సంపాదకీయం

మైత్రికి మారాకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఫ్రభుత్వం 2015లో ఆరంభించిన ‘ప్రాచ్యదిశా కార్యాచరణ’- యాక్ట్ ఈస్ట్- ‘దూర ప్రాచ్య దిశా కార్యాచరణ’- యాక్ట్ఫ్‌ర్ ఈస్ట్-గా పరిణతి చెందడం ప్రధాని నరేంద్ర మోదీ బుధ, గురువారాలలో జరిపిన రష్యా పర్యటనలో ప్రస్ఫుటించిన ప్రధాన ఇతివృత్తం. రష్యాలోని తూర్పు ప్రాంతం చివరన- రష్యా ఆగ్నేయ భాగాన సముద్ర తీరంలో నెలకొని ఉన్న ‘వ్లాడివోస్టాక్’ నగరాన్ని మోదీ దర్శించడానికి చైనా,రష్యాల మధ్య దశాబ్దికి పైగా పెరిగిన మైత్రి విచిత్ర నేపథ్యం. ఈ ‘మైత్రి’ అమెరికా వ్యతిరేక వ్యూహమన్నది రష్యా అంతరంగం. ఈ మైత్రి భారత వ్యతిరేక వ్యూహమన్నది చైనా విశ్వాసం. అందువల్ల మోదీ ‘వ్లాడివోస్టాక్’ను సందర్శించడం చైనాకు, అమెరికాకు గిట్టని వ్యవహారం. మన దేశానికి ఏకైక ‘ఆయుధాల విక్రేత’గా అవతరించాలన్న అమెరికా ప్రభుత్వ సుందర స్వప్నానికి రష్యాతో మన మైత్రి పెరగడం విఘాతకరం. ఇదీ అమెరికా ఏడుపు. జమ్మూకశ్మీర్‌లో తమ చొఱబాటుకు రష్యా మద్దతును సాధించుకోవాలన్నది చైనా పన్నాగం. మన దేశానికీ రష్యాకు మధ్య స్నేహసంబంధాలు విస్తరించడం పట్ల చైనా కడుపు మంటకు ఇది తక్షణ ప్రాతిపదిక! అమెరికాకు వ్యతిరేకంగా చైనా సాగిస్తున్న దీర్ఘకాల ఆధిపత్య సమరానికి మన దేశానికీ రష్యాకు మధ్య పెంపొందే మైత్రి అవరోధమన్నది శాశ్వత ప్రాతిపదిక. అందువల్ల మన దేశానికీ రష్యాకు మధ్య 1970-1990 సంవత్సరాల మధ్యకాలం నాటి మైత్రి పునరుద్ధరణ జరగాలన్నది అమెరికా అభీష్టం, చైనా దుష్ట వ్యూహం! అందువల్ల రష్యా దూరప్రాచ్యంలో మన ప్రధాని జరిపిన చారిత్రక పర్యటన చైనాలోను అమెరికాలోను మరింత- వ్యతిరేక- ప్రాధాన్యం సంతరించుకొంది. ‘వ్లాడివోస్టాక్’ను సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ముగిశాక భారత- రష్యా సంబంధాలలో అనేక ఏళ్లపాటు ‘నిర్లిప్తత’ ఏర్పడడం చరిత్ర. భారత, అమెరికాల మధ్య ‘ప్రపంచీకరణ వ్యవస్థ’ మైత్రిని పెంపొందించడం ఈ నిర్లిప్తతకు కారణం. సోవియట్ రష్యా పదిహేను దేశాలుగా విడిపోయిన తరువాత ‘అవశేష’ రష్యాతో చైనా మైత్రి పెరగడం ‘నిర్లిప్తత’కు మరో కారణం. వ్లాదిమిర్ పుతిన్ 2001 నుంచి అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా రష్యాలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. పుతిన్ విదేశాంగ విధానానికి అమెరికా వ్యతిరేకత కేంద్ర బిందువు. అంతర్జాతీయంగా అమెరికా విధానాలను పుతిన్ కొన్ని సందర్భాలలో తార్కికంగాను మరికొన్ని సందర్భాలలో అతార్కికంగాను వ్యతిరేకిస్తున్నాడు. అందువల్ల అమెరికాకు సన్నిహితవౌతున్న భారత్ పట్ల అనేక ఏళ్లపాటు పుతిన్ అంటీముట్టనట్టు వ్యవహరించాడు. పాకిస్తాన్‌ను దాదాపు అరవై ఐదు ఏళ్లపాటు దూరంగా ఉంచిన, వ్యతిరేకించిన రష్యా ఐదేళ్లకు పైగా దగ్గరికి తీస్తుండడం రష్యాపై పెరిగిన చైనా ప్రభావానికి నిదర్శనం. ఇదంతా ‘వ్లాడివోస్టాక్’లో జరిగిన ‘ప్రాచ్యదేశాల ఆర్థిక సమాఖ్య’- ఈస్టరన్ ఎకనామిక్ ఫోరమ్- ఇఇఎఫ్- ప్రభుత్వ అధినేతల సమావేశానికి పూర్వరంగం...
