సంపాదకీయం

వ్యూహాత్మక విజయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్‌దీవుల పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో ‘మాల్ దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ’- ఎమ్‌డీపీ- ఘన విజయం సాధించడం మన దేశానికి లభించిన మరో వ్యూహాత్మక విజయం. చైనా నౌకాదళాలు మన దేశానికి మూడువైపులా ఉన్న సముద్ర జలాలలో నిరంతరం సంచరిస్తూ ఉండడం ఈ వ్యూహాత్మక విజయానికి సమాంతర నేపథ్యం! గత ఏడాది సెప్టెంబర్‌లో ‘ఎమ్‌డీపీ’కి చెందిన ఇబ్రహీం సోలీ మాల్‌దీవుల అధ్యక్షుడుగా ఎన్నిక కావడం చైనాకు వ్యతిరేకంగా సంభవించిన తొలి పరిణామం. ‘ఎమ్‌డీపీ’ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌ను చైనా అనుకూల, పాకిస్తాన్ సమర్ధక ‘జిహాదీ’ మూకలు 2012లో దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించాయి. మాల్‌దీవులు బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమైన తరువాత 2007 వరకు అక్కడ ఏకపక్ష నిరంకుశ పాలన కొనసాగింది. 2008లో తొలిసారిగా బహుళ పక్ష ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ నెలకొంది. 2008 నవంబర్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. మహమ్మద్ నషీద్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. కానీ బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు గిట్టదు.. పాకిస్తాన్‌కు గిట్టదు. 2002లో అఫ్ఘానిస్థాన్ నుంచి పలాయనం చిత్తగించవలసి వచ్చిన ‘తాలిబన్’ ‘అల్‌ఖాయిదా’ జిహాదీ మూకలు ‘యెమెన్’కూ ‘సోమాలియా’కూ విస్తరించాయి. ఆ తరువాత పాకిస్తాన్ ‘ఐఎస్‌ఐ’-ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్-వారు సోమాలియా కేంద్రంగా పనిచేస్తున్న ‘ఓడ దొంగల’నూ వివిధ జిహాదీ ముఠాలనూ అనుసంధానం చేయగలిగారు. ‘ఐఎస్‌ఐ’ పాకిస్తాన్ గూఢచర్య సంస్థగా అధికార ముద్ర వేసుకొని ఉంది. కానీ నిజానికి ఈ ‘ముఠా’ భారత వ్యతిరేక బీభత్స చర్యలను నిర్వహిస్తున్న ప్రచ్ఛన్న జిహాదీ సంస్థ! ఈ ‘ఐఎస్‌ఐ’ అనుసంధాన కలాపాల ఫలితంగానే మాల్‌దీవులలో పాకిస్తానీ, అఫ్ఘానీ జిహాదీ మూకలు ప్రవేశించగలిగాయి. పాకిస్తాన్‌లోని బీభత్స కేంద్రాలలో మాల్‌దీవులకు చెందిన యువకులు శిక్షణ పొందారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ జిహాదీలు మాల్‌దీవుల ప్రభుత్వ దళాలలో ఉద్యోగాలు పొందారు. మాల్‌దీవులలో సైనికులే పోలీసులు కూడ! మాల్‌దీవులలోని నిర్జన ద్వీపాలలో ఈ ‘జిహాదీలు’ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్టు ప్రచారమైంది. పాకిస్తాన్, అఫ్ఘానీ, మాల్‌దీవుల జిహాదీలు, సోమాలియా ఓడదొంగలు ‘దుష్టచతుష్టయం’వలె మాల్‌దీవులకు, మన లక్షద్వీపాలకు మధ్య ఉన్న అంతర్జాతీయ జలమార్గంలో కలాపాలను ఆరంభించినట్టు దశాబ్దికి పైగా ప్రచారం జరిగింది. ఈ జిహాదీలు మన ‘లక్ష ద్వీపాల’లోని నిర్జన ప్రాంతాలలోకి సైతం చొరబడే ప్రమాదం ఉందన్నది 2009లో జరిగిన ప్రచారం! ఈ జిహాదీలకు చైనా అండగా నిలబడి ఉంది. 2012 ఫిబ్రవరిలో మొదటి ప్రజాస్వామ్య అధ్యక్షుడైన మహమ్మద్ నషీద్‌ను మాల్‌దీవుల ప్రభుత్వ దళాలు బలవంతంగా గద్దెదించడం చైనా కుట్రలో భాగం! 2012నుంచి చైనా మద్దతుతో భారత వ్యతిరేక విధానాన్ని మాల్‌దీవుల ప్రభుత్వం అనుసరించడం చరిత్ర. 2018 సెప్టెంబర్‌లో అనూహ్యరీతిలో మహమ్మద్ నషీద్ సహచరుడు ఇబ్రహీం మహమ్మద్ సోలీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఈ చరిత్రకు ముగింపు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో నషీద్ నాయకత్వంలోని ‘ఎమ్‌డీపీ’కి మూడింట రెండువంతుల స్థానాలు లభించడం చైనా వ్యూహాత్మక దురాక్రమణకు మరో ఎదురుదెబ్బ...
