సంపాదకీయం

సమగ్రతకు సాకారం..??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిపోవడం జమ్మూ కశ్మీర్ సమగ్రతా సాధనకు శ్రీకారం మాత్రమే. భౌగోళిక సర్వసమగ్రతా సాకారం ఇంకా సిద్ధించవలసి ఉంది. అఖండ భారత్ ముక్కలు చెక్కలు కావడం, భారత్‌లో అవిభాజ్యమైన జమ్మూ కశ్మీర్ ముక్కలు చెక్కలు కావడం సమాంతర పరిణామాలు. ఈ ఉభయ విపరిణామాలకు ప్రధాన కారకుడు 1946 నుంచి 1964 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ ‘అధి నాయకుడు’ జవహర్‌లాల్ నెహ్రూ. ఈ ‘అధి నాయకత్వం’ మరో చారిత్రక వైపరీత్యం. ఈ ‘ముక్కలు చెక్కలైన’ భౌగోళిక చరిత్ర గురించి, మూడువందల డెబ్బయ్యవ అధికరణం రాజ్యాంగంలోకి ‘చొఱబడడం గురించి’ పార్లమెంటు ఉభయ సభలలో సోమ,మంగళ వారాలలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా జాతీయ నిష్ఠకల రాజకీయ వేత్తలు అనేక చారిత్రక వాస్తవాలను ప్రస్తావించారు. కానీ, జాతీయ నిష్ఠలేని రాజకీయవేత్తలు బోలెడన్ని చారిత్రక వక్రీకరణలను సైతం ఉభయ సభలలో చాటించారు. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ చెప్పిన అబద్ధాలు ‘వక్రీకరణ’కు పరాకాష్ఠ. ‘జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయడానికి 1947లో అప్పటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ అంగీకరించాడు..’-అన్నది బుద్ధికి ‘చెదలు’పట్టిన కపిల్ సిబల్ చెప్పిన పచ్చి అబద్ధం. ‘జన బాహుళ్య- మెజారిటీ- సూత్రాన్ని అనుసరించి ఉండినట్టయితే జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్‌లో విలీనం అయి ఉండాలి..’అన్నది ఆయన నిర్లజ్జగా నిర్భయంగా రాజ్యసభలో చేసిన పాకిస్తాన్ అనుకూల ప్రకటన! బహుశా కపిల్ సిబల్ చెప్పగలిగిన స్ఫూర్తితో కాబోలు.. లోక్‌సభలో మరికొందరు కూడ ‘చారిత్రక’ అబద్ధాలను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ రాజ్యాంగపు మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని సమర్ధించాడన్నది ఈ ‘శతాబ్దపు అబద్ధం’. అవగాహన లేక కొందరు, దుర్బుద్ధితో మరికొందరు ఇలా ‘రద్దయిన రాజ్యాంగపు అధికరణం అవతరణ’కు సంబంధించిన అబద్ధాలను ఆవిష్కరించారు!!
సర్దార్ పటేల్ 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి దేశంలోని దాదాపు ఐదువందల డెబ్బయి ఐదు సంస్థానాలను బ్రిటన్ విముక్త భారత్‌లో విలీనం చేయడం చరిత్ర. 1947 ఆగస్టు 15నాటికి జునాగఢ్, హైదరాబాదు, జమ్మూ కశ్మీర్ సంస్థానాలు మాత్రమే బ్రిటన్ విముక్త భారత్‌లో చేరలేదు. సర్దార్ పటేల్ కృషివల్ల మాత్రమే ఆ తరువాత జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలకు ‘జిహాదీ’ల బీభత్సపాలన నుంచి విముక్తి లభించింది. ఈ విలీన విముక్తుల వ్యవహారంలో నెహ్రూ ప్రమేయం లేదు. అందువల్ల ఆ తరువాత సమస్యలు ఉత్పన్నం కాలేదు. కానీ జమ్మూకశ్మీర్ వ్యవహారంలో మాత్రం నెహ్రూ జోక్యం