సంపాదకీయం

అద్వానీ ‘స్థానం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాల్‌కృష్ణ అద్వానీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకపోవడం ఆశ్చర్యకరం కాదు.. ఇది సహజ పరిణామం. కానీ ఇలా పోటీ చేయకపోవడం అద్వానీ ప్రాతినిధ్యం వహించిన విలువలను మరోసారి విశే్లషించుకొనడానికి లభించిన అవకాశం. మూడు దశాబ్దుల పాటు అద్వానీ లోక్‌సభ సభ్యుడు. తనకు వ్యతిరేకంగా, అక్రమంగా వచ్చిన అవినీతి ఆరోపణలు తప్పని ధ్రువపడేవరకు లోక్‌సభకు పోటీచేయనని 1995లో అద్వానీ ప్రకటించాడు. 1996 నాటి ఎన్నికలలో పోటీ చేయలేదు. రెండేళ్లు ‘సభ’కు దూరంగా ఉన్నాడు. ‘ఆరోపణలు’ పచ్చి అబద్ధాలని న్యాయస్థానాలలో ధ్రువపడిన తరువాతనే 1998లో అద్వానీ మళ్లీ ఎన్నికలలో పోటీ చేశాడు. లోక్‌సభ సభ్యుడయ్యాడు. విలువలను నిలబెట్టడానికి విలువలను పాటించడానికి అద్వానీ చేసిన విజయవంతమైన ప్రయోగాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆచరించి, బోధించడం తరతరాల జాతీయ జీవన వౌలిక సూత్రం! భారత రాజకీయాలకు సైద్ధాంతిక ప్రత్యామ్నాయాన్ని సమకూర్చడానికి దశాబ్దులుగా జరుగుతున్న కృషికి జీవన రూపం లాల్‌కృష్ణ అద్వానీ! నిజానికి ఈ ‘ప్రత్యామ్నాయం’ యుగయుగాల జాతీయ జీవన వౌలిక తత్త్వం. వౌలిక తత్త్వం- బేసిక్ కంటెంట్- ప్రత్యామ్నాయం- ఆల్టర్‌నేటివ్-గాను, ‘ప్రత్యామ్నాయం’ ‘వౌలిక తత్వం’గాను ప్రచారం జరుగుతుండడం విదేశీయులు శతాబ్దులపాటు జరిపిన దురాక్రమణ ఫలితం. బ్రిటన్ వారి బీభత్సపాలన ఫలితం! ‘‘ఈ దేశంలో అనాదిగా వైద్యవిధానం ఉంది, అది ఆయుర్వేదం. అందువల్ల అది వౌలిక వైద్యం- ఒరిజినల్ మెడిసిన్-! ఇటీవలి కాలంలో వ్యాపించిన ‘అల్లోపతి’- పాశ్చాత్య- వైద్యం అందువల్ల ఆయుర్వేద వైద్యానికి ప్రత్యామ్నాయం. అంటే ‘అల్లోపతి’ ప్రత్యామ్నాయ వైద్యం- ఆల్టర్‌నేటివ్ మెడిసిన్-! కానీ బ్రిటన్ దురాక్రమణదారులు ‘అల్లోపతి’ వౌలిక వైద్యమని, ‘ఆయుర్వేదం’ ప్రత్యామ్నాయ వైద్యమని ప్రచారం చేసిపోయారు!’’-అన్నది క్రీస్తుశకం రెండువేల ఒకటవ సంవత్సరంలో అప్పటి కేంద్ర మంత్రి, భారతీయ జనతాపార్టీ- భాజపా- మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి చెప్పిన మాట! ఈ విచిత్రాన్ని మార్చి ఆయుర్వేదాన్ని వౌలిక వైద్యంగాను, ‘అల్లోపతి’ని ప్రత్యామ్నాయ వైద్యంగాను గుర్తించేందుకు వీలైన సంస్కరణ విద్యారంగంలో జరగాలన్నది మురళీమనోహర్ జోషి ఆవిష్కరించిన అభిప్రాయం. రాజకీయ రంగంలో అద్వానీ ప్రతిష్ఠించగలిగిన ‘ప్రత్యామ్నాయ తత్త్వం’ అందువల్ల నిజానికి యుగయుగాలుగా ఈ దేశపు జాతీయ జీవనాన్ని నిర్దేశిస్తున్న ‘వౌలికతత్త్వం’! విదేశీయ దురాక్రమణ కొనసాగిన సమయంలో ఈ ‘జాతీయ వౌలికతత్త్వం’ మరుగున పడింది. ఈ వౌలికతత్త్వం అనాదిగా ఈ జాతీయ వికాసానికి భూమిక అయిన ‘సంస్కృతి, సంస్కారాల’ సమాహారం! ‘రాజకీయం’ సంస్కృతిలో ఒక అంశం మాత్రమే. కానీ పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి సాంస్కృతిక ‘శకలం’ అయిన ‘రాజకీయం’ సకలంగా కన్పించింది! అందువల్ల జాతీయ వికాసానికి ‘రాజకీయం’ ప్రాతిపదిక అన్నది పాశ్చాత్యులు కల్పించిన కృత్రిమ సిద్ధాంతం! ఈ కృత్రిమ సిద్ధాంతాన్ని తొలగించి, సహజమైన వౌలికతత్త్వాన్ని పునరుద్ధరించడానికి రాజకీయ రంగంలో జరిగిన, జరుగుతున్న కృషికి దశాబ్దులపాటు ఆధ్వర్యవం వహించినవాడు లాల్‌కృష్ణ అద్వానీ..
