకీయాలను రాజ్యాంగ నిబంధనలు నిర్దేశించడం ప్రజాస్వామ్య వ్యవస్థ, పరిపాలనను రాజ్యాంగ సూత్రాలు నియంత్రించడం ప్రజాస్వామ్య వ్యవస్థ.. రాజకీయ ప్రయోజనాలు రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించడానికి యత్నిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ‘కేంద్ర నేర పరిశోధక మండలి’- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సీబీఐ-కి చెందిన అనేక మంది అధికారులను, ఉద్యోగులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అనేక గంటలపాటు నిర్బంధించడం ‘అరాజకం’ అంకురిస్తోందనడానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వాన్ని, పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని వేఱువేఱుగా రాజకీయ పక్షాలు నిర్వహించడం రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణమైన వాస్తవం. కేంద్ర ప్రభుత్వ నిర్వాహక పక్షమైన భారతీయ జనతాపార్టీ, పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ పరస్పరం విరోధించడం రాజకీయ వాస్తవం. బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని అధికార పక్షానికి ‘్భజపా’ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించడం రాజకీయ ‘వైరానికి’ కారణం కావచ్చు. కానీ ఈ రాజకీయం ప్రాతిపదికగా రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించే స్థితికి బెంగాల్ పోలీసులు ‘చేరడం’ మాత్రం ఘోరమైన వైపరీత్యం. ‘్భజపా’కూ ‘తృణమూల్ కాంగ్రెస్’కూ మధ్య కొనసాగుతున్న రాజకీయ స్పర్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘రాజ్యాంగ యుద్ధం’గా చిత్రీకరించే యత్నం ఈ ఘోర వైపరీత్యం. ఈ ప్రయత్నంలో భాగంగానే బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేయడానికి వచ్చిన ‘సీబీఐ’ బృందం వారిని అడ్డుకున్నారన్నది స్పష్టం. ఒక ‘చిట్ ఫండ్’ అవినీతి వ్యవహారంలో కలకత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించడానికి వెళ్లిన ‘సీబీఐ’ బృందాన్ని పోలీసులు అడ్డుకొనడం స్పష్టమైన రాజ్యాంగ ధిక్కారం. ‘సీబీఐ’ బృందాన్ని నిర్బంధించం పోలీసులు పాల్పడిన దౌర్జన్యం. ‘సీబీఐ’ నిబంధనలకు వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించడానికి యత్నించి ఉంటే కమిషనర్ సమాధానం చెప్పడానికి నిరాకరించి ఉండవచ్చు. లేదా ఈ ‘దుశ్చర్య’ను నిరోధించవలసిందిగా కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు! అంతేకానీ ‘నేర పరిశోధన’ విధులను నిర్వహిస్తుండిన లేదా విధుల నిర్వహణ చేస్తున్నట్టు ప్రకటించిన ‘కేంద్ర దర్యాప్తుసంస్థ’ను రాష్ట్ర పోలీసులు నిరోధించడం, దర్యాప్తు బృందం వారిని నిర్బంధించడం కేంద్ర ప్రభుత్వంపై జరిగిన చట్టవ్యతిరేకమైన తిరుగుబాటుతో సమానం! ప్రశ్నించే అధికారం సీబీఐకి ఉంది. ‘సీబీఐ’వారు రాజీవ్‌కుమార్‌ను ‘నిందితుడు’గా పేర్కొన్న దాఖలాలేదు. ‘శారదా చిట్ ఫండ్’ అవినీతిని గతంలో దర్యాప్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, బృందానికి రాజీవ్‌కుమార్ నాయకత్వం వహించాడట. ఈ దర్యాప్తులో అనేక అవకతవకలు జరిగాయన్నది ‘సిబిఐ’ ఆరోపణ. గతంలో అనేకసార్లు పిలిచినప్పటికీ ఈ ‘కలకత్తా పోలీస్ కమిషనర్’ తమ కార్యాలయానికి రాలేదన్నది ‘సిబిఐ’ చేస్తున్న మరో ఆరోపణ.. అందువల్లనే ఆయన వాఙ్మలాన్ని నమోదుచేయడం కోసం ‘సిబిఐ’ రాజీవ్‌కుమార్ ఇంటికి వెళ్లవలసి వచ్చిందట!
సిబిఐ వాదాన్ని రాజీవ్‌కుమార్ నిరాకరించవచ్చు. నిరాకరిస్తూ సోమవారం ఆయన కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ‘యాచిక’ను దాఖలు చేశాడట. తనను విచారించరాదని, విచారించడానికి యత్నిస్తున్న ‘సిబిఐ’ను నిరోధించాలని ఆయన తన ‘న్యాయ యాచిక’- ‘పిటిషన్’-లో అభ్యర్థించాడట. రాజీవ్‌కుమార్‌ను విచారించడాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసులు అడ్డుకోకుండా నిరోధించాలని ‘సిబిఐ’ సోమవారం ‘న్యాయ యాచిక’ను దాఖలు చేయడం సమాంతర పరిణామం! ఇలా న్యాయ యాచికలను దాఖలు చేయడానికి ఉభయ పక్షాలకూ చట్టాల ప్రకారం అధికారం ఉంది. కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ న్యాయ ప్రక్రియను ఆశ్రయించకుండా ‘సిబిఐ’ అధికారులను ‘పోలీస్ స్టేషన్’కు బలవంతంగా తీసుకొని వెళ్లి నిర్బంధించడం, వారి విధులను నిరోధించడం మాత్రం గర్హనీయం. ఈ అనుచిత చర్యకు పాల్పడిన పోలీసులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, ఎవరు తీసుకుంటారన్నది వేచి చూడవలసిన వ్యవహారం. ‘సిబిఐ’ కేంద్ర ప్రభుత్వ సంస్థ. కానీ ‘్భరతీయ జనతాపార్టీ’ ప్రతినిధి కాదు. పశ్చిమ బెంగాల్ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందినవారు, కానీ వారు తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు కారు.. పోలీసులకు, ‘సిబిఐ’కి మధ్య జరిగిన వివాదాన్ని రెండు రాజకీయ పక్షాల మధ్య మొదలైన ఆధిపత్య సమరమన్న ప్రచారం జరుగుతోంది!
