సంపాదకీయం

ఎవరికి సౌలభ్యం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవన సౌలభ్యం-ఈజ్ ఆఫ్ లివింగ్-గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం హర్షణీయం. జూలై ఐదవ తేదీన పార్లమెంటుకు సమర్పించిన నూతన వార్షిక ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్-లో జీవన సౌలభ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ నుంచి భారతీయ జీవనం క్రమంగా విముక్తం కాగలదన్న ఆశలు అంకురించడానికి ప్రాతిపదిక! అంకురించిన ఆశలు చిగురిస్తాయా?- అన్నది వేచి చూడదగిన పరిణామం. రెండు దశాబ్దులకు పైగా ‘జీవన సౌలభ్యం’ అన్న ధ్యాసను సైతం భారతీయ సామాన్యులు క్రమంగా కోల్పోవడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ విస్తృతి ఫలితం! బ్రిటన్ దాస్యగ్రస్త భారతంలో ‘జీవన సౌలభ్యం’ అన్న వాస్తవానికి నిర్వచనం మారిపోయింది. కానీ ‘జీవన సౌలభ్యం’ గాంధీ మహాత్ముని జీవితం నిరంతరం ప్రస్ఫుటించడం చరిత్ర- ఇది గాంధీ మహాత్ముని సార్థ శతజయన్తి వత్సరం-! ‘క్విట్ ఇండియా’- భారత్ నుంచి వెళ్లిపోండి’- అన్న బ్రిటన్ వ్యతిరేక ఉద్యమం ఆరంభం కావడానికి ముందు గాంధీ దక్షిణ భారతంలో పర్యటించాడు! సబర్మతీ లేదా వార్థా ఆశ్రమాలలో ‘‘నివసించినప్పుడు పాటించిన దిన చర్యను పర్యటన సమయంలో సైతం మహాత్ముడు పాటించాడు’’ అన్నది ‘మహాత్ముని అనుమతి కోసం..’- వెయిటింగ్ ఫర్ ది మహాత్మా- అన్న తన ఆంగ్ల రచనలో రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ చెప్పిన మాట! తెల్లవారుజామున నిద్ర లేచిన గాంధీ గంటసేపు చరఖా-రాట్నం-పై నూలు వడికాడు, మరో గంటసేపు నడిచాడు. తరువాత స్నానానుస్ఠాలను చేశాడు. ఇదీ ‘జీవన సౌలభ్యం’. సూర్యుడు ఉదయించడాని కంటె ముందు నిద్ర లేచి సూర్యుడికి ‘స్వాగతం’ చెప్పడం గాంధీ ఆచరించి, ఇతరులను ఆచరింపచేసిన జీవన సౌలభ్యం. నిర్మలా సీతారామన్ తన ‘బడ్జెట్’లో ‘రాట్నం’ ప్రస్తావనను ధ్వనింప చేసింది. ఖద్దరు, నూలు, దూది, పత్తి, వ్యవసాయం, గ్రామం వంటివి జాతీయ ‘జీవన సౌలభ్య’ చిహ్నాలు! కానీ నగరాలలో మాత్రమే కాదు, పల్లెసీమలలో సైతం ‘‘రెండుబారల పొద్దెక్కే’’వరకు ‘‘నిగడతన్ని నిద్రపోవడం’’ గాంధీ సార్థ శత జయన్తి- నూట యాబయ్యవ పుట్టినరోజు- సంవత్సరంలో ‘‘స్వచ్ఛ భారతం’’లో సాక్షాత్కరిస్తున్న దృశ్యాలు. ‘జీవన సౌలభ్యం’ అంటే ఇదేనా? ‘సున్నిత విజ్ఞాన స్థపతులు’- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు- ఇతరేతర ఉన్నత ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు శని, ఆదివారాలలో ఉదయం తొమ్మిది గంటలకు కాని నిద్ర లేవరు. ఉదయం పదకొండు గంటల వరకు నిద్రపోతున్న విద్యాధిక యువజనులు కూడ ఉన్నారన్నది ఆశ్చర్యపడవలసిన వ్యవహారం కాదు. వీళ్లు నడవరు.. పాతికేళ్ల లోపున్నవారికి సైతం నడుములు బలిసి ‘బాన కడుపులు’ ఏర్పడిపోతున్నాయి!! ఇదంతా జీవన సౌలభ్యమా? జీవన ఆనందమా?? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుం బిగించి యోగాభ్యాసానికి విస్తృత ప్రచారం కల్పించిన తరువాత వేల మందిలో ఒకరిద్దరు లేదా ముగ్గురు మాత్రమే నిద్ర లేస్తున్నారు, నడుస్తున్నారు... మిగిలినవారు యథావిధిగా సూర్యుడిని చూడమంటున్నారు, నిద్రపోతున్నారు. ఇదంతా పాశ్చాత్యీకరణ ఫలితం.. పాశ్చాత్య వికృతికి విస్తృతి ప్రపంచీకరణ!!
