సంపాదకీయం

‘శుల్కం’.. శాశ్వతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్ ఎకానమీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించి ‘చిత్తశుద్ధి’తో కృషిచేస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ ‘చిత్తశుద్ధి’ని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి లోక్‌సభలో ఆవిష్కరించాడు, దేశ ప్రజలను చకితులను చేశాడు. దేశ ప్రజలు విస్మయ చకితులయ్యారా? లేక ఆనంద ఆశ్చర్య చకితులయ్యారా? అన్నది ఏకాభిప్రాయం కుదరని విషయం. దేశాన్ని విదేశీయ వాణిజ్య సామ్రాజ్య దురాక్రమణ నుండి రక్షించాలని భావిస్తున్న వారికి గడ్కరీ ఆవిష్కరించిన ‘చిత్తశుద్ధి’ విస్మయాన్ని కలిగించింది. ఈ విదేశీయ వాణిజ్య సామ్రాజ్య దురాక్రమణ మరింతగా విస్తరించాలని వాంఛిస్తున్న వారికి గడ్కరీ ఆవిష్కరణ బహుళ అమిత ఆనందాన్ని కలిగించింది. జాతీయ మహాపథాల- హైవేస్-పై పయనించే వాహనాల యజమానులు జీవితమంతా ‘రహదారి శుల్కాలు’- టోల్ టాక్స్- చెల్లిస్తూ ఉండవలసిందేనన్నది నితిన్ గడ్కరీ మంగళవారం లోక్‌సభలో చేసిన చారిత్రక ఆవిష్కరణ. ప్రయాణ సమయాన్ని ఆదాచేసుకోదలచినవారు, మెరుగైన రహదారి సేవలను పొందగోరే వారు ఈ శుల్కాలను చెల్లిస్తూనే ఉండాలన్నది మంత్రివర్యులు చేసిన స్పష్టీకరణ. ఇలా మెరుగైన సేవలను అందించే మిషతో వాణిజ్యసంస్థలు ప్రత్యేకించి విదేశీయ సంస్థలు వినియోగదారులను దోచుకోవడం, జనాల బతుకులను ఈ సంస్థలు నిర్దేశించడం ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛావిపణి- వ్యవస్థ వౌలిక కార్యక్రమం. ‘ప్రపంచీకరణ’ సిద్ధాంతం అమలు జరుగుతున్న మాధ్యమం ‘స్వేచ్ఛావిపణి’ ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- స్వభావం, స్వేచ్ఛావిపణి వ్యవస్థ స్వరూపం. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు, ‘బహుళ జాతీయ’మైన దోపిడీ చేసే స్వభావాన్ని సంతరించుకొని ఉన్న స్వదేశీయ వాణిజ్యసంస్థలు ప్రభుత్వ రాజకీయ, రాజకీయేతర నిర్వాహకులు ఈ విస్తరిస్తున్న వికృత స్వరూపానికి అవయవాలు, ప్రభుత్వం బుద్ధి..! అందువల్ల ‘టోల్’- రహదారి శుల్కం-ను ప్రభుత్వేతర సంస్థలు వాహన చోదకుల నుండి గుంజుకోవడం ప్రభుత్వం సృష్టించిన వాణిజ్య వైపరీత్యం. ఈ ‘స్వేచ్ఛావిపణి’ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు కూడ చిత్తశుద్ధితో అమలుజరుపడానికి నడుములను మరింత గట్టిగా- కేంద్ర ప్రభుత్వం కంటె- బిగించి ఉండడం దేశమంతటా ఆవిష్కృతవౌతున్న దృశ్యాలు..!
