సంపాదకీయం

విచిత్ర సందేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉండేదంతా ఉండంగ ఉయ్యూరొచ్చి మేడూరు మీద పడింద’న్న లోకోక్తికి ఇది మరో ఉదాహరణ.. మిజోరమ్‌లో తలదాచుకుంటుండిన రెండువందల పంతొమ్మిది మంది శరణార్థులను మన అధికారులు బలవంతంగా బర్మాకు తరలించారట. బర్మా-మ్యాన్‌మార్-లోని ‘అరకాన్’- రఖైన్- ప్రాంతంలో ‘రోహింగియా’ జిహాదీ బీభత్సకారులు ఇస్లాం మతేతరులపై దశాబ్దులుగా దాడులు జరుపుతున్నారు. ఈ బీభత్సకాండకు బలికాకుండా తప్పించుకొని మన దేశానికి వచ్చి ‘శరణార్థులు’గా జీవిస్తున్న ఈ రెండువందల పంతొమ్మిది మంది బౌద్ధ మతస్థులను యుద్ధప్రాతిపదికన వెళ్లగొట్టడం విచిత్రమైన పరిణామం. వీరు అక్రమ ప్రవేశకులట.. గతంలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లా నుంచి శరణార్థులై త్రిపుర తదితర ఈశాన్య ప్రాంతాల్లోకి వచ్చిన ‘చక్మా’ వనవాసీలలో అత్యధికులను మన ప్రభుత్వం ఇలాగే వెళ్లగొట్టింది. 1947లో జరిగిన దేశ విభజన సమయంలో అవశేష భారత్‌లో చేర్చవలసిన చిట్టగాంగ్ జిల్లాను బ్రిటన్ బీభత్స పాలకులు దుర్బుద్ధితో తూర్పు పాకిస్తాన్- బంగ్లాదేశ్-లో చేర్చిపోయారు. ఈ జిల్లాలోని జనసంఖ్యలో తొంబయి ఐదు శాతం బౌద్ధ మతస్థులు, హిందువులు. 1947 నుంచి జిహాదీ దుండగులు సాగిస్తున్న దాడుల ఫలితంగా ఈ హిందువుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. హత్య చేయడం, తరిమివేయడం, మతం మార్చడం, మహిళల మాన మర్యాదలను మంటగలపడం జిహాదీ బీభత్సకాండలో భాగం. చిట్టగాంగ్‌లోని బౌద్ధులైన హిందువులైన చక్మా వనవాసీలు 1947 నుంచి ఈ బీభత్సకాండకు బలి అవుతున్నారు. తప్పించుకొని పారిపోయి శరణార్థులై మన దేశంలో ప్రవేశించిన ‘చక్మా’వనవాసీ ప్రజలలో అత్యధికులను మన ప్రభుత్వం తిప్పి పంపి వేసింది. బర్మా నుంచి మన దేశంలోకి అక్రమంగా చొఱబడి తిష్ఠవేసిన ‘రోహింగియా’లు డెబ్బయి వేలకు పైగా ఉన్నట్టు ప్రచారవౌతోంది. వీరిలో నలబయి వేల మందిని ‘ఐక్యరాజ్యసమితి శరణార్థి వ్యవహారాల సంఘం’వారు శరణార్థులుగా గుర్తించారన్న ప్రచారం కూడ జరుగుతోంది. మన ప్రభుత్వం మాత్రం ‘రోహింగియా’లు అక్రమ ప్రవేశకులని స్పష్టం చేసింది. వారిని బర్మాకు తిప్పి పంపనున్నట్టు కూడ మన ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ‘తిప్పి పంపడాన్ని’ నిరోధించాలని కోరుతూ ‘రోహింగియా’ అక్రమ ప్రవేశకుల తరఫున సర్వోన్నత న్యాయస్థానంలో ‘యాచిక’- పిటీషన్-లు దాఖలయి ఉన్నాయి. సర్వోన్నత న్యాయ నిర్ణయం వెలువడేవరకు ప్రభుత్వం వేచి ఉండక తప్పదు. వేలాది రోహింగియాలను ఇలా దేశం నుండి వెళ్లగొట్టలేని మన ప్రభుత్వం కేవలం రెండువందల పంతొమ్మిది మంది బౌద్ధ మతస్థులను, జిహాదీల హత్యాకాండకు బలికాకుండా పారిపోయి ‘‘ప్రాణావశిష్టులై’’ మన దేశంలో పడి ఉన్నవారిని బర్మాకు తిప్పి పంపడంలోని ఔచిత్యం ఏమిటో..? విదేశాల నుంచి ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి మాత్రమే వచ్చిపడిన అక్రమ ప్రవేశకుల సంఖ్య దాదాపు నలబయి రెండు లక్షలని ‘జాతీయ పౌరుల సూచిక’- నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్స్- ఎన్‌ఆర్‌సి- ముసాయిదా ద్వారా వెల్లడైంది. ఇన్ని లక్షల మంది అక్రమ ప్రవేశకులను దేశం నుండి తరలించడానికి లేని తహతహ ‘మిజోరమ్’లో తలదాచుకుంటూ ఉండిన నిస్సహాయులను వెళ్లగొట్టడంలో ఎందుకు పుట్టుకొని వచ్చినట్టు?
ఒక బర్మా శరణార్థి మహిళను మహిళా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు మాథ్యమాలలో ప్రసారమైన తరువాత ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంటోంది. ఈ అబలను ‘పోలీసు సబలలు’ ఆమె తలదాచుకుంటుండిన గుడిసె నుంచి బలవంతంగా బయటికి లాగి నెట్టుకొంటూ వెళ్లారట. రోదిస్తుండిన ఈ మహిళను సరిహద్దు దాటించి బర్మాలోకి తరిమివేసిన దృశ్యాలు కూడ ప్రసారమయ్యాయట! ఈ శరణార్థి మహిళ 2016లో ‘అరూన్’ ప్రాంతంలో ‘జిహాదీ’లు జరిపిన భయంకరమైన హత్యాకాండకు బలికాకుండా తప్పించుకొని మన దేశంలోకి వచ్చిన దాదాపు పదిహేను వందల బౌద్ధ శరణార్థులలో ఒకరు. ‘అరకాన్’ మన ఈశాన్య ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న బర్మా భూభాగం. ఇలా వచ్చిన పదిహేను వందల మందిలో ఎనబయిఐదు శాతానికి పైగా తమంతతాముగా బర్మాకు తిరిగి వెళ్లిపోయారు, తమ గ్రామాలకు చేరారు. వారి గ్రామాలలో ‘భద్రత’ పెంపొందడం ఇందుకు కారణం కావచ్చు. తిరిగి వెళ్లని రెండువందల పంతొమ్మిది మందికి సంబంధించిన గ్రామాలలో బహుశా ఇప్పటికీ జిహాదీల ప్రమాదం కొనసాగుతూ ఉండవచ్చు. ఏమయినప్పటికీ ఈ హిందూ-బర్మా శరణార్థులకు మన దేశంలో శాశ్వతంగా తిష్ఠవేయాలన్న తలంపులేదన్నది స్పష్టం. ఎనబయి ఐదు శాతం శరణార్థులు తిరిగి స్వదేశానికి స్వచ్ఛందంగా వెళ్లడం ఇందుకు నిదర్శనం..