తేనెను ఉత్పత్తిచేసే గ్రామీణ పరిశ్రమలను సైతం ఆర్థికమంత్రి ప్రస్తావించింది. సూర్యుని కంటె ముందు నిద్రలేస్తున్న తేనెటీగలు స్వచ్ఛతకు ప్రతీకలు, నిరంతర శ్రమ జీవన పతాకాలు! తేనెపట్టులు సహజంగా ఏర్పడేచోట భూగర్భ జలం పుష్కలంగా ఉండడం తరతరాల భారత జాతీయ జీవన సౌలభ్యం. ఇప్పుడు చుక్క నీరు దొరకని గ్రామాలు, గూడెములు, బస్తీలు విస్తరించిపోవడానికి కారణం ‘‘ప్రపంచీకరణ’’ వాణిజ్య సౌలభ్యం- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- పెంపొందించడం ‘అంతర్జాతీయ ఆర్థికవేత్త’ మన్‌మోహన్ సింగ్ విరచించిన ఆర్థిక నీతి. ఆర్థికమంత్రిగా,ప్రధానిగా ఆయన ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ-ని దేశం నెత్తికెత్తాడు! ‘వాణిజ్య సౌలభ్యం’ ‘జీవన సౌలభ్యాన్ని’ దిగమింగి వేసింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కానీ ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం కానీ ఈ ‘మార్కెట్ ఎకానమీ’ గుదిబండను వదిలించుకునే ప్రయత్నం చేయలేదు. ‘మన్‌మోహనీయ ఆర్థిక వైపరీత్యం’ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జీవన సౌలభ్యం కోట్లాది భారతీయుల ప్రయోజనం, జాతీయ సమాజ సమష్టిహితం! ‘వాణిజ్య సౌలభ్యం’ మన దేశాన్ని భయంకరంగా దోపిడీ చేస్తున్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’- మల్టీ నేషనల్ కంపెనీ- ఎమ్‌ఎన్‌సి-ల అక్రమ లాభం.. ఒకదానికి మరొకటి విఘాతకరం! రెండింటినీ సాధించగలమని ‘బడ్జెట్’లో చెప్పడం దేనికి నిదర్శనం!!
