సంపాదకీయం

ప్రగతికి గీటురాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయపు వాటాల వినిమయ కేంద్రం- అగ్రికల్చరల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్- ఏర్పడకపోవడం దశాబ్దుల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం. ఈ వైపరీత్యం విదేశీయ దురాక్రమణ నాటి వారసత్వం. కొనసాగుతున్న ఈ విపరీత వారసత్వం మన ఆర్థిక వ్యవస్థలో నిహితమై ఉన్న డొల్లతనం. ప్రతి ఏడాది ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’-బడ్జెట్-ఆవిష్కృతం కాగానే ‘వాటాల వినిమయ సూచిక’ పెరుగుతోంది లేదా తరుగుతోంది. ఈ ‘పెరుగుదల’ లేదా ‘తరుగుదల’ ప్రాతిపదికగా జాతీయ ఆర్థిక సౌష్టవాన్ని నిర్ధారించడం లేదా అంచనా వేయడం కొనసాగుతున్న ప్రహసనం. కానీ ఈ ‘వాటాల సౌష్టవ సూచిక’- సెనె్సక్స్ వంటివి-లతో వ్యవసాయ రంగానికి కానీ కోట్ల మంది గ్రామీణ, నాగరిక ప్రజలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ‘వాటాల వినిమయ కేంద్రాలు’- స్టాక్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్లు- కేవలం కొన్ని వేల లేదా లక్షల పారిశ్రామిక సంస్థలతోను, వాటాలను కొని అమ్ముతున్న దళారీ తండాలతోను, వాటాలను కొనుగోలు చేసి ‘్భగస్వామ్య భ్రాంతి’కి గురి అవుతున్న వారితోను మాత్రమే ముడివడి ఉన్నాయి. అందువల్ల ఈ పారిశ్రామికపు వాటాల విలువలు, విలువలతో ముడివడిన సూచిక- ఇండెక్స్-లు కుదేలుమని కుప్పకూలడం కానీ కొండెక్కి కూర్చోవడం కానీ ఈ లక్షల మందికి మాత్రమే సంబంధించిన పాక్షిక అంశం కావాలి. కానీ ‘బొంబాయి’ వాటాల వినిమయ కేంద్రం సూచిక కాని, జాతీయ వాటాల వినిమయ కేంద్రానికి చెందిన సూచిక-ఇండెక్స్-కాని పెరిగితే ఆర్థిక ప్రగతిని మొత్తం దేశం సాధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ‘సూచిక’ గణాంకాలు తగ్గితే ‘కుదేలుమంటే’ దేశం మొత్తం ఆర్థికంగా అధోగతి పాలవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం కూడ విదేశీయ వారసత్వం. ఈ కొన్ని లక్షల మందికి తప్ప దేశంలోని కోట్ల మంది వ్యవసాయదారులకు గ్రామీణులకు వనవాసీలకు సామాన్య ప్రజలకు ఈ ‘వాటా’ల గోలతో సంబంధం లేదు. ఆర్థిక వ్యవస్థలో ఈ ‘వాటా’ల అమ్మకాలు, విలువలు, వినిమయ సూచికలు- ఒక నగరంలోనే, రెండు మూడు నగరాలలోనే కేంద్రీకృతమై ఉన్న ఈ ప్రక్రియ మొత్తం- ఒక చిన్న ‘శకలం’ మాత్రమే, చిన్న ముక్క మాత్రమే. కానీ శకలాన్ని ‘సకలం’గా- మొత్తంగా చిత్రీకరించానికి దశాబ్దుల తరబడి జరుగుతున్న ప్రహసనం సామాన్యుల భాగస్వామ్యాన్ని ప్రాధాన్యాన్ని గుర్తించని ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. ఈ ‘వ్యవస్థ’ బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల దొంగలు, దోపిడీదారులు వదలివెళ్లిన వారసత్వం!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన వార్షిక ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’ను ఆవిష్కరించిన వెంటనే గత పదకొండేళ్ల చరిత్రలో కనీవినీ ఎఱుగని రీతిలో ఈ ‘వాటాల వినిమయ సూచిక’ కిందికి పడిపోయిందట. లేవనెత్తలేని వాణిజ్య సంస్థలవారు, తమ సంస్థల వాటాల విలువ పతనమైన సంస్థల వారు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారట. ఈ ఆక్రందనలను గురించి మానవీయ శ్రద్ధ- ‘హ్యూమన్ ఇంటరెస్ట్’-కు విశే్లషకులు కథనాలను కూడ వెలువరించారు. ఇదంతా కూడ ‘బడ్జెట్’ బాగాలేదని చెప్పడానికి జరుగుతున్న ప్రహసనంలో భాగం. గత ఫిబ్రవరిలో అప్పటి ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించిన ‘తత్కాల ఆదాయ వ్యయ ప్రణాళిక’-ఇంటరిమ్ బడ్జెట్-కు ప్రస్తుతం నిర్మలమ్మ రూపొందించిన బడ్జెట్‌కు మధ్య పెద్ద తేడాలేదు. అప్పుడు పతనం కాని ‘సెనె్సక్స్’- వాటాల వినిమయ సూచిక- ఇప్పుడు ఎందుకని కుదేలుమంది?? పైగా ఇప్పుడు ఈ ‘బడ్జెట్’లో ‘వాణిజ్య సంస్థలు చెల్లించే పన్ను’- కార్పొరేట్ టాక్స్-ను తగ్గించారు. గతంలోనే విదేశీయ వా ణిజ్య సంస్థల చొఱబాటుకు బార్లా తెరుచుకొని ఉన్న మన ‘ఆర్థిక ద్వారం’ ఇప్పుడు మరింత వెడల్పయింది. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం నాటి ‘‘విదేశీయ సంస్థలు మన దేశాన్ని దోపిడీ చేయడానికి, కొల్లగొట్టడానికి వీలుకల్పించే ‘స్వేచ్ఛా విపణి’వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ- గత ఐదేళ్ల నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలో మరింత విస్తరించింది, పాతుకొనిపోతోంది. అయినప్పటికీ ‘ఘరానా వాణిజ్య సంస్థల’ సమష్టి ఆర్థిక సౌష్టవానికి సూచిక అయిన ఈ వాటాల విలువలు ఎందుకని తగ్గినట్టు? ‘సెనె్సక్స్’ పదకొండేళ్ల కనిష్ట స్థాయికి ఎందుకు చేరినట్టు? లేదా గరిష్ఠ స్థాయిలో ఎందుకు పతనమైనట్టు?’’
