సంపాదకీయం

షాంఘయి ‘సంత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిర్గిఝస్థాన్ రాజధాని బిష్‌కెక్ నగరంలో జరిగిన ‘షాంఘయి సహకార సమాఖ్య’- షాంఘయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్-ఎస్‌సిఓ- దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశం అంతర్గత వైరుధ్యాలను మరోసారి స్ఫురణకు తెచ్చింది. గురువారం, శుక్రవారం జరిగిన ఈ ‘శిఖర’ సభకు- ‘హాంకాంగ్’ ప్రజలపై చైనా ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ వికృతమైన నేపథ్యం... 1997లో ‘హాంకాంగ్’ నగర రాజ్యం చైనాలో కలసిపోయింది. చైనా ఆగ్నేయ ప్రాంతంలో చైనాకు చేరువగా సముద్రంలో నెలకొని ఉన్న ‘హాంకాంగ్’ అంతవరకు బ్రిటన్ వలస! మలేసియాకు దక్షిణం కొసన నెలకొని ఉన్న ‘సింగపూర్’ స్వతంత్ర దేశం కాగలిగింది. ఇదే రీతిలో స్వతంత్ర దేశంగా అవతరించాలన్న హాంకాంగ్ ప్రజల ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. బ్రిటన్ ప్రభుత్వం ‘హాంకాంగ్’ను చైనాకు అప్పగించింది. అయితే ‘హాంకాంగ్’లో బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగడానికి విలీనం సమయంలో చైనా ప్రభుత్వం అంగీకరించింది. ‘‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’’- వన్ కంట్రీ, టూ సిస్టమ్స్- అన్న సిద్ధాంతం ఈ ఒడంబడికకు ప్రాతిపదిక! అంటే చైనా అంతటా 1949 నుంచి కొనసాగుతున్న ‘కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వం’ మొదటి వ్యవస్థ! ఈ వ్యవస్థకు భిన్నంగా ‘హాంకాంగ్’ ప్రాంతంలో మాత్రం బహుళపక్ష ప్రజాస్వామ్యం కొనసాగాలన్నది రెండవ వ్యవస్థ!! కానీ ప్రస్తుతం చైనా ప్రభుత్వం ‘హాంకాంగ్’లో ‘‘నేరం చేసిన వారిని’’ చైనాకు తరలించి విచారించడానికి వీలుకల్పించే ‘బిల్లు’ను రూపొందించింది. ఇలా తరలించడానికి వీలు ఏర్పడినట్టయితే హాంకాంగ్‌లోని చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేక ప్రజాస్వామ్యవాదులకు వ్యతిరేకంగా అసత్య అభియోగాలను బనాయించి వారిని చైనాలోకి చేరవేసే ప్రమాదం పెరుగుతుంది. ప్రజాస్వామ్య హాంకాంగ్‌లోని న్యాయస్థానాలలోని విచారణ పద్ధతులకు భిన్నంగా చైనాలోని న్యాయస్థానాలలో ప్రభుత్వ అనుకూల విచారణ పద్ధతులు నెలకొని ఉన్నాయి. అందువల్ల నేరస్థులని ప్రభుత్వం ఆరోపించిన నిందితులలో తొంబయితొమ్మిది శాతం మంది శిక్షలకు గురి అవుతున్నారు. ఈ శిక్షలు కూడ భయంకరమైన రీతిలో అమలు జరుపుతున్నారు. మరణశిక్షలను, యావజ్జీవ కారాగృహ నిర్బంధ శిక్షలను అత్యధిక నిందితులకు విధిస్తున్నారు. అందువల్ల ఈ తరలింపు ‘బిల్లు’ను వ్యతిరేకిస్తూ ‘హాంకాంగ్’ వీధులలో ప్రతిరోజు అనేక లక్షల మంది ప్రదర్శనలు జరుపుతుండడం, చైనా అనుకూల ‘‘్భద్రతా దళాలు’’ వారిపై భయంకర దమనకాండ జరుపుతుండడం ‘బిష్‌కెక్’లో జరిగిన ‘ఎస్‌సిఓ’ శిఖర సమావేశానికి సమాంతర విపరిణామం. ‘బహుళ దేశాల సమాఖ్య’ సభావేదికపై చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్ ‘‘నాగరిక’’ ప్రసంగం చేసిన సమయంలోనే ‘హాంకాంగ్’లో నిరసనకారులపై ‘అనాగరిక’ దౌర్జన్యాన్ని చైనా ప్రభుత్వం జరిపించింది...
