సంపాదకీయం

కాళేశ్వర గంగ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని నిరోధించి పొలాల వైపు నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి శ్లాఘనీయం. ‘సేద్యం’, ‘వ్యవసాయం’ అన్న పదాలకు సంస్కృత భాషలో సమాన పదం ‘‘కృషి’’. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ‘వ్యవసాయం’ చేస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదు. ‘వ్యవసాయం’ అంటే పంట, పచ్చదనం, పర్యావరణానికి పరిమళం, ప్రజలకు భోజనం! వ్యవసాయం ఇన్ని ఇస్తున్నప్పటికీ వ్యవసాయాన్ని ఇస్తున్నది, భూమికి ఈ ఆకుపచ్చదనాన్ని ప్రదానం చేస్తున్నది మాత్రం నీరు. నీటి ప్రవాహాలను తెలంగాణ ప్రాంతమంతటా పెంచాలన్న, కోటి ఎకరాలకు నీటిని పంచాలన్న ప్రభుత్వ లక్ష్యం అభినందనీయం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఏర్పడుతున్న జలాశయాల వల్ల పరుగులు తీస్తున్న కాలువల వల్ల మాత్రమే నలబయి లక్షల ఎకరాల భూమికి సేద్యపు నీరు లభించనున్నదట! ఈ పథకం నిర్మాణంలో భాగంగా బుధవారం మొదటి దశ ‘జల వికిరణం- వాటర్ పంపింగ్- ప్రయోగం విజయవంతం కావడం మరో స్థాపత్య అద్భుతం- ఇంజనీరింగ్ మార్వెల్. పెద్దపల్లి జిల్లా నంది మేడారం వద్ద నిర్మించిన ‘జల వలయం’- సిస్టెర్న్-లోకి నీరు దూకడం ఈ విజయం. ఈ జల వలయం నుంచి పెద్ద ప్రవాహమార్గం గుండా నీరు ముందుకు సాగుతుందట! నిజానికి గోదావరి ప్రవాహగతికి వ్యతిరేక దిశగా పెద్ద ప్రవాహం వెనక్కి కదలడం ఈ ‘కాళేశ్వరం జల మార్గ’ పథకంలోని ఒక ప్రధాన అంశం. ఇలా వెనక్కి ఉరకలెత్తే గోదావరి నీరు, ప్రాణహిత నదీ సహిత గోదావరీ జలం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న శ్రీరామ్‌సాగర్ జలాశయాన్ని నింపనున్నదట! మహారాష్టల్రో గోదావరి ఎగువ భాగాన ‘బాబ్లీ’ జలాశయాన్ని నిర్మించడం వల్ల, గోదావరిపై అనేకచోట్ల చిన్నచిన్న ఆనకట్టలను నిర్మించడం వల్ల శ్రీరామ్‌సాగర్ జలాశయం ఎండిపోయే దుస్థితి దాపురించి ఉండడం చరిత్ర. మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గోదావరి క్రమంగా శుష్కించిపోయింది. శ్రీరామ్‌సాగర్ జలాశయానికి దిగువన తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల, గోదావరిలో చేరుతున్న ఉపనదుల వల్ల ఈ గంగమ్మ తల్లి మళ్లీ జల పరిపుష్టమై ప్రవహిస్తోంది. ప్రాణహిత వచ్చి కలసిన తరువాత ‘కాళేశ్వరం’వద్ద గోదావరి మళ్లీ ఉత్తుంగ తరంగిణిగా ఉరకలు వేస్తోంది. అందువల్ల ఈ సంగమ స్థలివద్ద నుంచి నీటిని వెనక్కు విరజిమ్మి- రివర్స్ పంపింగ్- శ్రీరామ్‌సాగర్‌ను మళ్లీ జల కళకళ లాడించాలన్న తెలంగాణ ప్రభుత్వ పథకం మరో భగీరథ ప్రయత్నం. ప్రాణహిత సంగమించిన తరువాతనే గోదావరి నీరు పుష్కలం కావడం భౌగోళిక వాస్తవం. నిజానికి ప్రాణహిత ఉపనది కాదు, పరిపుష్టమైన స్వతంత్ర జీవధార అన్నది ఇలా మరోసారి ధ్రువపడుతోంది. కృష్ణానదిలో కలిసిన తుంగభద్ర నదివలె ప్రాణహిత నది గోదావరిలో సంగమిస్తోంది. ఈ సంగమస్థలి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉంది. ఈ తూర్పు చివర ఉన్న జలప్రవాహాన్ని పడమటి కొసన ఉన్న మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న శ్రీరామ్‌సాగర్‌కు నడిపించడం భౌగోళిక అద్భుతం. ‘తెలంగాణ’ ఈ అద్భుతాన్ని సాధించే దిశగా పయనిస్తోంది!
