సంపాదకీయం

సుజల సంయోగం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరు పల్లమెరుగు- అన్నది ప్రాకృతిక వాస్తవం! నీరు పైకి ఎగురు- అన్నది ప్రాకృతిక నియమ ప్రవాహానికి ఎదురీదగలిగిన తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం! ఈ విజయం ‘కాళేశ్వరం బహుళ ప్రయోజనకరమైన ఎత్తిపోతల పథకం’గా ఆకృతిని ధరించడం శుక్రవారం సంభవించిన చారిత్రక పరిణామం! ఈ చారిత్రక అద్భుతం తెలంగాణ జన మానస సీమలలో హరిత ఆనంద పరిమళాలను సభతీర్చనున్న అవిరళ జలప్రవాహం! గోదావరి గంగమ్మ కాళేశ్వరం జలాశయాల నుంచి పొలాలవైపు గలగలా కదలిపోతున్న దృశ్యం ఈ చారిత్రక శుభపరిణామం! తెలంగాణ ప్రభు త్వం మూడేళ్ల వ్యవధిలో ఈ జలసాధన సంకల్పాన్ని లక్ష్యంగా మార్చగలగడం అభూత పూర్వ చారిత్రక ‘స్థాపత్య’- ఇంజనీరింగ్ విప్లవం! దేశమంతటా దశాబ్దుల క్రితం శంకుస్థాపనలు జరిగిన సేద్యపునీటి పథకాలు, మంచినీటి చెఱువుల ప్రణాళికలు పునాదులలోనే కూలబడి ఉండడం నడుస్తున్న చరిత్ర. పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల బీడు భూమిని పంట సీమగా మార్చడానికి వీలైన నీటి ప్రవాహాలను సమకూర్చగల కాళేశ్వరం జలాశయ సముదాయాన్ని మూడేళ్లలో రూపకల్పన చేసి నిర్మించి ప్రారంభించగలగడం అందువల్ల అభూత పూర్వ జల విప్లవం! కలియుగం 5121వ సంవత్సరం జ్యేష్ఠ బహుళ చతుర్ధినాడు ఆకృతి దాల్చిన మూడేళ్ల నిర్మాణక్రమ ఫలితం ఈ జల విప్లవం! ‘మేడిగడ్డ’వద్ద ‘మహా జలాశయం’ ఆనకట్టకు ప్రారంభోత్సవం జరగడం.. కనె్నపల్లి వద్ద నీరు ఉప్పొంగి పరుగులు తీయడం, అన్నారం వారధి వద్ద మంచినీటి సముద్రంగా అవతరించడం... గోదావరి వ్యవసాయ క్షేత్ర నిరంతర ప్రస్థానానికి శుక్రవారం జరిగిన శుభారంభం! ఈ ప్రారంభోత్సవ మహాప్రాంగణం వేద మంత్రాలతో మారుమ్రోగడం, జల సంకల్ప యజ్ఞవాటికగా మారడం సాంస్కృతిక భారత స్వరూపానికి అద్దం పట్టిన దృశ్యం, స్వభావాన్ని అనుభూతం చేసిన మంగళకరం! ‘‘నిత్య కల్యాణం పచ్చని తోరణమన్న’’ ఆదర్శం గోదావరి జలాలతో ఆర్ద్రం అవుతున్న నలబయి ఐదు లక్షల ఎకరాల వ్యవసాయ భూమిపై అవిరళ ఆకృతిని ధరించబోతోంది. నీరు మన సాంస్కృతిక జాతీయ జీవన ప్రతీక. నీరు నేలతల్లి దప్పిక తీర్చగల జీవనాళిక..!