వాణిజ్య సౌలభ్యం పెంపొందించడం- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- పేరుతో ‘ప్రపంచీకరణ’ మొదలయినప్పటినుంచి ఇరవై ఆరు ఏళ్లుగా మన ప్రభుత్వం ‘బహుళ జాతీయ వాణిజ్య’ సంస్థల పెట్టుబడుల కోసం దేబిరించింది. ఈ ‘బహుళ జాతీయ వాణిజ్యపు’ ముఠాలవారు వౌలిక పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులను పెట్టలేదు, ఉత్పత్తులను పెంచలేదు.. భూమిని తవ్విపారేసి భూగర్భాన్ని ఎండగట్టి శీతల పానీయాలను, ‘ప్లాస్టిక్’ నీళ్లను, ఐస్‌క్రీములను, చాక్లెట్లను, పిజ్జాలను, ‘బర్గర్’లను, చిప్పులను, వేఫర్లను తయారుచేశాయి. ఇవే విదేశాల పెట్టుబడుల వల్ల జరిగిన గొప్ప ఉత్పత్తులు. వీటిని ‘ఆబ’గా తాగి, తింటున్న జనాలకు ఆరోగ్యాలు అడుగంటాయి. అందువల్ల మందులనమ్మే, టానిక్కులనమ్మే, శరీర సౌష్టవ దోహదకర పరికరాలనమ్మే ‘బహుళ జాతీయ సంస్థలు’ విజృంభించాయి. వందల సంఖ్యలోని ఈ ‘గుత్తగంప’ సంస్థల పోటీకి తట్టుకోలేక లక్షల చిల్లర దుకాణాలు మూతపడ్డాయి, సంచార వర్తకులు కూలబడి కుదేలుమన్నారు. ‘జీవన సౌలభ్యా’న్ని దిగమింగిన ఈ విదేశీయ ‘వాణిజ్య సౌలభ్యం’ స్వదేశీయులైన కోట్ల చిల్లర వ్యాపారులను గల్లంతు చేసింది!! అంతర్జాల మార్గం- ఆన్‌లైన్- ద్వారా కిరాణా సామగ్రిని కొంటున్న సంపన్నులు, మధ్యతరగతివారు చిల్లర దుకాణాల సంగతి మరచిపోయారు!! ప్రభుత్వాల నిర్వహణలోని చౌక దుకాణాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ అవుతున్న ‘కిరాణా’దినుసులను పెద్దపెద్ద ‘కాంట్రాక్టర్’లు గుత్తకు తీసుకున్నారు. ఇక చిల్లర దుకాణాలలో ఎవరు కొంటారు??- అందువల్లనే ఒక్కొక్కటిగా అవి మూతపడుతున్నాయి. ‘జీవన సౌలభ్యం’ సంగతి దేవుడెరుగు. ‘వాణిజ్య సౌలభ్యం’ మాత్రం ఎవరికి ఉపకరిస్తోంది?? ప్రపంచీకరణ కల్పించిన మారీచ మృగ మాయాజాలం ‘‘సౌలభ్యం’’-ఈజ్- అన్న ప్రక్రియను వక్రీకరించింది, వక్రీరిస్తోంది...
నగరాలలో పట్టణాలలో వీధులలో బస్తీలలో నల్లా-కొళాయి-లు ఉండిన చరిత్ర చాలామందికి తెలీదు. విహార స్థలాల-పార్కుల-లో కళాశాల ప్రాంగణాలలో పాఠశాలల ప్రాంగణాలలో ఉండిన నల్లాలోని నీటిని సామాన్యులు తాగేవారు, వాడుకునేవారు. దప్పి అయినవారికి బాటల పక్కన ‘బోరింగ్’-గొట్టపు బావులు- లు కనిపించేవి. ఈ వీధి నల్లాలు, ‘బోరింగ్’లు బాటసారుల, పశుపక్ష్యాదుల దప్పిను తీర్చేవి. ఆధునికత పెరిగినకొద్దీ ఈ ‘సౌలభ్యం’ అడుగంటిపోయింది. ఇంటింటికీ ‘నల్లా’పెట్టగలిగినప్పుడు వీధులలో సార్వజనిక ఉపయోగం కోసం ‘నల్లా’లను ఎందుకు పెట్టరాదు? ‘ప్లాస్టిక్ పొట్లా’లలోని నీరు కొనుక్కొని క్రిములతో పాటు తాగడం ఎవరి జీవన సౌలభ్యం?? సీసాలలో, పీపాలలో సరఫరా అవుతున్న నీరు రోగాలను విస్తరింప చేస్తోంది. సార్వజనిక వైద్యశాలలు పనిచేయవు. అందువల్ల ‘బహుళ జాతీయ సంస్థల’ వాణిజ్య వైద్యం జనాన్ని పీల్చి పిప్పిచేస్తోంది.. ఇదీ- జీవన సౌలభ్యం?!