సంపాదకీయం

‘వారసత్వ’ గ్రహణం..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టుచెడు కాలమునకు ‘కుక్కమూతి’ పిందెలు- అన్నది ప్రకృతిని పరిశీలించిన వేత్తలు చేసిన నిర్ధారణ కావచ్చు. ఈ ‘సామెత’ కాంగ్రెస్ పార్టీ పట్ల నిజం కారాదన్నది దేశంలోని ప్రజాస్వామ్య సమర్థకుల ఆకాంక్ష! ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ నిరంతర విజయానికి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పటిష్ఠమైన ప్రతిపక్షం కూడ అవసరం. పదహారవ లోక్‌సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్షం లేకపోవడం 2014వ సంవత్సరం నుంచి ఇప్పటికి వరకు నడచిన ప్రజాస్వామ్య వైపరీత్యం! ఈ పదిహేడవ లోక్‌సభలోనైనా కాంగ్రెస్‌కు ఆధికారికంగా ప్రధాన ప్రతిపక్ష పరిగణన లభించగలదన్న ఆశలు కూడ ఇప్పుడు అడియాసలయ్యాయి. పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు కేవలం యాబయి రెండు స్థానాలు దక్కడం ఇందుకు కారణం. ప్రతిపక్షం హోదా లభించడానికి అనివార్యమైన యాబయి ఐదు స్థానాలు కాంగ్రెస్‌కు ‘‘అందని ద్రాక్ష పళ్లు’’ కావడం కాంగ్రెస్ పట్ల ‘మతప్రదాతల’- వోటర్‌ల- విశ్వాస రాహిత్యానికి మరో నిదర్శనం! 1952 నుంచి 1967 వరకు లోక్‌సభలో మూడింట రెండవ వంతు స్థానాలతో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం వహించడం చరిత్ర! 1967నాటి లోక్‌సభ ఎన్నికలలోను కాంగ్రెస్‌కు సాధారణ సంఖ్యాధిక్యం- మెజారిటీ- మాత్రమే లభించింది. ఐదువందల పద్దెనిమిది స్థానాల లోక్‌సభలో కాంగ్రెస్‌కు దక్కింది రెండువందల ఎనబయి ఏడు మాత్రమే. అయినప్పటికీ 1969లో కాంగ్రెస్ రెండుగా చీలిపోయేవరకు లోక్‌సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్షం లేదు. కాబినెట్ మంత్రి హోదాను పొందగలిగిన ప్రతిపక్ష నాయకుడు లేడు. లోక్‌సభ మొత్తం సంఖ్యలో పదవ వంతు స్థానాలను గెలిచిన ప్రతిపక్షం లేకపోవడం ఇందుకు కారణం. 1969వ 1970వ సంవత్సరాలలో రెండుగా చీలిన ‘కాంగ్రెస్’లలో మొదటిది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిత్వంలో అధికార పక్షంగా కొనసాగింది. రెండవది మురార్జీ దేశాయ్ , ఎస్.కె.పాటిల్, నిజలింగప్ప, కామరాజ నాడర్ వంటి ప్రముఖుల నాయకత్వంలోని ప్రతిపక్ష కాంగ్రెసే. అందువల్ల దేశంలో తొలిసారిగా లోక్‌సభలో సంఖ్యాధిక్యం లేని- మైనారిటీ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ నడిపించింది. రెండువందల ఇరవై ఎనిమిది స్థానాల ‘ఇందిరా కాంగ్రెస్’- కొత్త కాంగ్రెస్- మనుగడ కోసం ‘ద్రవిడ మునే్నత్ర కజగం’- ద్రముక-, భారత కమ్యూనిస్టుపార్టీ తదితర పక్షాల మద్దతుపై ఆధారపడవలసి వచ్చింది. 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇందిరమ్మ నాయకత్వంలోని కొత్త కాంగ్రెస్ లోక్‌సభలో రెండువందలకు పైగా స్థానాలను కైవసం చేసుకొని ‘అసలు’ కాంగ్రెస్‌గా అవతరించింది. పదహారు స్థానాలు మాత్రం- ఇందులో పదకొండు గుజరాత్ నుంచి- గెలువగలిగిన పాత కాంగ్రెస్ ప్రాధాన్యం కోల్పోయి 1977లో ఇతర ప్రతిపక్షాలతో కలసి ‘జనతాపార్టీ’గా మారింది! అందువల్ల 1977వరకూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష పాలన సాగింది. భారతదేశం ‘ఏకపక్ష’- సింగిల్ పార్టీ- ప్రజాస్వామ్య వ్యవస్థ అని ఆరోజులలో పాశ్చాత్య దేశాల ‘పత్రికలు’ అభివర్ణించడం చరిత్ర! ఈ చరిత్రకు కారణం కాంగ్రెస్ ‘ఆధిపత్యం’. అలాంటి ‘కాంగ్రెస్’ ఇప్పుడు పతనావస్థలో ఉంది! ఆనాటి ఆధిపత్యానికి, ఈనాటి పతనానికి కూడ ఏకైక కారణం ‘కాంగ్రెస్’ను దశాబ్దుల తరబడి ఆవహించి ఉన్న ‘వారసత్వ’ రాజకీయం..! ఈ వారసత్వ రాజకీయం మోతీలాల్ నెహ్రూ కుటుంబం, జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం.. రాజకీయ విదూషకుడిగా రాణకెక్కిన ‘రాహుల్ గాంధీ’ ఇలా ‘చెట్టుచెడు కాలమునకు’ వర్తమాన ప్రతీక..
