సంపాదకీయం

కనపడుట లేదా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊపిరి పీల్చుకుంటున్నంత ‘సహజం’గా ఒక ‘పార్టీ’నుంచి మరో ‘పార్టీ’లోకి ‘ప్రముఖులు’ చొరబడిపోతున్నారు. ఊపిరి పీల్చుకుంటున్నంత ‘సులభం’గా అవకాశవాదాన్ని ఆదర్శ రాజకీయంగా చిత్రీకరించగలుగుతున్నారు. పదిహేడవ- కొత్త- లోక్‌సభను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కావడం, తెలుగు రాష్ట్రాలలోను ఇతర రాష్ట్రాలలోను ‘్ఫరాయింపుల’ ప్రహసనం ఊపందుకొనడం సమాంతర పరిణామాలు. జాతీయ స్థాయిలోను, ప్రాంతీయ స్థాయిలోను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలలోకి ఇతర పక్షాలవారు చొఱబడిపోతున్నారు, అన్ని ప్రధాన పక్షాలనుంచి ప్రముఖులు నిష్క్రమిస్తున్నారు. ఏఏ ప్రముఖుడు, ఏఏ ప్రముఖురాలు ఏ ‘పార్టీ’లో ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం వెంటనే స్ఫురించడం లేదు, కొంత పరిశోధన కనీసం కొంత అధ్యయనం చేస్తే తప్ప సమాధానం దొరకని విచిత్ర స్థితి ఏర్పడి ఉంది. ఎందుకంటె నిన్న సాయంత్రంవరకు ఒక పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలు నేటి ఉదయాన మరో పక్షంలోకి చేరిపోతున్నారు. అందువల్ల ఆయా ‘పార్టీ’లలోని అందరూ అక్కడే ఉన్నారా? లేక కొందరు జారుకున్నారా? అన్న నిజనిర్ధారణ ప్రతిరోజు చేసుకోవలసిన అవసరం ఏర్పడిపోయింది. మారినవారు, మారుతున్నవారు, మారబోయినవారు, మారబోతున్నవారు- ఇలా వివిధ దశలలో ‘్ఫరాయింపుల రాజకీయం’ నర్తిస్తోంది, రకరకాల విన్యాసాలను ప్రదర్శిస్తోంది. గతంలో, పదేళ్ల క్రితంవరకు కూడ, ఒక పార్టీనుంచి మరో పార్టీకి మారుతున్న రాజకీయ ప్రముఖులను గురించి, ప్రజాప్రతినిధుల గురించి జనం నిరసించేవారు, జుగుప్సను ప్రదర్శించేవారు, తేలిక ‘్భవాన్ని’ వ్యక్తంచేసేవారు. ఇప్పుడు దృశ్యం మారిపోయింది, దృక్పథం మారిపోయింది, ప్రవృత్తి మారిపోయింది. పార్టీలు మారడం రాజకీయాలలో అనివార్యమైన సహజ పరిణామక్రమమన్నది అధికాధిక ‘మత ప్రదాతల- వోటరుల- వర్తమాన దృక్పథం, అందువల్ల ‘పార్టీ’ని ఫిరాయించిన నాయకులను, నాయకురాండ్లను జనం నిరసించడం లేదు... ‘‘నిన్న అరటిపండ్లను అమ్మిన ‘బండి’వాడు నేడు ‘ఉల్లిపాయలను’ అమ్ముతున్నాడు....’’