‘సిబిఐ’ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను స్వీకరించాలి. కానీ ‘సిబిఐ’ కేంద్ర ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షాల అదుపాజ్ఞలలో ఉంటోందన్నది దశాబ్దుల తరబడి కొనసాగుతున్న ఆరోపణ! ప్రత్యర్థి రాజకీయ పక్షాలను వేధించడానికై కేంద్ర ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలు ‘సిబిఐ’ని ప్రయోగిస్తున్నట్టు ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో ‘సిబిఐ’లో గణనీయమైన పరివర్తన వచ్చిందన్నది కూడ నిరాకరింపజాలని నిజం. ‘సిబిఐ’ సంచాలకుడిని నియమించడం, బదిలీచేయడం, తొలగించడం వంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పాల్పడజాలదన్నది సర్వోన్నత న్యాయస్థానం నిగ్గుతేల్చిన రాజ్యాంగ వాస్తవం. ఇటీవల స్వచ్ఛంద సేవా నివృత్తిని పొందిన ‘సిబిఐ’ మాజీ సంచాలకుడు - డైరెక్టర్- ఆలోక్‌కుమార్ వర్మ వ్యవహారం ఇందుకు సరికొత్త సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించిన ఆలోక్‌వర్మను గత నెల ఎనిమిదవ తేదీ సర్వోన్నత న్యాయస్థానం తిరిగి నియమించింది. ఉన్నత స్థాయి అధికార మండలి నిర్ణయం మేరకు మాత్రమే ‘సిబిఐ’ సంచాలకుని నియామకం, బదిలీ, తొలగింపు జరగాలన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన స్పష్టీకరణ. ఈ స్పష్టీకరణకు అనుగుణంగానే ఆ తరువాత ఈ ‘ఉన్నతస్థాయి మండలి’ ఆలోక్‌వర్మను పదవి నుంచి బదిలీ చేసింది. ఈ ‘ఉన్నత స్థాయి మండలి’లో ప్రధానమంత్రి, సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు- లోక్‌సభలో అతి పెద్ద విపక్షం నాయకుడు- సభ్యుడుగా ఉంటున్నారు. ఈ ఉన్నత స్థాయి మండలి నిర్ణయం మేరకు శనివారం ఋషికుమార్ శుక్లా ‘సిబిఐ’ నూతన సంచాలకులడిగా నియుక్తుడయ్యాడు. ఆలోక్‌కుమార్ వర్మ ‘వివాదం’ కొనసాగినంత కాలం ‘కేంద్ర ప్రభుత్వం’- భాజపా- రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేయడానికి యత్నిస్తోందన్నది ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ.. మమతాబెనర్జీ మరింత పెద్ద గొంతుకతో ఈ ‘రుసరుసల’ను సంధించింది. కలకత్తా పోలీస్ కమిషనర్‌ను ‘సిబిఐ’ ప్రశ్నించడంతో, ఈ ‘‘రాజ్యాంగ’’ సంస్థ- సిబిఐ-ను కేంద్రం- భాజపా- దురుపయోగం చేస్తోందని మమతాబెనర్జీ ఆరోపించింది. ఏది నిజం?
‘శారద’ చిట్‌ఫండ్ అవినీతి వ్యవహారంలో భాగస్వాములయినట్టు అనేకమంది తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడం చరిత్ర. ఈ వ్యవహారాన్ని దర్యాప్తుచేసిన బృందం నాయకుడు- ప్రస్తుతం కలకత్తా పోలీస్ కమిషనర్- రాజీవ్‌కుమార్ నిందితులను కాపాడడానికి యత్నించాడన్నది మూడేళ్లుగా కొనసాగుతున్న ఆరోపణ. ‘సిబిఐ’ని కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు దురుపయోగం చేసే అవకాశాలు ఉండవచ్చు. అలాగే రాష్ట్ర పోలీసు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు సైతం దురుపయోగం చేసుకుంటున్నారన్న ఆరోపణలు దేశవ్యాప్తం... అందువల్ల న్యాయస్థానాలు మాత్రమే నిజానిజాలను నిర్ధారించగలుగుతున్నాయి! కానీ కేంద్ర ‘పరిశోధకుల’ను నిరోధించి నిర్బంధించిన రాష్ట్ర పోలీసుల చర్యను నిజమైన ‘సమాఖ్య స్ఫూర్తి’- ఫెడరల్ స్పిరిట్-ని నిలబెట్టదలచినవారు నిరసించాలి. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేసింది. ‘సమాఖ్య స్పూర్తి’ వికటించి ‘విచ్ఛిన్న తత్త్వం’ మొలకెత్తుతోందా??