జన సమృద్ధి పెరిగినంతగా జల సమృద్ధి పెరగకపోవడానికి ప్రధాన కారణం అటవీ హననం. వర్ష మేఘాలను ఆకర్షించగల అడవులు అదృశ్యమైపోవడం, వర్షగతిని నిరోధించి, దిశను నియంత్రించి సమీప స్థలంలో కురిపించగల వృక్ష సహిత పర్వతాలు రాళ్లగుట్టలుగా మారడం, ఈ రాళ్లను సైతం పిండికొట్టేసి తరలిస్తుండడం ‘జల దారిద్య్రానికి’ ప్రధాన కారణం! జానపదులు చెప్పుకునే కథ ఒకటి ఉంది. కథలు చారిత్రక ఘటనలు కావచ్చు, కమనీయ కల్పనలు కావచ్చు, ఇది ప్రధానం కాదు. ఈ కథల వల్ల లభించే ప్రేరణ, కథలలో ధ్వనించే జీవన వాస్తవాలు ప్రధానం! ఈ జానపద గాథ కైలాసంలో ‘పాల’కు కొరత ఏర్పడడంతో మొదలైంది. గణపతి, కుమారస్వామి చిన్న పిల్లలు.. పాలకోసం పట్టుపట్టారు, గట్టిగా ఏడ్చారట! వాళ్లమ్మ పార్వతీదేవి పంచపాత్ర తీసుకొని ‘వైకుంఠానికి’ వెళ్లింది. ‘పంచె పాత్రడు కాకపోతే ఒక బిందెడు పట్టుకొని వెళ్లండి వదిన గారూ..’ అని మహాలక్ష్మి అనునయించిందట! ‘మా పుట్టింటి నుంచి ప్రతి దినం గంగాళాలతో పాలు వస్తున్నాయి’ అని కూడ పుట్టింటి గొప్పను విష్ణుదేవుని భార్య ప్రస్తావించిందట! శివుని అర్ధాంగికి కోపం వచ్చిందట! ‘తన పుట్టిల్లు హిమాలయం, మంచు మయం’ అన్నది పార్వతీదేవికి కలిగిన స్ఫురణ. లక్ష్మీదేవి తన- ‘పాల సముద్రం’- పుట్టింటి గొప్పను చాటి ‘నన్ను ఎగతాళి చేసింది..’ అన్న భ్రాంతి స్ఫురించిన పార్వతీమాత పాలు పుచ్చుకోకుండానే తిరిగి వెళ్లిపోయింది. కైలాసంలో శివుని తలపైన ఉన్న గంగమ్మకు కోపం వచ్చిందట. ‘వైకుంఠంలో పాలు ఉండవచ్చు, నీరు ఉండదు..’అని గంగాదేవి నిర్దేశించింది. దాంతో చుక్కనీరు లేని ‘వైకుంఠం’లో అందరూ నీటితో చేయవలసిన పనులన్నీ పాలతో చేయడం మొదలుపెట్టారట! విష్ణుదేవుడు అనేక రోజులు పాలతో స్నానం చేశాడు. శివుడు విష్ణుదేవుని భక్తుడు, విష్ణుదేవుడు పరమశివుని భక్తుడు. విష్ణువు శివలింగాన్ని రోజూ పాలతో మాత్రమే అభిషేకించాడు, ‘శుద్ధ ఉదక’స్నానం లేదు! కొన్నాళ్లకు విష్ణుదేవుని శరీరమంతా చీమలు, శివలింగంపై కూడ చీమలు బారులు తీరాయి. నీరు లేదు! చివరికి లక్ష్మీనారాయణులు కైలాసానికి కదలివెళ్లారు! అక్కడ శివుని శరీరంపై నుంచి చీమలను దులుపుతుండిన ఉమాదేవి వారికి దర్శనమిచ్చింది. విష్ణుదేవుడు, శివుడే విష్ణువు.. ‘‘శివాయ విష్ణురూపాయ, శివ రూపాయ విష్ణవే!’ అన్నది సనాతన సమారాధన. విష్ణువు శరీరం మీది చీమలు శివుని శరీరం మీద కూడ కన్పించాయట! రాజీ కుదిరింది. కథ కంచికిపోయింది. కానీ వైకుంఠంలో అవిరళ అమలిన జల ప్రవాహం మళ్లీ పరుగులు తీసింది! ఆమె గంగ, విష్ణుదేవుని దుహిత! ఆ గంగ పర్వతాల మీదికి దూకుతోంది, శివుని తలపైకి దూకుతోంది. ఈ నీరు జాతికి జీవం, ప్రజలకు ప్రాణం! అందుకే పర్వతశ్రేణులు వక్షస్థలమైన భూమి ప్రజలకు తల్లి అయింది. ఆమె వక్షస్థలం ‘పయస్సు’ను ప్రసరిస్తోంది. ‘పయస్సు’ నీరు, ‘పయస్సు’ పాలు!
