సబ్ ఫీచర్

తిరోగమనంలో సాంస్కృతిక జీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర జంతువులనుండి మనిషిని వేరుగాను, ప్రత్యేకంగానూ చూపేది మేధస్సు, సంస్కారం. ఈ సంస్కారం రెండు విధాలుగా వుంటుంది. ఒకటి- మానవతా ధర్మం! రెండవది- సామాజిక సంస్కారం! జంతువులకు మేధస్సు చాలా తక్కువ. వాటికి బుద్ధి, విచక్షణా జ్ఞానం వుండవు. శారీరక ప్రేరణతోనే (‘ఇనిస్టింక్ట్’) స్పందిస్తాయి. అలాగే వాటికి సంఘ జీవనముండదు కనుక, సామాజిక సంస్కారమూ వుండదు. మనిషిలోని మానవతా సంస్కారం అంటే, ఇతరులకు హాని చేయకుండా వుండడం, ఇతర ప్రాణులను దయతో చూడడం నేటి సమాజం వేల సంవత్సరాలుగా, అనేక తరాల ప్రస్థానం తరువాత ఏర్పడినది. మంచిచెడ్డలు విచక్షణ, నమ్మకాలు, ఆహారం, ఆహార్యం మొదలైన నడవడికలు ఒక ప్రత్యేక సంస్కారంగా ఏర్పడుతాయి. అదే మాతృ సంస్కృతి! ఇటువంటి మాతృ సంస్కృతి ఒక జాతి యొక్క ప్రత్యేక సంస్కారంగా నిలుస్తుంది. ఆ ప్రత్యేక సంస్కృతి పరంగానే ఆ జాతికి గుర్తింపు వస్తుంది. దీనిననుసరించే ప్రజల యొక్క ఆచరణ మీదనే ఈ ప్రత్యేక గుర్తింపు ఆధారపడి వుంటుంది. పారంపర్యంగా వచ్చిన ఈ గుర్తింపును వదులుకునే లాగా నడవడమే ఆధునికత కాదు. అర్ధవంతమైన, ప్రజల యొక్క జీవనశైలి, జీవన ప్రమాణాలను బాగుపరచే మార్పే ఆధునికత!
అయితే, నేటి ప్రజల జీవనశైలి, ప్రమాణాలూ ఆ దిశగా పయనించడం లేదనిపిస్తోంది. సమిష్టి భావన తొలగిపోయి, వ్యక్తిగత స్వార్థం పెరిగిపోతోంది. మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన సామరస్యత తొలగిపోయి, మానవ సంబంధాలు వ్యాపార పద్ధతిలోకి మారుతున్నాయి. గతంలో పల్లెల్లోనూ, గ్రామాల్లోనూ కుల వ్యత్యాసాలున్నమాట నిజమే. అయితే ఆ కుల వర్గాల మధ్య ద్వేషాలుండేవికావు. సామరస్యత ఉండేది. ఇపుడు కుల అంతరాలు తగ్గాయి. కాని, కులాల మధ్య ద్వేషాలు పెరిగాయి. గ్రామాలు పట్టణ రూపం దాలుస్తున్నాయి. అక్కడ కూడా అనాగరికత, అశ్లీలం ప్రదర్శితమవుతోంది.
ప్రజల వేషభాషల్లో చాలా దిగజారుడుతనం కనిపిస్తోంది. సాంప్రదాయంగా అలవడిన ఆహార్యం (దుస్తులు మొదలైనవి), స్నేహశీలతలవలనే ఒక జాతికి గుర్తింపు వస్తుంది. ఆధునీకరణ, ప్రపంచీకరణల పేరుతో దుస్తుల్లోనూ, వేషభాషల్లోనూ మార్పువస్తోంది. అనేక కళారూపాల తర్వాత, సాంకేతికాభివృద్ధి ఫలితంగా, ‘సినిమా’ అనే ఒక కళారూపం ఆవిష్కరించబడింది. ఈ సినిమా ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని కాలక్షేపాన్నీ పంచింది చాలాకాలం. అయితే ఇటీవల పెడధోరణులు మొదలయ్యాయి. అభ్యంతరకరమైన భాషతోపాటు, స్ర్తి పాత్రలను అశ్లీలంగా చూపించడం మొదలైంది. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నారు. కాని హీరోయిన్లకూ, డాన్సర్లకూ బట్టలు మాత్రం కక్కుర్తిగా తొడుగుతున్నారు.
ఇతర రాష్ట్రాలనుండి హీరోయిన్ పాత్రలకు తీసుకువస్తున్నారు. తెలుగులో ఏది చెడ్డ, ఏది సంస్కారమైన మాటో వాళ్ళకు తెలియదు. అలాంటి మాటల్ని వాళ్ళచేత పలికిస్తున్నారు. అంతేకాక, ఆ అమ్మాయిల చేత సినిమాల్లో సిగరెట్లు కాల్పిస్తున్నారు. మద్యం తాగిస్తున్నారు. వాళ్ళు కూడా నిస్సంకోచంగా ఇవన్నీ చేస్తున్నారు. వారికి అవకాశాలు, కేరీర్ ముఖ్యం. ఇటువంటి ప్రదర్శనల ద్వారా యువకులకు, యువతులకూ నిర్మాతలూ, డైరెక్టర్లూ ఎలాంటి సందేశమిస్తున్నారు!!
