సంపాదకీయం

‘ప్రగతి’ ప్రహేళిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఆర్థిక వ్యవస్థ ‘వాటాల విపణి’- స్టాక్ మార్కెట్- జాలంలో ఇరుక్కొని ఉండడం తరతరాల వైపరీత్యం. ఈ వైపరీత్యం మన దేశానికి దాపురించిన విదేశీయ వాణిజ్య వారసత్వం, బ్రిటన్ దురాక్రమణ వారసత్వం! ఐరోపావారి వాణిజ్య విస్తరణ, చైనా వస్తువుల దురాక్రమణ మన ప్రగతిని నిలదీస్తున్న వికృత పరిణామాలు... మన ‘స్థూల జాతీయ ఉత్పత్తుల’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- పెరుగుదల వేగం మందగించి పోవడానికి ఇదంతా నేపథ్యం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలలో ‘స్థూల జాతీయ ఉత్పత్తుల’ పెరుగుదల వేగం ఐదు శాతానికి పడిపోయిందన్నది ఆధికారిక నిర్ధారణ. ఇలా పడిపోవడానికి ప్రధాన కారణం ‘వాటాల విపణి’ సృష్టించిన సృష్టిస్తున్న మాయాజాలం! ఈ ‘వాటాల విపణి’ సూచికలు పెరగడం గొప్ప ప్రగతిగాను ఈ సూచికలు పడిపోవడం మాంద్యానికి ప్రతీకగాను ప్రచారం జరుగుతుండడం వౌలికమైన భ్రాంతి! దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవాన్ని నిర్ధారించే వౌలికమైన వాస్తవాలకు ప్రాధాన్యం తగ్గిపోయి, వౌలికమైన భ్రాంతి దేశ ప్రజల సమష్టి ప్రగతిగా ప్రచారం జరుగుతుండడం తరతరాల ఐరోపా వారసత్వం, పాశ్చాత్య వారసత్వం! ముంబయి ‘వాటాల విపణి’ ఇన్ని వందల అంకెలను కోల్పోయింది, ‘వాటాల విపణి’ జాతీయ సూచిక ‘‘ఇన్ని’’వందల అంకెలను నష్టపోయింది!- అంటూ జరిగే ప్రచారం మన జాతీయ ఆర్థిక వ్యవస్థ మందకొడితనానికి నిదర్శనమట! ఇందుకు భిన్నం ఈ ‘వాటాల విపణి’ ప్రగతి సూచికలు పెరిగిపోతే అది ‘జాతీయ ఆర్థిక వ్యవస్థ’ పరిపుష్టికి ప్రగతి వేగానికి నిదర్శనం... ఇదీ వౌలిక భ్రాంతి! ఈ ‘వాటాల విపణి’- స్టాక్ మార్కెట్- ప్రగతి సూచికలు మంగళవారం గొప్పగా పతనమయ్యాయట. పాతాళ పతనమయ్యాయని కొందరు ‘అతల’ పతనమయ్యాయని మరికొందరు ‘వితల’ పతనమయ్యాయని మరికొందరు... కాదు కాదు ‘రసాతల’ పతనమయ్యాయని వేఱుకొందరు విశే్లషణలు గుప్పిస్తూ ఉండవచ్చు! అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు మన భూలోకానికి కింద ఉన్నాయట. అందువల్ల ‘పాతాళ పతనం’కావడం గొప్ప ఆర్థిక విపత్తు. ఈ ఏడు కింది లోకాలు ఎక్కడ ఉన్నాయి, కనబడడం లేదే?? అన్నవి అర్ధంకాని ప్రశ్నలు!! మన ఆర్థిక వ్యవస్థ కూడ ఇలా అర్ధంకాని గొప్ప వాణిజ్య ‘ప్రహేళిక’- పజిల్-! ఇందుకు కారణం వౌలికమైన ఆర్థిక ప్రగతి ప్రాతిపదికలు దశాబ్దుల తరబడి- ఇంకా కచ్చితంగా చెప్పాలంటే దాదాపు రెండున్నర శతాబ్దులుగా - మరుగున పడిపోవడం!! ‘భ్రాంతి’ని ‘నిజం’గా మెరిపించి మురిపిస్తున్న ‘ఆర్థిక మాయ’ ఆవహించి ఉండడం! ‘వాటాల’ సూచికలు ఈ ఆర్థిక మాయ! కొన్ని వందలు లేదా కొన్ని వేల ‘నమోదైన’ పారిశ్రామిక వాణిజ్య సంస్థల ‘వాటాల’ ధరలు పెరగడం లేదా తగ్గడం ప్రాతిపదికగా ‘వాటాల విపణి’ సూచికలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఇలా వాటాల ధరలు పెరగడం అమ్ముకునే ‘వాటా’దారులకు లాభం, కొనేవారికి నష్టం. దీనికి వ్యతిరేకంగా వాటాల విలువ తగ్గిపోవడం అమ్మేవారికి నష్టం కొనేవారికి నష్టం! ఈ మొత్తం వ్యవహారం దేశ ప్రజల జనాభాలో వినియోగదారుల జనాభాలో ఒక శాతం కంటె తక్కువ ఉన్నవారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారం. కానీ వంద శాతం జనానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకున్న మొత్తం ప్రాధాన్యాన్ని ఈ ‘అర్థశాతం’ప్రజల ‘వాటాల విపణి’ అపహరించుకొని పోతుండడం- హైజాకింగ్- దశాబ్దుల వైపరీత్యం... విదేశీయ వాణిజ్య వారసత్వం! ‘ప్రపంచీకరణ’ ఈ విదేశీయ వారసత్వానికి విస్తృతి.....