ఇదంతా పాశ్చాత్యులు శతాబ్దుల పాటు మనలను చేసిన దోపిడీలో కొంత శాతం మాత్రమే. పాశ్చాత్య ఆర్థిక వికృతికి విస్తరణ ప్రపంచీకరణ! బ్రిటన్ దురాక్రమణ నడికొనిన నాటివరకు- క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది చివరకు అంటే 1801వ సంవత్సరం వరకు- మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో మన దేశం వాటా నలబయి శాతం. ప్రస్తుతం ఈ ‘వాటా’ నాలుగు శాతం కంటె తక్కువకు దిగజారడానికి కారణం విదేశీయులు ప్రధానంగా ఆంగ్లేయ బీభత్స పాలకులు మన ఆర్థిక వ్యవస్థను కుళ్లగించి పెళ్లగించి పారేయడం. అనాదిగా మన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులు, గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ ఉత్పత్తుల ప్రాతిపదికగా పరిఢవిల్లింది. ఈ వికేంద్రీకృత వ్యవస్థను ధ్వంసం చేసిన విదేశీయ బీభత్స పాలకులు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ‘కేంద్రీకరణ’ పెరుగుతున్నకొద్దీ ‘విలోమ అనుపాతం’లో ప్రపంచ వాణిజ్యంలో మన వాటా తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోనుంది. చారిత్రక గుణపాఠం గ్రహించకపోవడం డెబ్బయి రెండేళ్ల ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల ‘నిర్వాకం’. అందువల్ల ‘ప్రపంచీకరణ’ ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ చొఱబాటు, విదేశాల పెట్టుబడులు ‘సేవల’ రంగాన్ని ముంచెత్తడం-వంటి వైపరీత్యాలు కొనసాగుతున్నంత వరకు నిజమైన ఆర్థిక ప్రగతి అంకురించబోదు. విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడులను కేవలం పారిశ్రామిక వౌలిక రంగాలకు పరిమితం చేస్తామన్నది 1993లో ప్రపంచీకరణను వ్యవస్థీకరించిన అప్పటి మన ప్రభుత్వం చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం భగ్నమైంది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు వౌలిక పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేయడం లేదు. అక్కర లేని ఐస్‌క్రీమ్‌లను, అప్పడాలను ఉత్పత్తి చేశాయి. ఈ విదేశీయ సంస్థలు సేవల రంగాన్ని కబ్జా చేశాయి. ఫలితంగా మధ్యతరగతి వారు, సామాన్యులు భయంకరమైన దోపిడీకి గురి అవుతున్నారు. సేవల రంగంలో జరిగే ప్రగతి నిజానికి ప్రగతి కాదు. కేవలం ప్రగతి భ్రాంతి.. కానీ మన స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ-లో సగానికి పైగా- యాబయి ఆరు శాతం- సేవల రంగం ద్వారా లభించడం ఏ క్షణంలోనైనా కుదేలు మనగల కృత్రిమ ప్రగతికి నిదర్శనం. పారిశ్రామిక రంగంలో కేవలం ఇరవై తొమ్మిది శాతం ఉత్పత్తులు జరుగుతున్నాయి. మిగిలిన పదహైదు శాతం ‘జీడీపీ’ మాత్రమే వ్యవసాయ రంగం నుంచి సమకూడుతోంది. నిజమైన దేశ ప్రగతి వ్యవసాయ ప్రగతి, గ్రామీణ పరిశ్రమల విస్తరణ...
దాదాపు డెబ్బయి శాతం ప్రజలకు జీవన ప్రాతిపదిక అయిన వ్యవసాయం- వ్యవసాయ భూముల- వాటాల- విలువ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, వ్యవసాయ ఆదాయ ప్రాతిపదికగా ‘వ్యవసాయ వాటాల వినిమయ కేంద్రాల’ను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వాలు ఎందుకని ప్రయత్నించరాదు. ఈ ‘‘అగ్రికల్చరల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్’’ సూచికను నిర్ధారించి, దాని ప్రాతిపదికగా కూడ ప్రగతిని ఎందుకు నిర్ధారింపరాదు..??