కల్పించుకున్నాడు. జమ్మూకశ్మీర్ ముక్కలు చెక్కలు కావడానికి నెహ్రూ ‘నిర్వాకం’ ఏకైక కారణం.. నెహ్రూ జోక్యం వల్ల రెండు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మొదటిది మూడువందల డెబ్బయ్యవ అధికరణం రాజ్యాంగంలో చేరడం. ఫలితంగా లభించిన ‘ప్రత్యేక ప్రతిపత్తి’వల్ల తాము మిగిలిన భారత ప్రాంతాల వారికంటె భిన్నమన్న భావం కశ్మీర్ ప్రజలలో అత్యధికులకు ఏర్పడడం. ఈ ‘్భన్నభావం’ క్రమంగా విచ్ఛిన్నకాండకు, విద్రోహకాండకు, బీభత్సకాండకు దారితీసింది. జమ్మూకశ్మీర్‌ను దేశం నుండి విడగొట్టాలన్నది బీభత్స జిహాదీ మూకల లక్ష్యం. పాకిస్తాన్ 1947 నుంచీ ఈ మూకలను పెంచి పోషించి ఉసిగొలుపుతోంది. సర్దార్ పటేల్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించినప్పటికీ నెహ్రూ ‘ఆధిపత్యం’వల్ల ఈ ‘అధికరణం’ రాజ్యాంగంలోకి చొరబడడం వాస్తవం! కానీ ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికి పార్లమెంటు ఉభయ సభలలో ఇప్పుడు జరిగిన ప్రయత్నాన్ని దేశ ప్రజలు నిరసిస్తున్నారు. నెహ్రూ ప్రమేయం లేకుండా సర్దార్ పటేల్ మాత్రమే జమ్మూకశ్మీర్ విలీనం వ్యవహారాన్ని నిర్వహించి ఉండినట్టయితే డెబ్బయి రెండేళ్లలో కశ్మీర్ కల్లోలం అంకురించి ఉండేది కాదు....
నెహ్రూ ఇలా జమ్మూకశ్మీర్‌లో వ్యధను రగిలించడానికి కారణం ‘ముస్లిం కాన్ఫరెన్స్’- ఆ తరువాత నేషనల్ కాన్ఫరెన్స్- నాయకుడు షేక్ అబ్దుల్లాతో ఆయనకున్న సాన్నిహిత్యం. జమ్మూ కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ఏర్పాటుచేయాలన్న విచ్ఛిన్నకాంక్షకు షేక్ అబ్దుల్లా మానవ రూపం. కానీ ఈ విచ్ఛిన్న కాంక్ష నెరవేరలేదు, నెరవేరబోదు. అందువల్ల కనీసం ప్రత్యేక ప్రతిపత్తిగల ప్రాంతంగానైనా తమ ‘ప్రాబల్య మండలం’ ఏర్పడాలన్నది షేక్ అబ్దుల్లా వాంఛ. ఫలితంగా నెహ్రూ రంగప్రవేశం చేశాడు. 1950లో సర్దార్ పటేల్ మరణించడంతో నెహ్రూ ‘విధానం’ నిర్నిరోధంగా కొనసాగింది. ఇదీ వాస్తవం. నెహ్రూ విధానాలు గిట్టని శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ముఖర్జీ ఈ ‘అధికరణం’ రద్దుకోసం ఉద్యమించి ప్రాణాన్ని బలిదానం చేయడం వాస్తవం! ఈ చారిత్రక వాస్తవాలను వక్రీకరించడానికి కొందరు ప్రతిపక్షాల ప్రతినిధులు పార్లమెంటులో యత్నించారు! ప్రత్యేక ప్రతిపత్తి- స్పెషల్ స్టేటస్- చాలదని, స్వయం ప్రతిపత్తి- అటానమీ- కావాలని షేక్ అబ్దుల్లా కుమారుడు ఫరూక్ అబ్దుల్లా కోరడం చరిత్ర. ఈ ఇద్దరూ, ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా కశ్మీర్ ముఖ్యమంత్రులు కాగలిగారు. కుటుంబ వారసత్వ రాజకీయానికి వీరు ప్రతినిధులు. ముఫ్తీ మహమ్మద్ సరుూద్, ఆయన కుమార్తె మెహబూబాలు కూడ కశ్మీర్‌కు ముఖ్యమంత్రులయ్యారు. వీరి నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ- పిడిపి- మరింత ముందుకెళ్లి కశ్మీర్‌కు ‘స్వయం పాలన’- సెల్ఫ్ రూల్-ను కోరింది. ఇలా