సంపాదకీయం

కొత్తసభ ‘కొలువు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త లోక్‌సభ తొలిసారి కొలువుతీరడం మన ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ ప్రస్థాన పథంలో ఒక ప్రధానమైన పరిణామం! బ్రిటన్ దురాక్రమణ విముక్త భారత్‌లో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత క్రీస్తుశకం 1952 నుంచి ఈ చారిత్రక పరిణామం పదిహేడుసార్లు సంభవించింది. పదిహేడవ లోక్‌సభ సోమవారం సమావేశం కావడం ఈ పరిణామక్రమంలో వర్తమాన ఘట్టం. ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రాతిపదిక నిర్ణీత కాలవ్యవధిలో ప్రస్ఫుటించే జనాదేశం. ఈ జనాదేశం ప్రస్ఫుటించే మాథ్యమం ఎన్నికల ప్రక్రియ. జనాదేశానికి ‘రూపం’ చట్టసభ! ఎన్నికయిన ఐదువందల నలబయి ముగ్గురు ప్రతినిధుల సమష్టి రూపం లోక్‌సభ.. అందువల్ల లోక్‌సభ సమష్టి అభిప్రాయం శాసన నిర్మాణ ప్రక్రియ.. సమష్టి అభిప్రాయం ఏకగ్రీవమా? సంఖ్యాబాహుళ్య- మెజారిటీ- గళమా? అన్నది దశాబ్దులుగా ఎడతెగని కొనసాగుతున్న మీమాంస! లోక్‌సభలో సంఖ్యా బాహుళ్యం మంత్రివర్గం ఏర్పడడానికి అనివార్యమైన ప్రాతిపదిక.. కానీ ‘సంఖ్యా అల్పత్వం’- మైనారిటీ-, ‘సంఖ్యా బాహుళ్యం’ అన్నవి దేశ హితకరమైన ప్రజాప్రయోజనకరమైన నిర్ణయాలలో తొంగిచూడక పోవడం ప్రజాస్వామ్య పరిణతకు ప్రజాప్రతినిధుల ప్రామాణికతకు రాజ్యాంగ దర్పణం కాగలదు! రాజకీయ పక్షాల మధ్య ఎన్నికల సమయంలో ఏర్పడే విభేదాలు సమసిపోయి ప్రతినిధులందరి మధ్య సమన్వయం ఏర్పడడానికి ఐదేళ్లపాటు దోహదం చేయగల వేదికలు చట్టసభలు.. అందువల్ల లోక్‌సభ ఈ సమన్వయ పరాకాష్ఠకు సజీవ రూపం.. ప్రతిపక్షమైనా ప్రభుత్వ పక్షమైనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే ప్రజాస్వామ్యం. అందువల్ల నిజమైన జాతీయ హితం, ప్రజాప్రయోజనం విషయంలో సభలోని ప్రతినిధులందరిదీ ఒకే మాట సహజం.. కానీ ఈ ‘సమష్టి హిత సమష్టి నిబద్ధత’ అన్న ప్రజాస్వామ్య సిద్ధాంతం వంద శాతం ఆచరణకు రావడం సుదూర సుందర స్వప్నం మాత్రమే! కనీసం అధికాధిక జనహిత, జాతీయ ప్రయోజనకర అంశాల విషయంలోనైనా అన్ని రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడాలన్నది ప్రజాస్వామ్యపు వ్యవహార వాస్తవం! కానీ ఈ వాస్తవాన్ని వైరుధ్యాలు ఆవహించి ఉండడం దశాబ్దుల చరిత్ర. ప్రభుత్వ పక్షానికీ, విపక్షాలకు మధ్య ఒక ‘సభ’ కాలవ్యవధిలో కంటె తరువాతి ‘సభ’ కాలవ్యవధిలో వైరుధ్యాలు విస్తృతం కావడం నిరాకరింపజాలని నిజం. పదహారవ లోక్‌సభలో వైరుధ్యాలు విరుచుకొని పడిన తీరు ఇందుకు నిదర్శనం. ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం కావాలన్న తపన కంటె తమ రాజకీయ పాక్షిక ప్రయోజన సాధనకు ప్రతినిధులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూండడం ఇందుకు కారణం. ఈ వైపరీత్యం 1952లో తొలి లోక్‌సభ కొలువుదీరిన నాటి నుంచి నిరంతరం తీవ్రతరం అవుతుండడం విస్తరిస్తూ ఉండడం ఆవిష్కృతవౌతున్న దృశ్యం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలినాటి సమావేశాలకు పూర్వరంగంగా, అన్ని పక్షాలకు చేసిన విజ్ఞప్తికి ఈ ‘‘వైరుధ్యం’’ నేపథ్యం...
