సంపాదకీయం

విషాద సింహళం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంకలో ఆదివారం జరిగిన భయంకర బీభత్స విస్ఫోటన ధ్వనులు భారతీయుల హృదయ సీమలలో సైతం విషాద ప్రకంపనలు సృష్టించడం సహజం. శ్రీలంక భద్రత భారత భద్రతతో ముడివడి ఉంది, శ్రీలంక చరిత్ర భారత చరిత్రతో అనుసంధితమై ఉంది. శ్రీలంక సాంస్కృతిక వారసత్వానికి, భారతీయ సాంస్కృతిక వారసత్వానికీ మధ్య సమానత్వం నెలకొని ఉంది. శ్రీలంక ప్రజలకూ, భారతీయ ప్రజలకూ మధ్య అనాదిగా మమకార బంధం ఏర్పడి ఉంది. ఆదివారం నాడు నరరూప పిశాచాలు సింహళం- శ్రీలంక-లోని ఎనిమిదిచోట్ల జరిపిన ‘కనీ వినీ ఎఱుగని తరహా’ పేలుళ్లకు చిన్న దేశమైన శ్రీలంక భయ ప్రకంపితమైంది, భయంకర బాధను తట్టుకోలేక విలవిలలాడుతోంది. ఈ విషాదం భారతదేశానికి సైతం విస్తరించి ఉండడం అందువల్ల సహజం. 2009వరకు దాదాపు మూడున్నర దశాబ్దులపాటు సింహళ ద్వీపంలో అంతర్యుద్ధస్థితి నెలకొనడం చరిత్ర. శ్రీలంకను భాషల పేరుతో బద్దలుకొట్టడానికి ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’- ఎల్‌టిటిఇ- అన్న బీభత్స ముఠా యత్నించడం ఆ చరిత్ర. అరవై ఆరువేల చదరపు కిలోమీటర్ల- ఇరవై ఆరువేల చదరపు మైళ్ల- చిన్న దేశమైన శ్రీలంక ‘ఎల్‌టిటిఇ’ సృష్టించిన దశాబ్దుల బీభత్స జ్వాలలకు తట్టుకోలేక తల్లడిల్లింది. తమిళ భాషా జన సముదాయానికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడానికి వీలుగా సింహళ ద్వీపాన్ని బద్దలుకొట్టి రెండు ముక్కలు చేయాలన్నది ‘ఎల్‌టిటిఇ’ షడ్యంత్రం. కానీ ఈ ‘ భాషాజాతి’ వాదాన్ని అధిక సంఖ్యాకులైన సింహళ భాషా జన సముదాయం కాని, అల్పసంఖ్యాకులైన తమిళ భాషా జనసముదాయం కాని అంగీకరించలేదు. శ్రీలంక భూభాగం భారతదేశానికి భౌగోళిక విస్తృతి. కోట్ల సంవత్సరాలకు పూర్వం భారతదేశపు భూభాగంతో కలసి ఉండిన ఈ సింహళ ద్వీపం- సిలోన్- శ్రీలంక- ‘భూఖండ చలనం’- కాంటినెంటల్ డ్రిఫ్ట్- కారణంగా భారత భూమినుంచి వేఱుపడి ఆగ్నేయ దిశగా దూరంగా జరిగింది. ఈ ‘కాంటినెంటల్ డ్రిఫ్ట్’ కారణంగానే భారత్‌కూ సింహళ ద్వీపానికి మధ్య ఏర్పడి ఉన్న సముద్ర జలాల లోతు చాలా తక్కువగా ఉంది. ఇలా భౌతిక బంధం విడిపోయినప్పటికీ భారత శ్రీలంక దేశాల ప్రజల సాంస్కృతిక స్వభావం ఒక్కటే! అందువల్ల భారతదేశంలో వలెనే వివిధ మతాలవారు భాషలవారు శ్రీలంకలో శతాబ్దులుగా ప్రశాంత సహజీవనం చేస్తున్నారు. ఈ వైవిధ్య సమాజ జాతీయ స్వభావం ఒక్కటే! ఒక్కటిగా ఉన్న ఈ సాంస్కృతిక రూపాన్ని భాష పేరుతో ముక్కలు చేయడానికై కుట్ర చేసి భయంకర బీభత్సం సృష్టించి, మానవ మారణకాండను జరిపిన ‘ఎల్‌టిటిఇ’ మూడు దశాబ్దులు శ్రీలంకను రక్తపాతంతో ముంచెత్తింది. శ్రీలంక ప్రభుత్వం, ప్రజలు ఒక్కటిగా నిలబడి ‘ఎల్‌టిటిఇ’ పన్నాగాన్ని వమ్ముచేశారు. 2009 మే నాటికి ‘ఎల్‌టిటిఇ’ నడుం విరిగిపోయింది. బీభత్సపు తోడేలు తోక ముడిచింది, పారిపోయింది!
