సంపాదకీయం

చదువుల సంస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల పిల్లలకు లాంఛనంగా విద్యాభ్యాసం మొదలుకావాలని కొత్త ‘జాతీయ విద్యావిధానం’ ముసాయిదాలో ప్రతిపాదించారట. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చుకుంటున్నారు. ఐదేళ్లలోపు శిశువులకు చదువుచెప్పే వ్యవస్థ ఇంతవరకు ‘సర్కారీ’ బడులలో ఏర్పడలేదు. ఇకపై ఏర్పడబోతోందట! ఇన్నాళ్లుగా రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు నిండిన ‘బుడుతల’కు అనవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తున్న ‘వాణిజ్య పాఠశాలలు’- కార్పొరేట్ స్కూల్స్- ‘ప్రభుత్వేతర పాఠశాలలు’-ప్రైవేట్ స్కూల్స్- దేశమంతటా చీమల పుట్టల వలె విస్తరించాయి. ఇలాంటి వాణిజ్య, ప్రభుత్వేతర పాఠశాలలు ఆ తరువాత ‘పాముల పుట్టల’వలె మారడం నడుస్తున్న చరిత్ర. ఇలాంటి ప్రభుత్వేతర, వాణిజ్య పాఠశాలల యజమానులలో అత్యధికులు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న దుర్మార్గులు. కొన్ని జాతీయ స్వచ్ఛంద సంస్థలు, అతి కొద్దిమంది సామాజిక హిత సాధకులు కూడ ప్రభుత్వేతర రంగంలో మంచి పాఠశాలలను నిర్వహిస్తున్నారు! కానీ ఇలాంటి పాఠశాలలు, యాజమాన్యాలు ‘అవినీతి ఎడారుల’ మధ్య ఏర్పడిన ‘నీటి ఊటలు’- ఒయాసిస్సులు- మాత్రమే! అత్యధిక ప్రభుత్వేతర, వాణిజ్య పాఠశాలలు సమాజాన్ని నిర్లజ్జగా నిర్భయంగా వంచిస్తున్న దోపిడీ కేంద్రాలుగా మారి ఉండడం దశాబ్దుల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోని దుర్మార్గపు వ్యవస్థ! ‘బుడుతల’ తల్లిదండ్రుల వద్ద వేల, లక్షల రూపాయలను ‘శుల్కాల’ రూపంలో దండుకుంటున్నారు. పుస్తకాలను, పెన్సిళ్లను, బొమ్మలను, చాక్లెట్లను జబ్బులు చేయడానికి దోహదం చేసే అనవసరమైన తినుబండారాలను పాఠశాలల ప్రాంగణాలలో విక్రయిస్తూ వాటిని దుకాణాలుగా మార్చివేశారు. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడ ఐదేళ్లకంటె తక్కువ వయస్సుకల పిల్లలకు పాఠశాల సదుపాయం కల్పించడానికి పూనుకుంటున్నారట. కేంద్ర ప్రభుత్వం వారు రూపొందించిన జాతీయ విద్యావిధానంలో ఒక ప్రధానాంశం ఇది. నిర్బంధంగా ఉచితంగా విద్యార్జన చేసేందుకు రాజ్యాంగం కల్పించిన ‘విద్యార్జన అధికారం- ‘రైట్ టు ఎడ్యుకేషన్’- పరిధిని ఐదేళ్లు నిండని పిల్లలకు సైతం వర్తింపచేస్తారట! అందువల్ల ప్రభుత్వేతర, వాణిజ్య పాఠశాలల దోపిడీ నుంచి ‘బుడుతల’ తల్లిదండ్రులకు కొంతవరకు విముక్తి లభించవచ్చు. కానీ ఐదేళ్లు నిండని శిశువులను బడులకు, చదువుల భారానికి బలిచేయవలసిన అవసరం ఉందా? అన్నది విద్యావేత్తలు, మేధావులు, ప్రభుత్వాల నిర్వాహకులు, ఇతర ప్రముఖులు చర్చించవలసిన అంశం!
జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ఐదేళ్లు నిండక పూర్వం మూడేళ్లపాటు శిశువులకు విద్యలను మప్పడం గురించి ప్రస్తావించారట. అంగన్‌వాడీ కేంద్రాలలో రెండేళ్లు నిండిన పిల్లలను తీసుకొని వచ్చి కూర్చుండబెట్టడం ఇప్పటికే జరుగుతోంది. అయితే పౌష్టికాహారం ప్రసాదించడం పేరుతో ప్రస్తుతం ఈ తతంగం నడుస్తోంది. ఇకపై రెండేళ్ల పిల్లలకు సైతం అక్షరాలను నేర్పిస్తారా? నేర్పిస్తే ఏ భాషలోని అక్షరాలను మప్పుతారు? ఆంగ్ల భాషలోని అక్షరాలనా? మాతృభాషలోని అక్షరాలనా?? ప్రభుత్వాలు చిత్తశుద్ధి కలిగి ఆలోచించినట్టయితే ఐదేళ్లు నిండని పిల్లలకు అక్షరాలను నేర్పించరాదన్న చట్టాన్ని రూపొందించగలవు. ఐదవ ఏట అంటే నాలుగేళ్లు నిండిన తరువాత ఐదవ నెలలో ఐదవ రోజున ప్రతి శిశువునకు అక్షరాభ్యాసం చేయాలన్నది జాతీయ సంప్రదాయం. అందువల్లనే ఐదేళ్లు నిండిన శిశువులను ఒకటవ తరగతిలో చేర్పించాలన్న నిబంధన ఏర్పడి ఉంది. ఈ నిబంధనను ప్రభుత్వాలు ఆధికారికంగా ఇప్పటివరకు మార్చలేదు. ప్రభుత్వేతర, ‘కార్పొరేట్’ పాఠశాలల పేరుతో ఏళ్లతరబడి నడుస్తున్న తతంగం అనధికార ప్రహసనం. కానీ ఒకటవ తరగతిలో ప్రవేశం కోసం చిన్నారులు ‘ప్రవేశ పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించవలసి వస్తోంది. ప్రభుత్వేతర పాఠశాలలలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే కాని- ఒకటవ తరగతిలో ప్రవేశం లభించడం లేదు. అందువల్ల దాదాపు తల్లిదండ్రులందరూ రెండేళ్ల పాపలలను, బాబులను ‘బడి’కి పంపిస్తున్నారు! ‘నర్సరీ’ లేదా ‘ప్లే క్లాస్’, ‘ఎల్‌కెజి’, ‘యుకెజి’ల పేరుతో రెండు, మూడు, నాలుగేళ్ల శిశువులు ‘చదువుల బీభత్సానికి’ గురి అయి, మానసికంగా అనిర్వచనీయ వేదనను అనుభవిస్తున్నారు. ఈ అనధికార చదువుల బీభత్సాన్ని ‘జాతీయ విద్యావిధానం’ద్వారా ఆధికారికం చేయాలా? పిల్లలకు చదువుల మోత తగ్గించాలన్న ‘అనుగ్రహ భాషణ’లను చేస్తున్న ప్రభుత్వాల నిర్వాహకులు ఆలోచించాలి! ఇది అనుగ్రహమా? బుడుతలపై ఆధికారిక ఆగ్రహమా??
