సంపాదకీయం

ఎండమావి ‘నీరు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పాటు చేయదలచిన ‘సమాఖ్య కూటమి’ ప్రభుత్వం ‘మరీచికలో మధుర జలం’ వంటిది కాదు. ఎందుకంటె మరీచిక- ఎండమావి-లో మధుర జలాన్ని- తీయని నీటిని- అనే్వషించే వారికి ‘నీరు కన్పించడం’ సహజం. అది చివరికి భ్రాంతిగా మిగిలిపోతుంది. అయినప్పటికీ వెదకుతున్నంత సేపుఎండమావిలో ‘లేని నీరు’ ఉన్నట్టుగానే వెదికేవారిని ఊరించడం సహజం. కాని భ్రాంతికి గురి అయి ఉన్నవారికి సైతం ప్రస్తుత రాజకీయపు ‘ఎండమావి’లో సమాఖ్య కూటమి అన్న ‘నీరు’ కనిపించడం లేదు. అందువల్ల ‘సమాఖ్య కూటమి ప్రభుత్వం’ ఎండమావిలోని నీరు కాదు! ఆ ‘లేని నీరు’ ఉన్నట్టుగా కొంతసేపైనా భ్రాంతి కలుగుతుంది. ఈ ఏర్పడని కూటమి ఉన్నట్టుగా అలాంటి భ్రాంతి కూడ కలుగడం లేదు. చంద్రశేఖరరావు ఏర్పాటు చేయతలపెట్టిన ‘సమాఖ్య కూటమి ప్రభుత్వం’ గగన కుసుమం- ఎవ్వరూ పోలేని, కాకులు దూరని కారడవి మధ్యలో వికసించిన పూవు-కూడ కాజాలదు. ఎందుకంటె ఆ అడవి పూవులభించడం అసాధ్యం అయినప్పటికీ ‘పూవు’మాత్రం ఉంది. ఈ తథాకథిత ‘సమాఖ్య కూటమి ప్రభుత్వం’ ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండదు! అందువల్ల తథాకథిత - సోకాల్డ్- సమాఖ్య కూటమి ప్రభుత్వాన్ని ‘గగన కుసుమం’తో పోల్చడం కూడ సరికాదు. సువిశాలంగా విస్తరించిన ‘శూన్యమైన’ ఆకాశంలోని ‘పువ్వు’ను పొందడం నిచ్చెన వేయడం వంటిది. జాతీయ స్థాయిలో ‘సమాఖ్య కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రశేఖరరావు చేస్తున్న బృహత్ ప్రయత్నం! ‘భారతీయ జనతాపార్టీ పరాజయం తరువాత’ ఏర్పడనున్న ‘కాంగ్రెస్ రహిత’ సమాఖ్య కూటమిలో తాము చేరగలమని కల్వకుంట్ల వారికి కచ్చితంగా హామీనిచ్చిన ఇతర పక్షాలు ఏవి? ఇంతవరకు ధ్రువీకరణ జరగలేదు. ఈ తథాకథిత సమాఖ్య కూటమిలో ఇంతవరకూ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ మాత్రమే చేరి ఉంది! కేరళ ముఖ్యమంత్రితో చంద్రశేఖరరావు జరిపిన చర్చలు ఫలించాయి. కానీ ‘భాజపా’ ఓడిపోతుందని, కాంగ్రెస్ గెలవదని మాత్రమే పినరాయ్ విజయన్ జోస్యం చెప్పాడు. ఈ స్థితిలో ‘ప్రాంతీయ పక్షాల పాత్ర కీలకమైనది, ప్రాధాన్యవంతమైనది’అని మాత్రమే ఆయన చెప్పాడు. భాజపాకు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘రాజకీయ సూత్రం’ ఒకటి అల్లికకు గురి అవుతోందని మాత్రమే ఆయన వ్యాఖ్యానించాడు. తమ పార్టీ కాని వామపక్షాలు కాని ‘సమాఖ్య కూటమి’లో చేరుతున్నట్టు మాత్రం ఆయన ధ్రువీకరించిన సమాచారం లేదు.. వ్యాఖ్యానించాడు, విశే్లషించాడు!!