అప్పటి నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా శ్రీలంక ప్రశాంతంగా మనుగడ సాగించింది. ఆదివారం జరిగిన పేలుళ్లు, కాల్పులు, బీభత్స వికృత విన్యాసాలు ఈ పదేళ్ల ప్రశాంతికి భయంకరమైన విఘాతం! భాషా విద్వేషాలను రెచ్చగొట్టిన ఉన్మాదులు, ‘ఎల్‌టిటిఇ’ హంతకులు అణగారిపోయారన్న ఆనందంతో పదేళ్లుగా ఆదమరచిన శ్రీలంక ప్రజలపై ఇప్పుడు మతోన్మాద పైశాచిక బీభత్స మృగం దూకడం విస్మయకరమైన విపరిణామం. దాదాపు రెండు వందల తొంబయి మంది ఆదివారం నాటి వరుస పేలుళ్లకు బలైపోయారు. ఐదువందల మందికి పైగా గాయపడ్డారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం బీభత్సకాండకు బలికావడం ఇటీవలి కాలంలో అభూత పూర్వ ఘోర విషాదం. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు పెద్దసంఖ్యలో చర్చిలలో ప్రార్థనలు చేసుకొనడానికై సమావేశమైన సమయంలో ఆయా చర్చిలలో మానవబాంబులు పేలడం పథకం ప్రకారం జరిగిన కుట్ర. పదేళ్లుగా పొంచి ఉండిన ‘జిహాదీ’ మృగం ‘‘గోడ దూకడం’’ శ్రీలంకను ఛిన్నాభిన్నం చేయాలన్న అంతర్జాతీయ మతోన్మాద షడ్యంత్రంలో భాగం కావచ్చు. మన దేశం సమీపంలో హిందూ మహాసముద్రంలో నెలకొని ఉన్న మాల్దీవులలో ‘జిహాదీ’ హంతకులను పులికొల్పిన అంతర్జాతీయ శక్తులే శ్రీలంకలో సైతం స్థానిక జిహాదీ మృగాన్ని ఉసిగొల్పాయన్న అభిప్రాయం అతార్కికం కాదు. పేలుళ్ల తరువాత పట్టుబడిన హంతకులందరూ ‘జిహాదీ’లు కావడం ఇందుకు ప్రాథమిక నిదర్శనం. అందువల్ల మన దేశంలో ‘జిహాదీల’ను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స విభాగం ‘ఐఎస్‌ఐ’- ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- శ్రీలంకలో సైతం చొరబడి ఉండవచ్చునన్న అనుమానం ఇప్పుడు ధ్రువపడింది. సింహళంలోనే పుట్టపగిలిన ‘నేషనల్ దౌహీత్ జమాత్’ అన్న బీభత్స సంస్థ ఆదివారం నాటి మారణకాండను నిర్వహించినట్టు ప్రచారమైంది. కానీ ఆసియా, ఆఫ్రికాలలో పనిచేస్తున్న దాదాపు అన్ని బీభత్స ముఠాల మధ్య అనుసంధానకర్త పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ అన్నది దశాబ్దులుగా జగమెరిగిన సత్యం..
