సంపాదకీయం

‘అమెజాన్’ తిండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజనం పంపిణీ వ్యాపారం చేస్తున్న వందల వేల ‘గృహ పరిశ్రమలు’ మూత పడడానికి సిద్ధమవుతున్న రంగం ‘అమెజాన్’ అన్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ విస్తరణకు నేపథ్యం. ‘అమెజాన్’ సంస్థ వారి అతి పెద్ద వాణిజ్య ప్రాంగణం హైదరాబాదులో బుధవారం ఆరంభం కావడం ఈ విస్తరణలో భాగం. ఇలా విదేశీయ సంస్థలు మన దేశంలో విస్తరించి పోతుండడం ‘శుభ పరిణామ క్రమం’అన్న రీతిలో ప్రచారం జరుగుతుండడం అవగాహన రాహిత్యానికి నిదర్శనం. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని మన ‘నిర్వాహకుల’ అవగాహన రాహిత్యం ఇది. ‘వాల్‌మార్ట్’ అన్న అమెరికా సంస్థ ఇదివరకే దేశమంతటా పెద్దపెద్ద చిల్లర దుకాణాలను తెరిచింది. ‘అమెజాన్’కూ ‘వాల్‌మార్ట్’కూ మధ్య జరిగిపోతున్న వాణిజ్య ఆధిపత్య సమరానికి మన దేశం ప్రధాన రంగ స్థలంగా మారింది. ఈ ‘చిల్లర వ్యాపార’ సంస్థల పట్ల ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. కొన్ని దేశాలలో ఈ సంస్థల ‘దుకాణాల’ను మూయించడానికి జరిగిన ప్రయత్నాలు సఫలమయ్యాయి కూడ. ఎందుకంటె వాల్‌మార్ట్, అమెజాన్ వంటి సంస్థలు చిల్లర వ్యాపారంలోకి చొరబడి పోవడంవల్ల పంపిణీ రంగాన్ని నియంత్రించడానికి యత్నించడంవల్ల ఆయా దేశాలలో ‘చిల్లర దుకాణాలు’ స్వదేశీయుల దుకాణాలు మూతపడి పోయాయట. మన దేశంలో కూడ ఇదే జరిగిపోయింది, జరిగిపోతోంది, జరుగబోనున్నది. వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ ఆదర్శవంతమైనదని మేధావులు, ఆర్థికవేత్తలు, ఉద్యమ నిర్వాహకులు, ప్రభుత్వ నిర్వాహకులు దశాబ్దుల తరబడి ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరోవైపు కేంద్రీకరణకు దోహదం చేస్తున్న విధానాలను ప్రభుత్వాల నిర్వాహకులు అమలుజరుపుతున్నారు. మన ప్రభుత్వ విధానాలలో నిహితమైన పరస్పర వైరుధ్యాలు ఈ ‘అవగాహన రాహిత్య ఫలితం’. ప్రతి రంగంలో కేవలం రెండు సంస్థలు లేదా మూడు నాలుగు సంస్థలు మాత్రమే ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ సంస్థలు కూడ అత్యధిక శాతం విదేశాలకు చెందినవి. ఈ విదేశీయ సంస్థలు పరస్పరం పోటీపడి దేశమంతటా వాణిజ్య సామ్రాజ్యాలను ఏర్పాటు చేస్తున్న బీభత్స దృశ్యాలను ప్రభుత్వ నిర్వాహకులు ఆనంద పారవశ్యంతో తిలకిస్తున్నారు. ఈ పారవశ్యానికి కారణం ప్రపంచీకరణ, స్వేచ్ఛావిపణి- మార్కెట్ ఎకానమీ- బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు కలసికట్టుగా సృష్టించిన మాయాజాలం! ఒక్కొక్క విదేశీయ ‘రాక్షస’- జెయింట్- వాణిజ్య సంస్థ ఒక్కొక్క ‘బంగారపు జింక’వలె జనజీవన ప్రాంగణాలలోకి దేశమంతటా చొరబడుతున్నాయి. నిజమైన ప్రగతి ‘వెనుకబడినతనం’గాను, ‘ప్రగతి భ్రాంతి’ నిజమైన ప్రగతి గాను ప్రచారం అవుతుండడం ఈ బంగారపు జింకలు, మారీచ వాణిజ్య మృగాలు సృష్టించిన మాయాజాలం! ఈ మాయల వలలో మన దేశం తగులుకొని ఉంది. ఉచ్చులు బిగిసిపోతుండడం మన నిర్వాహకులు గమనించని వ్యవహారం. ‘బహుళ జాతీయ సంస్థల’ చొఱబాటువల్ల వేల మందికి ఉద్యోగాలు దొరకుతున్నాయన్నది ప్రభుత్వాలు చేసిన ప్రచారం, చేస్తున్న ఆర్భాటం! లక్షల మంది భారతీయులు- చిల్లర వ్యాపారులు, వృత్తికళాకారులు, గ్రామీణ కుటీర పరిశ్రమలవారు ఉపాధిని కోల్పోతున్న కఠోర వాస్తవం గురించి ప్రచారం లేదు, విచారం లేదు, ధ్యాస లేదు..
