సంపాదకీయం

వికృత పోకడల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసికందును ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, ఆపై క్రూరంగా హతమార్చిన కామోన్మాది ప్రవీణ్‌కు వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని అన్ని వర్గాల వారూ ముక్తకంఠంతో హర్షిస్తున్నారు. సభ్య సమాజాన్ని నివ్వెరపరచిన ఈ ఘోరం జరిగాక- కేవలం 48 రోజుల్లోనే దర్యాప్తు, విచారణ ప్రక్రియలను ముగించి నిందితుడికి కఠిన శిక్ష విధించడంతో పోలీసు, న్యాయశాఖల పట్ల జనంలో నమ్మకం పెరిగింది. ముక్కుపచ్చలారని పసిగుడ్డును కర్కశంగా కడతేర్చిన కర్కోటకుడికి భూమీద జీవించే హక్కు లేదని న్యాయస్థానం తేల్చింది. ఆ కామాంధుడికి ఒక్క మరణశిక్ష మాత్రమే కాదు.. మూడు జీవిత ఖైదులు, ఇరవై ఏళ్ల చొప్పున మరో రెండు శిక్షలు కూడా విధించడంతో ఈ కేసుపై న్యాయమూర్తి ఎంతగా చలించిపోయారో అవగతమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత స్వల్ప వ్యవధిలో తీర్పు వెలువడిన తొలికేసు ఇదే కావడం విశేషం. శాయంపేట మండలం వసంతాపూర్‌కు చెందిన 25 ఏళ్ల ప్రవీణ్ జూన్ 18న అర్ధరాత్రి వేళ హన్మకొండలోని ఓ ఇంట్లో చొరబడి, తల్లి పక్కనే నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకొనిపోయి పాశవికంగా అత్యాచారం చేశాడు. పాప ఏడవడంతో నోరు, ముక్కు మూసి హతమార్చాడు. సంఘటన జరిగిన కొద్ది సేపటికే స్థానికులు నిందితుడిని వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ దారుణం గురించి తెలియగానే వరంగల్ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. జనాగ్రహం వెల్లువెత్తడంతో ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు చురుగ్గా వ్యవహరించి, ఇరవై రోజుల్లోనే దర్యాప్తు చేసి, కోర్టులో చార్జిషీటును దాఖలు చేశారు. నిందితుడిపై అపహరణ, అత్యాచారం, హత్య తదితర నేరారోపణలతో పాటు ‘లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ’ (పోక్సో) చట్టం కింద ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో అభియోగాలను దాఖలు చేశారు. అత్యాచారం, హత్య, ఇతర నేరాలకు సంబంధించి సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో నిందితుడికి కోర్టు ఉరిశిక్షను విధించింది. నిందితుడి తరఫున వాదించేందుకు స్థానిక న్యాయవాదులు విముఖత చూపారంటే సభ్య సమాజాన్ని ఈ దారుణ ఉదంతం ఎంతగా కలచివేసిందో తేటతెల్లమవుతుంది. ప్రవీణ్‌కు ఉరిశిక్ష సరైనదేనని, ఇలాంటి దారుణాలు ఇకముందు జరగకుండా చట్టంపై నమ్మకం కలిగేలా తీర్పు వెలువడిందని చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు. కాలయాపన లేకుండా ఉరిశిక్ష అమలైతేనే తమ పాపకు ఆత్మశాంతి కలుగుతుందని వారు తీవ్ర భావోద్వేగంతో అన్నారు.
తాగిన మైకంలో ఏం చేశానో తనకు తెలియదని దోషి ప్రవీణ్ చెబుతున్నా, అతడు లైంగిక వాంఛతో రగిలిపోతూ మహిళల పట్ల తరచూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసుల దర్యాప్తులో బహిర్గతమైంది. సెల్‌ఫోన్‌లో నిత్యం నీలిచిత్రాలను వీక్షిస్తూ కాలం గడిపేవాడని అతడి సన్నిహితులు చెప్పారు. హోటల్‌లో పనిచేసే ప్రవీణ్ సెల్‌ఫోన్లను చోరీచేస్తూ అశ్లీల చిత్రాలు చూసేందుకు అలవాటు పడ్డాడు. ఇంటి బయట ఆరేసిన చీరలను వాసన చూస్తూ కామోద్రేకానికి లోనయ్యే అతడు లైంగికానందం కోసం వికృత చేష్టలకు పాల్పడేవాడు. ప్రవీణ్ ప్రవర్తన గురించి తెలిసినప్పటికీ కుటుంబ సభ్యులు కాని, స్థానికులు కాని ఏనాడూ అతడిని దండించలేదు. పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతడిని పట్టించుకోలేదు. తల్లి, ఇద్దరు సోదరులు అతడిని చూసేందుకు జైలుకు గాని, తీర్పు వెలువడినపుడు కోర్టు వద్దకు గాని హాజరు కాలేదు. ఈ కేసులో మొత్తం 51 మందిని సాక్షులుగా పోలీసులు చేర్చారంటే- నిందితుడి వికృత ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. ప్రవీణ్‌లో విపరీత లైంగిక వాంఛలు, నేర స్వభావం ఉన్నట్టు తెలిసి కూడా అతడిని గాడిలో పెట్టేందుకు కుటుంబ సభ్యులు గాని, తెలిసిన వారు గాని చొరవ చూపకపోవడంతో- సమాజం సిగ్గుతో తలదించుకొనే దారుణం జరిగిపోయింది. అభం శుభం తెలియని చిన్నారి చిత్రహింసను అనుభవించి చివరికి మృత్యువు ఒడికి చేరింది.
