సంపాదకీయం

నేపాల్‌తో ‘అనుసంధానం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌లో ఇంధన తైలం ధరలు లీటరుకు రెండు రూపాయలు చొప్పున తగ్గిపోవడం మంగళవారం నాటి పరిణామం. భారత నేపాల్ దేశాల మధ్య ఇంధనం సరఫరా చేసే ‘గొట్టపు మార్గం’- పైప్‌లైన్- పనిచేయడం ఆరంభం కావడం ఇందుకు కారణం. మన బిహార్‌లోని మోతీహారీ నుంచి నేపాల్‌లోని నారాయణీ ప్రాంతంలోని ‘అమ్‌లేఖ్ గంజ్’వరకు ఏర్పడిన ఈ గొట్టపు మార్గం ఉభయ దేశాల మధ్య సరికొత్త స్నేహ వారధి. ‘ఇరుగు పొరుగు ప్రాథమ్యం’ అన్న మన ప్రభుత్వ విధానం విజయవంతం అవుతోంది. భూటాన్, నేపాల్‌లు మన ఉత్తర సరిహద్దులలో నెలకొని ఉన్న మిత్ర దేశాలు. 2014 నుంచి మన ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ‘ఇరుగు పొరుగు ప్రాథమ్యం’- నైబర్‌హుడ్ ఫస్ట్- అన్న విధానంలో భాగంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ మొదట ఈ దేశాలకు వెళ్లివచ్చాడు, ఈ దేశాల ప్రభుత్వాధినేతలు వచ్చి వెళ్లారు. 2014 మేలోను, ఈ ఏడాది జూన్‌లోను జరిగిన మోదీ ప్రభుత్వ అధికార స్వీకార ఉత్సవానికి ఈ రెండు దేశాల ప్రభుత్వ అధినేతలు హాజరయ్యారు. 2014లో ‘దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య’లోని దేశాల ప్రభుత్వ ప్రతినిధులు మోదీ ప్రమాణ స్వీకరణ ఉత్సవానికి హాజరు కాగా, 2014లో ‘బంగళాఖాత ప్రాంత’ సమాఖ్య- బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్- దేశాల ప్రభుత్వ ప్రతినిధులు మన దేశ రాజధానికి విచ్చేశారు. ‘దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య’- సార్క్-లో సభ్యదేశమైన పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోకి ‘జిహాదీ’ బీభత్సకారులను ఉసిగొల్పుతుండడం ఈ పరివర్తనకు నేపథ్యం. ‘బంగాళఖాత ప్రాంత సమాఖ్య’లో పాకిస్తాన్ లేదు. ‘ప్రగతి ఫలాలను ఇరుగుపొరుగు మిత్ర దేశాలతో పంచుకొనడం’ అని మోదీ మంగళవారం చేసిన వ్యాఖ్యకు ఇదీ నేపథ్యం. ఇలా పంచుకొనడంలో భాగంగానే మన దేశానికీ నేపాల్‌కు మధ్య ఇప్పుడీ ‘గొట్టపు ఇంధనం’ వ్యవస్థ రూపొందింది. మన ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్‌శర్మ ఓలీ ‘దృశ్యమాధ్యమ అనుసంధానం’ద్వారా ఉమ్మడిగా శుభారంభం చేసిన ఈ నూతన గొట్టపుమార్గం ద్వారా సంవత్సరానికి ఇరవై లక్షల టన్నుల పెట్రోలియం ఇంధనం మన దేశం నుంచి నేపాల్‌కు సరఫరా అవుతుంది. మోతీహారీలోని మన ప్రభుత్వరంగ ‘ఇండియన్ ఆయిల్’ సంస్థ గిడ్డంగి నుంచి నేపాల్‌లో ఆమ్‌తీభగంజ్‌లోని ‘నేపాల్ ఆయిల్ కార్పొరేషన్’ గిడ్డంగికి అరవై తొమ్మిది కిలోమీటర్లమేర గొట్టపు మార్గం ద్వారా చమురు సరఫరా కానుంది. దక్షిణ ఆసియా ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఇలా ‘పైప్‌లైన్’ ఏర్పడడం ఇదే తొలిసారి కావడం ఉభయ దేశాల మధ్య స్నేహం మారాకు తొడుగుతోందనడానికి చారిత్రక నిదర్శనం. పదిహేను నెలల క్రితం ఆరంభమైన నిర్మాణం నిర్దిష్ట కాలవ్యవధి