సంపాదకీయం

మహాత్ముని బాటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మా గాంధీ సార్థ శత జయన్తి- నూట యాబయ్యవ జయన్తి- సం వత్సర ఉత్సవాలు జరుగుతుండడం డెబ్బయి మూడవ భారత స్వాతంత్య్ర దినోత్సవానికి చారిత్రక నేపథ్యం. మహాత్మా గాంధీ స్వచ్ఛతకు ప్రతిరూపంగా భాసించడం చరిత్ర. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలలో మహాత్మా గాంధీ ప్రబోధించిన స్వచ్ఛతను ప్రస్తావించడం ఈ చరిత్రకు అనుగుణం. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణ నిష్ఠను పునరుద్ఘాటించడం మహాత్మాగాంధీకి ‘స్వచ్ఛ భారతం’ సమర్పించుకొంటున్న నివాళి! బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ సమరం, సత్యాగ్రహ ఉద్యమం సమాంతరంగా సాగడం తొంబయి ఏళ్ల చరిత్ర. క్రీస్తుశకం 1857లో ఈ స్వాతంత్య్ర సంఘర్షణ మొదలైంది, 1947 ఆగస్టులో మన దేశం నుంచి బ్రిటన్ మూకలు నిష్క్రమించవలసి వచ్చింది. బ్రిటన్ వ్యతిరేక సాయుధ సమరానికి పరాకాష్ఠ నేతాజీ సుభాస్ చంద్రవసు.. సత్యాగ్రహ ఉద్యమ విజయసారథి మహాత్మా గాంధీ. గాంధీ ద్వారా ప్రస్ఫుటించిన స్వచ్ఛతకు ప్రాతిపదిక రాట్నం... నూలు వడకడంతో మొదలు, వస్త్రం తయారయ్యేవరకూ కొనసాగే ప్రక్రియ వికేంద్రీకృత ప్రగతికి మాధ్యమమన్నది మహాత్మా గాంధీ చెప్పిన మాట! పొలంలో పత్తి పండించడానికి నాగలితో దున్నడం నుంచి ‘మగ్గం’పై బట్ట రూపొందేవరకు జరిగే కార్యక్రమం పల్లెల ఆర్థిక పుష్టికి ప్రాతిపదిక మాత్రమే కాదు పర్యావరణ స్వచ్ఛతకు ప్రతీక కూడ! ఈ స్వచ్ఛత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశ రాజధానిలోని ఎఱ్ఱకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మరోసారి ప్రస్ఫుటించింది. మహాత్మా గాంధీ దినచర్యలో నూలు వడకడం అనివార్యమైన అంశం. సబర్మతీ, వార్థా ఆశ్రమ కుటీరాలలో నివసించినప్పుడు మారుమూలలలోని పల్లెలలో పర్యటించినప్పుడు దళిత వాడలలో హరిజన బస్తీలలో విడిది చేసినప్పుడు గాంధీ దినచర్య ఒకే విధంగా ఉండడం నియమ పాలనకు చారిత్రక నిదర్శనం. నిద్రలేచిన వెంటనే- తెల్లవారుజామున మూడు గంటలకు- రాట్నంపై నూలు వడకడంతో గాంధీ దినచర్య మొదలయ్యేది. నూలు స్వచ్ఛత, పత్తి స్వచ్ఛత. తన దినచర్యలోని అన్ని కార్యక్రమాలలోను అత్యంత ప్రధానమైనది నూలు వడకడమన్నది మహాత్ముడు స్వయంగా చెప్పిన మాట! మడక- నాగలి- భూమి స్వచ్ఛతకు ప్రతినిధి. మగ్గం పర్యావరణ స్వచ్ఛతానిధి. ఈ రెండూ మహాత్ముడు పునరుద్ధరించదలచిన వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు పునాది రాళ్లు, గ్రామ స్వరాజ్య రథానికి చక్రాలు! నరేంద్ర మోదీ భూమి స్వచ్ఛతను పరిరక్షించాలని కోరాడు. పర్యావరణ సమతుల్యతను సాధించాలని కోరాడు. రసాయన విషాలు నిండిన ఎఱువులు భూమి స్వచ్ఛతను భంగపరిచాయి, ‘ప్లాస్టిక్’ పదార్థాలు పర్యావరణ పరిపుష్టికి ప్రబల విరోధులు. గాలి నీరు నేల నింగి ‘ప్లాస్టిక్’ విషాలతో కాలుష్యం కావడం దశాబ్దుల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం. నిప్పు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ విషాలను జీర్ణించుకోవడం లేదు. పంచభూత భాసితమైన ప్రకృతికి ఇలా పరమ మిత్రము పత్తి, పరమ శత్రువు ‘ప్లాస్టిక్’.. ‘ప్లాస్టిక్’ను నిర్మూలించడానికి ‘పత్తి’ వస్తువులను పెంపొందించాలి. గురువారం ప్రధాని చెప్పిన ఈ మాట మహాత్మా గాంధీ చూపిన బాట!
