సంపాదకీయం

అడవిపై ‘గొడ్డలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున చర్యలను చేపట్టడం ముదావహం. అడవి అంటే కేవలం వృక్షజాలం కాదు, చెట్లు మాత్రమే కాదు. ఈ వృక్షజాలాన్ని ఆశ్రయించి జీవిస్తున్న జంతు జాలం కూడ అడవిలో భాగం. వృక్షజాలం, జంతుజాలం కలసిన జీవజాలం ప్రకృతి! ప్రకృతి సహజత్వం చెడని ప్రాంగణం అరణ్యం. అందువల్ల ఇటీవల జరిగిపోయిన క్రూరమైన జంతు హననం తెలంగాణ ప్రభుత్వం వారి నడుం బిగింపునకు కారణం కావచ్చు. టేకు చెట్లను తెగనరికి కలపను అక్రమంగా తరలించుకొనిపోతున్న ముఠాల దుశ్చర్యలు కూడ తెలంగాణ ప్రభుత్వం వారి ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తక్షణ నేపథ్యం కావచ్చు. ఈ దొంగ రవాణా ముఠాలలో కొందరు రాజకీయవేత్తలు చేరిపోయి ఉండడం ఆశ్చర్యం కలిగించని ఆవిష్కరణ.. ఎందుకంటె దుర్మార్గపు వ్యాపారులకు, అక్రమ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు, ఇతర రాజకీయ వేత్తలు అండగా నిలబడడం గతం.. ఈ దుర్మార్గపు వ్యాపారులు, అక్రమ పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తల రూపమెత్తి ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా, ప్రభుత్వాల నిర్వాహకులుగా దేశమంతటా విస్తరించి ఉండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- ఫలితం. దాదాపు అన్ని రకాల వాణిజ్య పారిశ్రామిక కలాపాలలోను, సంస్థలలోను, ముఠాలలోను రాజకీయవేత్తలు భాగస్వాములై ఉండడం నడుస్తున్న చరిత్ర. ఇలా ‘‘్భగస్వాములు’’ కాని రాజకీయ వేత్తల సంఖ్య చాలా తక్కువ. ఇటీవల నిర్మల్ ప్రాంతంలో జరిగిన టేకు కలప దొంగ రవాణాకు నాయకత్వం వహించినది నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు రాజకీయవేత్తలన్నది ‘ప్రతీక’ మాత్రమే. దేశమంతటా ఇదే తీరు. ఎఱ్ఱచందనం, టేకు కలప, పులిగోళ్లు, పులిచర్మాలు, ఏనుగుల దంతాలు భారీగా చైనాకు అక్రమంగా తరలిపోతుండడం అటవీ హనన ప్రక్రియకు దీర్ఘకాల నేపథ్యం. ఇలా వాణిజ్య దురాక్రమణను కొనసాగిస్తున్న చైనా వాణిజ్య సంస్థలను మన దేశంలోకి ఆహ్వానించడంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇతర ప్రాంతాల ప్రభుత్వాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం జాతీయ వైపరీత్యం. ప్రపంచీకరణ మారీచ మృగ మాయాజాలం ఆవహించి ఉండడం ఈ వైపరీత్యానికి కారణం. బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరం జరిగిన సమయంలో బ్రిటన్ ప్రభుత్వం మన దేశం నుండి కలపను, అటవీ సంపదను భారీగా తరలించుకొని పోయింది. ఉద్యమకారులు, సమరయోధులు దీన్ని నిరసించారని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మన అటవీ హననానికి ప్రధాన కారణాలు చైనా వాణిజ్య దురాక్రమణ, ప్రపంచీకరణ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల కేంద్రీకృత పారిశ్రామిక కలాపాలు. కానీ ప్రభుత్వాలు దీన్ని నిరసించడం లేదు. నిరసించాలన్న ధ్యాస కూడ లేదు. ‘‘చైనాను చూసి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది..’’ అన్నది రెండు దశాబ్దులకు పైగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటినుంచి- ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు చేస్తున్న ఆర్భాటం...
చైనాను చూసి ఏమి నేర్చుకోవాలి? ఇతర దేశాల నుంచి పులుల చర్మాలను గోళ్లను, అవయవాలను, ఏనుగు దంతాలను, ఎఱ్ఱచందనాన్ని దొంగతనంగా తమ దేశంలోకి తరలించడాన్ని నేర్చుకోవాలా..?? ఆఫ్రికా ఖండంలోని అడవులు అంతరించిపోతుండడానికి కారణం చైనా ముఠాలు నిర్వహిస్తున్న అటవీ సంపదను అక్రమంగా తరలించే కార్యక్రమం. 2013 మార్చిలో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ టాంజానియాలో పర్యటించాడు. ఆయన పయనించిన విమానంలోనే అనేక పెట్టెల నిండా ఏనుగు దంతాలను టాంజానియా నుంచి చైనాకు అక్రమంగా రవాణా జరిగినట్టు ప్రచారమైంది. మన దేశం నుండి ఎఱ్ఱచందనం దుంగలను తరలించుకొని వెడుతుండిన చైనా దొంగలు అనేకసార్లు పట్టుబడ్డారు. చైనాలోని సంప్రదాయ ఔషధాల తయారీకి అవసరమవుతున్న పులిచర్మాలను, పులి గోళ్లను మన దేశం నుండి తరలించుకొని పోతున్నారు. తెలంగాణ తదితర ప్రాంతాలలోని పులులను అమిత క్రూరంగా మట్టుపెడుతున్న ముఠాలకు ఇదీ ‘ప్రేరణ’. సిక్కింలోని నాథులా కనుమ మార్గం గుండా 2003-2004వ సంవత్సరంలో సీమాంతర వాణిజ్యం మొదలయిన తరువాత మన దేశం నుండి టిబెట్‌లోకి ఈ అటవీ సంపద అక్రమంగా తరలిపోవడం మరింత ఉద్ధృతమైంది. ఈ అక్రమ వ్యాపార ఉద్ధృతికి అనుగుణంగా వేటగాళ్లలో క్రౌర్యం పెరుగుతోంది. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలంలోని శివారం వద్ద విద్యుత్ ప్రసరించే తీగెలతో వల పన్నిన వేటగాళ్లు ఒక పెద్దపులిని విద్యుత్ ఘాతంతో చంపడం ఈ క్రౌర్యానికి నిదర్శనం.