‘ప్రపంచీకరణ’ మన దేశంలో వ్యవస్థీకృతం కావడానికి ప్రధాన కారకుడు మన్‌మోహన్‌సింగ్. ఆర్థికమంత్రిగా ఐదేళ్లు, ప్రధానిగా పదేళ్లు మన్‌మోహన్‌సింగ్ ‘‘నిర్వహించిన’’ అతి ప్రధాన కార్యక్రమం ‘ప్రపంచీకరణ’. ప్రపంచీకరణకు రూపం కేంద్రీకరణ. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ఈ కేంద్రీకరణ భూతానికి కరచరణ- చేతులు కాళ్లు- వంటి అవయవాలు, ‘స్వేచ్ఛా వాణిజ్యం’ ఈ భూతానికున్న దుర్బుద్ధి. యుగయుగాలుగా మన దేశంలో వికేంద్రీకృత ఆర్థికవ్యవస్థ కొనసాగింది. దీన్ని బ్రిటన్ దొరలు ధ్వంసం చేశారు, లక్షల కుటీర గృహ గ్రామీణ పరిశ్రమల ‘యజమానులు’ ఉపాధి కోల్పోయి బికారులయ్యారు. వాణిజ్యం పరిశ్రమలు కేవలం వందల భారీ పరిశ్రమల యజమానుల ఆధిపత్య సామ్రాజ్యానికి పరిమితం అయ్యాయి. అలా మొదలైన కేంద్రీకరణకు ప్రపంచీకరణ పరాకాష్ఠ. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి విదేశీయ సంస్థలు స్వదేశీయ సంస్థలను కొనుగోలుచేసి దిగమింగాయి. ప్రతి రంగంలోను రెండుమూడు విదేశీయ సంస్థలు మాత్రం మిగిలి, మిగిలిన సంస్థలు మూతపడడం ప్రపంచీకరణకు పరాకాష్ఠ.
ఈ ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించినవాడు మన్‌మోహన్‌సింగ్....ఈ విధానాన్ని చిత్తశుద్ధితో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వం అమలు జరుపుతోంది. విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు- మల్టీ నేషనల్ కంపెనీస్- దేశంలోని అన్ని రంగాలలోకి చొఱబడిపోవాలన్నది ఈ విధానం. విదేశీయ సంస్థల ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యం- ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్టిమెంట్- రక్షణ రంగానికి సైతం విస్తరించడం ఈ విధానం అమలు జరుగుతున్న తీరునకు ఒక నిదర్శనం మాత్రమే. జాతీయ హిత సాధనకు సంబంధించిన అంశాలపై రాజకీయ ప్రభుత్వ, ప్రతిపక్షాలవారు ఏకాభిప్రాయం కలిగి ఉండాలన్నది ప్రజాస్వామ్య సూత్రమన్నది పాతబడిన వ్యవహారం. దీన్ని ప్రతిపక్షాలలో అధిక శాతం పాటించడం లేదు. మూడువందల డెబ్బయ్యవ రాజ్యాంగ అధికరణం రద్దును వ్యతిరేకిస్తూ పళనియప్పన్ చిదంబరం, దిగ్విజయసింగ్ వంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధిష్ఠానం వారు ప్రచారం చేస్తుండడం ఒక ఉదాహరణ మాత్రమే! కానీ ‘‘అంతర్జాతీయ హితం’’ సాధించడంలో అన్ని రాజకీయ పక్షాలవారు విధాన విభేదాలను విస్మరించి ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలన్నది ‘ప్రపంచీకరణ’ సూత్రం. అందువల్లనే మన్‌మోహన్‌సింగ్ ప్రపంచీకరణ విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వంవారు కూడ యథాతథంగా అమలుజరుపుతున్నారు.
‘స్థూల జాతీయ ఉత్పత్తుల’ పెరుగుదల మందగించి పోతుండడానికి ఇదీ కారణం! మన నెత్తికెక్కి తొక్కుతున్న ప్రపంచీకరణ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు కారణం, కేంద్రీకరణ కారణం! ఇలా తన విధానాన్ని అమలుజరుపుతున్న మోదీ ప్రభుత్వ విధానాన్ని మన్‌మోహన్‌సింగ్ మళ్లీ స్వయంగా విమర్శించడం విచిత్రం... రాజకీయ విద్వేషం... ప్రజలను తప్పుదోవ పట్టించే పన్నాగం! ‘ప్రపంచీకరణ’వల్లనే రూపాయి విలువ పడిపోతోంది, విదేశీయ వాణిజ్యంలో భారీ లోటు ఏర్పడి ఉంది! కానీ ‘ప్రపంచీకరణ’వల్ల విదేశీయుల పెట్టుబడులవల్ల మంచి జరుగుతోందన్న ప్రచారం ఆగడం లేదు... ఎందుకంటె ‘ప్రపంచీకరణ’ మాయల మారీచ మృగం.... బంగారపు జింక!!