సంపాదకీయం

‘నక్క’.. ‘తోడేలు’..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధిపత్యం కోసం కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం లేదా పరోక్ష యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారుతుండడం అంతర్జాతీయ వర్తమాన వైపరీత్యం. చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా ప్రభుత్వం భారీగా సుంకాలను పెంచడం ప్రచ్ఛన్న యుద్ధం- కోల్డ్‌వార్- ప్రత్యక్ష యుద్ధంగా మారుతుండడానికి నేపథ్యం. ప్రతీకార చర్యకు పూనుకున్న చైనా ప్రభుత్వం అమెరికా నుంచి తమ దేశానికి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల పైన ఇతర సామగ్రి పైనా భారీగా సుంకాలను విధించింది. ఫలితంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు చైనాలో గిరాకీ మరింతగా తగ్గే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం చర్యలను అమెరికాలోని ఉత్పత్తిదారులు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తిదారులు నిరసించే దుస్థితి ఏర్పడింది. అందువల్ల వచ్చే ఏడాది చివర జరుగనున్న అమెరికా అధ్యక్షుని ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతాడని- ఓడిపోవాలని- చైనా భావిస్తోందట. ట్రంప్ ‘రిపబ్లికన్ పార్టీ’ అధినేత. ట్రంపు ఓడినట్టయితే ప్రత్యర్థి ‘డెమొక్రాటిక్ పార్టీ’కి చెందిన ‘అధ్యక్షుని’తో వాణిజ్యపు ఒప్పందం కుదుర్చుకోవడం సులభమని చైనా భావిస్తోందట. అందువల్ల సుంకాల పెంపు గురించి తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోరాదన్నది ప్రస్తుతం చైనా విధానం. 2021 జనవరి తరువాత కొత్త అధ్యక్షునితో చర్చలు జరుపడం చైనా ఆకాంక్ష. కానీ ఈ ఆకాంక్ష కేవలం ‘పగటి కల’ అన్నది ట్రంప్ నిర్ధారణ. 2020 నవంబర్‌లో జరిగే ఎన్నికలలో తాను రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయమని ట్రంప్ ధీమాతో ఉన్నాడట. అందువల్లనే ఉభయ దేశాల మధ్య రెండు రోజులు జరిగిన వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. జూన్‌లో జపాన్‌లో జరిగే ఇరవై ప్రముఖ దేశాల- గ్రూప్ ట్వంటీ- కూటమి ప్రభుత్వ అధినేతల సమావేశం సందర్భంగా ట్రంపు చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్‌తో ఈ వాణిజ్య వైరుధ్యం గురించి చర్చలు జరుపుతాడట. ఆ సమావేశంలో తప్పకుండా ఉభయ దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందన్నది అమెరికా ప్రభుత్వ విశ్వాసం. ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకొనకపోతే 2021లో మొదలయ్యే తన ద్వితీయ పదవీ కాలంలో కుదిరే ఒప్పందం చైనాకు మరింత వ్యతిరేకంగా ఉండగలదన్నది అమెరికా అధ్యక్షుని హుంకరింపు.... ‘‘అసలు నీవు మళ్లీ గెలిస్తే కదా!’’ అన్నది చైనావారి ‘అహంకరింపు’. అమెరికాది ‘గుంటనక్క’ నీతి.. చైనాది ‘తోడేలు’ రీతి!