అందువల్ల చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయతలపెట్టిన సమాఖ్య కూటమి ప్రభుత్వం గగన కుసుమం- ఆకాశంలోని పువ్వు. దాన్ని సాధించడానికై ఆయన చేస్తున్న ప్రయత్నం ఆకాశానికి నిచ్చెన! చంద్రశేఖరరావు వంటి పరిణత రాజకీయవేత్త ఇలాంటి ‘నిచ్చెనలు’ వేయడమే విచిత్రం. దేశంలో ఆషామాషీ రాజకీయవేత్తలు, అభినయ రాజకీయవేత్తలు, రాజకీయ విదూషకులు ఉన్నారు. అలాంటి వారు ఎలా నోళ్లు పారేసుకున్నప్పటికీ, ఎలా వ్యవహరించినప్పటికీ జనం పట్టించుకోరు. కానీ చంద్రశేఖరరావు జనం పట్టించుకుంటున్న ప్రామాణిక రాజకీయవేత్త! ఆయన రాజకీయ జీవన ప్రస్థానం విశ్వాసానికి ప్రతీక, విజయానికి పతాక! ఉద్యమించవలసిన సమయంలో ఉద్యమించాడు, వ్యూహాత్మకంగా సంఘర్షణను సాగించవలసిన సమయంలో వ్యూహాత్మకంగా సంఘర్షణ సాగించాడు. ఈ ఉద్యమం, వ్యూహం తెలంగాణ రాష్ట్రంగా రూపుదాల్చడం చరిత్ర. ప్రజలు ఆయనను పట్టించుకున్నారు కనుకనే ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల ఆయన చేస్తున్న ఈ ‘సమాఖ్య కూటమి’ ప్రయత్నం ఆయన రాజకీయ వివేచనకు అపవాదం, ఆయన రాజకీయ పరిణతికి విరుద్ధం. ‘నేల విడిచి సాము చేయడం’ అన్న జీవసూక్తికి చంద్రశేఖరరావు చేస్తున్న ఈ ‘భాజపా’ వ్యతిరేక, కాంగ్రెస్ రహిత కూటమి ఏర్పాటుప్రయత్నం గొప్ప రాజకీయ ఉదాహరణం. ‘విచక్షణ’ను ఆవహించిన మహాభ్రాంతికి నిదర్శనం!
తమిళనాడులో ‘ద్రవిడ మునే్నత్ర కడగం’- ద్రముక- నాయకత్వంలోని కూటమిలో కాంగ్రెస్ ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఐక్యప్రగతి కూటమి’లో ‘ద్రముక’ ఉంది. లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మొదట ప్రతిపాదించిన ఘనత ‘ద్రముక’ అధినేత ఎమ్‌కె స్టాలిన్‌ది. కాంగ్రెస్ వంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మహాసంస్థకు రాహుల్ వంటి ఆషామాషీ వ్యవహర్త అధ్యక్షుడు కావడమే విచిత్రం. ఆయన ఎప్పుడు దేశంలో ఉంటాడో ఎప్పుడు విదేశాలకు ఉడాయించి విశ్రాంతి తీసుకుంటాడో ఊహించడం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సాధ్యం కాదు. బహుశా ఆయనకే సాధ్యం కాదు. మమతాబెనర్జీ కాని, మాయావతి కాని, ఇతర ప్రముఖ ప్రతిపక్ష నాయకులు కాని రాహుల్ గాంధీని లెక్కచేయడం లేదు. ఆయనకు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టాలని కోరడం లేదు. ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశాలలో రాహుల్ ప్రసంగించినప్పుడు ‘ఆయన ఏం చెప్పదలచుకున్నదీ మాకు బోధపడలేదు..’ అని కాంగ్రెస్ మిత్ర పక్షాలవారు వ్యాఖ్యానించడం చరిత్ర. ఈ చరిత్ర రాహుల్ ఆషామాషీ స్వభావానికి అద్దం. ఇలా అనేక మిత్రపక్షాల వారు పెద్దగా పట్టించుకోని ‘‘అపహాస్య స్వరూపుడైన’’ రాహుల్ ప్రధాని కావాలన్నది స్టాలిన్ పగటి కల, కమ్మటి స్వప్నం! రాహుల్ గాంధీకి ఇలా ఘన గౌరవం కట్టబెడుతున్న అద్వితీయ కాంగ్రెస్ మిత్రుడు స్టాలిన్! మరో కాంగ్రెస్ మిత్రపక్షం వారు ఇలా రాహుల్‌ను ప్రధాని పదవికి ప్రతిపాదించలేదు. ఇంతటి గొప్ప రాహుల్ భక్తుడైన స్టాలిన్ నాయకత్వంలోని ‘ద్రముక’ కాంగ్రెస్ రహిత, ‘భాజపా’వ్యతిరేక కూటమిలో చేరదుకాక చేరదు. దేశ ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఇది. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఇంకా బాగా తెలుసు. తెలిసి తెలిసి ‘ద్రముక’ అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపాలని చంద్రశేఖరరావు ఎందుకు తహతహలాడినట్టు! ‘ద్రముక’ కాంగ్రెస్‌తో జట్టుకట్టి తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసింది. అలాంటి ‘ద్రముక’ ఎన్నికలు అయిన వెంటనే కాంగ్రెస్‌ను వదలిపెట్టి తమ ‘ప్రాంతీయ పక్షాల- సమాఖ్య కూటమి’లో చేరగలదని చంద్రశేఖరరావు భావించడం అతార్కికం! ‘్భజపా’నాయకత్వంలోని కూటమికి, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి కలిపి రెండువందల డెబ్బయి రెండు కంటె తక్కువ స్థానాలు మాత్రమే రాగలవని భావించడం కూడ అసమంజసమైన ఆకాంక్ష! అలా ఈ రెండు కూటములకు కలిపినప్పటికీ- లోక్‌సభలో సంఖ్యాధిక్యం- మెజారిటీ- రానట్టయితేనే కదా మూడవది అయిన- ఈ ‘సమాఖ్య కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది. కేరళ, తమిళనాడు, కర్నాటక ప్రాంతాలలోని ధార్మిక క్షేత్రాలను ఆలయాలను సందర్శించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్లిరావడం రాజకీయాలతో నిమిత్తం లేని వ్యవహారం. కానీ చంద్రశేఖరరావు ఈ ధర్మయాత్రల సందర్భంగా రాజకీయాలను నిర్వహించడం మాత్రం అర్థం లేని వ్యవహారం. తీర్థయాత్రలను ఆయన స్వయంగా రాజకీయం చేసుకున్నాడు..! ‘‘మీరే కాంగ్రెస్ కూటమిలో చేరండి’’ అని చంద్రశేఖరరావును ‘ద్రముక’ అధినేత స్టాలిన్ పిలిచాడన్నది జరుగుతున్న ప్రచారం! చంద్రశేఖరరావు వ్యూహం బెడిసికొట్టినట్టు కాలేదా?
ప్రధాన పక్షాల భాగస్వామ్యం కానీ లేదా వాటి మద్దతుకాని లేకుండా ప్రాంతీయ పక్షాలు కాని ఇతర పక్షాలు కాని కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఇంతవరకు లేదు. అలా ప్రధాన రాజకీయ పక్షాల మద్దతుతో ఏర్పడిన ప్రాంతీయ, ప్రాంతీయేతర పక్షాల కూటముల ప్రభుత్వాలు ఏడాదికే కుప్పకూలిపోవడం మాత్రమే నడచిన చరిత్ర. 1979లో చరణ్‌సింగ్ ప్రధానిగా ఏర్పడిన ప్రభుత్వంతో మొదలైన ఈ జాతీయస్థాయి సంకీర్ణ మంత్రివర్గాల చరిత్ర 1997వరకు పదే పదే గింగిర్లు కొట్టింది. 1989లో ఏర్పడిన వీపీ సింగ్ ప్రభుత్వం, 1990లో అవతరించిన చంద్రశేఖర్ మంత్రివర్గం, 1996నాటి దేవగౌడ ప్రధానమంత్రిత్వం, 1997లో ఏర్పడిన ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వం- ఇవన్నీ ‘భాజపా’ మద్దతుతోనో, కాంగ్రెస్ మద్దతుతోనో మాత్రమే పురుడు పోసుకున్నాయి, కుప్పకూలిపోయాయి. అలాంటప్పుడు ఈ రెండింటిలో దేని మద్దతు లేని ప్రభుత్వం ఎలా సాధ్యం? ఏదైన మాయో, మహిమో జరిగి ఈ రెండూ లేకుండాపోతే తప్ప..! అలాంటి ‘మాయ’ అసంభవమన్నది ప్రస్ఫుటిస్తున్న జనాదేశం..