భౌగోళికంగా రష్యా ప్రపంచంలో అతి పెద్ద దేశం. కోటి డెబ్బయి ఒక్క లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కల రష్యా ముప్పయి మూడు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కల మన దేశం కంటె ఐదు రెట్లు పెద్దది. అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది. 1917వ సంవత్సరానికీ, 1991వ సంవత్సరానికీ మధ్య డెబ్బయి నాలుగేళ్లు ‘ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ’ రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉండిన రష్యా ఆర్థికంగా దివాలా తీయడం చరిత్ర. 1990వ దశకంలో రష్యాలో తిండి కొరత ఏర్పడిపోయింది. 1991లో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడిన రష్యా మూడు దశాబ్దులు గడవకముందే మళ్లీ పుంజుకొనడం ప్రజాస్వామ్య విజయం, ప్రధానంగా పుతిన్ ఆర్థిక విధానాల విజయం. ఈ విధాన ఆచరణలో భాగంగానే దశాబ్దులపాటు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శతాబ్దులపాటు నిర్లక్ష్యానికి గురిఅయిన సుదూర ప్రాచ్యసీమను అభివృద్ధిచేయడానికి రష్యా పూనుకొంది. ఈ మంచుమయమైన సీమల అభివృద్ధికి మన ప్రధాని ఏడువేల రెండువందల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి ఇదీ నేపథ్యం. ఐరోపా ఖండం తూర్పు ప్రాంతంలోను ఆసియా ఉత్తర ప్రాంతంలోను విస్తరించి ఉన్న రష్యా దాదాపు పదునాలుగు వేల ఐదువందల కిలోమీటర్ల మేర నెలకొని ఉంది. పడమటి కొసన ఉన్న ‘పీటర్‌బర్గ్’నుంచి తూర్పు చివర ఉన్న ‘వ్లాడివోస్టాక్’వరకు ఏర్పడి ఉన్న రైలుమార్గం ప్రపంచంలో అత్యంత పొడవైనది. పీటర్స్‌బర్గ్‌లో మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వ్లాడివోస్టాక్‌లో రాత్రి తొమ్మిది గంటలయి ఉంటుంది, రష్యా ఈశాన్యపు కొసనందు రాత్రి పనె్నండు గంటలు అయి ఉంటుంది. తూర్పు పడమరలుగా అంత పెద్ద వెడల్పు అయిన దేశం రష్యా. ఇంత పెద్ద దేశం అయినప్పటికీ రష్యా జనాభా పదహైను కోట్లు మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం ఆర్కిటిక్ సముద్రానికి చేరువలో ఉన్న సగం దేశం మంచు మయమై ఉండడం. సైబీరియా మంచు ఎడారి వందల మైళ్లకొద్దీ నిర్మాణుష్య ప్రాంతం! రష్యాలోని ‘సుదూర ప్రాచ్యం’- తూర్పుసీమ- ఫార్‌ఈస్ట్- ఇలాంటి మంచు దిబ్బ. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ప్రధానంగా భూగర్భ చమురు నిక్షేపాలను, ఇంధన వాయువులను వెలికితీయడం కావచ్చు! మన మద్రాసు మహానగరం నుంచి ‘వ్లాడివోస్టాక్’ వరకు నేరుగా వాణిజ్య నౌకలను నడపడానికి ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ప్రాతిపదిక ఈ ‘ఇంధనం’. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకొనడానికి వ్లాడివోస్టాక్‌లో మన దేశం ఒప్పందాన్ని కుదుర్చుకొంది. వంట బొగ్గును భారీగా దిగుమతి చేసుకొనడానికి కూడ మన దేశం అంగీకరించింది.. నూతన నౌకా మార్గం ఈ ‘దిగుమతుల’కు సౌలభ్యం...