మహాత్మా గాంధీ సార్థ శత జయన్తి- నూటయాబయ్యవ జయన్తి- వత్సరంలో ఆయన ప్రబోధించిన ‘వికేంద్రీకృత’ప్రగతికి విరుద్ధమైన ‘ప్రగతి భ్రాంతి’ దేశమంతటా వ్యాపిస్తోంది. చిల్లర వ్యాపారంలో, పంపిణీ రంగంలో, ఆవకాయలను అన్నాన్ని సరఫరాచేసే రంగంలో ‘అమెజాన్’వంటి విదేశీయ సంస్థల చొఱబాటు ‘వికేంద్రీకరణ’కు విరుద్ధమైన భారీ కేంద్రీకరణ.. మహాత్మా గాంధీ వికేంద్రీకృత గ్రామ స్వరాజ్యం గురించి, బ్రిటన్ వాణిజ్య బీభత్సకారులు ధ్వంసం చేసిన భారతీయ ఆర్థిక పునరుద్ధరణ గురించి ప్రచారం చేశాడు. కానీ బ్రిటన్ దురాక్రమణ ముగిసిన తరువాత దశాబ్దుల తరబడి ‘కేంద్రీకృత’ పారిశ్రామిక, వాణిజ్య విధానాలను మన ప్రభుత్వాల వారు అమలుజరిపారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో మిగిలి ఉండిన వృత్తులు కూడ నశించిపోయి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పట్టణాల నగరాల జనాభా పది రెట్లుగా పెరిగిపోయింది- ఈ జనాభా కేంద్రీకరణ వల్ల కాలుష్యం కేంద్రీకృతం అయింది. దోమల ప్రమాదం కేంద్రీకృతమైపోయింది. ప్రపంచీకరణ వచ్చిపడిన తరువాత ‘కేంద్రీకరణ’ విదేశీయ వాణిజ్య సామ్రాజ్యంగా విస్తరించింది. ఇదంతా గతంలో బ్రిటన్‌వారు ఐరోపావారు ఆరంభించిన వాణిజ్య సామ్రాజ్య బీభత్స వ్యవస్థకు పునరావృత్తి! రెండు సంస్థలు మాత్రమే చిల్లర వ్యాపారాన్ని, ప్రత్యేకించి అంతర్జాల- ఇంటర్‌నెట్- ప్రసార- ఆన్‌లైన్- వ్యాపారాన్ని కొల్లగొట్టగలిగినప్పటికీ కనీసం అవి ‘ భారతీయ సంస్థలు’ కూడ కావు. ‘అమెజాన్’ ‘వాల్‌మార్ట్’ రెండూ విదేశీయ సంస్థలు. ఈ రెండు సంస్థలూ తోడేలువలె గుంటనక్కవలె మన దేశంలోకి చొరబడినాయి. స్వదేశీయ సంస్థలను దిగమింగి వేస్తున్నాయి. ‘్ఫ్లప్‌కార్ట్’ను ‘వాల్‌మార్ట్’ ఆక్రమించుకోవడం ఒక ఉదాహరణ మాత్రమే!!
