సంపాదకీయం

భాష.. పరిభాష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషా ప్రాంతీయ అధ్యయన కేంద్రం కర్నాటకలోని మైసూరు నుంచి తెలుగు నేలకు తరలిరావడం హర్షణీయ పరిణామం. మహాకవి తిక్కన క్రీస్తుశకం పదమూడవ శతాబ్దిలో వేదవ్యాసుని సంస్కృత మహాభారతంలోని పదహైదు పర్వాలను తెలుగులో వ్రాశాడు. ‘విక్రమ సింహపురి’గా వినుతికెక్కిన నెల్లూరు మహాకవి తిక్కన సోమయాజి జీవించిన ప్రాంతం. వేదం వేంకట రాయశాస్ర్తీ, మహాకవి గుఱ్ఱం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, దీపాల పిచ్చయ్యశాస్ర్తీ వంటివారు సింహపురితో సాహితీ సంబంధ బాంధవ్యాలను నెఱపిన సరస్వతీ రూపాలు. ఇటీవలి కాలంలో శివారెడ్డి శేషురెడ్డి, మోచర్ల రామకృష్ణకవి, పోలూరి హనుమజ్జానకీ రామశర్మ, జక్కా వేంకటేశ్వరుడు వంటి కవులు నెల్లూరు సాహితీ సీమలను పండించిన ‘అక్షర’ కృషీవలులు! మహాకవి గుఱ్ఱం జాషువా చెప్పినట్టు-
‘‘యతియుం ప్రాసలు లేని సంస్కృత
కవిత్వారణ్యమందున్న, భా
రత వేదాన పదేను పర్వముల
కాంధ్రత్వంబు నేర్పించి, శా
శ్వతుడైపోయిన తిక్కయజ్వకు
నివాసంబైన నెల్లూరికిన్
నతులర్పింపుము, స్నానమాడు
మతిగణ్యంబైన పెన్నానదిన్...’’
అందువల్ల తెలుగు మహాభారత వికాస భూమిక అయిన నెల్లూరికి భాషా ప్రాంతీయ అధ్యయన కేంద్రం తరలిరావడం ముదావహం. ఆదికవి నన్నయ భట్టారకుడు రాజమహేంద్రవరంలో నాటిన మహాభారత ఇతిహాస కావ్యనందనం సింహపురి ప్రాంతంలో పల్లవించి, తెలుగు నేల అంతటా పుష్పించి తరతరాల ‘తెలుగు’వారి హృదయ సీమలలో పరిమళిస్తుండడం నడుస్తున్న చరిత్ర! దక్షిణ భారతీయ భాషల అధ్యయన కేంద్రం ఒకేచోట, మైసూరులో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ ఇప్పటికీ మధ్య వికేంద్రీకరణ జరిగింది. ఏ భాష అధ్యయన కేంద్రం ఆ భాషా ప్రాంతానికి తరలిపోయింది. ఈ వికేంద్రీకరణ కార్యక్రమానికి తార్కిక పరాకాష్ఠ ‘తెలుగు అధ్యయన కేంద్రం’ తెలుగు నేలకు తరలిరావడం.
తెలుగు ప్రాచీన భాష. ‘తెలుగు’, ‘ఆంధ్రం’అన్నవి పర్యాయ పదాలు. మహానదీ తీరం నుంచి కావేరీ నదీ తటం వరకూ ఆంధ్ర భాషా సాహిత్యాలు వికసించడం చరిత్ర. హంపీ విజయనగరం, తంజావూరు, కోటిలింగాల, ఓరుగల్లు, అమరావతి, శ్రీకాకుళం వంటి ప్రాచీన తెలుగు రాజధానులు ‘ఆంధ్రసీమ’ విస్తృతికి నిదర్శనం. గోదావరీ చంద్ర భాగా నదుల మధ్య ప్రాంతం తుంగభద్రా, కావేరీ నదుల మధ్య ప్రాంతం... కృష్ణానదీ పరీవాహ ప్రాంతం గోదావరికి ఉత్తర ప్రాంతం... ఇలా తెలుగుసీమలో అనేక రాజ్యాలు విలసిల్లడం చరిత్ర. తెలుగువారు- ఆంధ్ర శాతవాహనులు- క్రీస్తునకు పూర్వం ఎనిమిదివందల ముప్పయి మూడవ సంవత్సరం నుంచి క్రీస్తునకు పూర్వం మూడువందల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించారు. క్రీస్తునకు పూర్వం మూడువేల నూట రెండవ సంవత్సరం నుంచి మూడువేల ఆరువందల ఏళ్లు అంటే క్రీస్తుశకం ఆరవ శతాబ్దివరకు మొత్తం భారతదేశాన్ని పది రాజవంశాలవారు పాలించారు. ఆంధ్ర శాతవాహన వంశం ఎనిమిదవది. మొదటిదైన బృహద్రథ వంశం వెయ్యేళ్లు పాలించగా, ఆంధ్ర శాతవాహనులు ఐదువందల ఆరు ఏళ్లు పాలించారు. మరే ఇతర రాజవంశం కూడ ‘సమీకృత ప్రాచీన భారత రాజ్యాంగ వ్యవస్థ’కు ఇంత దీర్ఘకాలం ఆధ్వర్యవం వహించలేదు. అందువల్ల ఆంధ్ర భాష లేదా తెలుగు భాష ‘ప్రాచీనత’ రెండువేల ఎనిమిది వందల ఏళ్లకు మించినది. కానీ బ్రిటన్ దురాక్రమణకారులు మన దేశాన్ని పాలించిన కాలంలో ‘బిషప్ కాల్డ్‌వెల్’వంటివారు మన భాషల చరిత్రను, మన దేశ చరిత్రను వక్రీకరించారు, చెఱచారు!! అందువల్ల తెలుగు భాష ప్రాచీనతను గురించి జాతీయమైన ఆధారాల ప్రాతిపదికగా ఇప్పుడైనా అధ్యయనం జరగాలి. బ్రిటన్ విముక్త భారత్‌లో జరుగుతున్న భాషా అధ్యయనాలు ఇప్పటికీ బ్రిటన్ విబుధ దైత్యులు వ్యాపింపచేసిన ‘్భవదాస్య పరిధి’లో గిరికీలు కొడుతున్నాయి, గింగిర్లు తిరుగుతున్నాయి.
జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలమ్మునన్- అన్నది అధ్యయనానికి జాతీయ ప్రాతిపదిక! వింధ్యకు దక్షిణ ప్రాంతం ద్రవిడ ప్రాంతం. ఇది భౌగోళికమైన వాస్తవం. అంతేకాని ద్రవిడ ప్రాంతం ప్రత్యేక ‘జాతి’ కాదు, కాలేదు. ‘ఆర్య’ అన్నది గుణవాచకం, అంతేకాని ఆర్య శబ్దం ‘జాతి’ని సూచించలేదు. ద్రవిడ ప్రాంతంలోను ‘ఆర్యులు’- సంస్కారవంతులు ఉన్నారు. ‘వింధ్య’కు ఉత్తరాన ఉన్న ఉత్తర భారతంలోను ‘ఆర్యులు’ సంస్కారవంతులున్నారు. అనాది వాస్తవం ఇది. కానీ ‘బ్రిటన్’వారు మన దేశ ప్రజలను విడగొట్టడానికై ‘ఆర్య’ ‘ద్రావిడ’ జాతులను కృత్రిమంగా కల్పించిపోయారు. అనాది ‘్భరత ఖండం’- కొలంబో నుంచి కైలాసం వరకు, ‘గాంధారం’ నుంచి ‘కామరూప’ వరకు ఒకే జాతి! అందువల్ల వింధ్య పర్వతానికి దక్షిణంగా ఉన్న ‘ద్రవిడ’ప్రాంత ప్రజలు, ఉత్తరాన ఉన్న వివిధ ప్రాంతాలవారు అనాదిగా ఒకే జాతి! కానీ రెండు జాతులను కల్పించిన బ్రిటన్ ముష్కరులు ఒకే భాష కుటుంబాన్ని కూడ విడగొట్టారు. అనాదిగా భరతవర్షంలోని అన్ని భాషలూ సంస్కృత భాషా కుటుంబానికి చెందినవి, భారతీయ భాషలు మొత్తం సంస్కృత భాషకు రూపాంతరాలు మాత్రమే. అందువల్లనే వందలాది భారతీయ భాషల ద్వారా తరతరాలుగా ఒకే భావజాలం ప్రస్ఫుటించింది. ఈ భావజాలం సంస్కృతి! అన్ని భాషల ‘లిపు’లూ మాతృ ‘లిపి’ ‘బ్రాహ్మీలిపి’నుంచి మాత్రమే వికసించడం చరిత్ర. కానీ బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు, కాల్డ్‌వెల్ వంటివారు దక్షిణ భారత భాషలు సంస్కృత భాషా కుటుంబానికి చెందినవి కావని ‘అబద్ధాల పాఠం’ బోధించారు. ఈ అబద్ధాలను ఇప్పటికీ మన ‘్భషావేత్తలు’ విశ్వవిద్యాలయాలలోను, కళాశాలలలోను వల్లెవేస్తున్నారు. ‘కాల్డ్‌వెల్’ కట్టుకథ భారత జాతీయ సమైక్యానికి, భాషా సమన్వయానికి గొడ్డలిపెట్టు... ‘కాల్డ్‌వెల్’ భారత జాతీయ వ్యతిరేక భాషా చరిత్రను, సిద్ధాంతాలను కనిపెట్టిన నాటినుంచి అంటే క్రీస్తుశకం 1858నుంచి జాతీయ సమైక్య పరిరక్షక భాషావేత్తలు అతగాడి ‘కల్లల’ను ఖండిస్తూనే ఉన్నారు. కాల్డ్‌వెల్ సమకాలంలోని శేషగిరి శాస్ర్తీనుంచి 1948లో ‘్భషా చరిత్ర’ను ప్రచురించిన చిలుకూరి నారాయణరావు వరకు ఎందరో జాతీయ భాషనిష్ఠులు బిషప్ ‘కాల్డ్‌వెల్’ను ఖండించారు. కోట వెంకటాచలం, విశ్వనాథ నారాయణ వంటివారు ‘కాల్డ్‌వెల్’, ‘్థమస్ బాబింగ్టన్ మెకాలే’, ‘విలియం జోన్స్’వంటి వారి కట్టుకథల గుట్టును రట్టుచేసిన మరికొందరు జాతీయ సాహితీమూర్తులు. ఆలస్యం అయినప్పటికీ బ్రిటన్ దుండగుల నకిలీ సిద్ధాంతాలను నిరాకరించే దిశగా తెలుగు భాషా పరిశోధన ఇప్పుడైన మొదలుకావాలి....
పరిణతి చెందిన ప్రతి భాషకూ గ్రాంథిక రూపం-క్లాసికల్ ఫార్మ్-, వ్యవహార రూపం- కమ్యూనికేటివ్ ఫార్మ్- రెండూ ఉన్నాయి. అందువల్ల పరిణతి చెందిన భారతీయ భాషలలో దేన్ని కూడా కేవలం ‘గ్రాంథిక భాష’అని కాని, కేవలం ‘వ్యవహార భాష’ అని కాని ముద్రవేయడం అర్థంలేని వ్యవహారం. ‘ద్రవిడ మునే్నత్ర కజగం’వారు కేవలం తమిళ భాష మాత్రమే ‘విశిష్ట్భాష’ లేదా ‘గ్రాంథిక భాష’లేదా ‘విద్వత్ భాష’ లేదా ‘కావ్య భాష’అని ప్రచారం చేసుకొనడానికి 2004లో యత్నించారు. మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆలోచన రహితంగా ‘ద్రముక’ వారి ప్రతిపాదనను ఆమోదించింది. ఫలితంగా ‘క్లాసికల్’అన్న ఆంగ్ల పదం కొత్త అర్థంలో ప్రచారం అవుతోంది. పైగా ప్రాచీనత ఆధారంగా ఈ ‘క్లాసికల్’ హోదాను నిర్ధారించాలన్న సూత్రాన్ని కూడ కనిపెట్టారు, ‘క్లాసికల్ లాంగ్‌వేజ్’ అన్న పదజాలానికి ‘ప్రాచీనభాష’ అన్నది సరైన అనువాదం కాజాలదు. పైగా సంస్కృత భాష కంటె తమిళ భాష ప్రాచీనమైనదన్న మరో అక్రమం-, అబద్ధం-కూడ ‘కజగం’వారి పథకంలో భాగం. ‘‘తల్లి- సంస్కృతం- కంటె కుమార్తె- తమిళం- ఎక్కువ వయస్సుకలది’’ అని చెప్పినట్టయింది. సంస్కృత భాష నుంచి రూపాంతరం చెందిన ప్రాకృత భాషలలో ‘ద్రవిడ’ ప్రాకృతం కూడ ఒకటి. ఈ ‘ద్రవిడ’ప్రాకృతం నుంచి తమిళం రూపాంతరం చెందింది... అందువల్ల ఈ దిశగా పరిశోధన జరగాలి, అధ్యయనం జరగాలి. అన్ని భారతీయ భాషలనూ ఆంగ్ల భాష దిగమింగుతోంది. ఈ ప్రమాదాన్ని ఇప్పటికైనా నిరోధించాలంటే, ఏడవ తరగతి వరకు తెలుగులోను, భారతీయ మాతృభాషలలోను మాత్రమే విద్యాబోధన జరగాలి. ‘శిశుస్థాయి’-ఎల్‌కెజి- నుంచి ఏడవ తరగతి వరకు భారతీయ మాతృభాషల ‘మాధ్యమం’గా మాత్రమే బోధన జరగాలని నిర్దేశిస్తూ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం పూనుకోవాలి! భాష ప్రజల నాలుకల మీద జీవిస్తుంది... ‘కేంద్రాల’లో కాదు!!