సంపాదకీయం

‘వామ’న వైచిత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికలలో పోరాడగల జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యమన్నది ‘భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ’- భా.మా.క.పా-వారు కనిపెట్టి ఆవిష్కరించిన గొప్ప రాజకీయ వాస్తవం! ‘‘ఊరందరికీ తెలిసిన ఉదంతాన్ని ‘ఊలప్ప’ వచ్చి చెవిలో ఒదాడన్నది’’ ‘భా.మా.క.పా.’ వారు వెల్లడించిన పొత్తుల రహస్యం తీరు.. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీవారు అనేక దశాబ్దులుగా వివిధ రాజకీయ పక్షాలకు ‘వ్యూహాత్మక’ మార్గదర్శకులు. వివిధ రాజకీయ పక్షాలంటే ‘భాజపా’ను వ్యతిరేకిస్తున్న ‘కాంగ్రెసేతర’ పక్షాలన్నది ‘వామ సిద్ధాంత నిఘంటువు’- లెఫ్ట్ ఐడియలాజికల్ డిక్షనరీ-లోని వాచ్యార్థం. తాము కాంగ్రెస్ పార్టీకి సైతం మార్గదర్శకులమన్నది ‘భా.మా.క.పా.’ వ్యవహార శైలిలో అప్పుడప్పుడు ధ్వనించే వ్యంగ్యార్థం. ఈ మార్గదర్శకత్వాన్ని కాంగ్రెస్ కాని, కాంగ్రెసేతర ‘భాజపా’వ్యతిరేక పక్షాలు కానీ స్వీకరించాయా? లేదా? అన్న అనుమానం మార్క్సిస్టు మహానేతలకు రాలేదు, దశాబ్దులుగా రాలేదు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ‘మార్క్సిస్టుపార్టీ’వారు వివిధ రాజకీయ పక్షాలకు తాము మార్గదర్శకులమైనట్టు ప్రవర్తిస్తుండడం ప్రకటనలు చేస్తూ ఉండడం ‘‘వ్యవహార వాస్తవం..!’’. ‘మీరు మాకు రాజకీయ వ్యూహాత్మక మార్గదర్శకులు కాదు..’ అని మిత్రపక్షాల వారెవ్వరూ ‘భామాకపా’ వారికి స్పష్టం చేయకపోవడం కూడ ఈ దశాబ్దుల చరిత్ర. ఎందుకంటే ఆయా ‘మిత్ర పక్షాల’వారికి తమకు ‘మార్క్సిస్టు పార్టీ’వారు ఇలా మార్గదర్శనం చేస్తున్నారన్న ధ్యాస లేదు. ధ్యాస లేదు కనుక ఆమోదించడమన్న లేదా నిరాకరించడమన్న ప్రశ్న తలెత్తలేదు, తలెత్తడం లేదు. జాతీయస్థాయిలో ఎన్నికల ముందు కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నది ‘భామాకపా’వారు ప్రస్తుతం చేస్తున్న ‘మార్గదర్శనం’. ఈ రహస్యాన్ని మార్క్సిస్టుపార్టీ వారు ఇప్పుడు ఎవరి చెవిలో ఊదినట్టు..? జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక ‘కాంగ్రెస్ రహిత’ కూటమిని ఏర్పాటు చేయడం ‘తెలంగాణ రాష్టస్రమితి’- తెరాస- అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ‘సహిత’ భాజపా వ్యతిరేక కూటమిని కల్పించడం తెలుగుదేశం పార్టీ- తెదేపా- అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న బృహత్ ప్రయత్నం. ఈ రెండు కూటములూ లోక్‌సభ ఎన్నికల ‘పోలింగ్’ ముగిసేవరకూ సాధ్యం కావని ‘అభాకపా’వారు స్పష్టం చేశారు. ఇదేనా మార్క్సిస్టు మహానేత ఏచూరి సీతారామ్ ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చెవులలో ఊద తలపెట్టిన ‘జాతీయ రాజకీయ రహస్యం’?
జాతీయ స్థాయిలో ఎన్నికల తరువాత, ఫలితాలు వెల్లడి అయిన తరువాత ‘సర్వమత సమభావ’- సెక్యులర్-పక్షాల కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు ‘భామాకపా’ అధినేత ప్రకటించడం గత చరిత్రకు పునరావృత్తి. 2014వ సంవత్సరం నాటి లోక్‌సభ ఎన్నికలకు పూర్వం కూడ ‘మార్క్సిస్టు పార్టీ’వారు జాతీయస్థాయి కూటమిని ఏర్పాటు చేయతలపెట్టి కృషిచేశారు. తరువాత అది సాధ్యం కాదని తేల్చిపారేశారు. 1980నుండి జరిగిన చరిత్రకు ఇది పునరావృత్తి! కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా అప్పటినుంచి ఇప్పటివరకు సర్వసమగ్ర జాతీయ కూటమి ఎన్నికలకు పూర్వం ఎప్పుడు కూడ ఏర్పడలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మాత్రమే కాంగ్రెసేతర పక్షాల కూటమి కాని, ‘భాజపా’ వ్యతిరేక పక్షాల కూటమి కాని ఏర్పడడం చరిత్ర. ఎన్నికలలో పరస్పరం కలహించిన పక్షాలు ఇలా ఎన్నికల తరువాత ‘కూటమి’గా ఏర్పడడం జనాదేశ స్ఫూర్తికి విరుద్ధం కాదా? వోటర్ల విశ్వాసాన్ని వమ్ముచేయడం కాదా?? ‘‘ఇలా జాతీయస్థాయిలో కూటమి సాధ్యం కాకపోయినప్పటికీ ప్రాంతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకోవడం అవకాశవాదం, సైద్ధాంతికమైన దివాళాకోరుతనం..’’ అని ఎవ్వరూ మార్క్సిస్టుపార్టీ వారిని ప్రశ్నించకపోవడానికి కారణం కూడ ధ్యాస లేనితనం మాత్రమే. ఈ ‘ప్రాంతీయపు పొత్తుల’ వ్యూహాన్ని ఇతర పక్షాలవారు ఆమోదించినట్టు కాదు. కేరళలో పరస్పరం కలహించుకుంటున్న కాంగ్రెస్, ‘భామాకపా’ వారు 2016నాటి పశ్చిమ బెంగాల్ శాసనసభలో పరస్పరం మిత్రపక్షాలు! ఇప్పుడు మళ్లీ పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ‘మార్క్సిస్టుపార్టీ’ నాయకత్వంలోని ‘వామకూటమి’ వారు ముస్తాబవుతున్నారు. 2014నాటి లోక్‌సభ ఎన్నికలలో ‘భామాకపా’వారు రెండు స్థానాలు గెలిచారు. పశ్చిమ బెంగాల్‌లో 2011 వరకు దాదాపు ముప్పయి ఐదేళ్లు పాలించిన ‘వామ’కూటమి ఇలా రెండు స్థానాలు గెలవడానికి కారణం ఏమిటి? ఇతర పక్షాలకు ‘‘వ్యూహాత్మక మార్గదర్శకత్వం’’ వహిస్తున్న మార్క్సిస్టు పార్టీ ‘‘శకునాలను చెప్పే బల్లి’’వలె ‘కుడితి’లో పడినట్టు కాలేదా??