చైనాకు 2011 వరకు మాల్‌దీవులతో దౌత్య సంబంధాలు లేవు. క్రీస్తుశకం 1887 నుంచి 1965 వరకు మాల్‌దీవులను బ్రిటన్ దురాక్రమించింది. బ్రిటన్ విముక్త మాల్‌దీవులకు 2011వరకు కేవలం నాలుగు దేశాలతో మాత్రమే దౌత్యసంబంధాలున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్- ఈ నాలుగు దేశాలు. ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాల ప్రభుత్వాలు ఈ నాలుగు దేశాలలోని తమ దౌత్య కార్యాలయాల ద్వారా మాత్రమే మాల్‌దీవులతో వాణిజ్య విహార, రాజకీయ, దౌత్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. చైనా 2011వరకు శ్రీలంకలోని తన దౌత్య కార్యాలయం ద్వారా మాల్‌దీవులతో వ్యవహరించేది. 2009నుంచి పెద్దఎత్తున హిందూ మహాసాగర ప్రాంతంలో చైనా సైనిక కలాపాలను పెంచింది. ఓడదొంగలను అరికట్టే నెపంతో చైనా యుద్ధనౌకలు అరేబియా సముద్రంలోను, హిందూ మహాసాగరంలోను ‘గస్తీ’ తిరుగుతున్నాయి. పాకిస్తాన్‌లోని ‘గ్వాడార్’ ఓడరేవు చైనా యుద్ధస్థావరంగా మారి ఉంది. శ్రీలంకలోని ‘హంపన తోట’ ఓడరేవును చైనా ‘అభివృద్ధి’చేస్తోంది.- ‘హంపనతోట’పై చైనా నియంత్రణ లేదని ‘సింహళ’ ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ చైనా మాత్రం ఈ ఓడరేవుపై కనే్నసి ఉంది. ఈ ‘క్రమం’లో శ్రీలంక నుంచి గ్వాడార్‌కు వెళ్లే జలమార్గంలో మన లక్ష ద్వీపాలకు దక్షిణంగా నెలకొని ఉన్న మాల్ దీవులలో సైతం తన నౌకాదళ స్థావరాలను స్థాపించడానికి చైనా 2011-2018 సంవత్సరాల మధ్య రహస్యంగా పథకం వేసింది. 2011 నవంబర్ తొమ్మిదవ తేదీన చైనా చరిత్రలో తొలిసారిగా మాల్‌దీవులలో దౌత్యకార్యాలయం ఏర్పాటు చేయడానికి ఇదీ నేపథ్యం...
