సంపాదకీయం

వాణిజ్య నియంతృత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ వేత్తలు ప్రధానంగా ప్రాంతీయ దళాధినేతలు ‘బహుళ’ ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో, ప్రత్యేకించి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ మహదాకాంక్షలు మరింతగా సమావిష్కృతవౌతుండడం దశాబ్దుల చరిత్ర. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీచేస్తున్న ప్రాంతీయ రాజకీయ పక్షాలకు ఈ ‘బహుళ’ ప్రజాస్వామ్యం ప్రధాన ప్రచార ఇతివృత్తం కావడం ఈ చరిత్రకు అనుగుణం. లోక్‌సభలో ఏ ఒక్క రాజకీయ పక్షానికి కాని ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- లభించరాదన్నది ఈ ఇతివృత్తం! ఒకటి, అంతకంటె ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న ఇరవై ముప్పయి రాజకీయ పక్షాలు కూడ కావచ్చు, కలసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించాలన్నది ‘బహుళపక్ష’ వ్యవస్థను కోరుతున్న వారి ఆకాంక్ష. లోక్‌సభలో ఒకే పక్షానికి ‘సంఖ్యాధిక్యం’ లభించినట్టయితే ఆ రాజకీయ పక్షం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నది ఏకపక్ష- సింగిల్ పార్టీ- ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు స్వానుభవ పూర్వంగాను, పరిశోధన, అధ్యయనం ప్రాతిపదికగాను తేల్చివేసిన నిగ్గు. ఒకరి పెత్తనమే ఉండరాదన్నది ఈ రాజకీయ సూత్రం. అలా ఉండడం నిరంకుశత్వం- అట! అందువల్ల ఒక్కొక్కరుగా ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- సాధించలేని అనేకమంది ఎన్నికల తరువాత సమైక్యమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారట! రాజకీయ రంగంలో ఆర్భాటానికి గురి అవుతున్న ఈ ‘వైవిధ్య సూత్రం’ ఆర్థిక వాణిజ్య రంగాలలో వమ్మయిపోతోందన్నది రాజకీయ ప్రధాన జీవనులు పట్టించుకోని మహావిషయం. దశాబ్దుల తరబడి కొనసాగిన ఈ పట్టించుకోనితనం వల్ల దేశంలో ‘ఆర్థిక నియంతృత్వం’ నెలకొనిపోయింది, వాణిజ్య నిరంకుశత్వం వ్యవస్థీకృతం అయిపోతోంది. ఈ వైపరీత్యం చాపకింది విషం లాగా విస్తరించిపోతుండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్ ఫలితం. వాణిజ్య ప్రపంచీకరణ సాంస్కృతిక భారత సమాజాన్ని దిగమింగుతుండడం వేఱుకథ. కానీ వాణిజ్య క్షేత్రంలోని ప్రతి రంగంలోను ‘వైవిధ్యం’ నష్టమైపోయింది, నష్టమైపోతోంది. వందల వేల చిన్న సంస్థలు, దుకాణాలు, మండలులు, సంతలు మూతపడిపోయాయి, పోతున్నాయి. ప్రతి రంగంలోను ఒకటి లేదా రెండు ‘రాక్షస’- జెయింట్- వాణిజ్య సంస్థలు మాత్రమే మిగులుతున్నాయి. ‘జెట్ ఎయిర్‌వేస్’ అన్న విమానయాన సంస్థ తాత్కాలికంగా మూతపడడం ఒక ఉదాహరణ మాత్రమే. పాతికేళ్లకు పైగా వేల సంస్థలు వివిధ వాణిజ్య రంగాల నుంచి అదృశ్యమైపోయాయి. ‘‘చిన్న చేపలను పెద్దచేప దిగమింగడం’’ గురించి కథనాలు మాత్రమే మనం వింటున్నాము. ప్రత్యక్ష అనుభవం లేదు. ఇతర అన్ని వాణిజ్య సంస్థలను ఒకటి, రెండు ‘బృహత్’- మెగా- సంస్థలు దిగమింగుతుండడం దశాబ్దుల ప్రత్యక్ష అనుభవం! మన దేశంలో ఆర్థిక నిరంకుశత్వం ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఈ ధ్యాస రాజకీయ పక్షాలకు ఉందా? లేదా? ధ్యాస ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదా?? ప్రభుత్వాలు ప్రజలను పాలించడం లేదు. వాణిజ్య నిరంకుశ సంస్థలు వినియోగదారులను శాసిస్తున్నాయి. ఆర్థిక నియంతృత్వం సమాజాన్ని నడిపిస్తోంది.