ఇలా నిస్సహాయులైన రెండువందల పంతొమ్మిది మంది బౌద్ధులను- అక్రమ ప్రవేశకులన్న నెపంతో- వెళ్లగొట్టిన ప్రభుత్వం ఈనెల తొమ్మిదవ తేదీన సర్వోన్నత న్యాయస్థానంలో విచిత్రమైన స్పష్టీకరణను కోరింది. అక్రమ ప్రవేశకులకు సైతం శరణార్థి హోదాను కల్పించవచ్చునా?- అన్నది వౌలికమైన సమస్య అని. దీని గురించి సర్వోన్నత న్యాయస్థానం వారు స్పష్టం చేయాలని మంగళవారం కేంద్ర ప్రభుత్వం నివేదించడం విచిత్రమైన పరిణామం. ‘రోహింగియా’ అక్రమ ప్రవేశకులను దేశం నుండి తరలించరాదని కోరుతూ దాఖలైన ‘న్యాయ యాచిక’ విచారణ సందర్భంగా సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి అధ్యక్షతన ఏర్పడి ఉన్న ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది- సొలిసిటర్ జనరల్- తుషార్ మెహతా ఈ నివేదిక చేశాడట. రోహింగియాలు అక్రమ ప్రవేశకులని ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసి ఉంది. ‘రోహింగియాల’లో కొందరు ‘జిహాదీ’ బీభత్సకారులు కలసిపోయి ఉన్నారన్నది కేంద్ర ప్రభుత్వం ధ్రువపరచిన వ్యవహారం. బౌద్ధులు అధిక సంఖ్యలో ఉన్న బర్మాలో, ఈ ‘అరకాన్’ప్రాంతంలో మాత్రం ఇస్లాం మతస్థులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. జిహాదీ బీభత్సకారులు అరకాన్‌లోని బౌద్ధులను హిందువులను సామూహికంగా హత్యచేయడానికి ఇదీ కారణం. 1935వరకు అఖండ భారత్‌లో భాగంగా ఉండిన బర్మాను బ్రిటన్ దురాక్రమణకారులు ఆ తరువాత విడగొట్టిపోయారు. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉండిన అఖండ భారత భూభాగాలు పాకిస్తాన్‌గా ఏర్పడినప్పటి నుంచి, ‘అరకాన్’- రఖైన్-ను కూడ బర్మానుంచి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర ఇస్లాం మత రాజ్యంగా ఏర్పాటుచేయడానికి ‘రోహింగియా’లోని జిహాదీలు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దుల తరబడి సాగుతున్న ఈ జిహాదీ దుస్తంత్రాన్ని బర్మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిరోధించింది, నిరోధిస్తోంది. అరకాన్ కల్లోలగ్రస్తం కావడానికి ఇదీ కారణం. కానీ బర్మా ప్రభుత్వం తమను అణచివేస్తోందన్న సాకుతో వేలాది ‘రోహింగియా’లు మన దేశంలోకి చొరబడిపోవడం పాకిస్తాన్ ప్రభుత్వం- ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్- ఐఎస్‌ఐ-వారి భారత వ్యతిరేక జిహాదీ దుస్తంత్రంలో భాగం....
అక్రమ ప్రవేశకులకు శరణార్థుల హోదా కల్పించడం సాధ్యమా? అన్న సందేహం ప్రభుత్వ నిర్వాహకుల బుద్ధిని ఆవహించడమే హాస్యాస్పదం. అక్రమ ప్రవేశకులు.. వారు ప్రవేశించిన దేశానికి వ్యతిరేకులు, దేశద్రోహులు. శరణార్థులు ప్రాణభయంతో స్వదేశం నుంచి మరో దేశానికి లేదా ఒకచోటనుంచి మరోచోటికి పారిపోయే నిస్సహాయులు. ఈ ‘తరగతుల’ మధ్య పరస్పర వ్యతిరేకమైన అంతరం ఉండడం అందరికీ తెలిసిన వాస్తవం! కేంద్ర ప్రభుత్వానికి సందేహం కలగడం విచిత్రం. ఈ సందేహం కలిగినవారు సందేహ నివృత్తికాకముందే బౌద్ధశరణార్థులను ఎందుకు వెళ్లగొట్టారు? ఒకవేళ ‘అక్రమ ప్రవేశకుల’కు శరణార్థి హోదా ఇవ్వవచ్చునన్న న్యాయ నిర్ణయం జరిగినట్టయితే అస్సాంలో తిష్ఠవేసి ఉన్న లక్షలాది అక్రమ ప్రవేశకులు తమకు ‘శరణార్థి’ హోదాలను కల్పించమని కోరడం తక్షణ విపరిణామం కాగలదు..