భద్రత పదిలపడిందన్నది రాష్టప్రతి, ప్రధానమంత్రి బుధవారం, గురువారం చేసిన ప్రసంగాలలో ఇతివృత్తం. రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం, ముప్పయి ఐదవ అధికరణంలోని ‘ఏ’ ఉప అధికరణం రద్దుకావడం దేశ భద్రతకు దోహదం చేసిన పరిణామం. దేశమంతటా అన్ని ప్రాంతాలకు వర్తించే భారత రాజ్యాంగం ఉంది. కానీ కశ్మీర్ ప్రాంతానికి మరో ‘రాజ్యాంగం’ అదనంగా ఏర్పడి ఉండడం ఏడు దశాబ్దుల వైపరీత్యం. జమ్మూకశ్మీర్‌లో విద్రోహులు, విచ్ఛిన్నకారులు, జిహాదీ బీభత్సకారులు, పాకిస్తాన్ తొత్తులు విలయతాండవం చేయడానికి ఈ ‘ప్రత్యేకత’ దోహదం చేసింది. ఇప్పుడు ఈ ‘గుదిబండ’ అధికరణాలు రద్దుకావడం ‘ఒకే జాతి, ఒకే రాజ్యాంగం’ అన్న వాస్తవం పునరుద్ధరణను పొందగలిగింది. విద్రోహకాండకు ఇది అశనిపాతం. భద్రతకు దోహదం చేస్తున్న ఈ వాస్తవాలను ప్రస్తావించడంతోపాటు భద్రతా నిర్వహణలో మరింత సమన్వయం వికసించడానికి దోహదం చేయగల త్రివిధ రక్షణ దళాల సమీకృత వ్యవస్థను నరేంద్ర మోదీ ఈ డెబ్బయి మూడవ స్వాతంత్య్ర దినోత్సవ వేదికపై ఆవిష్కరించాడు. సైనిక దళానికి, నౌకా దళానికి, వైమానిక దళానికి విడివిడిగా అధిపతులు ఉన్నారు. ఇకపై ఈ అధిపతులతోపాటు ఈ మూడు విభాగాల సమీకృత వ్యవస్థకు ‘రక్షణ దళాల అధిపతి’- చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా- సీడీఎస్-ని నియమించనున్నారట. మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ రెండు కోట్ల పది లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరడం గురించి ఎఱ్ఱకోట వేదికపై ప్రధాని మరోసారి ప్రస్తావించాడు. మరో ఐదేళ్లలో ఈ స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ- మూడు కోట్ల యాబ యి లక్షల కోట్ల రూపాయల- ఐదు ట్రిలియన్ల అమెరికా డాలర్ల- స్థాయికి చేరుతుందట. భౌతిక భద్రతతోపాటు ఆర్థిక భద్రత పెంపొందుతోంది.
