సంపాదకీయం

కులభూషణ విజయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులభూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం విధించిన ‘మరణశిక్ష’ను అమలు జరుపరాదని హేగ్ నగరంలోని ‘అంతర్జాతీయ న్యాయస్థానం’ తీర్పుచెప్పడం మానవత్వపు విలువలకు లభించిన విజయం, అంతర్జాతీయ వ్యవహార నియమావళికి లభించిన బలం, సహజ న్యాయసూత్ర పరిరక్షణ సిద్ధాంతానికి అనుగుణమైన అంతర్జాతీయ పరిణామం, మన ప్రభుత్వానికి లభించిన మరింత నైతిక స్థైర్యం. రెండేళ్లపాటు జరిపిన అవిరళ కృషి ద్వారా మన ప్రభుత్వం కులభూషణ్ జాధవ్‌ను, నిరపరాధి అయిన భరతమాత బిడ్డడిని- పాకిస్తానీ ప్రభుత్వ పైశాచిక కరాళ దంష్ఠ్రలకు బలికాకుండా కాపాడగలిగింది. వివిధ దేశాలకు చెందిన నేర అభియోగాలను, వివాదాలను విచారించి పరిష్కరించడానికై 1946లో నెదర్లాండ్స్ ప్రభుత్వ కేంద్రమైన హేగ్‌లో అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడింది. 1913 నుంచి పనిచేస్తున్న శాశ్వత అంతర్జాతీయ న్యాయస్థానం 1946లో పేరు మార్చుకొంది. ఇరాన్‌కు వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ కోసం వెళ్లిన కులభూషణ్ జాధవ్‌ను పాకిస్తానీ సైనికులు అపహరించుకొని పోవడం పాకిస్తాన్ బీభత్స కృత్యాలలో ఒకటి మాత్రమే. ఈ సంగతి బయటపడినట్టయితే అంతర్జాతీయంగా తాము మరింతగా అభిశంసనకు గురికావలసి వస్తుందన్నది పాకిస్తాన్ పాలకుల భయం. పదేళ్లకు పైగా అంతర్జాతీయ సమాజానికి పాకిస్తానీ ప్రభుత్వ బీభత్స స్వభావం అవగతమైంది, స్పష్టమైంది. అందువల్ల ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్నాయి. ఈ అంతర్జాతీయ అభిశంసన నుంచి తప్పించుకొనడానికి వీలుగా పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ బీభత్సకారులను శిక్షించినట్టు, శిక్షిస్తున్నట్టు అభినయిస్తోంది. కులభూషణ్ జాధవ్‌ను తాము అక్రమంగా అపహరించుకొని పోయినట్టు వెల్లడయితే తమకు మరింత అభిశంసన ఎదురుకాగలదని పాకిస్తాన్ పాలకులకు తెలుసు. మన నౌకాదళంలో పనిచేసి సేవా నివృత్తుడయిన కులభూషణ్ జాధవ్ ‘‘మన దేశానికి చెందిన గూఢచారి’’ అని పాకిస్తాన్ ప్రభుత్వం అక్రమ అభియోగాన్ని కల్పించింది. తమ దేశంలో ‘గూఢచర్యం నిర్వహిస్తున్న సమయంలో కులభూషణ్‌ను తమ నిఘా అధికారులు పసిగట్టి పట్టుకున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసింది. ఈ అబద్ధపు, అసంబద్ధపు అభియోగం ప్రాతిపదికగా పాకిస్తాన్‌లోని సైనిక న్యాయాలయం కులభూషణ్‌కు మరణశిక్షను విధించడం మానవ రూపంలోని పిశాచాల క్రౌర్యానికి నిదర్శనం. నిర్బంధించిన తరువాత ఏడాది తిరగక ముందే కులభూషణ్‌ను విచారించడం, తీర్పు చెప్పడం పాకిస్తాన్‌లోని దుర్మార్గపు, ఏకపక్ష న్యాయవ్యవస్థకు నిదర్శనం. కులభూషణ్‌కు తన తరఫు వాదం వినిపించడానికి కాని, న్యాయవాదిని నియమించుకొనడానికి కాని వీలు కల్పించలేదు. పాకిస్తాన్‌లోని మన రాయబారి- హైకమిషనర్- కార్యాలయంతోకాని, దౌత్యవేత్తలతో కాని జాధవ్ సంప్రదింపులు జరుపడానికి వీలు కల్పించలేదు. జాధవ్‌తో తాము మాట్లాడడానికి వీలు కల్పించాలని ఈ తథాకథిత-సోకాల్డ్-విచారణ సందర్భంగా పదిహేనుసార్లు పాకిస్తాన్‌లోని మన రాయబారి కార్యాలయం వారు ప్రయత్నించారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. 2017 ఏప్రిల్‌లో జాధవ్‌కు మరణశిక్షను విధించిన తరువాత, మరోసారి ఆయనను కలుసుకోవడానికి అనుమతినివ్వాలని మన రాయబారి కార్యాలయం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి లభించలేదు.
