సంపాదకీయం

జలియన్‌వాలా బాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా మన దేశం జరిపిన స్వాతంత్య్ర సమర చరిత్రలో అత్యంత విషాద ఘట్టం ‘జలియన్‌వాలా బాగ్’లో జరిగిన పైశాచిక మారణకాండ. ఐరోపీయ బీభత్స స్వభావానికి చెఱగని భయంకర చారిత్రక సాక్ష్యం ఈ మారణకాండ! పంజాబ్‌లోని అమృతసర్ పట్టణంలోని జలియన్‌వాలా బాగ్ ప్రాంతంలో ప్రశాంతంగా సమావేశమై నిరసన తెలిపిన స్వాతంత్య్ర ఉద్యమకారులను, నిరాయుధులను అన్నివైపుల నుంచి దిగ్బంధనం చేసి హత్యచేసిన బ్రిటన్ ప్రభుత్వ బీభత్సకారులు నర రూప రాక్షసులు. తెల్లటి ‘బొల్లి’చర్మం వెనుక నక్కి ఉన్న ‘నల్లటి’ నిశాచరత్వానికి ఆ దుర్మార్గులు చారిత్రక ప్రతీకలు! సరిగ్గా వంద ఏళ్లకు పూర్వం క్రీస్తుశకం పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన బ్రిటన్ ప్రభుత్వం భారతీయులను ఈ భయంకర క్రూర కిరాతక బీభత్సకాండకు బలిచేసింది. బ్రిటన్ ప్రభుత్వ దురాక్రమణకు పైశాచిక ప్రతినిధులైన ఇద్దరు ‘డయ్యరు’లు నూరేళ్లనాడు జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన ఈ మానవ మేధాన్ని నిర్వహించారు; ప్రశాంతసీమను రక్తంతో తడిపి తడిపి వికృతమైన తమ ‘కోరల’ను ప్రదర్శించారు. ఈ ‘కోరలు’ బ్రిటన్ బీభత్సకారులకు నోటిలో లేవు, నిలువెల్లా నిక్షిప్తం అయి ఉండడం చరిత్ర ధ్రువపరచిన వాస్తవం. మన దేశంపై క్రీస్తుశకం పదహైదవ శతాబ్ది నుండి ‘దురాక్రమణ’ జరిపిన ఐరోపా బీభత్సకారులు గుంటనక్కల వంటివారు. అంతకు పూర్వం ఎనిమిదవ శతాబ్ది నుండి మన దేశంలోకి చొఱబడిన ఆరబ్, తురుష్క జిహాదీ హంతకులు తోడేళ్లు.. తోడేళ్లు నిరంతరం హింసాకాండను నిర్వహించాయి. ఇది తోడేళ్ల స్వభావం. కానీ గుంటనక్కలు కొన్నిసార్లు తోడేళ్ల కంటె భయంకరంగా దూకాయి, గొంతులను కొరికాయి, మరికొన్నిసార్లు తోకముడిచి వౌనం వహించాయి! క్రీస్తుశకం పద్దెనిమిది వందల యాబయి ఏడవ సంవత్సరంలో బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరం మొదలైంది. అప్పటివరకు భయంకరంగా దూకిన బ్రిటన్ ‘గుంటనక్కలు’ ఆ తరువాత క్రమంగా తోకలను ముడిచాయి. ఇలా తోకలను ముడిచిన సమయంలో ఐరోపా వారికి దేహమంతటా ఉన్న కోరలు లోపలికి ముడుచుకున్నాయి. ‘చట్టాలు’, ‘సంస్కరణలు’, ‘పాలన’, ‘రాజ్యాంగ ప్రక్రియ’ వంటి పేర్లతో ‘బ్రిటన్’ ఈ కాలవ్యవధిలో- 1857 నుంచి 1947 వరకు- వ్యూహాత్మక బీభత్సకాండను కొనసాగించింది. అయినప్పటికీ ఈ తథాకథిత చట్టాలకు, సంస్కరణలకు వ్యతిరేకంగా మన దేశంలోని స్వాతంత్య్ర ఉద్యమకారులు, స్వాతంత్య్ర సమర వీరులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. అలా జలియన్‌వాలా బాగ్ ప్రాంగణంలో దాదాపు ఇరవైవేల మంది ఉద్యమకారులు భరతమాత వరాల బిడ్డలు సభ తీరి ‘రౌలట్’ అన్న చట్టం పట్ల నిరసన తెలిపారు. ఇంత పెద్దసంఖ్యలో ఉద్యమకారులు సభ తీరడం బ్రిటన్ ప్రభుత్వం సహించలేక పోయింది. గుంటనక్క ‘కోరలు’ దేహమంతటా భయంకరంగా నిక్కపొడుచుకున్నాయి, భయంకర హత్యాకాండకు ఐదువందల నలబయి ఏడుగురు భారత స్వాతంత్య్ర ఉద్యమకారులు బలైపోయారు.