పశ్చిమ బెంగాల్‌లో నలబయి రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. 2014లో గెలిచిన రెండు స్థానాలను సైతం రానున్న లోక్‌సభ ఎన్నికలలో ‘్భమకపా’ వారు ఓడిపోనున్నారట.. అధ్యయన సంస్థలవారు, విశే్లషకులు ప్రచారం చేస్తున్నారు. కేరళలో తప్ప దేశంలో మరెక్కడ కూడ ‘మార్క్సిస్టు పార్టీ’వారు లోక్‌సభ స్థానాన్ని గెలిచే అవకాశం లేదన్నది ఈ అధ్యయనాల నిర్ధారణ. అందువల్ల 2014లో తాము గెలిచిన రెండు స్థానాలలోను కాంగ్రెస్ తమను బలపరచాలని, పోటీ చేయరాదని మార్క్సిస్టు పార్టీవారు కోరుతున్నారట! 2014లో కాంగ్రెస్ గెలిచిన నాలుగుచోట్ల తాము పోటీచేయరట! జాతీయ స్థాయిలో మాత్రమే కాదు, ప్రాంతీయ స్థాయిలో సైతం ఇలా మార్క్సిస్టులకు కాంగ్రెస్‌కు పొత్తు సాధ్యం కావడం లేదు. ఆరు లోక్‌సభ స్థానాలకు పరిమితమైన ‘‘ఉప ప్రాంతీయ’’ స్థాయి పొత్తును మార్క్సిస్టులు కాంగ్రెస్‌తో కుదుర్చుకోనున్నారు. రెండు స్థానాలు నిలబెట్టుకోవడం లక్ష్యంగా బెంగాల్‌లో వ్యూహరచన చేస్తుండడం ‘మార్క్సిస్టుపార్టీ’ వారి ‘‘ఎన్నికల తరువాత కూటమి ఏర్పాటు’’ వ్యూహానికి నేపథ్యం. అయితే 2014లో మార్క్సిస్టుపార్టీ గెలిచిన రెండు నియోజకవర్గాలలో సైతం తాము పోటీచేస్తామని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారట! ‘‘ఎన్నికల తరువాత భారతీయ జనతాపార్టీ ప్రాధాన్యం కోల్పోతుంది, మరుగుజ్జుగా మారుతుంది..’’ అని మార్క్సిస్టుపార్టీ నేతలు 1989నుండి ప్రతి ఎన్నికల సమయంలోను ‘జోస్యం’ చెప్పారు. కానీ వామనమూర్తి త్రివిక్రమ రూపందాల్చి విస్తరించినట్టు ‘్భజపా’ ప్రతి ఎన్నిక తరువాత ప్రాధాన్యం పెంచుకొనడం చరిత్ర.
కానీ చరిత్ర పట్ల ప్రధానంగా భారతీయ చరిత్ర పట్ల ‘వామ’ మేధావులకు, రాజకీయవేత్తలకు విశ్వాసం లేదు. చరిత్రను వక్రీకరించడం, తలకిందులు చేయడం వారి ‘వ్యూహాత్మక స్వభావాని’కి ప్రాతిపదికలు. అందువల్ల పశ్చిమ బెంగాల్‌లోను దేశంలోను కూడ మార్క్సిస్టుపార్టీ చరిత్ర ‘తలకిందులు’గా నడుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ముప్పయి ఐదేళ్లు ‘త్రివిక్రమ’ స్ఫూర్తితో విస్తరించిన ‘్భమాకపా’ నేడు వామనుడు. ఈ ‘వామనుడు’ విస్తరించగల విష్ణువుకాదు, కేవలం రాజకీయపు మరుగుజ్జు! అందువల్ల మూడు ‘అడుగుల’ను కాదు, రెండు స్థానాలను కాంగ్రెస్ నుంచి ప్రదానం పొందగోరుతోంది. కానీ కాంగ్రెస్ ఇవ్వనంటోందట. కాంగ్రెస్ ‘బలి చక్రవర్తి’కాదు, మార్క్సిస్టు పార్టీ విష్ణువు కాదు..