కంటె ముందుగానే పూర్తికావడం, ఆరంభం కావడం, నేపాల్‌లో పెట్రోలు ధరలు తగ్గడం అమితవేగంతో సంభవించిన అద్భుతం. పెట్రోలియం ఉత్పత్తులను తమ దేశం చైనానుంచి భారీగా కొనుగోలు చేయాలన్నది నేపాల్‌లో చైనాకు దళారీలుగా పనిచేస్తున్న ‘కమ్యూనిస్టు మావోయిస్టుపార్టీ’వారి పన్నాగం. యుగయుగాల నాటి భారత నేపాల్ మైత్రిని చెఱచి, నేపాల్‌ను చైనా ఒడిలో కూర్చోబెట్టాలన్నది మావోయిస్టుల తపన. 1996లో ఏర్పడిన నాటినుంచి ‘నేపాల్ కమ్యూనిస్టు మావోయిస్టుపార్టీ’వారు ఈ దిశగా కుట్రను కొనసాగిస్తున్నారు. మన దేశం మూడువందల ఇరవైనాలుగు కోట్ల ఖర్చుతో నిర్మించి నేపాల్‌కు ప్రదానం చేసిన ఈ ‘గొట్టపు మార్గం’ మావోయిస్టుల కుట్రకు విరుగుడు, చైనా అక్రమ విస్తరణకు విరుగుడు...
‘అనుసంధానం’ గురించి నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించాడు. ఉభయ దేశాల మధ్య వివిధ పద్ధతులలో వివిధ రీతుల అనుసంధానం పెంపొందడం లక్ష్యం. ఉభయ దేశాల మధ్య నెలకొని ఉన్న ‘కాపలా లేని సరిహద్దులు’ అనాదిగా కొనసాగుతున్న సహజమైన భౌగోళిక అనుసంధానం. ఈ సహజమైన అనుసంధానం ద్వైపాక్షిక మైత్రికి శాశ్వత నిదర్శనం. ప్రపంచంలోని అతి తక్కువ సంఖ్యలోని దేశాల మధ్య మాత్రమే ఇలా కాపలాలేని సరిహద్దులు, నిర్నిరోధ ప్రయాణ సౌలభ్యం కల, సరిహద్దులు- ఓపెన్ బార్డర్స్- ఏర్పడి ఉన్నాయి. 1949లో ఉభయ దేశాల మధ్య కుదిరిన ‘వాణిజ్య, ప్రయాణ సౌలభ్యపు ఒప్పందం’- ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ ట్రీటీ- తదితరాల ఈ సహజ అనుసంధాన వ్యవస్థకు సరికొత్త ధ్రువీకరణ. ఉభయ దేశాల భద్రత, ప్రాదేశిక సమగ్రతా పరిరక్షణ సహస్రాబ్దులుగా అనుసంధానమై ఉన్నాయి. 1950లో కుదిరిన ‘ద్వైపాక్షిక’ శాంతి, స్నేహ సంబంధాల ఒప్పందం’- పీస్ అండ్ ఫ్రెండ్‌షిప్ ట్రీటీ- అందువల్ల ఈ సహజ భద్రతా అనుసంధానానికి దర్పణం. ప్రాచీన అఖండ భారత్‌లోని యాబయి ఆరు రాజ్యాలలో నేపాల్ ఒకటి. బ్రిటన్ దురాక్రమణ ఫలితంగా భారత్ నుంచి రాజకీయంగా విడిపోయింది, స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ ఉభయ దేశాల మధ్య నెలకొన్న యుగయుగాల ‘సాంస్కృతిక సమానత్వం’ ఉభయ ప్రజల మధ్య స్వభావ అనుసంధానానికి కొనసాగుతున్న సాక్ష్యం. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో ఒక కొత్త జాతీయ కాలగణన పద్ధతికి ఉజ్జయిని కేంద్రంగా భరతఖండాన్ని పరిపాలించిన ప్రమర వంశపు విక్రమ సమ్రాట్టు శ్రీకారం చుట్టాడు. నేపాల్‌లో ఈ కొత్త ‘విక్రమ సంవత్’ ఆరంభం కావడం చరిత్ర. నేపాల్‌లో ఇప్పటికీ ఈ విక్రమ శకాన్ని జాతీయ శకంగా పాటిస్తున్నారు. 2008 తరువాత మావోయిస్టు ప్రభుత్వం ఈ ‘శకాన్ని’ఆధికారికంగా రద్దుచేసినప్పటికీ నేపాల్ జనజీవనంలో మాత్రం విక్రమ శకం కొనసాగుతోంది. ఇదీ ఉభయ దేశాల మధ్యగల సహజమైన అనుసంధానం- కనెక్టివిటీ-! గొట్టపుమార్గం ఆరంభం సందర్భంగా నరేంద్ర మోదీ ప్రస్తావించిన అనుసంధానానికి ఇదీ నేపథ్యం...