దేశ వ్యతిరేకత, విచ్ఛిన్నతత్త్వం, విద్రోహం జమ్మూకశ్మీర్‌లో వేళ్లుఊనడానికి దోహదం చేసిన ‘అధికరణం’కల్పించిన వాడు నెహ్రూ మాత్రమే! చరిత్రను వక్రీకరిస్తున్నవారు ప్రజల నిరసనకు గురికాక తప్పదు.. జమ్మూకశ్మీర్ దేశంలో విలీనం అవుతున్న సమయంలోనే పాకిస్తానీ కిరాయి మూకలు, ప్రభుత్వ మూకలు జమ్మూకశ్మీర్‌లో చొఱబడడం చరిత్ర! ఈ చొరబాటును మన సైనికులు తిప్పికొట్టారు. సైనిక చర్య మరికొన్ని రోజులు కొనసాగి ఉండినట్టయితే జమ్మూకశ్మీర్ పూర్తిగా ‘చొఱబాటు’నుంచి విముక్తం అయి ఉండేది. కానీ నెహ్రూ ‘విముక్తి’ పూర్తికాక పూర్వమే అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపివేశాడు. ఫలితంగా జమ్మూకశ్మీర్‌లోని ఎనబయి మూడువేల చదరపు కిలోమీటర్ల భూభాగం పాకిస్తాన్ దురాక్రమణలోనే ఉండిపోయింది! ఈ పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్‌కు విముక్తికలిగే వరకు, చైనా దురాక్రమిత జమ్మూకశ్మీర్ మళ్లీ మన దేశంలో భాగం అయ్యేవరకు జమ్మూకశ్మీర్‌కు భౌగోళిక సమగ్రత సిద్ధించదు.
‘గుదిబండ’ అధికరణం రద్దుకావడం సమగ్రత సాధనకు శ్రీకారం. ‘సమగ్రత’ సిద్ధించడం తుది లక్ష్యం. ఇందుకోసం ఇటు పాకిస్తాన్‌తోను అటు చైనాతోను మనం తలపడవలసి ఉంది. చైనా జమ్మూకశ్మీర్‌లో రెండుచోట్ల చొఱబడి తిష్ఠవేసి ఉంది. తన అక్రమ అధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని ఆరువేల చదరపు కిలోమీటర్లను పాకిస్తాన్ 1963లో చైనాకు అప్పగించింది. 1950వ దశకంనుంచి చైనా అంచెలంచెలుగా లడక్‌లోని నలబయి వేల చదరపు కిలోమీటర్లను దురాక్రమించి ఉంది. ఇలా జమ్మూకశ్మీర్‌లోని దాదాపు లక్షా ఇరవైమూడువేల చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్, చైనాలు దురాక్రమించి ఉన్నాయి. మన అధీనంలో కేవలం లక్షా పనె్నండు వేల చదరపు కిలోమీటర్ల జమ్మూకశ్మీర్ మాత్రమే మిగిలి ఉంది! ‘అధికరణం’ రద్దు సాంస్కృతిక సమగ్రతకు చిహ్నం. కానీ భౌగోళిక సమగ్రత మాత్రం ‘దురాక్రమిత’ కశ్మీర్‌ను మళ్లీ మనం సాధించినప్పుడే సిద్ధిస్తుంది. దేశ వ్యవహారాల మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ఈ విషయాన్ని, ఈ లక్ష్యాన్ని పునరుద్ఘాటించడం హర్షణీయం! అనాదిగా జమ్మూ కశ్మీర్ మన దేశంలో భాగం. పార్వతీదేవి పరమేశ్వరుని గురించి తపస్సుచేసిన ప్రాంతం సతీ సరస్సు. ఒకప్పటి సతీ సరస్సు నేటి కశ్మీర్ లోయ... ‘‘కశ్మీరా పార్వతీప్రోక్తా....’- కశ్మీరు పార్వతీ స్వరూపం- అని ‘మహాభారత’ సమయంలో యదుకుల కృష్ణుడు తన సోదరుడు బలరామునికి వివరించడం చరిత్ర! ఈ చరిత్రను బ్రిటన్ దురాక్రమణకారులు చెఱపిపోయారు. ఇన్నాళ్ల మళ్లీ ఈ జాతీయ చరిత్ర మళ్లీ మొదలవుతోంది....
నింగి నుండి తారకలు
నిష్క్రమించవచ్చుకాక,
పొంగి పొరలి సముద్రాలు
పుడమిని ముంచెత్తుగాక,
మాతృ శిరోమణి మకుటపు
ధవళ కాంతి మలగిపోదు,
భరతభూమి పరిధి నుండి
కాశ్మీరం విడిపోదు...