నోటిలోన కోరలున్న
నిశాచరులు జిహాదీలు,
కరచి కరచి భరతదేశ
స్వరూపాన్ని విరిచినారు..
నిలువెల్లా కోరలున్న
నిశాసురులు తెల్లవారు,
తరచి తరచి భరతజాతి
స్వభావాన్ని చెరచినారు!!
‘జలియన్‌వాలా బాగ్’ అమృతసర్‌లో ఒక ప్రదేశం. చుట్టూ ఇళ్ళు ఉన్న ఆటస్థలం వంటి ఈ మైదానం నుంచి బయటికి వెళ్లడానికి ఐదు ఇరుకైన మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఏడు ఎకరాల ఈ స్థలం చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. ‘బాగ్’-తోట- అని పేరు ఉన్నప్పటికీ ఈ స్థలంలో చెట్లు ఎక్కువ లేవు, బంజరుభూమి ఎక్కువ. అందువల్ల సభలకు, సమావేశాలకు ఈ స్థలం ఉపయోగపడేది. ఐదు ఇరుకైన మార్గాలు మాత్రమే ఉన్నాయి కనుక సమావేశానికి వచ్చిన నిరాయుధులపై కాల్పులు జరిపినట్టయితే ఎక్కువ సంఖ్యలో జనం నష్టవౌతారని అప్పటి పంజాబ్ ‘‘ఉప రాజప్రతినిధి’’- లెఫ్టినెంట్ గవర్నర్ మిషాయిల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ అనే వాడికి తెలుసు. వాడికి సహాయకుడిగా పనిచేసిన ‘కల్నల్’ రెజినాల్డ్ ఎడ్వర్డ్‌హారీ డైయెర్ అనే వాడికి కూడ తెలుసు. ఒకడు ‘డయ్యర్’ మరొకడు ‘డైయెర్’. డయ్యర్ పురమాయించాడు. యాబయి మంది సైనికులను వెంటబెట్టుకొని జలియన్‌వాలా బాగ్‌కు వెళ్లిన ‘కల్నల్’ డైయెర్ జనం పైకి విచ్చలవిడిగా కాల్పులు జరిపించాడు. జనం పారిపోకుండా ఐదు ద్వార మార్గాల వద్ద సైనికులను నిలబెట్టాడు. సైనికులందరూ మొత్తం పదహారువందల యాబయి తూటాలను పేల్చినట్టు ఆధికారికంగా నిర్ధారణ జరిగింది. నిరాయుధులపై కాల్పులు జరపడం, నిరాయుధులను చంపడం బీభత్సకాండ. ఈ హత్యాకాండను బ్రిటన్ ప్రభుత్వం జరిపించినందున ఇది ప్రభుత్వ బీభత్సకాండ. పురికొల్పిన ‘డయ్యర్’ జరిపించిన డైయెర్, జరిపిన సైనికులు బీభత్సకారులు, ఆతతాయిలు!