ఇలాంటి ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలు ఉభయ దేశాలకు సమకూడడానికి నరేంద్ర మోదీ ‘ప్రాచ్య దేశాల ఆర్థిక సమాఖ్య’ అధినాయక సమావేశంలో పాల్గొనడం దోహదం చేసింది. ఈ ఆర్థిక ప్రయోజనం కంటె మన రక్షణ వ్యూహం పటిష్టం కావడానికి, తూర్పు ఆసియా దేశాలతో మన రక్షణ బంధం బలపడడానికి మోదీ పర్యటన దోహదం చేసింది. తూర్పు ఆసియాలో చైనా వ్యూహాత్మక దురాక్రమణ నానాటికీ విస్తరించిపోతుండడం ఈ సదస్సుకు నేపథ్యం. ఈ ప్రాంతంలోని దాదాపు పది దేశాలు ప్రధానంగా వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, జపాన్ వంటి దేశాలు చైనా దౌర్జన్యాన్ని బహిరంగంగానే నిరసిస్తున్నాయి... ఈ శతాబ్ది ఆరంభం వరకు తూర్పు ఆసియా దేశాలతో మన సంబంధాలు అంతంత మాత్రం... ఇందుకు కారణం ఈ దేశాల ప్రభుత్వాలపై చైనా ఆధిపత్యం. 1967లో ఆరు ‘ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య’- ఏర్పడడానికి ప్రధాన లక్ష్యం చైనా దురాక్రమణను నిరోధించడం. ఆ తరువాతి కాలంలో చైనా ఈ ప్రాంతమంతటా వ్యూహాత్మక, వాణిజ్య దురాక్రమణను వ్యవస్థీకరించింది. ‘ఆసియాన్’ సభ్య దేశాల సంఖ్య పదకొండుకు పెరిగింది.
‘ఆసియాన్’ దేశాలతో మన సంబంధాలు మెరుగుపడకుండా చైనా నిరోధించడం ఇప్పుడు చరిత్ర. ‘ఆసియాన్, మరోమూడు దేశాల’- ఆసియాన్ ప్లస్ త్రీ- వాణిజ్య మండలిలో ఇప్పటికీ మన దేశానికి స్థానం లేదు. ‘ఆసియాన్’ దేశాలతోపాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఈ ‘వాణిజ్య మండలి’లో సభ్య దేశాలు. దీన్ని ‘ఆసియాన్, మరో నాలుగు’- ఆసియాన్ ప్లస్ త్రీ- ‘మండలి’గా విస్తరించి మన దేశాన్ని కూడ చేర్చుకోవాలన్న ప్రతిపాదనను చైనా ఏళ్లతరబడి వ్యతిరేకించింది. ఇప్పుడు ఈ ‘మండలి’ ప్రాధాన్యం కోల్పోవడానికి కారణం ‘ప్రాచ్య దేశాల ఆర్థిక సమాఖ్య’... ఈస్టరన్ ఎకనామిక్ ఫోరమ్! పదేళ్లకు పైగా అమలుజరిగిన మన ‘‘తూర్పు దిశగా ప్రస్థానం’’- లుక్ ఈస్ట్- విధానం 2015నుంచి ‘తూర్పు దిశగా కార్యాచరణ’- యాక్ట్ ఈస్ట్-గా పరిణతి చెందింది. ‘ఇఇఎఫ్’లో భాగస్వామ్యం ద్వారా ‘ప్రాచ్య దిశా కార్యాచరణ’ ‘దూరప్రాచ్య దిశా కార్యాచరణ’గా మరింత వేగం పుంజుకొంది! ప్రాచ్య ఆసియా దేశాలతో సహస్రాబ్దుల తరబడి నెలకొని ఉన్న సాంస్కృతిక సమనతా మైత్రి మారాకు తొడుగుతోంది.