రాజకీయాలలో పనిచేసే వారికి ఎన్నికలలో పోటీచేయడం, వివిధ ప్రాతినిధ్య పదవులను పొందడం సహజం. కానీ ‘పదవి’ పరమావధి కాదు, లక్ష్యం కాదు. కారాదన్నది తరతరాల భారతీయ రాజనీతి స్వభావం. ‘పదవి’ జాతీయ సమాజ ప్రగతికి లేదా పరిమిత ప్రాంతీయ సమాజప్రగతికి పాటుపడడానికి మాధ్యమం. కానీ ‘పదవి’ని సాధించడమే తుది లక్ష్యంగా రాజకీయం నడుస్తుండడం అత్యధిక రాజకీయవేత్తల విషయంలో దశాబ్దుల చరిత్ర.. అద్వానీ రాజకీయ జీవన ప్రస్థానం ఈ ‘పదవీస్వామ్య’ వికృతికి అరుదైన అపవాదం. 1980లో ‘్భరతీయ జనతాపార్టీ’ ఆరంభమైంది. 1950వ దశకంలో మొదలయి 1977లో జనతాపార్టీలో కలిసిపోయిన భారతీయ జన సంఘానికి ఇది మరో జన్మ. 1984లో ఘోర పరాజయం పాలయిన ‘్భజపా’కు లోక్‌సభలో రెండు స్థానాలు మాత్రం దక్కాయి. 1986లో అద్వానీ అధ్యక్షుడయిన నాటికి ‘్భజపా’ప్రభావం ఇలా ‘వామనీకృతం’ అయి ఉంది. ఈ వామనమూర్తికి త్రివిక్రమ రూపాన్ని సంతరించి పెట్టినవాడు అద్వానీ. ఈ ఎదుగుదలకు ప్రాతిపదిక ‘ప్రత్యామ్నాయ సిద్ధాంతం’గా ప్రచారమైన ఇప్పటికీ ప్రచారవౌతున్న వౌలికతత్త్వం. ఈ వౌలిక వాస్తవం సాంస్కృతిక జాతీయ తత్త్వం. విదేశీయ దురాక్రమణ ఫలితంగా మరుగున పడిన ఈ జాతీయ తత్త్వాన్ని పునరుద్ధరించడానికి బంకించంద్రుడు కృషిచేశాడు, వివేకానందస్వామి విప్లవించాడు, లోకమాన్యుడు ఉద్యమించాడు.. ఈ ‘పునరుద్ధరణ క్రమంలో పరాకాష్ఠ’ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ‘‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పాఠశాలలో చదివి ‘‘పట్ట్భద్రుడైన’’ జాతీయతత్త్వజ్ఞుడు అద్వానీ. అందువల్లనే ఆయనకు ‘పదవి’ కేవలం మాధ్యమం అయింది.. లక్ష్యం కాలేదు!