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలా కారణజన్ముడు, చరితార్ధుడు! ప్రాకృతిక వాస్తవానికి ఎదురొడ్డి, ప్రాకృతిక ప్రవాహానికి ఎదురీది పాతాళం నుండి పర్వత సమ ఉన్నత సీమలవైపు ‘గంగ’ను నడిపించగల కాళేశ్వరం ఎత్తిపోతల పథకం! ఈ పథకానికి ‘రూపశిల్పం’ తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిత్వం.. ‘‘ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి’’.. హిమాలయాల నుండి దిగివచ్చిన గంగ సముద్రం వైపుగా నడవడం, పాతాళం చేరడం యుగాలకు పూర్వం భగీరథుడు నడిపించిన కథ, నీరు పల్లపు ప్రదేశం వైపు కదలివెళ్లిన కథ.. ఇప్పుడు గోదావరి నీరు మేడిగడ్డ నుంచి పైపైకి ప్రవహిస్తోంది. సముద్రపు మట్టానికి తొంబయి రెండు మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డనుంచి దశల వారిగా పైపైకి ప్రవహిస్తున్న గోదావరి గంగ ‘కొండ పోచమ్మసాగర్’ను చేరుతోంది. ఆరువందల పద్దెనిమిది మీటర్లు- సముద్ర మట్టానికి- ఎత్తున ఉన్న ఈ జలాశయం చేరడం గోదావరి ఊర్ధ్వముఖ ప్రస్థానం.. సృష్టికి ప్రతిసృష్టి ఈ జలవృష్టి! ఇలా నీటిని పైపైకి ఎత్తిపోయడానికి వీలుగా పంతొమ్మిదిచోట్ల కృత్రిమ బృహత్ జలాశయాలను నిర్మించడం, దాదాపు పదహారు కిలోమీట ర్లమేర కాలువలను నిర్మించడం అభూత పూర్వమైన నిర్మాణ విప్లవం. రెండువందల మూడు కిలోమీటర్ల మేర భూగర్భ నాళిక-సొరంగ మార్గం-గుండా ‘గోదావరీ ప్రాణహిత’ నదీ జలాల ప్రస్థానం మానవ మేధాపటిమకు శాశ్వత చిహ్నం. ‘ఎత్తిపోతల’కోసం యంత్రాలు, యంత్రాలను నడిపే విద్యుచ్ఛక్తి, విద్యుత్ ఉత్పత్తికి నిరంతరం కొనసాగనున్న ఆర్థిక వ్యయం.. ఇదంతా సమకాల భగీరథ బృహత్ శ్రమప్రణాళిక! సువర్ణ స్రోతస్విని నడుస్తున్న చారిత్రక భూమిక.. వ్యవసాయ ప్రగతి నిజమైన ప్రగతి, మిగిలినది కేవలం ప్రగతి భ్రాంతి, కృత్రిమ ప్రగతి! ఈ నిజమైన ప్రగతి పరిమళించగల సుజల జగతిని సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం అభినందనీయం.. ఇతర ప్రాంతాల పరిపాలకులకు అనుసరణీయం!
గత జల సేతుబంధనము చేయడం- నీరు మొత్తం దిగువకు ప్రవహించి సముద్రం పాలయిన తరువాత ఆ సముద్రంలో కలసిన నీటికి ఎగువన ఆనకట్ట కట్టడం-వల్ల లాభం లేదని మరో ప్రాకృతిక వాస్తవం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాకృతిక వైపరీత్యానికి కూడ అడ్డుకట్టవేసింది. గోదావరి ప్రాణహిత జలాలు దిగువకు పారిపోకుండా నిరోధించగలిగింది. వెనుక్కు మళ్లించి పొలాల దప్పికను తీరుస్తోంది. నదులు అవిరళంగా ప్రవహించడం వల్లనే అమలిన జలాలు-స్వచ్ఛమైన నీరు- పుష్కలంగా లభిస్తుంది. అంటే జన్మస్థలం నుంచి సముద్ర సంగమ స్థలం వరకూ నదీలో ఎడతెగని -అవిరళ- ప్రవాహం కొనసాగడం పర్యావరణ పరిరక్షణకు సహజ మాధ్యమం. దీనివల్ల పరీవాహ ప్రాంతమంతటా సతత హరిత