ఇరుగు పొరుగు దేశాల సహకార సమాఖ్యలు, అంతర్జాతీయ సమాఖ్యలు ఏర్పడడానికి ఏదో ఒక సహజమైన, భౌతికమైన, ఆర్థికమైన లేదా భద్రతాపరమైన తార్కిక ప్రాతిపదిక ఉండాలి. షాంఘయి సమాఖ్య ఏర్పడడానికి అలాంటి ప్రాతిపదిక లేదు. చైనా వ్యూహాత్మక దురాక్రమణ విస్తరణ మాత్రమే ఈ కూటమి ఏర్పాటునకు ఏకైక ప్రాతిపదిక! ఆ తరువాత మధ్య ఆసియా దేశాలలోని ఇంధన సంపదను- ముడి చమురును, ఇంధన వాయువును- చైనా కొల్లగొట్టడానికి ఈ ‘షాంఘయి సంత’ దోహదం చేసింది. తమ దేశాలలో ఇంధనం తవ్వకాలను జరుపడానికి ఉత్పత్తి చేయడానికి మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను మధ్య ఆసియా దేశాలు ఆ తరువాత రద్దుచేసుకోవడం చరిత్ర. చైనా ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఈ దేశాలు ఇలా మాటమార్చడం బహిరంగ రహస్యం! 2001 జూన్ పదహైదవ తేదీన షాంఘయి- చైనాలోని అతి పెద్ద వాణిజ్య నగరం-లో జరిగిన సమావేశంలో ఈ ‘ఎస్‌సిఓ’ ఏర్పడింది. చైనా, రష్యా, నాలుగు మధ్య ఆసియా దేశాలు కలసి ఈ కూటమి ఏర్పడింది. ఇందులో సభ్యత్వం కోసం మన దేశం 2005 నుంచి దేబిరించడం విచిత్రమైన వ్యవహారం. 2014 మే 26నుంచి మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారిన తరువాత కూడ అర్థం లేని ఈ దేబిరించే విధానం కొనసాగడమే విచిత్రం. 2017 వరకు మన దేశానికి ఈ ‘షాంఘయి’ సంతలో పరిశీలక స్థాయిని మాత్రమే కల్పించిన చైనా మన దేశాన్ని అవమానించింది. మన దేబిరింపునకు ఫలితం అవమానం. 2017లో మన దేశానికి షాంఘయి కూటమిలో సంపూర్ణ సభ్యత్వం లభించడం చైనా ఆధిపత్యానికి మరో దౌత్య విజయం...