ఇలాంటి జీవజలం పుష్కలంగా లభించడం సమృద్ధి. నీటికొరత నిజమైన దారిద్య్రం! మన దేశంలో నీటికొరతకు కారణం కాలుష్యం. కాలుష్యం కేంద్రీకృతం అవుతుండడం నడుస్తున్న చరిత్ర. అవిరళ- ఎడతెగని- ప్రవాహం, అమలిన- స్వచ్ఛమైన- ప్రవాహం నేల నలుచెఱగులా పరుగుతీసిన చరిత్ర మనది. ప్రతి పల్లె సమీపంలోను, గిరిజన ఆవాసాల సమీపంలోను ఏరులు ప్రవహించిన చరిత్ర ఉంది. ‘ఎప్పుడు ఎడతెగ పారు ఏరు..’ ఉన్నచోటనే, అలాంటి ఊరిలోనే జీవించాలన్న జీవన సంస్కారం మనది. బ్రిటన్ దురాక్రమణ నడికొన్న తరువాత క్రమంగా ఈ ‘నీటి సమృద్ధి’ని కాలుష్యం కాటువేయడం మొదలైంది. ‘ప్రపంచీకరణ మొదలైన తరువాత కొండవాగులు, సెలఏరులు, నీటి వాగులు, ఊట కాలువలు, బుగ్గలు, చెలమలు, దొనలు, చెరువులు, కొలనులు మొత్తం ఎండిపోయాయి. విష రసాయనాల ఎఱువుల ‘సారం’ ఇంకిన భూగర్భం కాలుష్యంతో కమిలిపోతోంది. భూగర్భ జలం ఇంకిపోయింది! పెద్దనదుల నుంచి దూరదూర ప్రాంతాలకు నీటిని తరలించవలసి వస్తోంది. కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం పరిఢవిల్లిన కాలంలో తెలుగునేలపై వేల చెరువులు, కుంటలు జలకళతో జనాన్ని పోషించాయి. ఆ చెరువులు అన్నీ గోదావరీ, కృష్ణా, పినాకినీ, తుంగభద్ర, ముచికుంద, ప్రాణహిత వంటి నదులతో నిండలేదు, కొండవాగులు, సెలఏళ్లు వాటిని నీటితో నింపాయి. వేల సంఖ్యలోని ఈ చిన్న ఏరులు, లఘుసరితలు క్రమంగా ఎందుకని ఎండిపోయాయి! ఉదాహరణకు తెలంగాణలోని వేల చెరువులు ఎక్కడికక్కడ ‘స్వయం సమృద్ధ జలరాశులు’గా కొనసాగి ఉండినట్టయితే ఇప్పుడు గోదావరి నది నుంచి నీటిని తరలించుకొని వచ్చి ఈ చెరువులను నింపవలసిన అనివార్యం ఏర్పడి ఉండేది కాదు. ఇది ఉదాహరణ మాత్రమే! దేశమంతటా ఇదే తీరు! తీయటి నీటి చిరుప్రవాహాలు లక్షల ఏరులు ఎంటిపోయి ఉన్నాయి!
ఇలా నేల నలుచెరగులా ప్రవహించిన చిన్న చిన్న నదులు- ఏరులు, వాగు లు- ఎండిపోవడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం ఇంతగా శ్రమించవలసి వస్తోంది. గోదావరి జలాలను మళ్లించి రాష్టమ్రంతటా కొత్తగా చిన్న చిన్న నదులను-ప్రధానమైన కాలువలను, పంట కాలువలను- నిర్మించవలసి వస్తోంది. నంది మేడారం వద్ద నిర్మించిన ‘ఉత్తుంగ తరంగిణి’- సర్జ్‌పూల్-లోకి నీటిని పధ్నాలుగు కిలోమీటర్ల మేర ‘యల్లంపల్లి’ జలాశయం నుంచి నడిపించడం ఒక అద్భుతం. భూతల జలవాహినిగా, భూగర్భ జల వాహినిగా- గొట్టాల ద్వారా- ఈ నీటిని ‘సర్జ్‌పూల్’కు నడిపించారు. ‘సర్జ్‌పూల్’నుంచి నూట ఐదు మీటర్ల ఎత్తున ఉన్న ‘జల వలయం’లోకి నీటిని ఎత్తిపోయడం మరింత గొప్ప అద్భుతం! ఇలా పెద్ద నదుల నీరు దేశమంతటా పంపిణీ చేయడం నీటి అనుసంధానం! కానీ ఇంకిపోయిన, ఎండిపోయిన లక్షల ‘చిన్న నదులు’ మళ్లీ ప్రవహించే కాలం రావాలి! అలా ఈ ఏరులు పునర్ జలవంతం అయినప్పుడే సహజ సమృద్ధి..!!