వయసుతో సంబంధం లేకుండా- ఆడశిశువులపై, బాలికలపై, యువతులపై, గృహిణులపై మన దేశంలో అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ‘సంచలనాత్మక ఘటనలు’ జరిగిన ప్రతిసారీ ప్రజలు ఆందోళనలు జరిపాక ప్రభుత్వాలు మేల్కొని కొత్త చట్టాలు తేవడం, ఉన్న చట్టాలను కఠినతరం చేయడం పరిపాటిగా మారింది. 2012లో దేశ రాజధానిలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన తర్వాత 2013లో ‘నిర్భయ చట్టం’ రూపొందింది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టిన దాఖలాలు లేవు. ‘జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ’ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2013 నాటికి దేశ వ్యాప్తంగా బాలికలపై అత్యాచారాలకు సంబంధించి 33,328 కేసులు విచారణ దశలో ఉండగా, కేవలం 1,611 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. తగిన సాక్ష్యాధారాలు లేక వేలాది కేసులు వీగిపోతున్నాయి. పెండింగ్ కేసుల రేటు 84.5 శాతంగాను, శిక్షల రేటు 31.5 శాతంగాను ఉంది. బాలికలపై అత్యాచారాల విషయంలో దేశం మొత్తం మీద నమోదయ్యే కేసుల్లో 14 శాతం కేసులు దిల్లీలోనే నమోదు కావడం గమనార్హం. దేశ రాజధానిలోని ఓ అంధుల పాఠశాలలో ముగ్గురు బాలికలపై లైంగిక నేరానికి పాల్పడిన ఓ బ్రిటన్ జాతీయుడిపై కేసు నమోదు కావడం విశేషం. ఇళ్లలో, మురికివాడల్లో, తమకు తెలిసిన ప్రాంతాల్లోనే బాలికలు ఎక్కువగా లైంగిక దాడులకు గురవుతున్నారు. 38.8 శాతం కేసుల్లో సమీప బంధువులే నిందితులు కావడం ఆందోళనకరం. 60.8 శాతం మేరకు అత్యాచారాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో చోటుచేసుకొంటున్నాయని, బాధితుల్లో 90 శాతం మంది తమపై జరిగిన అఘాయిత్యాల గురించి ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారని గణాంకాలు ఘోషిస్తున్నాయి. బాలలపై లైంగిక నేరాలు పెరిగిపోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించి, కేసుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు సూచించింది. ‘లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ’ (పోక్సో) చట్టం 2012లో అమలులోకి వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ‘పోక్సో’ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను ఇటీవల పార్లమెంటు ఆమోదించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని ‘పోక్సో’ చట్టంలో సవరణలు చేశారు. సాక్షులను విచారించేందుకు కోర్టుల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని, బాధిత బాలలు గౌరవంగా జీవించేలా అనుకూల వాతావరణం కలిగించాలని సవరణలు చేశారు. ‘పోక్సో’ సవరణ చట్టంపై ప్రజానీకంలో తగిన అవగాహన కలిగించేలా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ప్రతిపాదించారు. కేసు విచారణలో ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికలు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేయాలని, దేశ వ్యాప్తంగా వంద ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను నెలకొల్పాలని సూచించారు. కఠిన చట్టాలు అమలు చేస్తే తప్ప నేరగాళ్లలో భయం ఏర్పడదన్న భావంతో ‘పోక్సో’లో ఇపుడు మరణదండనను చేర్చారు. బాలలతో నీలిచిత్రాలు తీసేవారికి, వాటిని వ్యాప్తి చేసేవారికి జైలుశిక్షలను, జరిమానాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. ‘పోక్సో’ సవరణ చట్టం ప్రకారం నేరగాళ్లకు ఇరవై ఏళ్ల జైలుశిక్ష మొదలు మరణించే వరకూ జైలులోనే ఉండేలా జీవిత ఖైదు విధించడానికి అవకాశం ఉంటుంది. 2012లో అమలులోకి వచ్చిన ‘పోక్సో’ చట్టం కింద కేసుల సంఖ్య పెరుగుతున్నా, శిక్షలు పడుతున్న సందర్భాలు చాలా తక్కువ. కేవలం 9 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. 2016 నాటికి ‘పోక్సో’ చట్టం కింద 36,022 కేసులు నమోదు కాగా, దాదాపు 12వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 40 శాతం మంది బాధితులకు చట్ట సహాయం కూడా అందడం లేదు. గతంలో నమోదైన కేసులతో కలిపి, ఈ చట్టం వచ్చాక పెండింగ్ కేసుల సంఖ్య లక్ష దాటింది.
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సెల్‌ఫోన్లలో సామాజిక మాధ్యమాల్లో విహరించేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగి సమాజంలో వికృత పోకడలు చోటుచేసుకొంటున్నాయి. ఫేస్‌బుక్, యూ ట్యూబ్, టిక్‌టాక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో అశ్లీలం విశృంఖలమవుతోంది. సెల్‌ఫోన్లలోకి చొరబడే అశ్లీలాన్ని నిరోధించేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఫోన్లతో నిత్యం కాలక్షేపం చేసే బాలలు, యువతలో కొంతమంది దారి తప్పుతున్నారు. ఇళ్లలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం, విద్యాసంస్థల్లో నైతిక విలువలను బోధించకపోవడంతో విపరీత పరిణమాలు అనివార్యమవుతున్నాయి. సమాజంలో విస్తరిస్తున్న వికృత పోకడలకు అడ్డుకట్ట వేయనంత కాలం- ఎన్ని కఠోర చట్టాలు తెచ్చినా, కఠిన శిక్షలు వేసినా నేరాలను నియంత్రించడం పెను సవాలే.