మన ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఇదీ నేపథ్యం. 2017 మేలో మరణశిక్ష అమలు జరుపకుండా అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసింది. బుధవారం తుది తీర్పును చెప్పింది. హేగ్ న్యాయస్థానం న్యాయమూర్తుల మండలి అధ్యక్షుడు అబ్దుల్ అహ్మద్ యూసఫ్ సహా పదిహేనుగురు న్యాయమూర్తులు కులభూషణ్ జాధవ్‌కు అనుకూలంగా తీర్పుచెప్పడం పాకిస్తాన్ బీభత్స వ్యవస్థకు అంతర్జాతీయ అభిశంసనం. ఒక్క న్యాయమూర్తి మాత్రమే తీర్పును వ్యతిరేకించాడు, ఆ ఒక్కడు పాకిస్తాన్ ప్రతినిధి. జాధవ్‌ను నిర్బంధించినప్పటి నుంచి ఆయనకు ‘మరణశిక్ష’ను ప్రకటించే వరకు పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిన తతంగం మొత్తం ‘వియన్నా ఒప్పందానికి’ విరుద్ధమని అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ధారించడం పాకిస్తాన్ నిజరూపానికి సరికొత్త ఆవిష్కరణ. వియన్నా ఒప్పందం కులభూషణ్‌కు వర్తించదన్న పాకిస్తాన్ వాదం వీగిపోయింది. ఈ వ్యవహారాన్ని విచారించే హక్కు అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన విచిత్ర వాదాన్ని సైతం న్యాయస్థానం తోసిపుచ్చడం పాకిస్తానీ ప్రభుత్వ ‘అంతర్జాతీయ అనభిజ్ఞత’- ఇంటర్నేషనల్ ఇగ్నోరెన్స్-ను బట్టబయలు చేసింది. కులభూషణ్‌కు మరణశిక్షను అమలు జరుపరాదని మాత్రమే కాక, తీర్పును సమీక్షించాలని, వియన్నా ఒప్పందంలోని ముప్పయి ఆరవ నిబంధన మేరకు భారత రాయబారి కార్యాలయంతోను దౌత్యవేత్తలతోను సంప్రదించే అవకాశం కులభూషణ్‌కు కల్పించాలని కూడ న్యాయస్థానం ఆదేశించడం పాకిస్తాన్ వాదానికి శృంగభంగం. వియన్నా ఒప్పందం ప్రకారం ఇలా సంప్రదించే అధికారం- రైట్ టు కాన్సులర్ యాక్సెస్- జాధవ్‌కుందన్న వాస్తవం ‘తీర్పు’తో ధ్రువపడింది. అందువల్ల తీర్పునకు అనుగుణంగా పాకిస్తాన్ ప్రభుత్వం పునర్ విచారణ జరపాలి!
కులభూషణ్ వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పడానికి కొన్ని గంటలుముందు పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించడం వంచన క్రీడలో మరో ఘట్టం.. అంతర్జాతీయ సమాజం పరోక్షంగా, ప్రత్యక్షంగా అనేకసార్లు అభిశంసించింది. పాకిస్తాన్ బీభత్స స్వభావాన్ని కప్పిపుచ్చడానికి చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడ బెడిసికొట్టాయి, బెడిసికొడుతున్నాయి. మసూద్ అఝార్ అన్న పాకిస్తానీ జిహాదీ హంతకుడిని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ‘అంతర్జాతీయ బీభత్సకారుడ’ని నిర్ధారించడం ఇలా బెడిసికొట్టిన చైనా పన్నాగానికి ఒక నిదర్శనం మాత్రమే! నిరంతరం బీభత్సకారులను రూపొందించిన పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి లక్షల కోట్ల రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వానికి సమకూడినప్పటికీ పాకిస్తాన్ ఆర్థికంగా కుంగిపోయింది. ‘మత నిష్ఠ’ను పెంచడం పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి, జిహాదీలకు లభించిన నిధులు దశాబ్దులపాటు బీభత్సపు బట్టీలను నిర్వహించడం కోసం ఖర్చయిపోయాయి. అమెరికాకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత వ్యతిరేక బీభత్సకాండ గురించి దశాబ్దులుగా తెలుసు. అయినప్పటికీ ‘అంతర్జాతీయ ఆధిపత్య వ్యూహం’లో భాగంగా రష్యాకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ను తమ వైపునకు తిప్పుకొనడానికై ఏళ్లతరబడి ఆయుధ, ఆర్థిక సహాయం అందించింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం చైనా చంకకెక్కి తమను వెక్కింరించడం ఆరంభించాక అమెరికా ప్రభుత్వ వైఖరి మారింది. పాకిస్తాన్‌ను అమెరికా ‘బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’-టెర్రరిస్ట్ రిజిమ్-గా ప్రకటించడానికి రంగం సిద్ధమైంది. సౌదీ అరేబియా తదితర అరబ్ దేశాలు చేస్తున్న ఆర్థిక సహాయం, చైనా వారి వ్యూహాత్మక సహకారం పాకిస్తాన్‌ను ఆర్థిక పతనం నుంచి, అంతర్జాతీయ అభిశంసన నుంచి రక్షించలేకపోతున్నాయి. అందువల్లనే తాము ‘‘జిహాదీ బీభత్సకారులను శిక్షిస్తున్నాము’’అని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించడానికి మాత్రమే హఫీజ్‌ను పాకిస్తానీ పాలకులు మళ్లీ నిర్బంధించారు! కులభూషణ్ జాధవ్ వ్యవహారంలో తీర్పు వెలువడడానికి ముందుగా పాకిస్తాన్ హఫీజ్‌ను నిర్బంధించడం వంచన వ్యూహంలో భాగం.
హఫీజ్ సరుూద్‌ను 2008 డిసెంబర్ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం అనేకసార్లు నిర్బంధించింది, ప్రతిసారీ న్యాయస్థానాలు అతగాడిని విడుదల చేశాయి. సైనిక దళాల చెప్పుచేతులలో మెలగుతున్న పాకిస్తానీ న్యాయవ్యవస్థ బీభత్సకారులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. కానీ కులభూషణ్ వ్యవహారంలో ఈ విచిత్ర న్యాయప్రక్రియ బెడిసికొట్టింది. అయితే కులభూషణ్ జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించి మన దేశానికి పంపించాలన్న మన ప్రభుత్వ విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం ఇంకా అంగీరించవలసి ఉంది.. అంగీకరించడం ఎప్పుడో..?