అంతర్గత వైరుధ్యాలున్న ఈ కూటమిలో చేరినందువల్ల మన దేశానికి ఒరిగింది లేదు. మన దేశంతోపాటు పాకిస్తాన్‌కు కూడ ‘షాంఘయి’ కూటమిలో సంపూర్ణ సభ్యత్వం లభించడం చైనా సాధించగలిగిన ‘సమతుల్యం’. శుక్రవారం నాటి తన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్ర మోదీ బీభత్సకాండను ‘షాంఘయి సమాఖ్య దేశాలు’ కలసికట్టుగా రూపుమాపాలని పిలుపునిచ్చాడు. సమావేశం చివరన ఆమోదించిన తీర్మానంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. కానీ ఈ ‘‘కలసికట్టు’’ కృషిలో పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడ తీర్మానం ద్వారా భాగస్వామ్యం లభించింది. బీభత్సకారులకు నిధులను సమకూర్చుతున్న దేశాలను, బీభత్సకారులను ప్రోత్సహిస్తున్న దేశాలను అంతర్జాతీయ సమాజం నుంచి బహిష్కరించి శిక్షించాలన్నది ‘షాంఘయి’ సభ్య దేశాలకు మోదీ ఇచ్చిన పిలుపు! మరి ‘తీర్మానం’ ప్రాతిపదికగా బీభత్స రాజ్యాంగ వ్యవస్థ ఉన్న పాకిస్తాన్‌ను వేఱుచేసి ఒంటరిని చేస్తారా? లేక బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న ‘‘పేరులేని దేశాన్ని’’ లేదా ‘‘పేరులేని దేశాల’’ను వెలివేయడంలో పాకిస్తాన్ సహకారాన్ని తీసుకుంటారా?? హంతక బీభత్స పాకిస్తాన్ ప్రభుత్వానికి హంతక బీభత్సకారులను శిక్షించడంలో షాంఘయి తీర్మానం భాగస్వామ్యం కల్పించింది. ఈ ‘షాంఘయి’ కూటమిలో జపాన్ కాని, దక్షిణ కొరియా కాని ఎందుకు భాగస్వాములు కాలేదు? దక్షిణ కొరియా చైనాను ఆనుకుని ఉంది! జపాన్‌కూ చైనాకు మధ్య ఉన్న తగాదాల కంటె మనకూ చైనాకు మధ్య తగాదాల తీవ్రత ఎక్కువ! అలాంటి చైనా నాయకత్వంలో ఏర్పడిన ఈ ‘కూటమి’లో మన సభ్యత్వం మన దేశ ప్రయోజనాలకు భంగకరం. సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా వంటి దేశాలున్న ‘కూటమి’లో ఇజ్రాయిల్ చేరలేదు.. మన ప్రధాని ఆంగ్ల అక్షరాలను ప్రతీకలుగా -హెల్త్- ఆరోగ్యం- అన్న ప్రణాళికను ఆవిష్కరించాడు. ఆరోగ్యం- హెల్త్- హెచ్-, ఆర్థిక సహకారం- ఇ- ఎకనామిక్ కోఆపరేషన్-, ప్రత్యామ్నాయ ఇంధనం - ఏ- ఆల్టర్నేటివ్ ఎనర్జీ- సాహిత్య సాంస్కృతిక సంబంధాలు- ఎల్ - లిటరేచర్-, బీభత్స నియంత్రణ- టి- టాకిలింగ్ టెర్రర్-, మానవీయ సహకారం- హ్యుమన్ కోఆపరేషన్- హెచ్-!- ఇవీ ఆరుసూత్రాలు- హెచ్‌ఇఏఎల్‌టిహెచ్-‘హెల్త్’!! ఈ ప్రణాళికను ఎవ్వరూ వ్యతిరేకించలేదు.. కానీ వైరుధ్యాలను అతిగమించి కూటమివారు వీటిని అమలు జరుపడం సాధ్యమా??
ఈ కూటమిలో మనకూ చైనాకూ కూడ పొరుగు దేశాలైన బర్మా- మ్యాన్‌మార్-ను కాని నేపాల్‌ను కాని చేర్చుకోలేదు.. ఎందుకని?? పాకిస్తాన్ కంటె అఫ్ఘానిస్థాన్ మధ్య ఆసియాకు మరింత దగ్గరి దేశం... దానికి మాత్రం ఇంకా పూర్తి సభ్యత్వం ఇవ్వలేదు. నాలుగు మధ్య ఆసియా దేశాలయిన కిర్గిఝస్థాన్, ఉఝబెకిస్థాన్, తజకిస్థాన్, కజఖ్‌స్థాన్‌లకు సభ్యత్వం ఉంది. మరో మధ్య ఆసియా దేశం తుర్క్ మెనిస్థాన్‌కు ఎందుకని సభ్యత్వం లేదన్నది సమాధానం లేని ప్రశ్న..