సంపాదకీయం

ప్రకృతి పూజ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానబడక అనుమాన ప్రమాణమునకె
అంది అందని పరతత్త్వమవల నుంచి
పంచభూత భాసితమైన ప్రకృతి కళనె
సన్నిహిత లక్ష్యమనియె వచస్వి నేడు!
సుప్రసిద్ధ కవి రాయప్రోలు సుబ్బారావు గత శతాబ్దిలో రచించిన ఈ పద్యంలో పర్యావరణ పరిరక్షక వౌలిక సూత్రం నిహితమై ఉంది. నిహిత స్వార్థంతో ప్రకృతి హరిత కళలను హననం చేయడానికి విదేశీయ దురాక్రమణకారులు శతాబ్దుల తరబడి యత్నించడం రాయప్రోలు వంటివారు ప్రకృతి పరిరక్షక సాహిత్య ఉద్యమాలను ఆరంభించడానికి నేపథ్యం. ‘ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, నేల- ఈ పంచభూతముల ద్వారా అభివ్యక్తం అవుతున్న ప్రకృతి కనిపిస్తున్న దేవత. పరతత్త్వము కనబడని దేవత! అందువల్ల కనిపించని దేవత మానవుని సాధనలో సుదూర లక్ష్యం. లక్ష్యాన్ని చేరలేకపోవడం సంభవం కావచ్చు. కనిపిస్తున్న ప్రకృతి దేవత మానవునికి అతి సన్నిహిత లక్ష్యం, అందువల్ల ఈ ఆకుపచ్చని తల్లిని ఆరాధించడం, లక్ష్యాన్ని చేరడం అందరికీ అతి సులభం. ‘పంచభూత భాసితమైన ప్రకృతి’ మనలో ఉంది. సమస్త జీవజాలంలో ఉంది, మన చుట్టూ ఉంది.. ‘‘అంతర్ బహిశ్చతత్ సర్వ వ్యాప్తః’’- లోపల, బయట, అంతటా వ్యాప్తమై ఉన్నది, ఉన్నవాడు- అని అనాదిగా యుగాలుగా వేదం అభివర్ణిస్తున్న తత్త్వం ఈ ప్రకృతి! ప్రకృతి ఒడిలో పెరిగి ప్రగతిని సాధిస్తున్న మానవులు మాత్రమే కాదు సమస్త జీవజాలం అంతటా ఉన్న ఈ ప్రకృతి కంటె భిన్నం కాజాలరు. అంటే మానవుడు, జంతుజాలం, వృక్షజాలం, జీవజాలం కలసిన సమగ్ర రూపం ప్రకృతి! ఇదీ అద్వైతం- ప్రకృతికీ సమాజానికీ మధ్యకల అద్వైతం! అందువల్లనే ‘రూపం’లో ఒకచోట గాయం అయితే మొత్తం రూపానికి బాధ కలుగుతోంది! ఈ ‘రూపం’లో ఎక్కడ ‘పరిపుష్టి’ అంకురించినప్పటికీ అది మొత్తం రూపానికి పరిపుష్టిని కలిగిస్తోంది! ఈ ప్రకృతి గత వాస్తవం వేద విజ్ఞాన నిహితం కావడం, భారత జాతీయ జీవన స్వభావంగా వికసించడం అనాది చరిత్ర. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ వంటి జాతీయ కవులు ‘‘ఆకులో ఆకునై పూవులో పూవునై...’’అంటూ నినదించడం ఈ పర్యావరణ పరిరక్షక స్వభావం! ‘కొమ్మ’తానే అని భావించిన భారతీయుడు ‘నునులేత రెమ్మ’తో అద్వైతం సాధించిన హైందవ జాతీయుడు చెట్టును పుట్టను, చెఱువును, గట్టును, కొండను, కోనను ఏటి నీటిని, నీటి వాగును, వీటన్నింటి సమాహారమైన ప్రకృతిని పూజించాడు, ప్రేమించాడు, గాయపరచలేదు, ధ్వంసం చేయలేదు, కాలుష్యంతో నింపలేదు. భారతీయ జీవన రీతి ఈ పరిరక్షక నీతిగా మారడం సనాతన వాస్తవం! బుధవారం రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధానమంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రకృతి మాత పట్ల పర్యావరణ పరిరక్షణ పట్ల భక్తిని, శ్రద్ధను వ్యక్తం చేయడం ఈ జాతీయ సంప్రదాయంలో భాగం.. బుధవారం జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఇది భారతీయ నేపథ్యం...