ఒకటవ తరగతి నుంచి దేశమంతటా పిల్లలకు మూడు భాషలను నేర్పించాలన్న ప్రతిపాదన హర్షణీయం. అంటే ఆంగ్ల భాషతోపాటు మాతృభాషను మరో భారతీయ భాషను నేర్పించాలి. కానీ ఆంగ్ల భాష శుద్ధతను స్వచ్ఛతను పరిరక్షిస్తున్నట్టుగానే భారతీయ మాతృభాషల స్వచ్ఛతను శుద్ధతను పరిరక్షించగల పాఠ్యప్రణాళిక, బోధన పద్ధతులు రూపొందగలవా? అన్నది ప్రశ్న! ప్రస్తుతం అన్ని భారతీయ భాషలూ ఆంగ్ల పదజాలంతో సంకరమైపోయాయి. తెలుగు భాష మాట్లాడుతున్నవారు, తెలుగు భాషలో వ్యాసాలు, కథలు, నవలలు, కవితలు, గ్రంథాలు వ్రాస్తున్నవారు పుంఖానుపుంఖాలుగా ఆంగ్ల పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే తెలుగు భాషను, భారతీయ భాషలను ఆంగ్ల పదాలతో సంకరం చేస్తున్నారు. ఈ భాషా సాంకర్యం నానాటికీ విస్తరిస్తోంది. విశ్వవిద్యాలయాల నుంచి బయలుదేరిన ఈ సాంకర్యం వీధుల గుండా, కార్యాలయాల గుండా, వాణిజ్య ప్రాంగణాల గుండా, మతిమాలిన జీవన పద్ధతుల గుండా ఊరేగుతూ ఇళ్లలోకి, పూజా మందిరాలలోకి చొరబడిపోయింది. కానీ ఆంగ్ల భాషను మాట్లాడుతున్న సమయంలోను, ఆంగ్లంలో వ్రాస్తున్న సమయంలోను ఒక్క తెలుగు పదం కాని, భారతీయ పదం కాని వాడడం లేదు, ప్రవేశపెట్టడం లేదు. ఆంగ్లం విషయంలో మాత్రం భాషా సాంకర్యం లేదు, భారతీయ భాషలు మాత్రం ఆంగ్ల పదాలతో సంకరమైపోయాయి. ఇందుకు కారణం రెండు- ఐదేళ్ల మధ్య పిల్లలకు కేవలం ఆంగ్ల భాషను మాత్రమే మప్పుతుండడం. ‘కెజి’ తరగతులలో కేవలం ఆంగ్ల అక్షరాలను నేర్పుతున్నారు, ఆంగ్లం వ్రాయిస్తున్నారు, ఆంగ్ల పదాలను, పద్యాలను, గీతాలను వల్లెవేయిస్తున్నారు, మూడు నాలుగేళ్ల పిల్లలకు ఈ ‘కెజి’తరగతులలో తెలుగు అక్షరాలను ఎందుకు నేర్పించడం లేదన్న ప్రశ్నను తల్లిదండ్రులు వేయడం లేదు.. ఇదీ దౌర్భాగ్యం! అందువల్ల చదివినకొద్దీ చిన్న పిల్లలు తెలుగును ఆంగ్లంతో సంకరం చేసి మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ముక్కులెగరేసుకుంటూ మురిసిపోతున్నారు...
‘జాతీయ విద్యావిధానం’ జాతి చరిత్రను సంస్కృతిని జీవన సంప్రదాయాలను, వౌలిక అస్తిత్వాన్ని ప్రతిబింబించాలి. ఆంగ్లభాష పుట్టక పూర్వం, ఆంగ్లేయులు మన దేశాన్ని భౌతికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా దురాక్రమణ జరుపడానికి పూర్వం లక్షల ఏళ్లుగా మన దేశం, మన జాతి ఉన్నాయి. ఆంగ్లం తెలియని సమయంలో మన వంట ఇల్లు ఉంది, నీళ్ల ఇల్లు ఉంది, ఉగ్రాణం ఇల్లు ఉంది. అమ్మలు, నాన్నలు ఉన్నారు. ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన ఈ పదాలను, ఈ జాతీయ భాషా సంపదను మనం దూరం చేసుకోవాలా? వంటిల్లు ‘కిచెన్’గాను నీళ్ళ ఇల్లు ‘బాత్‌రూమ్’గాను, ఉగ్రాణం ఇల్లు ‘స్టోర్ రూమ్’గాను మారిపోవాలా? అమ్మానాన్నలు ‘మమీడాడీలు’గా మాతృభాషలో చేరాలా? ఇప్పుడైన ‘‘పూర్వ ప్రాథమిక స్థాయి’’ పాఠశాలల్లో కేవలం మాతృభాషను బోధించాలన్న నియమాన్ని విధించాలన్న విజ్ఞత ప్రభుత్వ నిర్వాహకులకు కలుగుతుందా? ఐదేళ్లలోపు శిశువులకు మాతృభాష తప్ప మరో భాష మప్పరాదన్నది సహజమైన ఇంగిత జ్ఞానం.. ఒకటవ తరగతి నుంచి మాత్రమే ఆంగ్లభాషను మరో భారతీయ భాషను బోధించండి!!