ధరలు పెరగడంలో కాని ధరలు తగ్గడంలో కాని ప్రభుత్వ ప్రమేయం లేకపోవడం ‘మార్కెట్ ఎకానమీ’! ఏ మాత్రం ప్రభుత్వం వారి ప్రమేయం ఉన్నప్పటికీ అది ‘మార్కెట్ ఎకానమీ’కాదు. ‘మార్కెట్ ఎకానమీ’ మూడు ‘దగా’లు- ఆరు‘దోపిడీ’లుగా పరిఢవిల్లుతున్న దేశాలలో మాత్రమే విదేశీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులను పెడుతున్నాయట! అందువల్ల విదేశీయ సంస్థల పెట్టుబడుల- ఫారిన్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ-ను తరలించుకొని రావాలన్న తహతహతో ఉన్న ప్రతి ప్రభుత్వం తమ దేశం ‘మార్కెట్ ఎకానమీ’అని ప్రకటిస్తోంది. దీనికి మళ్లీ ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ పరిగణన పొందాలి. ధరల నియంత్రణలో ఏమాత్రం ప్రభుత్వ ప్రమేయం ప్రస్ఫుటించినప్పటికీ ‘మార్కెట్ ఎకానమీ’ హోదా దక్కదట. దక్కకపోయినట్టయితే విదేశాల పెట్టుబడులు రావన్నది ప్రభుత్వాల భయం. మన ప్రభుత్వం మరింత అతిగా భయపడుతోంది. అందువల్లనే మన దేశంలో ‘వాణిజ్య సౌలభ్యం’- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- గొప్పగా వర్ధిల్లుతోందని మన ప్రభుత్వం భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయే విధంగా పదే పదే పెద్దగా ప్రకటిస్తోంది. ‘వాణిజ్య సౌలభ్యం విస్తృతం కావడం’ అని అంటే దేశీయ, విదేశీయ బహుళ జాతీయ వాణిజ్యసంస్థల- మల్టీనేషనల్ కంపెనీస్-కు మరిన్ని రాయితీలు ప్రకటించడం. ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయ ప్రణాళిక- బడ్జెట్- ఆవిష్కరణ సమయంలో అంతకుముందు సంవత్సరం వరకు లభింపచేసిన రాయితీల కంటె మరిన్నింటిని ఈ వాణిజ్య సంస్థలకు లభింపచేయడం ‘వాణిజ్య సౌలభ్యం’ విస్తరించడం.. ఈ ఏడాది కూడ అదే జరిగింది. ఇలా ‘వర్ధిల్లుతున్న’ మార్కెట్ ఎకానమీని రాకపోకల, రహదారుల రంగాలలో అమలుజరుపడంలో భాగం ఈ ‘టోల్’టాక్స్ వ్యవస్థ...
జాతీయ పథాలను- మహాపథాలు- హైవేస్-, క్షిప్ర పథాలు-వేగంగా వాహనాలు దూసుకొని పోవడానికి అనువైన రహదారులు- ఎక్స్‌ప్రెస్ వేస్- నిర్మించడానికి అనుమతి లభించిన ప్రభుత్వేతర సంస్థలు ఈ రహదారుల నిర్మాణ వ్యయాన్ని ‘టోల్’ద్వారా రాబట్టుకుంటున్నాయి. ‘మహాపథాల మీద క్షిప్ర పథాల మీద నిర్ణీత దూరంలో ‘శుల్క ద్వారాలు’- టోల్ ప్లాజాల-ను ఏర్పాటుచేసి ప్రతి వాహన చోదకుని వద్ద శుల్కాన్ని వసూలు చేస్తున్నారు. బెంగళూరులో బయలుదేరి హైదరాబాదుకు చేరుతున్న ‘కారు’ చోదకుడు దాదాపు వెయ్యి రూపాయల వరకు ఈ రహదారి శుల్కాన్ని చెల్లించవలసి వస్తోంది. ద్విచక్ర వాహనాల వారు, లారీల వారు, బస్సులవారు, బృహత్ శకటాల- మెగావెహికల్స్- వారు స్థాయిని బట్టి ఈ ‘రహదారి శుల్కాన్ని’ చెల్లించవలసి వస్తోంది. రహదారి నిర్మాణం పూర్తయిన తరువాత ‘నిర్మించిన’ పారిశ్రామికవేత్తలు ఎన్నాళ్లవరకు