ఈ నేపథ్యం విజాతీయ, ప్రధానంగా ఐరోపీయ విధ్వంసక ప్రవృత్తికి గురికావడం శతాబ్దుల విపరిణామం. ప్రకృతి సౌభాగ్య శోభలను సంతరించుకొనడం తెలంగాణ రాజధాని భాగ్యనగరం చరిత్ర. ‘మూసీ’ మురుగు కాలువ దుర్గంధ వాయుకాలుష్యాన్ని వెదజల్లుతుండడం నేటి చరిత్ర. ఉదాహరణలు దేశవ్యాప్తంగా అసంఖ్యాకం! ఈ ఏడాది జరిగిన ‘ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఉత్సవానికి’ ప్రధాన భూమిక వాయు కాలుష్య నిర్మూలనం. పరిశ్రమల నుంచి విషపు పొగలు, ఇళ్ల నుంచి ప్లాస్టిక్ సెగలు వెలువడుతుండడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. జలాశయాలు మంచినీటితో నిండడం, పరిసరాలలో చెట్లు పెరగడం వాయు కాలుష్య నిరోధానికి ప్రక్షాళనకు కారణం. తిరుపతిలో ఒకప్పుడు ‘మంచినీళ్ల కుంట’ అన్న ప్రసిద్ధ జలాశయం ఉండేదట! ఆరు ఋతువులలోను నీరు తాగడానికి పనికివచ్చేదట! జలాశయంలో నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు ఒడ్డున నిలబడి ఒక చిన్న నాణెమును వదిలితే అది అట్టడుగున చేరడం కనిపించేదట! నీరు అంత నిర్మలంగా పారదర్శకంగా ఉండేదట! ఇది గతం! 1970వ దశకం నాటికి ఆ మంచినీళ్ల కుంట ‘బురద గుంట’గా మారింది.. ఇది మరో ఉదాహరణ మాత్రమే!
భాగ్యనగరంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ‘‘గాలి వీస్తే చాలు’’.. వేల చెట్లు కూలిపోతున్నాయి. ఇలా చెట్లు కూలుతుండడం వల్ల వాటి కొమ్మలు పడి విద్యుత్ తంత్రులు తెగిపోయి గంటల తరబడి రోజుల తరబడి విద్యుచ్ఛక్తి సరఫరా ఆగిపోతోంది. పెద్ద తుపానులు వచ్చినప్పుడు, విలయం సంభవించినప్పుడు మాత్రమే పెద్దచెట్లు విరిగి పడేవి. పల్లెలలోను పల్లెల చుట్టూ పెరిగిన వేల చెట్లలో ఇలా నిరంతరం విరిగిపడిన చెట్ల జాబితాలేదు. ఇది కూడ గత ఘనత.. ఇప్పుడు రోజూ చెట్లు విరిగిపోతున్నాయి, నగరాలలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఒక చెట్టు విరిగిపడితే నగర పాలక, పురపాలక సంఘాల ఉద్యోగులు నడుములను బిగించి ఆ వీధిలోని మొత్తం చెట్లను కసికొద్దీ నరికేస్తున్నారు. ‘‘ఎందుకయ్యా? అని అడిగితే మరోసారి గాలి గట్టిగా వీచినప్పుడు అవి విరిగిపోయి విద్యుత్ తంత్రులను విరగగొట్టకుండా ఉండడానికి...?’’ అన్నది సమాధానం! ‘చెట్లు పెంచడం చెట్లు నరకడం’ ఇదీ పునరావృత్తి! ఎందుకు ఈ చెట్లు ఇలా విరిగిపోతున్నాయి? గతంలో సహజంగా పెరిగిన, ప్రజలు పెంచిన చింత, రాగి, మర్రి, జువ్వి, మామిడి, వేప వంటి చెట్లు నెమ్మదిగా పెరిగేవి. కలప గట్టితనం సాధించేది. అందువల్ల పెనుగాలులు వీచినప్పటికీ అవి విరగలేదు. యాబయి ఏళ్లలోనో వంద ఏళ్లలోనే భయంకర ప్రాకృతిక బీభత్సం సంభవించినప్పుడు మాత్రమే అవి విరిగిపడ్డాయి. ఇప్పుడు నగరాలలోని పట్టణాలలోని వీధుల పక్కన ‘పరిపాలకులు’ నాటిస్తున్న చెట్లలో తొంబయి శాతం పైగా చేదు చెట్లు, విదేశాల నుంచి దిగుమతి అయిన పిచ్చి మొక్కలు. ఇవి ఏడాదిలోనే ఎంతో ఎత్తుకు పెరుగుతున్నాయి, వీటి కలప, కొమ్మలు ‘గట్టితనం’పొందడం లేదు. పెళుసైన ఈ చెట్లు గాలికి తట్టుకోలేవు. అందువల్ల కూలిపోతున్నాయి. ఈ ‘కొత్త’, విదేశాల నుంచి వచ్చిన, చేదు చెట్లను ముట్టుకుంటే ‘వెగటు’వాసనలు మాత్రమే వస్తున్నాయి,. మామిడి తదితర వృక్షాలపై ఊరేగిన ఉడుతలు ఈ కొత్త చెట్లపై కొలువుతీరడం లేదు. కారణం వెగటు వాసనలు! సంప్రదాయ సిద్ధమైన వందల వేల రకాల పండ్ల మొక్కలు, చెట్లు అడవులలోను జనావాసాలకు సమీపంలోను అంతరించిపోయాయి. అందువల్ల తిండి దొరకని కోతులు ఊళ్లలోకి ఇళ్లలోకి చొఱబడుతున్నాయి. వాయుకాలుష్యాన్ని కానీ మొత్తం ప్రాకృతిక కాలుష్యాన్ని కానీ నివారించడం మాత్రమే కాక, ‘విరిగిపడే’ ప్రమాదానికి లోనుకాని సంప్రదాయ సిద్ధమైన గట్టి చెట్లను వీధుల పక్కన నాటాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ‘మహాపథాల’కు పక్కన నూట ఇరవై అయిదు కోట్ల మొక్కలు నాటదలచిందట! ఆ మొక్కలు ఇలాంటి ‘కొత్త’, ‘పిచ్చి’ మొక్కలైతే రెండేళ్ల తరువాత ఈ రహదారుల పొడవునా చెట్లు విరిగిపడే విధ్వంస దృశ్యాలు ఆవిష్కృతం కావడం ఖాయం. అందువల్ల అనాదిగా ఈ దేశంలో పెరిగిన వేప, రావి, జువ్వి, మామిడి, మఱ్ఱి వంటి వందల జాతుల మొక్కలను రహదారుల పక్కన, నగర వీధుల పక్కన నాటగలగాలి! కోతులకు నగరాలలోని చెట్లమీద తిండి- పండ్లు, కాయలు- దొరికితే అవి ఇళ్లలోకి చొరబడడం మానుకుంటాయి- అని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాట అక్షర సత్యం, పర్యావరణ రక్షణ సూత్రం..
ఇలా ‘ప్రకృతి పరిరక్షణ స్వీయ పరిరక్షణలో భాగం’ అన్న భారతీయ జీవన రీతి మాత్రమే ‘‘ భూమి తల్లి, నేను ఈ భూమాత బిడ్డను’’అన్న సృష్టిగత సనాతన వాస్తవాన్ని గుర్తించగలిగింది! ‘‘తల్లిని మించిన దేవత లేదు..’’ అన్నది తాత్కాలిక అనుభూతి కాదు, శాశ్వత భారతీయ జీవన రీతి! స్వష్ట్యాదిలో వేదద్రష్టలు ఆవిష్కరించిన ఈ సనాతన సత్యాన్ని ‘రాయప్రోలు’ మరోసారి ఇలా వివరించాడు!
అందు ఈ విలక్షణ జీవయాత్ర కొదవు
‘పృథివి’నే నవ్యులు సమాదరింత్రు, భక్తి
తల్లిగా దేవతామతల్లిగా
సమస్త పరాపరకామ్యములకు!!