ఈ వారసత్వ రాజకీయం కాంగ్రెస్‌లో 1950వ దశకంలోనే మొదలైంది. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఈ కుటుంబ ఆధిపత్య విధానానికి శ్రీకారం. బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహాసంస్థ ఉద్యమించిన సమయంలో ఉద్యమ ప్రముఖులలో ఒకరైన మోతీలాల్ నెహ్రూ కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ. నలబయి ఏళ్ల చిన్నవయసులోనే జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్‌కు జాతీయ అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి మోతీలాల్ ప్రభావం దోహదం చేసి ఉండవచ్చు.. ఉండక పోవచ్చు. కానీ తన తరువాత తన కుటుంబం వారు కాంగ్రెస్‌పై ఆధిపత్యం వహించడానికి జవహర్‌లాల్ నెహ్రూ పథకం ప్రకారం దోహదం చేశాడన్నది ధ్రువపడిన వాస్తవం. తండ్రి ప్రధానమంత్రి.. తండ్రి నాయకత్వంలోని కాంగ్రెస్‌కు తనయ ఇందిరాగాంధీ కూడ దాదాపు నలబయి ఏళ్ల ప్రాయంలోనే అధ్యక్షురాలు కాగలిగింది. 1984లో నలబయి ఏళ్ల రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించడం ఈ పరంపర! ఇందుకు ఇందిరాగాంధీ రంగాన్ని సిద్ధం చేసింది. మొదట సంజయ్ గాంధీని, ఆ తరువాత రాజీవ్ గాంధీని కాంగ్రెస్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఇలా రంగాన్ని సిద్ధం చేయడం. ఆ తరువాతి కాలంలో ‘నెహ్రూ, గాంధీ’ కుటుంబం వారిదే కాంగ్రెస్ పార్టీ అన్నది కార్యకర్తల సహజ స్వభావమైపోయింది. ఇదీ వారసత్వ పరంపర..
ఇలా ‘‘గాంధీ కుటుంబం వారిదే కాంగ్రెస్ పార్టీ, వారసత్వంగా వారికే పార్టీ నాయకత్వం లభించాలి, వారు మినహా కాంగ్రెస్‌ను నడిపించడానికి మరో దిక్కులేదు..’’ అన్న ఆత్మన్యూనత కాంగ్రెస్ నాయకులను ఆవహించడానికి కారణం జవహర్‌లాల్ నెహ్రూ నుంచి సోనియాగాంధీ వరకు ఈ కుటుంబ పరంపర పార్టీలో ఇతరులను నాయకులుగా ఎదగనివ్వకపోవడం. అందువల్ల వారు నాయకులుగా ఎదిగి తమ కుటుంబ వారసత్వ ఆధిపత్య పరంపరకు అడ్డుతగులుతారన్న అనుమానగ్రస్తులైన వారందరినీ బయటికి పంపించారు, పొమ్మనలేక పొగపెట్టారు, పనికట్టుకొని పార్టీని చీల్చడానికి సైతం సిద్ధపడ్డారు. ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ 1950 చివరిలో భౌతిక యాత్రను చాలించినప్పటి నుంచీ జవహర్‌లాల్ నెహ్రూ ఈ పనికి పూనుకున్నాడన్నది చరిత్ర. ఈ చరిత్రను అందరూ అంగీకరించకపోవచ్చు. కానీ చక్రవర్తుల రాజగోపాలచారి వంటి సుప్రసిద్ధులు కాంగ్రెస్‌ను వదిలి వేఱు ‘పార్టీ’ని ప్రారంభించవలసి వచ్చింది. పురుషోత్తమదాస్ టాండన్ రాజర్షిగా పేరుపొందిన జాతీయ మహాపురుషుడు. అర్ధాంతరంగా ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పరిత్యాగం చేయడానికి కారణం జవహర్‌లాల్ నెహ్రూ ‘‘పెట్టిన పొగ..’’