పులుల సంరక్షణ చర్యలను వివరించడానికై గురువారం అటవీశాఖ ఉన్నత అధికారుల సముఖంలో హాజరు కావాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం వారు బుధవారం ఆదేశించడం మరో హర్షణీయ పరిణామం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అటవీ పరిరక్షణ చర్యలను ముమ్మరం చేస్తోంది! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్ర విస్తీర్ణంలో సగ భాగాన్ని అడవులతో నింపనుందట. ఈ కృత నిశ్చయం కూడ అభినందనీయం. కానీ ఒకవైపున హరిత విస్తరణ, మరోవైపున హరిత హననం జరుగుతుండడం విచిత్రమైన విషాదం. దేశంలో ప్రతిరోజూ సగటున మూడువందల ముప్పయి ఎనిమిది ఎకరాల అడవులు అంతరించిపోతున్నట్టు 2013లో ఆధికారికంగా నిర్ధారణ జరిగింది. 2016 నాటికి మన దేశపు ‘హరిత ప్రమాణం’ ప్రపంచ దేశాల మధ్య నూట నలబయి ఒకటవ స్థానంలో ఉండేదట. ఈ ‘హరిత ప్రమాణం’ గత ఏడాది ఆరంభం నాటికి నూట డెబ్బయి ఏడవ స్థానానికి దిగజారిపోవడం ‘ప్రపంచీకరణ’ విధానాల ఫలితం. పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు, జిల్లా కేంద్రాలకు, పట్టణ ప్రాంతాలకు విస్తరించడం లేదు. పరిశ్రమలు రాజధాని నగరాల శివారులలోను, పెద్ద నగరాలలోను అతిపెద్ద పరిమాణంలో కేంద్రీకృతం అవుతున్నాయి. ‘హరిత హారం’ రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సగం భూమిని అటవీ మయం చేయదలచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా గుర్తించదగిన వాస్తవం ఇది. పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రాంగణాలను, ప్రత్యేక ఆర్థిక మండలాలను నిర్మించడం మాని గ్రామీణ ప్రాంతాలలో అన్ని రంగాలలోను చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం పారిశ్రామిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్టడుగు స్థాయి వరకూ వికేంద్రీకరించాలి. ఇలా వికేంద్రీకరించగల శాస్తవ్రిజ్ఞాన వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రాచీన భారత సమాజంలో ఇలా సాంకేతిక, శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానం దేశమంతటా వికేంద్రీకృతమై ఉండేది. ‘కుయ్యో’ సంస్థవారి కార్ల కర్మాగారం కానీ ‘మొర్రో’ సంస్థవారి బస్సుల నిర్మాణం కానీ ఒకేచోట కేంద్రీకృతం కారాదు. ఒక్కొక్క విడి భాగాన్ని తయారుచేసే అనేక పరిశ్రమలను పల్లెసీమలలో నెలకొల్పండి. విడి భాగాలను సేకరించి ఒకచోట వాహనాన్ని నిర్మించండి. ఇది వికేంద్రీకరణకు ఒక ఉదాహరణ మాత్రమే..!
తెలంగాణ ప్రభుత్వం రెండువందల మంది అటవీశాఖ ఉద్యోగులను రకరకాల క్రమశిక్షణ చర్యలకు, శిక్షలకు గురిచేసినందు వల్ల అటవీ పునర్వికాసక్రమం వెంటనే అంకురించదు. అక్రమాలకు పాల్పడుతున్న వాణిజ్య ముఠాలను, రాజకీయవేత్తల ముసుగులోని అక్రమ వాణిజ్యవేత్తలను సైతం పసికట్టి పట్టుకోవాలి! తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశమంతటా జరుగుతున్న అడవుల హత్యకు, హరిత శోభల హత్యకు, వన్యప్రాణుల హత్యకు ప్రధాన కారణం ‘ప్రపంచీకరణ’.. ‘ప్రపంచీకరణ’ అనేది అడవుల పాలిట గొడ్డలి.. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నిరంతరం ఈ గొడ్డళ్లను విసురుతున్నాయి..