ఈ వాస్తవం తెలిసినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఈ మారణకాండను నిరోధించలేకపోవడం ‘ప్రమత్తత’కు మరో ఉదాహరణ. ఈ ‘నేషనల్ దౌహీత్ జమాత్’ అన్న బీభత్స సంస్థ గత ఏడాది సింహళంలోని అనేకచోట్ల బుద్ధవిగ్రహాలను ధ్వంసం చేసిందట. ఈ విగ్రహ విధ్వంసక ప్రవృత్తి దశాబ్దులుగా ‘జిహాదీల’ సహజ స్వభావం. వివిధ దేశాలలో శతాబ్దుల తరబడి వేల వేల విగ్రహాలు, మందిరాలు, జాతీయ స్ఫూర్తి కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు, ఆరాధన స్థలాలు ‘జిహాదీల’ విధ్వంస కాండకు దగ్ధకాండకు గురికావడం చరిత్ర. ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్థాన్‌లోని బుద్ధవిగ్రహాలను జిహాదీలు ధ్వంసం చేయడం మన దేశంలోని బుద్ధగయ ప్రాంగణంలో బాంబులు పేలడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం గత ఏడాది తమ దేశంలో జరిగిన బుద్ధ విగ్రహ విధ్వంసాన్ని ఆపలేకపోయింది. దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల సింహళ జనాభాలో డెబ్బయి శాతం మంది బౌద్ధులు. వివిధ వేద మతస్థులు పధ్నాలుగు శాతం ఉన్నారు. క్రైస్తవ మతస్థులు తొమ్మిది శాతం, ఇస్లాం మతస్థులు ఏడు శాతం. గత ఏడాది బుద్ధవిగ్రహాలపై దాడి చేసిన ‘జమాత్’ముఠా ఈ ఆదివారం చర్చిలను, విదేశీయులు అధికంగా బసచేసే హోటళ్లను తన బీభత్సకాండకు గురిచేయగలిగింది. ఆదివారం నాటి పైశాచిక కాండకు బలైన ముప్పయి ఐదుగురు విదేశీయులలో మన దేశం నుండి వెళ్లినవారు ఐదుగురున్నారట. శ్రీలంకకు విదేశాల నుంచి తీర్థయాత్రికులు, వినోద విహార యాత్రికులు రాకుండా నిరోధించాలన్నది కూడ ఈ బీభత్స పథకంలో భాగం! మత వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేకపోవడం సింహళంలోను, మన దేశంలోను నెలకొని ఉన్న సమాన సాంస్కృతిక వారసత్వం. కానీ మత వైవిధ్యాలను మత వైరుధ్యాలుగా మార్చడానికి ‘జిహాదీ’లు యత్నిస్తున్నారు. ఆదివారం నాడు ‘చర్చి’లపై జరిగిన దాడులు ఇందుకు మరో భయంకర నిదర్శనం! దేశమంతటా ‘అత్యవసర పరిస్థితి’- ఎమర్జెన్సీ- విధించవలసి రావడం బీభత్స ప్రమాద భయంకరత్వానికి, విస్తృతికి నిదర్శనం. శ్రీలంక నైరృతి తీరంలోని రాజధాని కొలంబో పరిసరాలలోను, తూర్పుతీరంలోని ‘బట్టికలోవా’లోను ఒకేసారి పేలుళ్లు జరపగలగడం ‘జిహాదీ’ల విస్తృతి..
తెలంగాణకు చెందిన కొందరు యాత్రికులు కొలంబో పరిసరాలలోని ‘శక్తిపీఠాన్ని’ సందర్శించుకొని ఆదివారం ఉదయాన విమానమెక్కి తిరిగి వచ్చేశారట. వారు విమానంలోఉన్న సమయంలోనే కొలంబో విమానాశ్రయం సమీపంలోని హోటళ్లలో విస్ఫోటనాలు జరిగాయి. తెలంగాణ యాత్రికులకు తృటిలో ప్రమాదం తప్పడం దైవ ఘటన. ‘లంకాయాం శాంకరీ దేవీ..’- లంకలో ఉన్న ‘శక్తి’ శాంకరీదేవి- అన్నది అష్టాదశ శక్తిపీఠాల నిసర్గస్థితికి నిదర్శనం. భారతీయుల శక్తిపీఠాలు మాత్రమే కాదు, అన్ని సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలు జాతీయ ప్రాదేశిక పరిధిలోనే ఉండడం అన్నది చరిత్ర. అందువల్లనే అమెరికా తిరిగివచ్చిన వివేకానందస్వామి- క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దంలో- కొలంబోలో ఓడ దిగిన వెంటనే మాతృదేశాన్ని మళ్లీ దర్శించినట్టు మురిసిపోయాడు. ఈ చరిత్రను బ్రిటన్ దురాక్రమణదారులు చెఱచారు. సింహళాన్ని భారత్ నుండి విడగొట్టారు. రాజకీయ సరిహద్దులు మారినప్పటికీ ఉభయ దేశాల ప్రజల హృదయ స్పందన ఒక్కటే. శ్రీలంకలో జరిగిన బీభత్సకాండ భారతీయులను అందువల్లనే శోకతప్తులను చేసింది, విషాదంతో ముంచెత్తుతోంది.