సంపాదకీయం

బలపడిన బంధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాల్‌దీవులకు, శ్రీలంకకు వెళ్లిరావడం ‘ఇరుగు పొరుగు’ దేశాల పట్ల మనకున్న మైత్రీభావానికి మరో నిదర్శనం. మన దేశానికి దక్షిణంగా నెలకొని ఉన్న ఈ రెండు చిన్న దేశాలకు విదేశీయ పర్యటన క్రమంలో మన ప్రభుత్వం ప్రాథమ్యాన్ని ప్రాధాన్యాన్ని కల్పించడం చారిత్రక భౌగోళిక వాస్తవాలకు అద్దం. మన దేశానికి అతి చేరువలో ఉన్న ఈ రెండు దేశాలు ఒకప్పుడు మన దేశంలో- అఖండ భారత్‌లో- భాగాలన్నది ఈ చారిత్రక వాస్తవం. మన దేశపు లక్ష ద్వీపాలనూ మాల్ దీవులనూ ఇరుకైన సముద్ర మార్గం మాత్రమే వేఱు చేస్తుండడం భౌగోళిక ప్రాధాన్యం సంతరించుకున్న అంశం! బ్రిటన్ దురాక్రమణకు పూర్వం మాల్‌దీవులు- మాలా ద్వీపాలు- మన దేశంలో భాగం. లక్ష ద్వీపాల వరుసలోని దక్షిణం వైపు దీవులను బ్రిటన్‌వారు మాల్ దీవుల పేరుతో ప్రత్యేక దేశంగా విడగొట్టడం చరిత్ర. శ్రీలంక చరిత్రలో సింహళ ద్వీపంగా ప్రసిద్ధికెక్కింది. ఈ సింహళ ద్వీపం ఒకప్పుడు మన దేశపు దక్షిణ భాగాన్ని తూర్పువైపున అంటుకొని ఉండేదట! భూవలయ సంచలనం- కాంటినెంటల్ డ్రిఫ్ట్- అన్న భూగర్భ పరివర్తన కారణంగా ‘సింహళం’ భారత భూభాగం నుండి విడివడిపోయింది. అందువల్ల మన దేశానికీ సింహళ ద్వీపానికి మధ్యన ఉన్న సముద్రం లోతు తక్కువగా ఉంది. బ్రిటన్ దురాక్రమణ సమయంలో ‘‘నోరు తిరగని’’ ఆంగ్లేయులు ‘సింహళం’ అన్న పేరు ‘‘సిమ్‌లోమ్’’అని పలికారు. ఈ ‘సిమ్‌లోమ్’ క్రమంగా ‘సిలోన్’గా మారింది! 1948లో బ్రిటన్ నిష్క్రమించిన నాటికి ‘సింహళం’ పేరు ‘సిలోన్’! 1972వరకు ఈ విదేశీయ ‘సంకర పదజాలం’ కొనసాగింది. ‘సిలోన్’ పేరును 1972లో ‘శ్రీలంక’గా మార్చడం భావదాస్య విమోచనానికి సంకేతం! సింహళ భాష సంస్కృత భాషకు రూపాంతరం. ‘శ్రీలంక ప్రజాతాంత్రిక సమాజ్‌వాదీ జనరాజ్య’ అన్నది సింహళ భాషలోని అధికార నామం! మాల్ దీవులలో ప్రాచీన కాలంలో మాట్లాడిన భాష కూడ సంస్కృత భాషకు రూపాంతరం. రాజకీయపు సరిహద్దులకు ప్రాధాన్యం లేని, ప్రాకృతికమైన సరిహద్దులకు ప్రాధాన్యం ఉండిన సమయంలో శ్రీలంక, మాల్ దీవులు భారత్‌లో భాగం. రాజకీయపు సరిహద్దులకు ప్రాధాన్యం పెరగడం ఐరోపా దురాక్రమణ వల్ల సంభవించిన విపరిణామం. రాజకీయపు సరిహద్దులకు ప్రాధాన్యం పెరగడం వల్లనే విదేశీయ దురాక్రమణ కాలంలో సింహళము, మాల్ దీవులు అఖండ భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడినాయి! అయితే రాజకీయంగా భౌగోళికంగా శ్రీలంక, మాల్ దీవులు స్వతంత్ర దేశాలు అయినప్పటికీ, మన దేశంతోపాటు ఈ రెండు దేశాలు కూడ ఒకే సాంస్కృతిక వ్యవస్థలో భాగం. ఈ సాంస్కృతిక సమానత్వం కారణంగా ఈ దేశాలతో మనకు ప్రత్యేక సంబంధాలు ఏర్పడి ఉన్నాయి. ఈ రెండు దేశాల భద్రత, మన దేశ భద్రత పరస్పరం ముడివడి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం, ఆదివారం జరిపిన పర్యటనలో ఈ ప్రత్యేక సంబంధాలను ధ్వనింపచేశాడు!