సొంత పార్టీనుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించే పార్లమెంటు సభ్యులు, విధాన మండలి- శాసనసభ, శాసన మండలి- సభ్యులు తక్షణం తమ సభ్యత్వాలను కోల్పోతారని ఫిరాయింపుల నిరోధక నిబంధనలు నిర్దేశిస్తున్నాయి, రాజ్యాంగంలోని ‘పదవ అనుబంధం’- టెన్త్ షెడ్యూల్- నిర్దేశిస్తోంది. 1985లో రాజ్యాంగంలోని 102వ 191వ అధికరణాలను సవరించడం ద్వారా ఈ అనుబంధాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ యాబయి రెండవ రాజ్యాంగ సవరణవల్ల, పదవ అనుబంధం ఏర్పడడంవల్ల అవకాశవాద రాజకీయాలకు, ‘‘్ఫరాయించే’’ కార్యక్రమాలకు అవకాశం ఉండబోదన్నది జరిగిన ప్రచారం. పదవ అనుబంధంలో పేర్కొన్న అనర్హతకు గురిఅయ్యే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సభ్యత్వాలను కోల్పోతారన్నది 191వ అధికరణంలోని రెండవ ఉప అధికరణం సారాంశం. పార్లమెంటు ఉభయ సభ్యులు ఇదే రీతిలో సభ్యత్వాన్ని కోల్పోతారని 102వ అధికరణం రెండవ ఉప అధికరణంలో నిర్దేశించారు. అంతవరకు దేశ రాజకీయాలను అపహాస్యంపాలు చేస్తుండిన ‘‘ఆయారామ్ గయారామ్’’- పార్టీలోకి చొఱబడడం, పార్టీలోనుంచి పారిపోవడం- వంటి వికృతులు ఈ రాజ్యాంగ సవరణ తరువాత అంతరించిపోగలవని ఆశించినవారు అప్పటినుంచి ఇప్పటివరకు విస్మయానికి గురిఅవుతూనే ఉన్నారు. పార్టీలను నిర్లజ్జగా మార్చుకుంటున్నవారు తమ ‘సభ్యత్వాల’ను వెంటనే కోల్పోకపోవడం ఈ విస్మయానికి కారణం. ఈ ‘అనర్హత’పై, ఫిరాయించిన సభ్యుల సభ్యత్వాలను రద్దుచేయడంపై ‘‘తుది నిర్ణయం’’ ఆయా చట్టసభల అధ్యక్షులది. ఈ తుది నిర్ణయ ప్రక్రియ వారాలతరబడి నెలల తరబడి సాగిపోతోంది. తుది నిర్ణయం వెలువడిన తరువాత వివాదం న్యాయస్థానాలకెక్కుతోంది. న్యాయ ప్రక్రియ సంవత్సరాలకు విస్తరిస్తోంది...
ఫిరాయింపుల నిరోధక నియమావళివల్ల ఇలా ఫిరాయింపులు ఆగకపోవడం నడచిపోతున్న వైపరీత్యం. ఎన్నికల ముందు, ‘‘నామాంకన పత్రం దాఖలు చేసే’’ తరుణంలో పార్టీలను మారడం మరింత సులభమైపోయింది. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను ఆవిష్కృతవౌతున్న ఫిరాయింపుల రాజకీయం అవకాశవాదానికి పరాకాష్ఠ! ఒక పార్టీనుంచి మరో పార్టీకి మారడం నిజానికి అప్రధానమైన అంశం. ఇలా మారుతున్నవారి, ప్రధానంగా ప్రముఖుల మానసికప్రవృత్తి స్వభావం ఏమిటన్నది రాజ్యాంగ చారిత్రక పరిశోధకులు కనిపెట్టదగిన అంశం! ‘పార్టీ’లు పరస్పరం జట్టుకట్టడానికి దోహదంచేస్తున్న ‘సిద్ధాంతం’ ‘విధానం’ ‘కార్యక్రమం’ దశాబ్దుల చరిత్రలో ‘‘మేడిపువ్వు....’’ ‘‘మోదుగ పువ్వు వాసన’’....! కాంగ్రెస్ పార్టీ 1977నుంచి ఇప్పటివరకు ‘అన్నాద్రవిడ మునే్నత్ర కజగం’- అద్రముక-తోను, ‘ద్రవిడ మునే్నత్ర కజగం’- ద్రముక- తోను తమిళనాడులో మార్చిమార్చి జట్టుకట్టింది. ఈ మార్పునకు ప్రాతిపదిక అయిన సిద్ధాంతం ఏమిటన్న ప్రశ్న పుట్టలేదు. 1971నాటి ఎన్నికలలో తమిళనాడులో ‘ద్రముక’తో కాంగ్రెస్ జట్టుకట్టింది. అప్పటికి ‘అన్నాద్రముక’ పుట్టలేదు. 1977లో కాంగ్రెస్ ‘అన్నా ద్రముక’తో చేరింది. 1980నాటి లోక్‌సభ ఎన్నికల నాటికి మళ్లీ ఫిరాయింపు... తమిళనాడులో ‘కాంగ్రెస్, ద్రముక’ కూటమి ఏర్పడింది. ఈ ‘సామూహిక’ ఫిరాయింపుల రాజకీయం కాంగ్రెస్‌కు మాత్రమే పరిమితంకాదు. ‘్భరతీయ జనతాపార్టీ’ వెనుకబడి లేదు. 