సంపాదకీయం

హక్కుల ‘విలాపం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లో విధించిన ‘నియంత్రణల’ను సడలించాలని ఐక్యరాజ్యసమితి ‘మానవ అధికార మండలి’- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్- వారు పిలుపునివ్వడం విచిత్రమైన వ్యవహారం. మన దేశంలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న రాజ్యాంగ బద్ధమైన సార్వభౌమ అధికార అనుగుణమైన ప్రజాహితకరమైన కార్యక్రమాలకు ఐక్యరాజ్యసమితి ‘మండలి’ వారు ‘బాధతో’ స్పందించడం హద్దులను అతిక్రమించిన అభినయం. మన దేశం పట్ల అమెరికా, ఐరోపా ప్రభుత్వాల విధానాలలో వ్యతిరేకత దశాబ్దులుగా నిహితమై ఉంది. సందు దొరికినప్పుడల్లా ఈ వ్యతిరేకత ‘వికృత ముఖంతో నిక్క చూడడం’ నడుస్తున్న కథ.. ఐక్యరాజ్యసమితి వారు జమ్మూ కశ్మీర్ విషయంలో అతిగా స్పందించడం ఈ వ్యతిరేకతకు విస్తృతి.. చైనా, పాకిస్తాన్‌లు ఉమ్మడిగా సాగిస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని పడమటి దేశాలవారు కాని, పడమటి- అమెరికా ఐరోపా- ప్రాబల్య పరిధిలో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ‘మానవ అధికార మండలి’వారు కాని నమ్మడం లేదు, పరిగణించడం లేదు. అయినప్పటికీ ‘మన ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రజలను అణచివేస్తోందన్న’ పాకిస్తాన్, చైనాల అబద్ధపు ప్రచారాన్ని విశ్వసించినట్టు అమెరికా అభినయించింది, బ్రిటన్ అభినయించింది, ఇప్పుడు సరికొత్తగా ఈ ‘మానవ అధికార మండలి’వారు తైతక్కలాడారు.. రాజ్యాంగపు మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దుద్వారా, జమ్మూకశ్మీర్‌కు ఉండిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయడం ‘ఐక్యరాజ్యసమితి మానవ అధికారాల మండలి’ సంచాలకురాలు మిచెల్లీ బాచిలెట్‌కు గొప్ప ఆందోళన కలిగించిందట. జమ్మూ కశ్మీర్‌లోని స్థానిక రాజకీయవేత్తలను, ఉద్యమకారులను నిర్బంధించడం తనకు గొప్ప దుఃఖాన్ని కలిగించినట్టు ‘మానవ అధికార మండలి’ నలబయి రెండవ సమావేశంలో సోమవారం ప్రసంగించిన మిచెల్లీ బాచిలెట్ వాపోవడం అక్రమ ప్రమేయానికి నిదర్శనం.. ‘జమ్మూ కశ్మీర్ ప్రాంగణానికి వేసిన’ తాళాలను తెరచి ప్రవేశాన్ని పునరుద్ధరించాలన్నది మిచెల్లీ బాచిలెట్ మన ప్రభుత్వానికి చెప్పిన ‘అయాచిత’ హితవు! మూడు వందల డెబ్బయ్యవ అధికరణం రద్దుపట్ల పాకిస్తానీ తొత్తులైన కొందరు రాజకీయవాదులు, ప్రచ్ఛన్న బీభత్స ముష్కరులు, జిహాదీ హంతకులు, వర్గ విద్వేష- వర్గ సమర సిద్ధాంతవాదులు తప్ప జమ్మూ కశ్మీర్ ప్రజలు సంతోషిస్తున్నారు, దేశ ప్రజలు హర్షం ప్రకటిస్తున్నారు. మన ప్రభుత్వ చర్యవల్ల ఎవరి మానవ అధికారాలకు విఘాతం ఏర్పడింది? ఏర్పడినట్టు భ్రమించి మిచెల్లీ బాచిలెట్ ఎందుకని ఏడ్చింది?? ఈ ఏడుపు గొంతు విన్యాసాలకు పాకిస్తాన్‌లో హిందువులపై కొనసాగుతున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర అత్యాచారాలు వికృత నేపథ్యం, ‘హాంగ్‌కాంగ్’లో చైనా ప్రభుత్వం సాగిస్తున్న జన వ్యతిరేక చర్యలు నేపథ్యం... జమ్మూ కశ్మీర్‌లో జరగని ప్రభుత్వ దమనకాండ గురించి వెక్కివెక్కి ఏడుస్తున్న మిచెల్లీ బాచిలెట్ వంటివారు పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని అత్యల్ప సంఖ్యలోని హిందువులపై సాగిస్తున్న దమనకాండను ఎందుకు నిరసించడం లేదు? ఎందుకని నిరోధించే యత్నాలను చేయడం లేదు?? ఆ హిందువులకు మానవ అధికారాలు అనుభవించే హక్కు లేదా? చైనా దమనకాండ నుండి హాంగ్‌కాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమకారులకు రక్షణ కల్పించడం కోసం ఈ ‘సమితి’ మానవ అధికార మండలి వారు ఎందుకు పూనుకోవడం లేదు??
జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సకారులు దశాబ్దుల తరబడి వేల మందిని హత్యచేశారు. హత్యాకాండకు పోలీసులు, సైనికులు, సామాన్య ప్రజలు బలైపోవడం చరిత్ర. అనేక లక్షల మంది హిందువులు కశ్మీర్ లోయ నుంచి నిర్వాసితులై దేశంలోని వివిధ ప్రాంతాలలో శరణార్థులుగా జీవిస్తున్నారు. ఈ శరణార్థుల హక్కుల గురించి కాని, జమ్మూ కశ్మీర్‌లోని ప్రజల అధికారాల గురించి కాని పట్టించుకోని ‘ఐక్యరాజ్యసమితి’ మాటిమాటికీ ‘పాకిస్తాన్-చైనా’లు పథకం ప్రకారం సాగిస్తున్న భారత వ్యతిరేక ప్రచారం గురించి పట్టించుకుంటోంది. ఆగస్టు పదహారవ తేదీన ‘సమితి’ భద్రతా మండలిలో ‘జమ్మూ కశ్మీర్’ అంతర్గత స్థితి గురించి ‘అనధికార చర్చ’ జరగడం సరికొత్త ఉదాహరణ. అధికార చర్చ జరగడానికి నియమావళి అంగీకరించదు. అందువల్ల చైనా ఒత్తిడితో పాకిస్తాన్ అభీష్టాన్ని నెరవేర్చడానికి భద్రతామండలి పూనుకొనడం ఆనాటి జనాంతిక చర్చలకు నేపథ్యం. ఆ ‘రహస్య’ చర్చల వల్ల తేలింది ఏమీలేదు కానీ ‘భద్రతా మండలి’లో చైనా పలుకుబడికి ఇది నిదర్శనం. చైనాకు పలుకుబడి ఉంది కాబట్టి టిబెట్‌లోను, హాంగ్‌కాంగ్‌లోను చైనా నియంతలు జరిపిస్తున్న దమనకాండ భద్రతా మండలికి ఎక్కడం లేదు, బలూచిస్థాన్‌లోను, దురాక్రమిత జమ్మూ కశ్మీర్‌లోను పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న దౌర్జన్యకాండ ‘భద్రతా మండలి’లో చర్చకు రావడం లేదు. భారతీయ జనతాపార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల వ్యాఖ్యానించినట్టు ‘సమితి’లో నిహితమై ఉన్న భారత వ్యతిరేకతకు ప్రధాన ప్రాతిపదిక- మనకు ‘భద్రతామండలి’లో శాశ్వత సభ్యత్వం లేకపోవడం, కమ్యూనిస్టు చైనాకు శాశ్వత సభ్యత్వం ఉండడం...