ఇలా దౌత్యపరంగా చైనా తమ దేశంలో చొఱబడడానికి అనుమతిని ప్రసాదించడం అప్పుడు మాల్‌దీవుల అధ్యక్షుడుగా ఉండిన మొహమ్మద్ నషీద్ చేసిన చారిత్రక మహాపరాధం. చైనా చొరబడిన మూడు నెలలకే పోలీసులు- సైనికులు- తిరుగుబాటుచేసి మొహమ్మద్ నషీద్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. 1988 నవంబర్‌లో కూడ మాల్‌దీవులలో ‘కిరాయి’మూకలు ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి యత్నించాయి. అప్పటి అధ్యక్షుడు - నియంత- మావ్ మూన్ అబ్దుల్ గయూమ్ అభ్యర్థన మేరకు మన నౌకాదళం మాల్‌దీవులకు వెళ్లి తిరుగుబాటును అణచివేసింది. ప్రభుత్వాన్ని పదిలపరచింది. 2012 ఫిబ్రవరి ఏడవ తేదీన ‘ప్రాజాస్వామిక’ అధ్యక్షుడైన మొహమ్మద్ నషీద్‌ను సైనికులు తొలగించారు. నషీద్, ఆయన నాయకత్వంలోని రాజకీయ పక్షంవారు మన సహాయాన్ని అర్ధించారు. కానీ మన ప్రభుత్వం మాల్‌దీవులకు సైనిక దళాలను పంపలేదు. ఇది మన ప్రభుత్వం 2012 ఫిబ్రవరిలో చేసిన ‘హిమాలయ’ మహాపరాధం. 1988లో నియంతృత్వ మాల్‌దీవుల ప్రభుత్వాన్ని కిరాయి మూకల నుంచి కాపాడిన మన ప్రభుత్వం, 2012లో జిహాదీ మూకల నుంచి ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను విముక్తం చేయలేకపోవడం మన వైఫల్యం! ఫలితంగా 2018 సెప్టెంబరులో చైనా ‘తొత్తు’ అబ్దుల్లా యామీన్ ఎన్నికలలో ఓడిపోయేవరకు మాల్‌దీవులు మన దేశాన్ని బహిరంగంగా వ్యతిరేకించింది. 2018 సెప్టెంబర్ వరకూ మాల్‌దీవుల అధ్యక్షుడిగా ఉండిన యామీన్ మన దేశంపై విషం కక్కడం చరిత్ర..
మన లక్షద్వీపాలకు దిగువన వ్యాపించి ఉన్న పదకొండు వందల తొంబయి రెండు ద్వీపాల సముదాయం ‘మాల్‌దీవులు’. తొంబయివేల చదరపు కిలోమీటర్ల భూమి, నాలుగు లక్షల జనాభా కలిగిన మాల్‌దీవులు అతి చిన్న దేశాలలో ఒకటి. చిన్న దేశం అయినప్పటికీ మన దేశానికి నైరృతి దిశలో అత్యంత చేరువలోఉన్న మాల్‌దీవుల భద్రతతో మన భద్రత ముడివడి ఉంది. వాస్తవానికి బ్రిటన్ సామ్రాజ్యవాదులు ‘అఖండ భారత్’ను ఛిన్నాభిన్నం చేసేవరకు శ్రీలంక, మాల్‌దీవులు అనాదిగా మన దేశంలోని ప్రాంతాలు! క్రీస్తుశకం పనె్నండవ శతాబ్ది చివరిలో ‘జిహాదీ’లు మాల్‌దీవులలో చొఱబడిన నాటికి మాల్‌దీవుల ప్రజలందరూ వేద మతాలవారు, బౌద్ధ మతం వారు. మహాభారత యుద్ధసమయంలో మాల్‌దీవులు మన దేశంలో భాగమన్నది పురాతత్త్వ విభాగాల తవ్వకాలలో బయటపడింది. సంస్కృత భాషలో లిఖించిన అనేక శిలాశాసనాలు, అనేక తామ్రశాసనాలు, ఈ తవ్వకాలలో బయటపడినాయి. క్రీస్తునకు పూర్వం పద్దెనిమిదవ శతాబ్ది- కలియుగం పదమూడవ శతాబ్ది-లో ‘విజయుడు’ అన్న మగథ సామ్రాజ్యపు యువరాజు మాల్‌దీవులను దర్శించినట్టు ఈ తవ్వకాలలో దొరికిన సాక్ష్యాల వల్ల ధ్రువపడింది. కలియుగం పదిహేడవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం పదహైదవ శతాబ్ది-నాటి వౌర్య సమ్రాట్టు అశోకుని కాలంలో బౌద్ధమతం ‘మాలాద్వీపాల’- మాల్‌దీవుల-కు విస్తరించింది. మాల్‌దీవులతో మన దేశానికున్న ఈ చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, రక్షణ వ్యూహాత్మక బంధాన్ని తెగగొట్టడానికి చైనా ప్రభుత్వం చేస్తున్న ‘కుట్ర’ భగ్నం కావడం ప్రస్తుత ఘట్టం..