ఇదివరలో ప్రజలు సినిమాలను థియేటర్లలోనే చూసే వారు. అక్కడ ఏ చెడు చూసినా అక్కడితోనే సరిపోయేది. కాని ఇపుడు సినిమా టి.వి.ల ద్వారా ఇళ్ళలోకొచ్చింది. వాటిలోని అశ్లీల దృశ్యాలను చూడలేక, కొందరు చానెళ్ళను మార్చేస్తున్నారు. లేదా టి.విలను కట్టేయవలసి వస్తోంది. ఇటువంటి సినిమాల మీదా, టి.వి. ప్రదర్శనల మీదా ప్రభుత్వ అదుపు లేదు. టి.వి. సీరియళ్ళలో స్ర్తిలనే విలన్స్‌గా, కిడ్నాపర్స్‌గా, మర్డరర్సుగా చూపిస్తున్నారు. చైనాలో సామాజిక శాస్తవ్రేత్తలు, భారత్ నుండి ప్రసారమవుతున్న సామాజిక సీరియళ్ళను నిషేధించమని వారి ప్రభుత్వాన్ని సలహా ఇచ్చారంట! అంటే ఇవన్నీ ఎంత దిగజారుడుగా వుంటున్నాయో అర్ధమవుతుంది.
ఇప్పటికే యువతీ యువకుల్లో వేషధారణ, ఫేషన్ల రూపంలో ఎలాంటి మార్పులొచ్చాయో కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగాని, మేధావులు, సామాజిక పెద్దలు కాని ఈ పోకడలను అదుపుచేయడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. ఒకప్పుడు సినిమాలలో స్ర్తిపురుష పాత్రలు ముద్దులు పెట్టుకోడానికనుమతి లేదు. తర్వాత అనుమతించారు. దీనిపై అపుడు పార్లమెంటులో చర్చ జరిగినపుడు, ఒక గౌరవనీయ ఎంపీగారు ‘ముద్దంటే చేదా’? ఎవరికైనా అన్నారు. అనుమతించమని వాదించారు. కాని అది స్ర్తిపురుషుల మధ్య ఏకాంతంలో జరగవలసినది. అంతే కాని, వీధుల్లోనూ, థియేటర్లలోనూ, టి.విల్లోనూ ప్రదర్శించాల్సింది కాదు. ఇలాంటి సంస్కార దూరమైన ప్రదర్శనలను కూడా సమర్ధించేవారి, అలా ప్రదర్శిస్తున్నవారి సంస్కారమెంత? సినిమాల్లో పాత్రలచేత పొగత్రాగడాన్ని నిషేధించాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు, సినిమా రంగంలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. సిగరెట్ కాల్చకపోతే నటుడికి ‘మూడ్’ రాదట- సరిగా నటించలేడట! ఇలా అన్నది ఇప్పటి సినిమా రంగంలోని ఒక ‘గొప్ప’రచయిత! ‘మాయాబజార్’ సినిమాలో సిగరెట్టు తాగుతూనే శ్రీకృష్ణుని పాత్రను ఎన్.టి.రామారావుగారంత అద్భుతంగా నటించారా? ఘటోత్కచుని పాత్రను యస్.వి.రంగారావుగారు సిగరెట్ కాలుస్తూనే అంత గొప్పగా చేసారా? ఇలాంటివన్నీ చేతగాని మాటలు! తాము ప్రదర్శిస్తున్న చెడును సమర్ధించుకోడానికి చెప్పే మాటలు!
భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కూడా బలహీన పడుతున్నవి. గతంలో పెళ్ళైనాకా, ఆ జంట జీవితకాలం భార్యాభర్తలుగా కొనసాగేవారు. ఏవైనా చిన్న చిన్న లోపాలిరుపక్షాల్లోనూ వున్నా కూడా, వారి కుటుంబ పెద్దలు నచ్చచెప్పి ఇరువురికీ రాజీ చేసేవారు. అందుకే భారతీయ వివాహ వ్యవస్థ స్థిరమైనదని ప్రపంచవ్యాప్తంగా గణనకొచ్చింది. అయితే, ఇటీవల కాలంలో మార్పు మొదలైంది. పెళ్ళయిన మొదటి అయిదు సంవత్సరాలలోపులోనే, విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. ఇలా విడిపోవడాన్ని, వారి వెనుకనున్న పెద్దవారు కూడా సమర్ధిస్తున్నారు చాలా సందర్భాల్లో! ఈ మార్పుకూడా ఆధునికతలో భాగమేనా? ఈ మార్పు సమాజ సుస్థిరతకు తోడ్పడుతుందా? పాశ్చా త్య దేశాల్లో విడాకుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. భారతదేశంలో పెరుగుతోంది. వ్యక్తులకు స్వేచ్ఛా స్వాతంత్య్రం, ఆత్మాభిమానం ముఖ్యమే! కాని అవి సంస్కారాన్ని పెంచే పరిమితుల్లో వుంటేనే శ్రేయస్కరం!

- మనెన సత్యనారాయణ సెల్ : 9989076150