అందువల్ల చీటికీ మాటికీ ‘సమితి’ భద్రతా మండలిలోను, మానవ అధికార మండలిలోను మన దేశానికి వ్యతిరేకమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రతిసారీ మన ప్రభుత్వం ‘సంజాయిషీ’ చెప్పుకోవలసి వస్తోంది, నిజానిజాలను వివరించవలసి వస్తోంది. చివరిలో పాకిస్తాన్ వాదం, చైనా కుట్ర భగ్నం అవుతున్నప్పటికీ మనం ఇలా ‘సారెసారె’కూ సమర్ధించు కొనవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి మానవాధికారాలను హత్యచేస్తున్న, దారుణ దమనకాండను తమ దేశ ప్రజలపై సాగిస్తున్న చైనాకానీ, పాకిస్తాన్‌కాని ఇలా సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం రావడం లేదు. ‘అగ్గికి ఎదురగ్గి పెట్టడం’వల్ల మాత్రమే హరిత వనాలను దహించి వేసే ‘దావానలం’ చల్లారుతుంది. ‘శామ్యేత్ ప్రతి అపకారణేన ఉపకారేణ దుర్జరః’- ఎంత మంచి చేసినప్పటికీ దుర్మార్గుడు తన నేరాలను మానుకోడు, దౌర్జన్యాన్ని విడనాడడు. ప్రతి చర్యకు పూనుకొని వాడికి అపకారం చేసినప్పుడు మాత్రమే ఆ దుర్మార్గుడు అణగిపోతాడు- అన్నది రెండువేల వంద ఏళ్లకు పూర్వం మహాకవి కాళిదాసు చెప్పిన మాట! క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి విక్రమ సమ్రాట్టు ఆస్థానంలోని వారు మహాకవి కాళిదాసు వరాహమిహిరుడు వంటి ‘నవరత్నాలు’. మన హద్దులను అతిక్రమించి బీభత్సకాండ సాగించిన ‘శకుల’ను విక్రమ సమ్రాట్టు తిప్పికొట్టి వారి ‘శక’స్థానం- నేటి ఇరాన్-లోకి చొచ్చుకొని వెళ్లి అణచివేశాడు. మహాకవి మాటలకు ఇదీ నేపథ్యం! అందువల్ల ‘విక్రమ’నుకి, కాళిదాసునకు వారసులమైన మనం వారి నీతిని పాటించాలి. హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న చైనా దౌర్జన్యాన్ని, బలూచిస్థాన్‌లోను, దురాక్రమిత కశ్మీర్‌లోను పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిస్తున్న దమనకాండను ‘మండలులలో- భద్రతా మండలి, మానవ అధికార మండలి-లో మన ప్రభుత్వం పదే పదే ప్రస్తావించాలి! చర్చ జరగాలి. తీర్మానాలు నెగ్గడం తరువాతి మాట! కానీ పాకిస్తాన్‌కు చైనాకు ‘మండలుల’లలో సంజాయిషీ ఇచ్చుకోవలసిన అనివార్యం ఏర్పడాలి!!
జమ్మూ కశ్మీర్‌పై మొసలి కన్నీరు కార్చిన మిచెల్లీ ‘మేడమ్’ అంతటితో ‘ఏడుపు’ను ఆపలేదు. అస్సాంలో ‘‘జాతీయ పౌర సంకలనల’’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిజిజెన్స్-ను రూపొందించడం ద్వారా మన ప్రభుత్వం లక్షల మంది ‘పౌరసత్వాన్ని’ హరించి వేసిందని ఆర్భాటించింది. ఇలా ‘జాతీయ పౌర సంకలనం’నుంచి మినహాయింపునకు గురైనవారు మన దేశపు పౌరులు కారు, విదేశాల నుంచి అక్రమంగా మన దేశంలోకి చొఱబడినవారు. ఈ చొఱబాటుదారులలో జిహాదీ బీభత్సకారులు కూడ ఉన్నారు. కోటిన్నర మంది అక్రమ ప్రవేశకులు దేశంలో ఉన్నారు. కానీ ‘జాతీయ పౌర సంకలనం’వల్ల కేవలం పంతొమ్మిది లక్షల అక్రమ ప్రవేశకులు మాత్రమే బయటపడినారు! వారి తరఫున మిచెల్లీ బాచిలెట్ ‘వకాల్తా’ పుచ్చుకొనడం మరింత విస్మయకరం. అక్రమ ప్రవేశకులు మన దేశంలోనే తిష్ఠవేసి ఉండాలట...