సంపాదకీయం

దౌత్య పటిమ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్‌ను కల్లోలగ్రస్తం చేస్తున్న బాహ్య శత్రువులను అంతర్గత విరోధులను నిరోధించడానికి, నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు ఇది కొత్త ఊపు... జమ్మూకశ్మీర్‌కు సంబంధించినంతవరకు ఐక్యరాజ్యసమితి ‘మానవాధికార మండలి’- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ -హెచ్‌ఆర్‌సి-తో సంప్రదింపుల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు మన ప్రభుత్వం ప్రకటించడం ఈ కొత్త ఊపు! ‘‘మానవుల హక్కుల పరిరక్షణ’’ పేరిట ‘‘అధ్యయనాలు పరిశోధనలు జరుపుతున్న’’ స్వచ్ఛంద సంస్థలు కొన్ని జమ్మూకశ్మీర్‌లోకి చొరబడి పోతుండడం దశాబ్దుల వైపరీత్యం. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలలో అనేకం నిజానికి దళారీ సంస్థలు... ‘‘స్వచ్ఛందం’’ వీటికి ‘‘ముసుగు’’ మాత్రమే! కొన్ని ‘‘స్వచ్ఛంద’’ బృందాలు అమెరికా, ఐరోపా దేశాలు ఉసిగొలుపుతున్న దళారీ ముఠాలు, మరికొన్ని ‘ఇస్లాం మత రాజ్యాంగ’ వ్యవస్థలున్న దేశాలు ఎగతోలుతున్న ప్రచ్ఛన్న బీభత్స ముఠాలు. చైనా ప్రభుత్వంవారి ముఠాలు వేఱు... జమ్మూకశ్మీర్‌లో సైనికులు ఇతర భద్రతాదళాలవారు పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న జిహాదీ హంతకులతో తలపడి పోరాడుతున్నారు. సైనికులపై భద్రతాదళాలపై ‘జిహాదీ’లు జరిపిన కాల్పులలో అనేకమంది అమరులయ్యారు. తథాకథిత- సోకాల్డ్- విదేశీయ స్వచ్ఛంద సంస్థలకు ఇది ఆందోళన కలిగించడం లేదు. మన దేశంలోని పాకిస్తానీ తొత్తులకు సైతం ఈ సంగతి పట్టడం లేదు. దాడులకు గురిఅయిన సైనికులు, భద్రతాదళాలవారు జరిపిన నిరోధక చర్యలలో ‘జిహాదీ’ బీభత్సకారులు హతులయినప్పుడు మాత్రమే దేశంలోని శత్రువులు, దేశం వెలుపలి ప్రచ్ఛన్న బీభత్సకారులు ‘నిరసనల’ను ప్రదర్శిస్తున్నారు. మన ప్రభుత్వాన్ని అభిశంసిస్తున్నారు. ఈ ‘స్వచ్ఛందం’ ముసుగులోని బీభత్స సంస్థలను మన ప్రభుత్వం లెక్క చేయవలసిన పని లేదు. జమ్మూకశ్మీర్‌లో అధ్యయనం పరిశీలన జరుపడానికి అనుమతి కోరుతున్న అనేక సంస్థలకు మన ప్రభుత్వం అనుమతిని నిరాకరించడం ఇందుకు నిదర్శనం. సైనికులు, భద్రతా దళాలవారు జరిపిన ఎదురుకాల్పులలో మరణించిన బీభత్సకారులను సామాన్య పౌరులుగా చిత్రీకరించడం ద్వారా మన ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజంలో అప్రతిష్ఠపాలు చేయడం ఈ నకిలీ స్వచ్ఛంద సంస్థల లక్ష్యం. ఇలాంటి రెండు నకిలీ స్వచ్ఛంద సంస్థలు కశ్మీర్‌లో ప్రజల జీవించే హక్కులకు భంగం వాటిల్లినట్టు ‘నివేదిక’లను కల్పించి వెల్లడించాయట! ఇలా జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ ఈ ‘నివేదికలు’ వెల్లడికావడం ‘ఐక్యరాజ్యసమితి’ మానవ అధికార మండలి వారు ‘‘మన సైనికులను అభిశంసిస్తూ’’ నివేదికను ఆవిష్కరించడం సమాంతర పరిణామాలు. 