ఈ కాల్పుల ఫలితంగా వందల మంది భారతీయులు హతులయ్యారు. హతుల సంఖ్య మూడువందల డెబ్బయి తొమ్మిది నుంచి పదహారు వందల వరకూ ఉండవచ్చునని బ్రిటన్ ప్రభుత్వం అంచనావేసింది. పదహైదు వందల మంది తీవ్రంగా గాయపడి ఆ తరువాత కోలుకున్నారు. డైయెర్ అప్పటికి యాబయి ఐదేళ్లవాడు. మామూలు సైనికుడిగా సైన్యంలో చేరినవాడు. ఉద్యోగ విరమణ సమయం దగ్గరపడుతుండడం వల్ల ‘బ్రిగేడియర్’గా పదోన్నతి పొందాలని ఆశించినవాడు. జలియన్‌వాలా బాగ్‌కు ఈ డైయెర్‌ను తాత్కాలిక ‘బ్రిగేడియర్’ హోదాలో పంపించింది ‘ప్రభుత్వం’. అందువల్ల ఎక్కువ హత్యలను చేసినట్టయితే పదోన్నతి లభిస్తుందన్నది వాడి ఆశ! పదోన్నతి లభించలేదు.. ఈ రాక్షసకాండ పట్ల అంతర్జాతీయంగా బ్రిటన్ పట్ల నిరసనలు చెలరేగాయి. అందువల్ల ‘కల్నల్’ డైయెర్‌ను బ్రిటన్ ప్రభుత్వం స్వదేశానికి పిలిపించుకొంది. ఉప రాజప్రతినిధి మిహాయిల్ డయ్యర్ కూడ పదవీచుత్యడై బ్రిటన్‌కు వెళ్లిపోయాడు. జలియన్‌వాలా బాగ్ మారణకాండను, ఆ భయానక బీభత్స దృశ్యాలను కళ్లారా చూసిన ఉధం సింగ్- ఉద్దం సింగ్ అనే బాలుడు చలించిపోయాడు. దోషులను దండించాలని ప్రతిజ్ఞచేశాడు. ఇరవై ఒక్క ఏళ్ల తరువాత 1940 మార్చి 13వ తేదీన ఉధం సింగ్ లండన్‌లో ‘కాక్స్‌టున్’ హాల్‌లో ‘డయ్యర్’ను దండించాడు, వధించాడు. భరతమాతృ ఋణం తీర్చుకున్న వజ్రాల బిడ్డడు ఉధం సింగ్. అప్పటికే డైయెర్- 1927లో- చనిపోయి ఉన్నాడు. ఉధం సింగ్‌ను ఉరితీసి చంపడం ద్వారా బ్రిటన్ ప్రభుత్వం మరోసారి తన బీభత్స స్వభావాన్ని ధ్రువపరచుకొంది. 1919 ఏప్రిల్ 13న జరిపించిన దారుణ మారణకాండను బ్రిటన్ ప్రభుత్వం పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు.
ఇప్పటికీ బ్రిటన్ ప్రభుత్వం ఈ కిరాతక బీభత్సచర్య పట్ల పశ్చాత్తాపం ప్రకటించడం లేదు. క్షమార్పణ కోరడం లేదు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరీసా మేమ్ కూడ క్షమార్పణ కోరకపోవడం కొనసాగుతున్న బీభత్స వారసత్వం! తమ ప్రభుత్వం భారత ప్రజలకు భారత ప్రభుత్వానికి క్షమార్పణ చెప్పవలసిందేనని ఎనబయి మంది బ్రిటన్ పార్లమెంటు సభ్యులు కోరడం- ‘హిరణ్యకశిపుల మధ్య ప్రహ్లాదులు కొందరైన ఉన్నారనడానికి’ నిదర్శనం. రెండవ ప్రపంచయుద్ధంలో తమ దేశాలను దురాక్రమించిన దేశాలతో ఆ తరువాత వివిధ ప్రభుత్వాలు క్షమార్పణ చెప్పించుకున్నాయి. మన ప్రభుత్వం కూడ ఇప్పుడైన ఆలస్యంగానైనా బ్రిటన్ ప్రభుత్వాన్ని దండించాలి. బ్రిటన్ చేత క్షమార్పణ చెప్పించడం ఈ దండన. మాతృదేశ దాస్యవిముక్తి కోసం తమ ప్రాణాలను అర్పించిన వందల జలియన్‌వాలా బాగ్ అమరవీరులకు అది నివాళి! ఆ వీరులు చరితార్థులు, భరత జాతికి నిత్య స్మరణీయులు! వారు భరతమాత యశోవిభవ రక్షకులు, భరతజాతి త్యాగమయ స్వభావానికి సమరశీల పటిమకు శాశ్వత ప్రతీకలు, స్వాతంత్య్ర పతాకలు...
వారి కథల పులకించి
ఒక కంట ఆనంద రసం,
వారి వ్యథల స్మృతుల గతుల
మరో కంట శోకజలం...
హర్ష విషాదముల మహా
సంగమస్థలి భారతి మది
ఉద్వేగపు హృదయ వీణ
శ్రుతి చేస్తున్నది జాతి...