బుకాయిస్తుండడం మాత్రం ఇద్దరీ సమాన ‘ఖ్యాతి’. ఎందుకంటె అమెరికా విధించిన కొత్త సుంకాల వల్ల లేదా ‘దండుగల’- ప్యునిటల్ టాక్సెస్- వల్ల చైనాలోని అనేక వాణిజ్య సంస్థలు ప్రధానంగా ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థలు దివాలా తీస్తాయని ప్రచారం జరుగుతోంది. చైనా వాణిజ్య దురాక్రమణ కారణంగా ఇదివరకే దివాలా తీసిన, నష్టాలను భరించలేక ‘దుకాణం’ మూసివేసిన అమెరికా ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ‘ఉద్ధరించడం’ పేరుతో మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలో ‘వాణిజ్యపు’ వలసలను ఏర్పాటుచేయడానికి బయలుదేరాయి. మన దేశంలో కూడ పెట్టుబడులు పెట్టడానికై వందకు పైగా అమెరికా వాణిజ్య సంస్థల యాజమాన్యాల వారు ప్రస్తుతం ‘అనే్వషణ’ యాత్రలు సాగిస్తున్నారట. అయినప్పటికీ అమెరికా, చైనాలు ‘ఇసుక తక్కెడ’- ‘పేడ తక్కెడ’వలె తమను తామేకాక ప్రపంచాన్ని బుకాయిస్తున్నాయి. తమ వాణిజ్య సంస్థల డొల్లతనాన్ని బయట పడనీయరాదన్నది ఈ బుకాయింపు. అమెరికా సంస్థలు దివాలా తీశాయి. చైనా సంస్థలు చైనా ప్రభుత్వం భారీగా కల్పిస్తున్న రాయితీలు రద్దయిన తక్షణం దివాలా తీస్తాయి. ‘ప్రపంచీకరణ’ మాయాజాలం ‘బుకాయింపు’లను కొనసాగనిస్తోంది. ఇద్దరు మనుషులు పరస్పరం ఎదురుపడ్డారు. పొడవైన చెఱువుగట్టుకు మధ్యలో వారు పరస్పరం తారసపడ్డాడు. మొదటివాని పేరు ‘గోముఖుడు’- అట! రెండవవాడు ‘పయోముఖుడు’- అట!! పరస్పరం పలుకరించుకున్నారట! ‘‘నీ చద్దిమూటలో ఏముంది?’’ అని ప్రశ్నించాడు ‘పయోఖుడు’. ‘‘పులిహోర’’-అన్నది గోముఖుని సమాధానం. ‘‘నీ చద్దిమూటలో ఏముందో మరి...?’’ ‘‘వంకాయ కూర, జొన్న రొట్టెలు’’-అన్నది పయోముఖుని జవాబు. ‘‘మా ఇంటిలో పులిహోర ప్రతిరోజు తిని తిని వెగటు పుడుతోంది.... మీ రొట్టెలు నాకివ్వండి నా పులిహోర మీరు తీసుకోండి...’’అని ప్రతిపాదించాడు గోముఖుడు! అయిష్టంగా ఒప్పుకున్నట్టు నటించాడు పయోముఖుడు! చద్దిమూటలు మార్చుకున్నారు. వ్యతిరేక దిశలలో వెళ్లిపోయారు. ఇవతలి గట్టుకు చేరిన పయోముఖుడు నీటివద్దకు వెళ్లి ‘పులిహోర’ను ఆరగించాలన్న ‘ఆబ’తో మూటను విప్పాడు. అందులో ‘పులిహోర’ లేదు. ‘ఇసుక’ఉంది. ‘‘ఎంత మోసం! హారినీ! ఇసుకతక్కెడ గాడివి...!’’అని అరిచాడట పయోముఖుడు! చెఱువు అవతలిగట్టుకు చేరిన గోముఖుడు వంకాయ కూరతో జొన్న రొట్టెలను ఆవురావురుమని ఆరగించడానికై మూటను విప్పాడు. అందులో పెద్ద పేడముద్ద మాత్రమే ఉంది.‘‘దగా! వంచన!! ఓరి పేడతక్కెడగా?!’’అని ఆక్రోశించాడట గోముఖుడు.. ‘ప్రపంచీకరణ’ వాణిజ్య ప్రముఖులు ఇప్పుడిలాగే వాపోతున్నారు.. ఒకవైపున అమెరికా గోముఖ వ్యాఘ్రం, మరోవైపున చైనా పయోముఖ విషకుంభం....!