ఇలా ‘శుల్కాన్ని’ దండుకోవచ్చు? ఆ సంస్థవారు ఎంత ఖర్చుపెట్టారు? ఎంత దండుకుంటున్నారు? అన్న వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. వినియోగదారులు లేదా ప్రయాణీకులు ఎంత కాలం ఈ ‘రహదారి శుల్కం’ చెల్లించాలి? అన్న ప్రశ్నకు మాత్రం నితిన్ గడ్కరీ సభలో సమాధానం చెప్పారు. వాహన యజమానులు, చోదకులు జీవితమంతా ఈ శుల్కాన్ని చెల్లించవలసిందేనన్నది మంత్రి చెప్పిన సమాధానం! అందువల్ల చెల్లిస్తూనే ఉండవలసిందే. ఇలా సందేహ నివృత్తి ద్వారా నితిన్ గడ్కరీ ‘మార్కెట్ ఎకానమీ’పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నాడు. ‘మార్కెట్ ఎకానమీ’ మన్‌మోహన్‌సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 1990వ దశకంలో మొదలైంది. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో బలంగా వేళ్లూని వ్యవస్థీకృతమైంది. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం వారి ఆర్థిక విధానాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వారు మరింత చిత్తశుద్ధితో అమలుజరుపుతున్నారు. ‘సమష్టి హితం’ కోసం అన్ని ప్రధాన రాజకీయ పక్షాలవారు విధాన సమానత్వాన్ని పాటించాలన్న ప్రజాస్వామ్య ఆదర్శం ఇలా సాకారమైంది. సమష్టి హితం బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ప్రయోజనం! అందువల్లనే ‘మార్కెట్ ఎకానమీ’లో ప్రజల సమస్యలకు తావులేదు, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ ప్రమేయం లేదు. వస్తువులకున్న గిరాకీ, వస్తువుల లభ్యత- డిమాండ్ అండ్ సప్లయ్-ప్రాతిపదికగా మాత్రమే ధరలు నిర్ధారితమవుతాయి. ‘లభ్యత’ను ‘గిరాకీ’ని ఘరానా వ్యాపారులు నిర్ధారిస్తారు, నియంత్రిస్తారు. సేవల రంగంలోని ఈ ‘్ధరల’కు ‘శుల్కాల’-టోల్స్- అని పేరు. ఇవి ఇంకా పెరగవచ్చునన్నది గడ్కారీ చెప్పిన తీపి కబురు. తీయదనం రహదారులను నిర్వహిస్తున్న ‘దోపిడీ’ సంస్థలకు..!
నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి- అన్న సూత్రం ప్రకారం ప్రభుత్వం ఈ మహాపథాల నిర్మాణాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించింది, నిర్మించిన సంస్థల వారు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వపు అధీనానికి బదిలీ ఎప్పుడు చేస్తారు?-అన్న విషయం మాత్రం గడ్కరీ స్పష్టీకరించలేదు. బదిలీ జరిగిన తరువాత ‘రహదారి శుల్కాలు’ రద్దు కావాలి. కనీసం బాగా తగ్గిపోవాలి! కానీ ‘‘కల్పాంతం’’వరకూ జనం రహదారి శుల్కాలు చెల్లిస్తూనే ఉండాలి కనుక ఎప్పటికీ రహదారులు నిర్వహణ ప్రభుత్వేతర సంస్థల నియంత్రణలోనే ఉండిపోతుందా? ఇలాంటి ‘శుల్కాలు’ తన ‘బుద్ధి బిడ్డ’లు- బ్రెయిన్ చైల్డ్- అని గడ్కరీ అంటున్నాడు. 2014కు పూర్వం ప్రభుత్వం నిర్వహించిన రాజకీయ వాదులు బాధపడరా??