ఎన్నికలలో ఏ పక్షం గెలిచినప్పటికీ, ఒకే పక్షానికి లోక్‌సభలో ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- లభించినప్పటికీ, లభించనప్పటికీ ‘‘ప్రజల బతుకులు ప్రభుత్వాల పాలన పరిధిలో ఉండడం లేదన్న’’ వాస్తవం మాత్రం మారడం లేదు. ప్రజల బతుకులు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ నియంత్రణలో కొనసాగుతున్నాయి. భారతదేశంలో పుట్టినదైనా, విదేశాల నుంచి వ్యాపించినదైనా ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ల స్వభావంలో భేదం లేదు, సమానత్వం ఉంది. జాతీయత, దేశభక్తి, మాతృభూమి పట్ల మమకారం, సామాజిక నిష్ఠ, సాంస్కృతిక నిబద్ధత, మానవీయ దృక్పథం, భూతదయ వంటి భారతీయ జీవన మూల్యాలకు స్థానం లేకపోవడం ‘స్వదేశీయ’, ‘విదేశీయ’ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల మధ్య అనుసంధితమై ఉన్న స్వభావ సమానత్వం! ‘్ఫ్లప్‌కార్ట్’అన్న భారతీయ సంస్థను ‘వాల్‌మార్ట్’ అన్న అమెరికా సంస్థ ఆక్రమించుకోవడం స్వరూప బీభత్సం! బీభత్స స్వరూపం విస్తరించిన తరువాత ప్రతిరంగంలోను రెండుమూడు కంటె ఎక్కువ సంస్థలు మిగలడం లేదు. ఒకే సంస్థ ‘గుత్తగంప’ పెత్తనం చెలాయిస్తున్న రంగాలు కూడ ఉన్నాయి. వినియోగదారులకు మరో ప్రత్యామ్నాయం లేదు, వినియోగదారులకు సిగ్గులేదు, వినియోగదారులకు భారతీయ జీవన మూల్యాలను నిలబెట్టుకోవాలన్న తపన లేదు. వినియోగదారులకు ఉన్నది కేవలం ‘్భయం’! ఈ ‘్భయం’ వివిధ రకాలు! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ను ఆశ్రయించకపోతే ఉదయాన ‘కాఫీ’ దొరకదన్నది భయం, ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ను ప్రోత్సహించకపోతే సమయానికి తమ కార్యాలయానికి చేరలేమన్నది భయం! ప్రతి రంగంలోను మిగిలి ఉన్న ఒకటి రెండు వాణిజ్య సంస్థలు గుత్తగంపగా లాభాలను కొల్లగొట్టుకుంటూ ఉండడానికి వినియోగదారుల ఈ ‘్భయం’ కారణం! ‘జెట్ ఎయిర్‌వేస్’ తాత్కాలికంగా మూతపడడం గగనయాన రంగంలో సైతం ఒకటో రెండో సంస్థలు మాత్రమే మిగిలి ఉండాలన్న ఆర్థిక నిరంకుశత్వానికి అనుగుణమైన విపరిణామం! వాణిజ్య బీభత్స స్వరూప విస్తృతి తీరు ఇది!