2018లో జమ్మూకశ్మీర్‌లో సైనికులు భద్రతా దళాలవారు జరిపిన కాల్పులలో పదముగ్గురు సామాన్య పౌరులు మరణించారని వీరిలో నలుగురు పిల్లలని ‘సమితి’ అనుబంధ ‘మండలి’ ఆరోపించడం పట్ల మన ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించిందట! ఇకపై కశ్మీర్‌లోకి ‘హెచ్‌ఆర్‌సి’ ప్రతినిధులను అనుమతించరాదని నిర్ణయించిందట! 2014 మే 26వరకు కశ్మీర్‌లో మన ప్రభుత్వం బీభత్సకారుల ముందు, జిహాదీల ముందు, విద్రోహుల ముందు, ‘హురియత్’ ‘జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్’ వంటి దేశ వ్యతిరేక తండాల ముందు ‘మోకరిల్లే విధానాన్ని’ అనుసరించింది. 2014 మే 26వరకు ‘్భరతీయ జనతాపార్టీ’ వారు ప్రభుత్వ నిర్వహణ బాధ్యతను స్వీకరించిన తరువాత ‘మోకరిల్లే విధానం’ అంతమైంది, బీభత్సకారులను, పాకిస్తానీ తొత్తులను శిక్షించే విధానం ఆరంభమైంది.... ఇలా హంతకులను శిక్షించడం మానవ అధికారాలకు విఘాతకరమని ప్రచారం జరుగుతోంది! ఈ ప్రచారాన్ని మన ప్రభుత్వం మరోసారి తిప్పికొట్టడం శుభపరిణామం!
కశ్మీర్‌లో బీభత్సకాండను జరుపుతున్నవారు, జరిపిస్తున్నవారు, సమర్ధిస్తున్నవారు, ఆమోదిస్తున్నవారు- - కర్తాకారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః- ఈ నాలుగు తరగతులవారు మానవులు కాదు, మానవ రూపంలోని పిశాచాలు నరరాక్షసులు! వీరికి మానవ అధికారాలను వర్తింపచేయాలన్నది అమానవీయం, అతార్కికం! అయినప్పటికీ మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి ఈ విద్రోహులకు, బీభత్సకారులు అన్యాయంగా మానవులకున్న హక్కులను కల్పించాయి. ‘హురియత్’ ముఠాల అధినేతలు నాయకులు కశ్మీర్ లోయలో దాదాపు సమాంతర ‘పాలన’ను నడిపించడానికి కారణం కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా కల్పించిన మానవ అధికారాలు సైనిక దళాలపైన భద్రతా దళాలపైన రాళ్లు రువ్వడానికి ముఠాలు ఏర్పడి ఉన్నాయి. ఇలా రాళ్లురువ్విన వారు బీభత్సకారులు. ఇలాంటి వారిని పట్టుకున్న ప్రభుత్వాలు వారిని న్యాయస్థానాలలో విచారించి శిక్షించలేదు. వారిని క్షమించి వదలి పెట్టడమేకాక వారికి పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు రూపాయలను వెచ్చించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన సమయంలో, దేశ వ్యవహారాల మంత్రి పళనియప్పన్ చిదంబరం ఆవిష్కరించిన ‘అష్టసూత్ర ప్రణాళిక’లోని ప్రధాన అంశం ఈ పునరావాసం.
పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ - పిడిపి-తో 2015లో జట్టుకట్టిన ‘్భరతీయ జనతాపార్టీ’ సైతం రెండేళ్లకు పైగా ఈ ‘మోకరిల్లే విధానాన్ని అనుసరించడం చరిత్ర. సైనికులపై రాళ్లురువ్విన నేరానికి విచారణకు గురి అవుతుండిన తొమ్మిది వేల ఏడువందల ముప్పయి మంది బీభత్సకారులకు వ్యతిరేకంగా దాఖలయిన అభియోగాలను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి నాయకత్వం ‘పిడిపి-్భజపా’ ప్రభుత్వం రద్దుచేసింది. కశ్మీర్‌కు ‘స్వయం పాలన’ను కోరుతున్న పిడిపితో ‘్భజపా’ జట్టుకట్టడమే జాతీయ వైపరీత్యం. 2018 జూన్‌లో ‘పిడిపి’తో తెగతెంపులు చేసుకున్న తరువాత మాత్రమే ‘్భజపా’నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో బీభత్సకారులను వారి మద్దతుదారులను కఠినంగా అణచివేసే చర్యలను ఆరంభించగలిగింది. ఈ అణచివేత ‘పిడిపి’కి ఇష్టం లేదు, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాల నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఇష్టంలేదు. పుల్వామా జిల్లా అవన్తీపుర సమీపంలో గత ఫిబ్రవరి పదునాలుగవ తేదీన దాదాపు నలబయి మంది అనుబంధ సైనికులను ‘జిహాదీ’ ముష్కరులు మట్టుపెట్టడానికి ఇదంతా నేపథ్యం. ఈ భయంకర బీభత్సకాండను నిరసించని అంతర్గత విరోధులు, బాహ్య శత్రువులు, ‘టెర్రరిస్టుల’ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిబద్ధతను, దేశ సమగ్రతానిష్ఠను, జాతీయ సార్వభౌమ అధికార విధేయతను అభినయిస్తున్న కొన్ని రాజకీయ పక్షాలవారు సైతం బహిరంగంగాను, ప్రచ్ఛన్నంగాను పాకిస్తాన్‌కు అనుకూలంగా ప్రవర్తిస్తుండడం మరో వైపరీత్యం. ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మన వైమానిక దళం పాకిస్తాన్‌లోకి చొచ్చుకొనిపోయి ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్‌ను నిర్వహించింది, బీభత్సకారుల ‘బట్టీ’లను బద్దలుకొట్టింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య సమాజం హర్షించిన ఈ ‘సాయుధ చికిత్స’ను ‘అంతర్గత శత్రువులు’ రాజకీయం చేయడం ఈ మరో వైపరీత్యం! ‘‘జరిగిందా? లేదా??’’అని కొన్నాళ్లు సందేహాలను వ్యక్తంచేసిన ఈ ‘అంతర్గత శత్రువులు’ సైనిక దళాలను అవమానించారు. ఆ తరువాత మాటమార్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో కూడ ‘సర్జికల్ స్ట్రయిక్స్’ జరిగాయని ప్రచారం చేశారు. 2016కు ముందు మన ప్రభుత్వం పాకిస్తాన్ బీభత్సకారులను శిక్షించడానికై ఎలాంటి ‘సాయుధ చికిత్స’ను కూడ జరపలేదన్నది సైనిక దళాలవారు చేసిన స్పష్టీకరణ...
ఇలా మన ప్రభుత్వం జిహాదీ బీభత్సకారులను అణచివేయడానికై పటిష్ఠ విధానాన్ని వహించడం సహించలేని బాహ్య శత్రువులు ‘మానవ అధికారాల’కు - టెర్రరిస్టుల అధికారాలకు- భంగం కలిగినట్టు వాపోతున్నారు. ఈ షడ్యంత్రంలో ‘ఐక్యరాజ్యసమితి’ కూడ తగులుకొనడం విచిత్రమైన వ్యవహారం. మన ప్రభుత్వం తిప్పికొట్టగలగడం మన దౌత్య పటిమ పెరుగుతోందనడానికి నిదర్శనం. మరో ఐదేళ్లపాటు ప్రభుత్వం ఇదే దృఢతర విధానాన్ని అవలంబించగలదన్నది స్పష్టం... ‘్భరతీయ జనతాపార్టీ’ మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించనుండడం ఇందుకు ప్రాతిపదిక.