కానీ ఇవన్నీ జాతీయ ప్రగతి ప్రస్థాన క్రమంలో తాత్కాలిక ఘట్టాలు. ఇలాంటి ఘట్టాలు ఎన్నో పరిణమించాయి, మరెన్నో పరిణమించనున్నాయి. కానీ ప్రగతికీ సుగతికీ ప్రాతిపదికలైన భూమిని ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచుకోగలగడం వౌలికమైన శాశ్వతమైన జాతీయ జీవన లక్ష్యం. అందువల్లనే కృత్రిమ రసాయనపు ఎఱువుల వాడకాన్ని క్రమంగా తగ్గించాలని చివరికి రద్దుచేయాలని నరేంద్ర మోదీ చెప్పడం వ్యవసాయ రంగంలో మరో జాతీయ విప్లవానికి శ్రీకారం. నిజంగా ఇది జరిగిన నాడు వ్యవసాయ భూమి మళ్లీ సహజ స్వభావాన్ని సంతరించుకోగలదు. ఇలా సంతరించుకోవడం ప్రాకృతిక సమతుల్యానికి దోహదకరం. ప్రాకృతిక సమతుల్యాన్ని దెబ్బతీసి కాలుష్యాన్ని పెంచుతున్న విషాలలో మొదటిది ‘ప్లాస్టిక్’, రెండవది కృత్రిమ విష రసాయనాల సమూహం! ‘ప్లాస్టిక్’ దాడిని భరించలేక హిమాలయ పర్వత శ్రేణులు కరగిపోతున్నాయి. వాతావరణంలో వేడిమిని ‘ప్లాస్టిక్’ పదార్థాలు పెంచుతున్నాయి. సముద్ర జలాలు కలుషితమైపోయి ఈ కాలుష్యం ‘కాటు’కు సముద్ర చర ప్రాణులు అంతరించిపోతున్నాయి. సముద్ర తీరాలకు చేపల, తాబేళ్ల, తిమింగలాల కళేబరాలు కొట్టుకొని వస్తుండడం నిత్యదృశ్యమైపోయి ఉంది.. అంతరిక్షం సైతం ప్లాస్టిక్ వ్యర్థాలతో, ముక్కలతో నిండిపోతుండడం ‘ప్లాస్టిక్’ ప్రమాద తీవ్రతకు ప్రతీక. ‘ప్లాస్టిక్’ను అక్టోబర్ రెండవ తేదీ- మహాత్మాగాంధీ నూట యాబయి ఒకటవ జయన్తి- నాటికి ఏమేరకు నిర్మూలించగలమన్నది వేచి చూడదగిన అంశం! వినియోగదారులు వ్యాపారుల నుంచి ‘ప్లాస్టిక్’ సంచులను కోరరాదన్నది ప్రధానమంత్రి ఇస్తున్న సలహా! కానీ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, జనుపనార సంచులు, కాగితం సంచులు విరివిగా ఉత్పత్తికావాలి, పంపిణీ కావాలి, వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. ఇది జరగకుండా ‘ప్లాస్టిక్’ బట్టీల ముఠాలు, ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నాయి. అడ్డు తొలగించడం ప్రభుత్వాల విధి....
రసాయన విషాలను ఎఱువులుగా వాడడం వల్ల భూమిని సహజంగా పరిపుష్టం చేస్తున్న ‘వానపాములు’వంటి ప్రాకృతిక జీవులు భూగర్భంలోకి లోతుగా దిగిపోయి మనుగడ సాగిస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయపు మొక్కలు పెరిగే భూమిపై పొరలు నిర్జీవం అయిపోయాయి. ఆవులు పశువుల ద్వారా లభించే పేడ, అడవుల ద్వారా లభించే ఆకులు ఈ దేశంలో అనాదిగా వ్యవసాయ భూమికి సహజమైన ఎఱువులు. ప్రాకృతికమైన ఈ ఎఱువుల వాసన తగిలిన వెంటనే భూగర్భంలోని లోతులలో దాగి ఉన్న ‘వానపాములు’ మళ్లీ భూమిపై పొరలలోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల కృత్రిమ రసాయన విషాల వాడకాన్ని తగ్గించాలంటే ఆవులను, అడవులను పరిరక్షించుకోవాలి. ఇదీ మహాత్మాగాంధీ నడచిన పర్యావరణ పరిరక్షక పథం.. సర్వసమగ్ర సహజ ప్రగతి సాధనాపథం..! చెప్పడం సులభం.. ఆచరణ కష్ట్భూయిష్టం!!