సంపాదకీయం

‘ఖరీదైన’ వినోదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎంత మంచి సినిమా అయినా వసూళ్లు ప్రధానంగా విడుదలైన తర్వాత నాలుగు రోజులే ఉంటాయి.. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకు నష్టం జరుగుతోంది.. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టిక్కెట్ ధరలు పెంచక తప్పదు..’ అని ఓ ప్రముఖ సినీ నిర్మాత కొత్త భాష్యం చెప్పాడు. ఓ అగ్రహీరో చిత్రం విడుదలైన నేపథ్యంలో తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ రేట్లు ఆకస్మికంగా పెరగడంతో సామాన్య ప్రేక్షకులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రాలు విడుదలైన ప్రతిసారీ టిక్కెట్ రేట్లను అమాంతం పెంచేసి, ‘అందినంత దండుకోవడం’ పరిపాటిగా మారింది. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోనే టిక్కెట్ రేట్లు పెంచామని, ఈ పెంపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తుందని నిర్మాతల మండలి చెబుతోంది. సింగిల్ థియేటర్లలో టిక్కెట్ ధర 80 నుంచి 110 రూపాయల వరకూ, మల్టీప్లెక్స్‌లలో 130 నుంచి 200 రూపాయల వరకూ పెంచినట్టు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇలా ఉండగా ‘ఆన్‌లైన్’లో టిక్కెట్లు బుక్ చేసుకొనే వారికి ‘ఇంటర్నెట్’ చార్జీలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. కాగా, టిక్కెట్ల రేట్ల పెంపువిషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించాయని, ధరలు పెంచేముందు తమను సంప్రదించడం గానీ, అనుమతి కోరడం గానీ జరగలేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. టిక్కెట్ ధరలపై థియేటర్ల యాజమాన్యాలు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు సగటు ప్రేక్షకులను అయోమయంలో పడవేశాయి. అన్ని అనుమతులు ఉన్నాయని యాజమాన్యాలు, ఎలాంటి అనుమతి లేదని అమాత్యుడు చెబుతుండడాన్ని చూస్తుంటే- టిక్కెట్ ధరల పెంపుపై నిర్దిష్ట విధానం లేదన్న విషయం బోధపడుతుంది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించినంత మాత్రాన టిక్కెట్ ధరలు భారీగానే పెంచేస్తామనడం సహేతుకమా? పెద్ద సినిమాలకు నాలుగు రోజుల తర్వాత వసూళ్లు ఉండవంటే- ముందుగానే ప్రేక్షకులను నిలువుదోపిడీ చేయాలా? ‘పైరసీ’ వల్ల తమకు నష్టం జరుగుతోందని నిర్మాతలు గగ్గోలు పెడుతుంటే- ‘పైరసీ నిరోధక చట్టం’ నీరుకారిపోవడానికి ప్రభుత్వం చెప్పే సమాధానమేమిటి..?
తెలుగు రాష్ట్రాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు సినిమాలే ప్రధాన వినోదం. రోజంతా కష్టపడి సాయంత్రానికి కాస్త కాలక్షేపం చేద్దామని సగటు జీవులు సినిమాకు వెళితే జేబు గుల్ల కావడం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. టిక్కెట్ ధరలపై ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించడంతో సినిమాకు వెళ్లాలంటేనే జనం హడలెత్తే రోజులు దాపురించాయి. వేసవి సెలవుల్లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావడం, టిక్కెట్ రేట్లు ఒక్కసారి పెంచేయడం చూస్తుంటే- ‘డిమాండ్ ఉన్నపుడే ఇష్టారాజ్యంగా దోచేయాలి..’ అన్న నవీన ఆర్థిక వ్యూహం కనిపిస్తోంది. సెలవుల్లో కచ్చితంగా సినిమాలకు జనం ఎగబడతారని తెలిసే ‘రేట్ల పెంపు వ్యవహారం’ ఏళ్ల తరబడి నిరాటంకంగా సాగుతోంది. థియేటర్లలో ఇంతకాలం తినుబండారాల విషయంలో దోపిడీకి గురవుతూ వస్తున్నామని, ఇపుడు టిక్కెట్ ధరలు కూడా అనూహ్యంగా పెరగడంతో సినిమాకు వెళ్లే పరిస్థితి ఉండదని పేద, మధ్య తరగతి జనం వాపోకతప్పడం లేదు. వేసవి సెలవుల్లో పిల్లాపాపలతో సరదాగా గడుపుదామని సినిమాకు వెళితే భారీగా ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. నలుగురు సభ్యులున్న కుటుంబం మల్టీపెక్స్‌లో సినిమాకు వెళితే.. టిక్కెట్లకు కనీసం 800 రూపాయలు, తినుబండారాలకు ఎంతలేదన్నా 300-400 రూపాయల వరకూ ‘వదిలించుకోవడం’ ఖాయం. టిక్కెట్ ధరలు పెంచకపోతే తాము ‘మునిగిపోతామంటూ’ ఆవేదన చెందే ‘స్టార్ ప్రొడ్యూసర్లు’ థియేటర్లలో కనీస సౌకర్యాల గురించి కాని, అక్కడ జరిగే దోపిడీ గురించి కానీ ఏనాడూ పెదవి విప్పరు. ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చుకొనే వాటర్ బాటిళ్లను, తినుబండారాలను థియేటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. తినడానికో, తాగడానికో ఏది కావాలన్నా థియేటర్లలోని క్యాంటీన్లలో అధిక ధరలకు కొనాల్సిందే. కొనేవాళ్లు ఉన్నపుడు, నిలదీసేవాళ్లు లేనపుడు ఈ ‘్ధరల బీభత్సం’ ఇలా యథేచ్ఛగానే సాగుతుంది. సాధారణ థియేటర్లు, మల్టీపెక్స్‌లలో వంద శాతం, రెండు వందల శాతం మేరకు ధరలు పెంచేసి వాటర్ బాటిళ్లు, సాఫ్ట్‌డ్రింక్‌లు, తినుబండారాలు విక్రయిస్తున్నా ఈ దోపిడీని నియంత్రించే నాథుడే లేడు. వాటర్ బాటిల్ 50 రూపాయలకు, చిప్స్ ప్యాకెట్ 50-70 రూపాయలకు, సాఫ్ట్‌డ్రింక్ 80 రూపాయలకు, పఫ్ 40 రూపాయలకు, పాప్‌కార్న్ 110 రూపాయలకు అమ్ముతున్నారు. థియేటర్ల క్యాంటీన్లలో ఈ దోపిడీని ఎంత మాత్రం సహించేది లేదని అధికారులు ఏడాదికోసారి మొక్కుబడిగా దాడులు చేయడం మరింత ‘వినోదం’ కలిగించే వ్యవహారం. అధికారుల తాటాకు చప్పుళ్లకు భయపడే థియేటర్ల యాజమాన్యాలు ఎక్కడా లేవన్నది బహిరంగ రహస్యం! హైదరాబాద్‌లోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో ఆ మధ్య కొంతమంది అధికారులు తూతూ మంత్రం తనిఖీలు చేసి స్వల్పంగా జరిమానాలు వడ్డించినా మర్నాడు పరిస్థితి షరా‘మామూలే’! ఓ వైపు సామాన్యుడి గగ్గోలు.. మరోవైపు దోపిడీల ‘షో’లు.. థియేటర్లలో సమాంతరంగా సాగిపోతుంటాయి.
టిక్కెట్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేవరకూ- థియేటర్ల యాజమాన్యాలు రేట్లను పెంచుకోవచ్చని గత ఏడాది జనవరి 3వ తేదీన ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. టిక్కెట్ ధరలను నిర్ణయించేందుకు శాస్ర్తియ పద్ధతుల్లో మార్గదర్శకాలను రూపొందించాలని 2017లో హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలకు రెండు ప్రభుత్వాలూ స్పందించకపోవడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ధరలను నిర్ణయించేందుకు కమిటీలను ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించేవరకూ రేట్లు పెంచుకోవచ్చునన్న కోర్టు ఉత్తర్వులు థియేటర్ యాజమాన్యాలకు వరంలా పరిణమించాయి. కమిటీలు వేయడానికి, ఆ కమిటీలు చేసిన సిఫార్సులను పరిశీలించడానికి ప్రభుత్వాలకు తీరిక లేకపోవడంతో సగటు ప్రేక్షకులు బలవుతున్నారు. సంక్రాంతి సీజన్ వచ్చినా, భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైనా తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు పెరగడం ఖాయమన్న సంగతి ప్రేక్షకులకూ తెలుసు. ‘సందర్భోచితం’గా ధరలు పెంచడం తమ సహజ లక్షణమని యాజమాన్యాలు చాటుకొంటున్నాయి. అవకాశాన్ని ‘క్యాష్’ చేసుకోవడానికి వారు బరితెగించడంతో బలైపోవడం ప్రేక్షకుల వంతయ్యింది.
న్యాయస్థానం అనుమతితోనే ధరలు పెంచామని సినీవర్గాలు చెబుతుంటే- ప్రజలపై భారం పడేలా రేట్లను పెంచడం సరికాదని తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్ సానుభూతి వాక్యాలు వల్లె వేశారు. సామాన్యుడికి సైతం వినోదం కావాల్సిందేనని ఆయన చెబుతున్నా, అధిక రేట్లను అరికట్టేందుకు ఇంతవరకూ ప్రభుత్వం ఏం చేసిందన్నది ప్రశ్నార్థకం. థియేటర్ల యాజమాన్యాలపై కోర్టుకు వెళతామని ఆయన చెప్పడంతో ఈ వివాదం మరింత జటిలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టిక్కెట్ ధరలను పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇలా పెంచేందుకు తామెక్కడా అనుమతి ఇవ్వలేదని మంత్రి చెబుతుండగా యాజమాన్యాలు ‘చాపకింద నీరు’లా తాము అనుకున్నది సాధించాయి. ‘టిక్కెట్ ధరల పెంపుఅనేది ప్రభుత్వ పరిధిలోని అంశం.. మేమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు..’ అని మంత్రివర్యుడు చెప్పడాన్ని చూస్తుంటే- యాజమాన్యాలపై సర్కారు వారికి అజమాయిషీ లేదనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో 79 థియేటర్లలో ఆకస్మికంగా టిక్కెట్ ధరలు పెంచారని తెలిశాక- ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పిన అమాత్యుడు సినీవర్గాలతో చర్చలు జరిపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ‘కోర్టు అనుమతి’తో రేట్లు పెంచేశారు గనుక ఈ వివాదం అక్కడే పరిష్కారం కావాలి. అంతవరకూ ప్రేక్షకులు ‘ఖరీదైన’ వినోదం చూడాల్సిందే!