ఇదంతా సంపన్న దేశాలవారు ప్రవర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న వాణిజ్య బీభత్సకాండ, ఆర్థిక దురాక్రమణ. ఒకే మతం ప్రపంచమంతటా పాదుకోవాలని, మిగిలిన మతాలను నిర్మూలించాలని భావించడం మతోన్మాదం. అలాగే ఒకే భాష ప్రపంచమంతటా ప్రబలిపోవాలని భారతీయ భాషలు, ఇతర వర్ధమాన దేశాల భాషలు అంతరించాలని భావించడం భాషా ఉన్మాదం. వైవిధ్యాలను ధ్వంసం చేసి ‘ఏకరూపత’ను సాధించాలనడం భావోన్మాదం. ఈ ఉన్మాదులు శతాబ్దుల తరబడి భౌతిక బీభత్సకాండను, బౌద్ధిక బీభత్సకాండను కొనసాగించారు. అలాగే తమ సంస్థ మాత్రమే మిగిలి, మిగతా వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు మూతపడిపోవాలన్న వాంఛ ఆర్థిక ఉన్మాదం. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలవారు ఇలాంటి ఆర్థిక ఉన్మాదులు... వీరి ‘విస్తరణ’ వాణిజ్య బీభత్సం! క్రీస్తుశకం పదహారవ శతాబ్దినుంచి ఐరోపా వాణిజ్య బీభత్సకారులు మన దేశంలోకి చొరబడడం చరిత్ర. ప్రపంచంలోని అనేక దేశాలను కూడ ఈ ‘వాణిజ్య బీభత్సకారులు’ కొల్లగొట్టడం మొదలైంది. ఐరోపా దేశాల మధ్య పోటీ మొదలుకావడం ఆ శతాబ్దినాటి సమాంతర బీభత్స పరిణామం. ఈ వాణిజ్య యుద్ధం బ్రిటన్‌కూ ఫ్రాన్స్‌కూ మధ్య పరాకాష్ఠకు చేరడం క్రమానుగత పరిణామం. పోర్చుగల్, హాలెండ్, నెదర్‌లాండ్స్ కంపెనీలను మన దేశం నుంచి వెళ్లగొట్టి బ్రిటన్, ఫ్రాన్స్‌లు విస్తరించడం చరిత్ర. చివరికి ఫ్రాన్స్ సంస్థలను సైతం వెళ్లగొట్టి బ్రిటన్‌వారి ‘ఈస్టిండియా’ వాణిజ్యపు ముఠా మన దేశాన్ని దోచుకోగల ఏకైక తస్కర ముష్కర బృందంగా అవతరించింది. ఈ ‘ఏకాధిపత్యం’ సాధించడానికి వీలుగా ‘ఈస్టిండియా కంపెనీ’ ఫ్రాన్స్‌కు పుదుచ్చేరిని వదిలిపెట్టింది. దొంగలు ఊళ్లు పంచుకున్నారు. పుదుచ్చేరికి బదులు బ్రిటన్‌కు కెనడాలోని ‘క్యూబెక్’ప్రాంతం దక్కింది. ఈ వాణిజ్య బీభత్సం రాజకీయ బీభత్సంగా స్థిరపడింది. మన దేశం బ్రిటన్‌కు ‘బానిస’గా మారింది. ఈ బానిసత్వాన్ని వదిలించుకొనడానికై మన దేశం తొంబయి ఏళ్లు సాయుధ సమరాన్ని, సత్యాగ్రహ ఉద్యమాన్ని జరుపవలసి వచ్చింది!
అమెరికా ప్రస్తుతం ఐరోపావారి దోపిడీ వారసత్వానికి ప్రధాన ప్రతినిధి. అందువల్ల పదిహేడవ శతాబ్దినాటి ‘ఈస్టిండియా కంపెనీ’ స్ఫూర్తితో ‘అమెజాన్’ మన దేశంలోకి చొఱబడి ఉంది, ‘వాల్‌మార్ట్’ విస్తరించిపోతోంది. వీటి ధాటికి తట్టుకోలేక ‘కారీఫోర్’వంటి ఫ్రాన్సీయ సంస్థలు పలాయనం చిత్తగించడం చారిత్రక పునరావృత్తి. అమెరికా ప్రభుత్వం చైనీయ సంస్థల దాడిని నిరోధించడానికై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ఈ సుంకాల కారణంగా తమ వాణిజ్య సంస్థలు దివాలా తీయనున్నట్టు చైనా ప్రభుత్వం వాపోతోంది. అందువల్ల చైనా కూడ అమెరికా సంస్థలకు వ్యతిరేకంగా సుంకాలను ప్రయోగిస్తోంది. గత చరిత్ర గుర్తులేకపోయినప్పటికీ అమెరికా, చైనాల మధ్య నడుస్తున్న ఈ వాణిజ్య యుద్ధం నుంచి అయినా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పాఠం’ నేర్చుకున్న జాడ లేదు.. అందువల్లనే ‘అమెజాన్’, ‘వాల్‌మార్ట్’..!!