1999లో అప్పటివరకు ‘్భజపా’తో జట్టుకట్టి ఉండిన ‘అన్నా ద్రముక’ అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఇలా తమ ప్రభుత్వాన్ని ‘కూల్చివేత’కు గురిచేసిన ‘అన్నా ద్రముక’తో ‘్భజపా’ ఇప్పుడు మళ్లీ జట్టుకట్టింది! రాజకీయాలకు సైద్ధాంతిక భూమిక, విధాన స్పష్టత, నైతిక నిష్ఠ. పాలనాపరమైన స్వచ్ఛత వంటివి ప్రాతిపదికలు కావాలన్నది ఏడు దశాబ్దుల చరిత్రలో ‘ఆచరణ’కు నోచుకోని మహావిషయం. కర్ణాటకలో ఎస్.ఎమ్.కృష్ణ అంతర్జాతీయ కీర్తిగాంచిన వరిష్ఠ రాజకీయవేత్త! మన్‌మోహన్‌సింగ్ మంత్రివర్గంలో తనకు విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖను ఇప్పించినందుకు కాంగ్రెస్ అధినేత్రిని వేయి నోళ్లతో పొగడిన సంస్థాగత నిష్ఠాపరుడు ఈ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. విదేశీ వ్యవహారాల మంత్రి హోదా ఐక్యరాజ్యసమితికి వెళ్లివచ్చాడు. సర్వప్రతినిధి సభలో ప్రసంగించాడు. పోర్చుగల్ విదేశాంగమంత్రి చదవడానికి సిద్ధంచేసుకుని ఉండిన ప్రసంగ పత్రాన్ని ఎస్.ఎమ్.కృష్ణ చదివేశాడు- అది తన ప్రసంగ పాఠం అనుకున్నాడట! ఒకటిన్నర పేజీలు చదివిన తరువాత, సర్వప్రతినిధుల సభలో ‘‘హాహాకారాలు’’ చెలరేగిన తరువాత కానీ ఈ మన మంత్రికి వాస్తవం తెలియలేదు. ఈ ఎస్.ఎమ్.కృష్ణ 2017లో ‘్భజపా’లో చేరిపోయాడు! ఏమిటి సిద్ధాంతం? ఏమిటి విధానం? పశ్చిమ బెంగాల్ నాలుగు దశాబ్దులపాటు బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ- భామాకపా- నాయకత్వంలోని ‘వామ’కూటమి 2016నాటి శాసనసభ ఎన్నికలలో పొత్తుపెట్టుకొంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో ‘తెలుగుదేశం’ జట్టుకట్టడం ‘‘ఉమ్మడి ఫిరాయింపులకు’’ పరాకాష్ఠ! కాదా??
సినిమాలలో వేషాలు వేసినవారు వేస్తున్నవారు రాజకీయ రంగంలోకి చొరబడిపోవడం సైద్ధాంతిక ప్రాతిపదిక లేని విచిత్ర ‘పరివర్తన’... ఇలా చేరినవారు కుదురుగా ఒకే పార్టీలో ఉండకపోవడం దక్షిణ భారత రాజకీయ చరిత్ర. తెలుగునేల మరింతగా ఇది విన్యాస క్రీడితమైంది, ఔతోంది. ‘బృహత్ తార’- మెగాస్టార్ చిరంజీవి తన ‘ప్రజారాజ్యం’తో మూక ఉమ్మడిగా కాంగ్రెస్‌లోకి దూరిపోవడం ‘విలీనం’పేరుతో జరిగిన ఫిరాయింపు...!! కాదా?? విజయశాంతి మూడు ప్రధాన పక్షాలలోను దశలవారిగా ప్రవేశించడం... మరో నటి జయసుధ ఇదే బాటలో పయనిస్తుండడం... ‘‘సహజ పరిణామక్రమం’’అన్న అభినయం ఆవిష్కృతవౌతోంది! ప్రముఖులు ఇతరులకు మార్గదర్శనం చేస్తున్నవారు వాగ్దాన భంగంచేయరాదు. మాట తప్పడం సైద్ధాంతికపరమైన ఫిరాయింపు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడు ప్రథమ ముఖ్యమంత్రి కాగలడన్న ‘తెలంగాణ రాష్టస్రమితి’ వాగ్దానం ఏమైంది?... ఇది ఇప్పటి సంగతి కాదు. చారిత్రక పథం పొడవునా ‘‘వాగ్దాన భంగప్రతీకలు’’ కోకొల్లలు నిలబడి ఉన్నాయి. 1979లో లోక్‌సభలో అప్పటి ప్రధాని మురార్జీదేశాయ్ మంత్రివర్గ వ్యతిరేక తీర్మానంపై చర్చ జరిగింది. మంత్రివర్గ సభ్యుడైన జార్జిఫెర్నాండెజ్ ప్రధానమంత్రిని సమర్ధిస్తూ సుదీర్ఘ ప్రసంగంచేశాడు, ప్రశంసలు పొందాడు. మరుసటిరోజున ఆయన ప్రత్యర్థి శిబిరంలోకి- మురార్జీ మంత్రివర్గాన్ని కూల్చి తాను ప్రధానమంత్రి అయిన చరణ్‌సింగ్ శిబిరంలోకి- దూరిపోయాడు! చరణ్‌సింగ్‌నకు మద్దతునిచ్చిన ‘కాంగ్రెస్’ నెలరోజులు తిరగకముందే ‘మద్దతు’ను ఉపసంహరించింది....!!