శోభ- నిరంతరం ఆకుపచ్చదనం- సభలను తీర్చుతుంది. నదీ ప్రవాహానికి ఇరువైపులా అనేక చదరపు కిలోమీటర్లమేర స్వచ్ఛమైన భూగర్భజలాలు కూడ లభ్యం అవుతాయి. అందువల్ల నదిపై ఎన్ని ఆనకట్టలు కట్టినప్పటికీ ప్రతి ఆనకట్టకూ దిగువ ప్రాంతంలో నదిగా ఉండాలి, సజీవంగా ఉండాలి! ఇదీ అవిరళ ప్రవాహం, అమలిన ప్రవాహం! కానీ వర్షాకాలంలో ముప్పయి శాతం కంటె మించి నదీజలాలు సముద్ర పర్యంతం సాగిపోరాదు. అలా సాగిపోయే నీరు సముద్రంలో వృథాగా కేంద్రీకృతం అవుతోంది. ఇలా మధుర జలాలు లవణగ్రస్తం కావడంవల్ల అవసరమై పొలాలకు దప్పి తీరడం లేదు. గోదావరి నది నీరు అధిక శాతం ఇలా సముద్రం పాలయి పోవడం చరిత్ర. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఈ చరిత్ర గతిని మార్చగలిగింది. సముద్ర కేంద్రీకరణకు భిన్నంగా తెలంగాణ అంతటా వ్యవసాయ క్షేత్రాలలో జల వికేంద్రీకరణ జరుగుతోంది. వందలాది పంట కాలువల ద్వారా, పిల్లకాలువల ద్వారా ఊహించని ఎత్తులలో నీరు వికేంద్రీకృతవౌతోంది! ఐదేళ్ల తెలంగాణ సాధించగలిగిన అద్భుత విజయాలలో ఈ ‘కాళేశ్వర గంగ’ నలుమూలలకూ కదలిరావడం అతి ప్రధానమైనది!
అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు తెలంగాణలో అదనంగా జరిగిన మహోత్సవం జలయోగం. యోగం కలయిక! యోగం అనుసంధానం, యోగం భౌతిక మానసిక బలం! నీరు ప్రకృతిలో సహజమైన అనుసంధాన మాధ్యమం. ‘‘చినుకు చినుకు చేరి చేరి సరిత పరుగుతీస్తున్నది.’’ ఇదీ అనుసంధానం.. జలయోగం! భూగర్భపు సుదీర్ఘమైన లోతులలో ఒకే జలవాహిని విస్తరించి ఉండడం ప్రాకృతిక సత్యం. ఈ కలయిక-యోగం- సమస్త జీవజలానికి ప్రాణం! ‘‘తల్లులు తమ పిల్లలకు చనుబాలనిచ్చి పరిపుష్టిని కల్పించినట్టుగా, జలములారా.. మీరు మీయందు ఉన్న సారవంతమైన పదార్థములనిచ్చి మమ్ములను పోషించండి...’’అన్నది అనాదిగా భారతీయుల ప్రార్థన- ‘‘యోవః శివతమో రసః, తస్య భాజయ తేహ నః, ఉశతీః ఇవ మాతరః’’- ఈ వేదద్రష్టల ప్రార్థన శుక్రవారం నాటి ‘జలసంకల్ప యజ్ఞం’లో మరోసారి ప్రతిధ్వనించింది! నీటి కాలువల ద్వారా వివిధ ప్రాంతాలమధ్య జలయోగం సిద్ధిస్తోంది. మూడు ప్రాంతాల ముఖ్యమంతుల కలయిక ‘కాళేశ్వర జలం’ సంధాన పరచిన జన యోగం! దేశంలోని అన్ని నదుల అనుసంధానం జరిగిననాడు జలయోగానికి పరాకాష్ఠ కాగలదు.. మంచినీటి భగీరథ ఉద్యమానికి, సేద్యపు నీటి కాకతీయ ఉద్యమానికి మధ్య ప్రస్తుతం ‘యోగం’ సిద్ధించింది. కాళేశ్వర జలాలు పంటపొలాల దప్పిని మాత్రమే కాదు... గ్రామీణుల, నగరవాసుల దప్పిని కూడ తీర్చనున్నాయి....!