స్వపక్షం, విపక్షం అన్న అంతరం చూపకుండా సభ్యులందరూ సమస్యలు, అంశాల ప్రాతిపదికగా ‘నిష్పక్షం’గా వ్యవహరించాలన్నది ప్రధానమంత్రి చెప్పిన హితవు. కానీ ఇలా వ్యవహరించాలంటే ‘పక్షాల’ మధ్య ‘జాతిహిత సమాజ హిత’ అంశాలపై ఏకాభిప్రాయం కుదరాలి. ఇలాంటి ఏకాభిప్రాయం కుదురుతుందన్న విశ్వాసం గత పదహారవ లోక్‌సభ సందర్భంగా వమ్మయిపోయింది. ‘‘ముమ్మారు తలాఖ్’’ను ఎప్పుడుపడితే అప్పుడు ఎలాపడితే అలా చెప్పి ఇస్లాం మతస్థులు విడాకులు తీసుకుంటుండడం వల్ల ఇస్లాం మతానికి చెందిన మహిళలు తీవ్రమైన కష్టనష్టాలకు గురి అవుతున్నారు. కానీ ఇలా విచక్షణ రహితంగా ‘విడాకుల’ను మహిళల నెత్తిన రుద్దడాన్ని నిరోధించే బిల్లుపై సైతం గత లోక్‌సభ కాలవ్యవధిలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందన్న విశ్వాసాన్ని నరేంద్ర మోదీ వ్యక్తం చేయడం ఈ గత చరిత్రకు అనుగుణంగా లేదు. ప్రతిపక్షాలకు లోక్‌సభలో బలం పెద్దగా లేదు. ప్రతిపక్షాల మధ్య సైతం ఏ ఒక్క అంశంపై కూడ ఏకాభిప్రాయం లేదు. ఉన్నట్టయితే లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కూడ ఈ ‘పక్షాలు’ ఒక సమైక్య ప్రతిపక్ష కూటమిని ఏర్పాటుచేసి ఉండేవి! అధికారం కోసం మాత్రమే ‘కూటమి’ని ఏర్పాటుచేయాలా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం కొన్ని లేదా అన్ని ప్రతిపక్షాలు కలసి ఒక సమైక్య సంఘటనను ఎందుకని ఏర్పాటు చేయరాదు?? ఇలా ఏర్పాటు చేయకపోవడం పరాజయ ప్రవృత్తికి అవకాశవాదానికి మాత్రమే నిదర్శనం. ఏమయినప్పటికీ ప్రతిపక్షాల మాటకు తాము అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తామని నరేంద్ర మోదీ చెప్పడం సయోధ్య సాధనకు సంకేతం. అందుకు ఈ పదిహేడవ లోక్‌సభలోనైనా రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా రాజ్యాంగ ప్రక్రియను కొనసాగించడానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర రాజకీయ పక్షాలు యత్నించినట్టయితే ‘అభ్యుదయ కారకమైన’ అనేక ‘బిల్లుల’ను ఆమోదించవచ్చు...
ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం అవుతోందనడానికి ఈ ‘లోక్‌సభ’ స్వరూప స్వభావాలు కొత్త సాక్ష్యాలన్నది ప్రధాని చెప్పిన మాట! గత లోక్‌సభ ఎన్నికలలో కంటె ఈ పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో మూడు కోట్ల మంది ‘మత ప్రదాతలు’-వోటర్లు- అధికంగా ‘వోట్లు’వేశారట. గత ఎన్నికల సమయం కంటె ఈ ఎన్నికల నాటికి జనం పెరిగారు, వోటర్లు పెరగడం సహజం. కానీ గత ఎన్నికలలో కంటె ఈ లోక్‌సభ ఎన్నికలలో ‘వోట్లు’వేసిన వారి శాతం కూడ పెరిగింది. ఇది ప్రధానమైన అంశం. గత లోక్‌సభ ఎన్నికలలో దాదాపు అరవై ఆరు శాతం ‘మత ప్రదాత’లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ పదిహేడవ లోక్‌సభ ఎన్నిక ప్రక్రియలో దాదాపు అరవై ఏడు శాతం ‘మత ప్రదాత’లు పాల్గొన్నారు. ఇదీ విజయ సంకేతం, పెరుగుతున్న ప్రజాస్వామ్య నిష్ఠకు నిదర్శనం..! కానీ ఎన్నికలలో పోటీచేస్తున్న వారిలోను, గెలిచి ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగ విధులను ‘‘శ్రద్ధతో నిర్వహిస్తున్నవారి’’లోను నేరప్రవృత్తి పెరిగిపోతుండడం సమాంతర విపరిణామం. ఈ పదిహేడవ లోక్‌సభకు ఐదువందల నలబయి ఇద్దరు ప్రతినిధులు ఎన్నికయ్యారు. ఒక స్థానానికి ఎన్నిక జరుగలేదు. ఈ ఎన్నికయిన వారిలో రెండువందల ముప్పయి ముగ్గురు ప్రతినిధులకు వ్యతిరేకంగా వివిధ న్యాయస్థానాలలో రకరకాల నేరాలు చేసిన ఆరోపణపై అభియోగాలు దాఖలయి ఉన్నాయి. అంటే ఈ కొత్త లోక్‌సభలోని ప్రతినిధులలో నేరాభియోగగ్రస్తుల శాతం నలబయి మూడు! వీరిలో ఇరవై తొమ్మిది శాతం ప్రతినిధులకు వ్యతిరేకంగా లైంగిక బీభత్సం- రేప్, హత్య, హత్యాయత్నం, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి ఘోరమైన అభియోగాలు దాఖలయి ఉన్నాయట. పదహైదవ లోక్‌సభలో ఇలాంటి ‘నేర చరితుల’ సంఖ్య ముప్పయి శాతం కాగా, పదహారవ ‘సభ’లో వీరి శాతం ముప్పయి నాలుగు.. ఇలాంటివారు ‘నిందితులు’ మాత్రమే! నిందితులు నిర్దోషులు కావచ్చు, నేరస్థులు కావచ్చు. న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. కానీ ఇలా ఆరోపణలకు గురిఅయినవారు తాము నిర్దోషులమని న్యాయస్థానాలలో నిగ్గుతేలే వరకూ ఎన్నికలలో పోటీ చేయరాదని స్వచ్ఛందంగా నిర్ణయించినట్టయితే ‘ప్రక్రియ’లో స్వచ్ఛత పెంపొందుతుంది. ప్రతినిధుల ప్రవర్తన మాత్రమే కాదు, ప్రజల జీవన సరళి సైతం స్వచ్ఛ్భారత పునర్ నిర్మాణంలో భాగం...
ఈ లోక్‌సభకు గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారన్న వాస్తవం నరేంద్ర మోదీ చెప్పిన మరో ముచ్చట... గత లోక్‌సభకు అరవై ఐదు మంది మహిళలు ఎన్నిక కాగా ఈ సభకు డెబ్బయి ఎనిమిది మంది ఎన్నిక కావడం నరేంద్ర మోదీ మాటలకు ప్రాతిపదిక. ఇలా ప్రస్తుత సభలో పదిహేను శాతం మహిళా ప్రతినిధులు ఉన్నారు. కానీ మహిళలు కనీసం ముప్పయి మూడు శాతం సభలో ప్రతినిధులుగా ఉండాలన్న లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు. మహిళలకు చట్టసభలలో ముప్పయి మూడు శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రతిపాదనను బయట అందరూ ఆమోదిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో మాత్రం ఈ విషయమై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఐదేళ్లలోనైనా ఏకాభిప్రాయం కుదురుతుందా?