హిందూ మహాసాగర ప్రాంతంలోకి చైనా చొఱబడి ఉండడం నరేంద్ర మోదీ పర్యటనకు ప్రాధాన్యం పెంచుతున్న విపరిణామం! శ్రీలంకలో మహేంద్ర రాజపక్ష అధ్యక్షుడుగా కొనసాగిన కాలంలోను, మాల్ దీవులలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌కు పదవీచ్యుతి జరిగిన తరువాత దాదాపు ఆరేళ్లపాటు ఈ ఉభయ దేశాలలోను చైనా దౌత్య దౌర్జన్యం విస్తరించింది! మాల్ దీవుల ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా జిహాదీ విషం కక్కింది! చైనా 2011లో చరిత్రలో తొలిసారి మాల్‌దీవులలో రాయబారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ వైపరీత్యాన్ని మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిరోధింపలేకపోయింది. క్రమంగా మాల్‌దీవుల నుంచి మన వాణిజ్య సంస్థలను వెళ్లగొట్టారు. మాల్‌దీవుల రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధిచేసే కార్యక్రమాన్ని తొలుత మన దేశపు సంస్థకు అప్పగించారు! అయితే 2012లో నషీద్ ప్రభుత్వాన్ని ‘చైనా పాకిస్తాన్’ మద్దతుదారులు కూలదోశారు. ఆ తరువాత కొనసాగిన భారత వ్యతిరేక చర్యలలో భాగంగా భారతీయ సంస్థను మాల్‌దీవుల నుంచి వెళ్లగొట్టారు.. మాలే విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే పనులను చైనీయ సంస్థలకు అప్పగించారు! పెట్టుబడులను పెట్టడం పేరుతో చైనీయ సంస్థలు చిట్టి దేశమైన మాల్‌దీవులలో చొరబడి ఆ దేశాన్ని అప్పులపాలు చేయడం ఆరేళ్ల చరిత్ర. మన ప్రధానమంత్రి శనివారం మాల్‌దీవుల పార్లమెంటులోను, బయట చేసిన ప్రసంగాలలో ఈ సంగతులు ధ్వనించాయి..
గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలలో అబ్దుల్లా యమీన్ అధ్యక్ష పదవిని కోల్పోయాడు. ప్రచ్ఛన్న ‘జిహాదీ’ అయిన యమీన్ మన దేశంతో దాదాపు అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాడు! మొహమ్మద్ నషీద్ అధ్యక్షుడిగా ఉండిన కాలంలో మన దేశం రెండు ‘రక్షణ గగన శకలాల’ -మిలిటరీ హెలికాప్టర్స్-ను మాల్ దీవులకు బహూకరించింది. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చును కూడ భరించింది, సిబ్బందిని సమకూర్చింది. కానీ యమీన్ ప్రభుత్వం ఈ గగన శకటాలు తమకు అక్కరలేదని చెప్పింది. ఈ గగన శకటాలను తిరిగి మన దేశానికి రప్పించడం మనకు కలిగిన వ్యూహాత్మక పరాజయం! ఇరుగు పొరుగు దేశాలతో మైత్రికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ వరకు మాల్ దీవుల సందర్శనకు వెళ్లలేక పోవడం చైనా వ్యూహాత్మక విస్తరణ ఫలితం. ఊహించని రీతిలో 2018 సెప్టెంబర్‌లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో అబ్దుల్లా యమీన్ పరాజయం పాలుకావడంతో చైనా ఆట కట్టబడింది.. మొహమ్మద్ నషీద్ సన్నిహిత సహచరుడు ఇబ్రహీం సోలీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం మన దేశానికి అనుకూలమైన పరిణామం. 2018 నవంబర్ పదిహేడవ తేదీన జరిగిన ఇబ్రహీం సోలీ అధ్యక్ష పదవీ స్వీకార ఉత్సవానికి మన ప్రధాని హాజరుకావడంతో ‘ఇరుగు పొరుగు మైత్రీ లత’ మారాకు తొడిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మాల్ దీవుల ప్రభుత్వం చైనా ఆర్థిక కబంధ బంధం నుంచి బయటపడడానికి వీలైన అనేక చర్యలను చేపట్టింది. చైనాతో యమీన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ‘స్వేచ్ఛా వాణిజ్య నిర్వహణ’ ఒప్పందాన్ని-ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్- కొత్త ప్రభుత్వం రద్దుచేసుకొంది. గత డిసెంబర్‌లో మన ప్రభుత్వం మాల్ దీవులకు దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడం ‘ఇరుగు పొరుగు’ ప్రాథమ్యం- నైబర్‌హుడ్ ఫస్ట్- సూత్రానికి అనుగుణం. ఇప్పుడు ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఆరు ఒప్పందాలు మైత్రీ ప్రస్థానంలో మరిన్ని ముందడుగులు..
శ్రీలంక ప్రభుత్వం 2009లో ‘తమిళ ఈలం లిబరేషన్ టైగర్ల’- ఎల్‌టిటిఇ- నడుమును విరిచివేసింది. భారత- శ్రీలంకలకు ఉమ్మడి శత్రువైన ‘ఎల్‌టిటిఇ’ బీభత్స సంస్థ అంతరించిన తరువాత ఉభయ దేశాల మధ్య మైత్రి మరింతగా పెంపొంది ఉండాలి! కానీ చైనా రంగప్రవేశం చేసింది. శ్రీలంకలోని ఓడరేవులను అభివృద్ధి చేయడంతో చైనా నౌకాదళాలు నెలల తరబడి శ్రీలంకలో తిష్ఠవేయడం మన దక్షిణ సరిహద్దులకు, పడమటి తీరానికి ప్రమాదకరంగా పరిణమించింది. మహేంద్ర రాజపక్ష అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తరువాత, మైత్రీపాల సిరిసేన అధ్యక్షుడయిన తరువాత శ్రీలంక ప్రభుత్వం మనతో మళ్లీ సన్నిహితంగా మెలగుతోంది. అందువల్ల ఆదివారం నరేంద్ర మోదీ జరిపిన ఐదుగంటల శ్రీలంక పర్యటన మైత్రీ ప్రకటన లాంఛనంగా మాత్రమే! అయినప్పటికీ భీభత్స భయానక జిహాదీ హత్యాకాండ కల్పించిన దిగ్భ్రాంతి నుంచి తేరుకుంటున్న సింహళ ప్రజలకు మోదీ పర్యటన కొండంత ఉపశమనం..