‘్భజపా’ఎదిగింది. కేంద్రంలో అధికారం పొందడానికి రంగం సిద్ధమైంది. 1996నాటి లోక్‌సభ ఎన్నికలు జరగడానికి దాదాపు రెండేళ్లకు ముందే ‘్భజపా’ అధ్యక్షుని హోదాలో అద్వానీ చేసిన ప్రకటన రాజకీయవేత్తల ప్రవర్తన నియమావళికి ప్రాతిపదిక వంటిది. 1996 ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధిస్తే అటల్‌బిహారీ వాజపేయి ప్రధాని కాగలడన్నది అద్వానీ చేసిన ఆ చారిత్రక ప్రకటన! ఆ తరువాత 1998లో ఈ ‘ప్రకటన’ను ఆచరించి చూపినవాడు అద్వానీ! తాను ప్రధాని కావాలన్న అభిలాషను అద్వానీ వ్యక్తం చేయలేదు, వరిష్ఠ సహచరుడు, తనకంటే వయోవృద్ధుడు అటల్ బిహారీకే ప్రధానమంత్రి పదవి దక్కాలని భావించిన ఆదర్శనాయకుడు అద్వానీ.. రెండు పర్యాయములు అధ్యక్ష పదవిని నిర్వహించిన తరువాత 1990లో-1991 నాటి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో- అద్వానీ మరోసారి అధ్యక్షుడు కావాలని ఆకాంక్షించలేదు. మురళీ మనోహర్‌జోషికి అధ్యక్ష పదవిని అప్పగించాడు. అధినాయకుడైన అద్వానీ అలా నియమావళిని పాటించాడు, మూడవసారి తాను ఎన్నిక కావడానికి వీలుగా నియమావళిని సవరించలేదు! ‘‘మరుగునపడిన వౌలిక తత్త్వాన్ని’’ పునరుద్ధరించడం అద్వానీ జీవన లక్ష్యమైంది. ఈ వౌలిక తాత్త్విక పథంలో ‘్భజపా’ముందుకు సాగడం అద్వానీ ప్రభావస్ఫూర్తికి సజీవ నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ యోగ విద్యకు అంతర్జాతీయ విస్తృతిని సాధించగలగడం ఈ వౌలిక తాత్త్విక పథంలో మన జాతీయ ప్రస్థానం కొనసాగుతోందన్నదానికి తిరుగులేని సాక్ష్యం. అంతర్జాతీయ సౌరశక్తి సంఘటన ఏర్పడడం ఈ వౌలికతత్వానికి మరో విజయం.. ఈ వౌలిక తత్త్వం భారతీయత.. హిందుత్వం... సాంస్కృతిక జాతీయ స్వభావం!
అభినవ సర్దార్ పటేల్‌గా వినుతికెక్కిన అద్వానీ ప్రధానమంత్రి కాలేదు. ‘పోలిక’కు సమానత్వం సిద్ధించింది, సార్థకత ఏర్పడింది. సర్దార్ వల్లభభాయి పటేల్ ఉప ప్రధాని అయ్యాడు, ప్రధాని కాలేదు! ఇదీ సమానత్వం! లోకమాన్య బాలగంగాధర తిలక్ ‘కాంగ్రెస్ ఉద్యమ సంస్థ’కు అధ్యక్షుడు కాలేదు.. ఇలా సాకారం పొందిన జాతీయ జీవన సంస్కారంగా రాజకీయ రంగాన్ని ఉజ్వల పరచిన అద్వానీ ఘోరమైన పొరపాటు చేయడం విధి విధానం.. కాల వైపరీత్యం! అఖండ భారతదేశాన్ని బద్దలుకొట్టి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయగలిగిన జిహాదీ బీభత్సకారుడు మహమ్మదాలీ జిన్నా. ఈ జిహాదీ రాజకీయవేత్త అన్యమత విద్వేషం పాకిస్తాన్ నుంచి లక్షల మంది సనాతన వైదిక మతాల వారిని నిర్మూలించింది. జిన్నా ఇలా చరిత్రను రక్తసిక్తం చేసిన అన్యమత విద్వేషి, మతోన్మాద పిశాచం. అలాంటి జిన్నాను ‘సర్వమత సమభావ’- సెక్యులర్- రాజకీయ వేత్తగా అభివర్ణించడం అద్వానీ చేసిన ఘోరమైన పొరపాటు. ‘‘ప్రమాదో ధీమతాం అపి- ధీమంతులు సైతం పొరపాట్లు చేయవచ్చు-’’. అద్వానీ ఇప్పుడైన ఈ తప్పిదాన్ని ఒప్పకొన్నట్టయితే ‘వాస్తవానికి న్యాయం జరుగుతుంది’. కానీ మహాకవి కాళిదాసు చెప్పినట్టు ‘‘చంద్రుని కిరణాలలో చంద్రునిలోని మచ్చ కలసిపోయినట్టుగా సుగుణవంతుని ఒక తప్పు ఎన్నదగినది కారాదు’’- ‘‘ఏకోహి దోషః గుణ సన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేషు ఇవ అఙ్కః’’