చైనా ప్రభుత్వం ఆర్థికపరమైన రాయితీలను ఇస్తుండడం వల్ల చైనాలో తయారవుతున్న వస్తువుల ఉత్పాదక వ్యయం ఇతర దేశాలలోని ఉత్పాదక వ్యయం కంటె తక్కువ. అందువల్ల చైనా వస్తువుల ధరలు అంతర్జాతీయ విపణిలో ‘కారుచౌక’.. ఇలా ఆర్థిక రాయితీలను ఇవ్వడం ‘ప్రపంచీకరణ’ సూత్రాలకు, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’నియమాలకు విరుద్ధం. అందువల్ల అన్ని దేశాలలోను ఆర్థికపరమైన రాయితీలు- సబ్సిడీస్- రద్దుకావాలన్నది ‘ప్రపంచీకరణ’వౌలిక సూత్రం! కానీ ఈ సూత్రాన్ని మన దేశం వంటి ప్రవర్థమాన దేశాలు మాత్రమే పాటించాలన్నది సంపన్న దేశాల ఆకాంక్ష. అమెరికాలోను, చైనాలో, ఐరోపా దేశాలలోను ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- డబ్ల్యూటీవో- నియమాలకు విరుద్ధంగా రకరకాల రాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ‘రాయితీ’లు కావన్నది ఈ దేశాల బుకాయింపు. వాటిని ఇతరేతరమైన పేర్లతో పిలవడం ‘బుకాయింపు.’ చైనా ప్రభుత్వం వారు వారి దేశంలో ‘రాయితీల’ను ఎత్తివేయాలని అమెరికా కోరుతోంది, ‘‘లేని రాయితీల’’ను ఎలా ఎత్తివేయడం అన్నది చైనా బుకాయింపు! ‘‘మీ దేశంలోని వ్యవసాయ రంగంలోని రాయితీలను ఎత్తివేయండి...’’అని చైనా అమెరికాను నిలదీస్తోంది! ‘‘మా దేశంలో రాయితీలను ప్రభుత్వం ఇవ్వడమే లేదు’’అన్నది అమెరికా బుకాయింపు. అందువల్లనే ఈ ‘ఇసుక తక్కెడ- పేడ తక్కెడల’ బుకాయింపువల్ల ఉభయ దేశాల మధ్య ‘వాణిజ్య ప్రచ్ఛన్న’-యుద్ధం మొదలైంది. అది ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో అనేక ఏళ్లుగా చైనాది పైచేయి. చైనాకు అమెరికా నుంచి 2018లో పనె్నండు లక్షల యాబయి మూడు కోట్ల రూపాయల వస్తుసామగ్రి సేవలు ఎగుమతి అయ్యాయి. చైనానుండి అమెరికాకు ముప్పయి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తుసామగ్రి సేవలు ఎగుమతి అయ్యాయి. ఇలా ‘అమెరికా-చైనా’ల ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాకు సాలీనా సగటున ఇరవై ఆరున్నర లక్షల కోట్ల రూపాయల లోటు ఏర్పడుతోంది. ఇదీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చైనా వస్తువుల దిగుమతిపై సుంకాలను భారీగా- పదినుంచి ఇరవై శాతం వరకు పెంచడానికి నేపథ్యం. చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వాటిపై దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కొత్త సుంకాలను విధించిందట. అందువల్ల అమెరికా ‘లోటు’ మరింత విస్తరించవచ్చు...
తోడేళ్లూ గుంటనక్కలూ
తలపడి పోరిన వేళ...
ధర్మాత్ములు ఎవరన్నది
దగుల్బాజీ ప్రశ్నన్నా!
‘డ్రాగను’, ‘అంకులు శాము’ల
సంకుల సమరంలోన
నైతిక నిష్ఠను వెదకుట
మతిమాలిన పని చిన్నా!
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రష్యాల మధ్య 1990వరకు ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. అది రాజకీయం. ఎవరిమీద ఎవరు కూడ ఆయుధ ప్రయోగం చేయలేదు. ఇతర దేశాలు బలి పశువులు! అందుకే అది ప్రచ్ఛన్నయుద్ధం. ఇప్పుడు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఇది ప్రత్యక్షం.. ఎవరు గెలుస్తారన్నది అంతర్జాతీయ ఉత్కంఠ!