నేలనుంచి నింగికి ఈ బీభత్సరూపం పెరుగుతోందా? నింగి నుంచి నేలకు ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- మల్టీ నేషనల్ కంపెనీస్- ‘బీభత్సకాయం’ అవతరిస్తోందా? అన్న మీమాంసకు తావులేదు. అన్ని రంగాలలోను అన్ని స్థితులలోను ఒకే సంస్థ లేదా రెండు సంస్థలు మిగిలిన సంస్థలను కొనుగోలు చేస్తుండడం విస్తరించిపోతున్న ఆర్థిక నియంతృత్వ విష వ్యూహం! ఇతర మతాలను, ఇతర భాషలను, ఇతర సంప్రదాయాలను, తమదికాని ప్రతి దాన్నీ ధ్వంసం చేయడం భారత వ్యతిరేక స్వభావం! ఈ స్వభావం ఆవహించిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ఇతర వాణిజ్య సంస్థలను మట్టుపెడుతుండడం ‘అసహిష్ణుత’లో ఒక అంశం. ఇది ఆర్థిక అసహిష్ణుత, వాణిజ్య అసహిష్ణుత! పోటీని తట్టుకోలేని ‘జెట్’వంటి సంస్థలు గగనం నుండి కుప్పకూలిపోతున్నాయి. అవకాశం వస్తే ఈ సంస్థకూడ మరో సంస్థను దిగమింగగలదు, మరెన్నో సంస్థలను కొనేయగలదు. గత నవంబర్‌లో నూట ఇరవై నాలుగు విమానాలను నడిపిన ‘జెట్’ సంస్థ ఇప్పుడు ఐదు విమానాలను నడుపుతోందట! ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలలోని ‘బ్యాంకులు’ భారీగా అప్పులిచ్చి తమ ‘గగన యాన’ సంస్థను మళ్లీ పైకెగిరించడానికి సహకరించాలని ‘జెట్’ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు విమానయాన రంగంలోని ఇతర సంస్థలు ఆదుకునే పేరుతో ‘జెట్’ను ఆక్రమించుకొనే యత్నాలను కూడ ఆరంభించాయట! గత ఇరవై ఒక్క ఏళ్లలో పనె్నండు ప్రభుత్వేతర విమానయాన సంస్థలు మూతపడ్డాయట లేదా ఇతర సంస్థలలో విలీనమైపోయాయట. ఆధిపత్య, ఏకఛత్రాధిపత్య వాణిజ్యం విస్తరిస్తున్న తీరు ఇది. పోటీ సంస్థలు మూతపడిన తరువాత మిగిలి ఉండే ఒకటి రెండు, వాణిజ్య సంస్థలు వినియోగదారులను ‘గుత్తగంప’గా దోచుకోవచ్చు!
భాగ్యనగరంలో కాని మరో మహానగరంలో కాని సొంత వాహనాలు లేని వారు ప్రయాణించడం ‘‘దొరకని’’ బస్సులపై ఆధారపడి ఉంది, దోచుకునే ప్రభుత్వేతర సంస్థల వాహనాలపై ఆధారపడి ఉంది. ‘ఓలా’, ‘ఉబర్’ అన్న సంస్థల ‘కార్’-క్యాబ్-లు తప్ప మరో సంస్థ వాహనం లేదు. ఇదీ గుత్తగంప వాణిజ్యం. ఈ రెండు సంస్థలలో ఏదో ఒక సంస్థ నుంచి వాహనం లభిస్తేకాని మనం ప్రయాణం చేయలేము. గతంలో ‘రోడ్డు’మీద నిలబడిన వినియోగదారునికి ప్రభుత్వేతర వాహనాలు కిరాయికి లభించేవి. లేదా ‘టాక్సీస్టాండు’ వద్ద దొరికేవి. ఇప్పుడు అలా రోడ్డుమీద రోజంతా నిలబడినప్పటికీ ‘టాక్సీ’-క్యాబ్- దొరకదు. ‘లావణ్య వాణి’ - స్మార్ట్ఫోన్- మనవద్ద ఉండాలి! దాని ద్వారా ‘అంతర్జాల జీవనాడి’- ఇంటర్‌నెట్ ఆన్‌లైన్-ని ఉపయోగించి మనం ‘క్యాబ్’ను పొందవచ్చు. ఇదీ ప్రపంచీకరణ! ప్రయాణం చేయాలంటే ‘లావణ్యవాణి’ అత్యవసరం. అది లేనిదే మనకు టాక్సీ దొరకదు, ‘క్యాబ్’ దొరకదు. నాగరికుల బతుకులు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ కబంధంలో గిలగిలకొట్టుకుంటూ ఉండడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ‘ఓలా’, ‘ఉబర్’ సంస్థలు ఇలా ‘గుత్తగంప’ ఆధిపత్యం సాధించాయి. పది కిలోమీటర్లు వెళ్లడానికి వంద యాబయి రూపాయలు. అదే దూరం తిరిగి రావడానికి నాలుగువందల యాబయి రూపాయలు! ఇదీ ‘ఓలా’, ‘ఉబర్’ సంస్థలు దోచుకుంటున్న తీరు. అడిగే ప్రభుత్వం లేదు! ‘‘రాజకీయ నిరంకుశత్వాన్ని’’ నిరసిస్తూ నోళ్లు పారేసుకుంటున్న ప్రాంతీయ రాజకీయ అధినేతలు ఈ వాణిజ్య సంస్థల ‘గుత్తగంప’ పెత్తనాన్ని, ఆర్థిక నిరంకుశత్వాన్ని, దుర్మార్గపు దోపిడీని ఎందుకని నిరసించడం లేదు??