! 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడంతో నాయకత్వం వహించగల సామర్థ్యం ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ ఉద్యమ పరంపరకు దూరమయ్యారు. కొత్త కాంగ్రెస్ పుట్టుకొచ్చి ఇందిరాగాంధీ అద్వితీయ నాయకురాలిగా మారింది. ఆమె తరువాత రాజీవ్‌గాంధీ- ప్రణబ్ ముఖర్జీ వంటి మహానాయకులను, సోనియాగాంధీ శరద్ పవార్ వంటి వారిని పార్టీనుంచి వెళ్లగొట్టడం చరిత్ర. ప్రాంతీయ స్థాయిలో సైతం నాయకత్వం వహించగల వారు పార్టీలో బలపడడం సోనియాకి, రాహుల్‌కి నచ్చని విషయం. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి ‘వైఎస్‌ఆర్’ కాంగ్రెస్‌ను స్థాపించడానికి ఇదీ నేపథ్యం!
ప్రణబ్ ముఖర్జీ మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ ఆ తరువాత ఆయన ప్రాధాన్యం తగ్గించడానికి సోనియా బృందం కృషిచేశారు. ‘నాకంటె ప్రణబ్ ప్రధానమంత్రి పదవికి ఎక్కువ అర్హుడు’ అని పదేళ్లు ప్రధానిగా పనిచేసిన వరిష్ఠ కాంగ్రెస్ కార్యకర్త మన్‌మోహన్‌సింగ్ ప్రకటించడం చరిత్ర! కానీ సోనియా బృందం వారు ప్రణబ్‌కు ప్రధాని పదవిని ఇవ్వలేదు... ప్రధానమంత్రిగా ఉండిన మన్‌మోహన్‌సింగ్‌ను రాహుల్ గాంధీ అనేకసార్లు బహిరంగంగా అవమానించడం చరిత్ర. ఇలా అద్వితీయ నాయకుడు, నాయకురాలు ఆ కుటుంబం వారు మాత్రమే కావడం కాంగ్రెస్ మహాసంస్థ పతనానికి ఏకైక కారణం! రెండుసార్లు పార్టీ ఘోర పరాజయానికి నాయకత్వం వహించిన తరువాత కూడ ఈ ‘కుటుంబం’ వారు నాయకత్వం నుండి తప్పుకోవడం లేదు. ఒకవేళ తప్పుకుంటే పార్టీని నడిపించగల మరో నాయకుడు లేడన్నది కాంగ్రెస్‌లోని అత్యధికుల ఆత్మన్యూనత! ఈ దుస్థితి కాంగ్రెస్‌ను అంతరించిపోతున్న స్థితికి చేర్చింది. ఇరవై రెండు రాష్ట్రాలనుండి లోక్‌సభకు ప్రతినిధులు ఎన్నిక కాకపోవడం ఈ దుస్థితి! సుదీర్ఘ చరిత్రకల కాంగ్రెస్ ఇలా పతనావస్థలోపడి ఉండడం ప్రజాస్వామ్య ప్రక్రియను సైతం నీరుకార్చుతోంది. లోక్‌సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్షం లేకపోవడం ఇలా నీరుకారడం.. అందువల్ల కాంగ్రెస్ విముక్త భారత్‌ను కోరడం అతార్కికం, అన్యాయం, అప్రజాస్వామ్య సిద్ధాంతం! ‘కుటుంబ ఆధిపత్య వారసత్వ రాజకీయ గ్రహణం’నుంచి కాంగ్రెస్ పార్టీకి విముక్తి లభించాలని ఆకాంక్షించడం ప్రజాస్వామ్య నిష్ఠాపరుల కర్తవ్యం.. కాంగ్రెస్‌లోని ‘కుటుంబ వారసత్వ రాజకీయం’ అనేక రాజకీయ పక్షాలకు అంటుజాడ్యం వలె వ్యాపించి ఉండడం కొనసాగుతున్న వైపరీత్యం..