భారత నేపాల్ దేశాల మధ్య నదులు సహజ అనుసంధాన వ్యవస్థలు. గండకీనది వంటివి ఉభయ ప్రజాహృదయ క్షేత్రాలను అనుసంధానం చేస్తున్న సాంస్కృతిక స్రోతస్వినులు. గండకి, కోసి నదులు గంగలో విలీనం కావడం ఈ సహజమైన అనుసంధానం. గండకీ నదిలో ప్రభవించే ‘సాలగ్రామం’ ఆసేతు హిమాచలం గ్రామగ్రామంలో కొలువుతీరడం అనుసంధానం. ఖాట్మండూ నగరంలోని పశుపతి నాథుని మందిరంలోని ప్రధాన అర్చకులు వేల ఏళ్లుగా దక్షిణ భారతీయులు. ఇంధనం, విద్యుత్తు, నిత్యావసరాల సరఫరాలు, ‘వీసా’అవసరం లేని రాకపోకలు ఆర్థిక అనుసంధానం. సమాన భావజాలం కల ఉభయ దేశాల ప్రజలు సాంస్కృతిక అనుసంధానం.. ఈ అనుసంధానాన్ని చెడగొట్టడానికి నేపాల్‌లోని మావోయిస్టులు పరోక్షంగా ప్రత్యక్షంగా యత్నిస్తుండడం మంగళవారం మహాపరిణామానికి నేపథ్యం. 1949నాటి 1950నాటి ఒప్పందాలను రద్దుచేయాలని కనీసం నీరుకార్చాలని ‘మావోయిస్టులు’ బహిరంగంగానే యత్నిస్తున్నారు. హిందీ పట్ల, ఇతర భారతీయ భాషల పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్టడం, పశుపతినాథుని గుడిలో దక్షిణ భారతీయుల అర్చకత్వాన్ని రద్దుచేయడం నేపాలీ మావోయిస్టుల లక్ష్యాలు. ఇవి నెరవేరడం లేదు. నిజానికి భారతీయ భాషలలో నేపాలీ భాష ఒకటి. భారత రాజ్యాంగంలో సైతం నేపాలీ భాషకు స్థానం ఉంది. బ్రిటన్‌వారు మొత్తం భారత్‌ను ఆక్రమించినప్పటికీ నేపాల్, భూటాన్ స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగించాయి. విదేశీయ దురాక్రమణకు గురికాని ‘అఖండ భారత’ ప్రాంతాలు నేపాల్, భూటాన్! ఇదీ అనుసంధాన చారిత్రక ప్రాతిపదిక!
నేపాల్, భూటాన్‌లు స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగించడం చైనాకు ఇష్టం లేదు. టిబెట్‌ను దురాక్రమించిన తరువాత చైనా నేపాల్, లడక్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రాంతాలను కలుపుకోవాలన్న వ్యూహాన్ని అమలు జరుపుతోంది. ‘‘చైనా చేతికి టిబెట్ ‘అరచేయి’ అని, మన దేశంలోని సిక్కిం, లడక్, అరుణాచల్ ప్రాంతాలతోపాటు నేపాల్ భూటాన్‌లు వేళ్లు అని’’ 1950వ దశకం నుండీ చైనా ప్రచారం చేసింది. చైనా దురాక్రమణ ప్రవృత్తికి ఇది ఒక నిదర్శనం మాత్రమే! ఈ వ్యూహం అమలులో భాగంగానే చైనా నేపాల్‌లో ‘మావోయిస్టుల’ను తయారుచేసింది. 1994- 2004 సంవత్సరాల మధ్య మావోయిస్టు బీభత్సకాండకు పదమూడు వేలమంది నేపాలీలు బలైపోయారు. 2008 నుంచి మావోయిస్టులు సాయుధ బీభత్సకాండను మానుకున్నారు, రాజ్యాంగ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమయ్యారు. అయినప్పటికీ చైనాకు అనుకూలంగా ఈ ‘రాజ్యాంగ ప్రక్రియ’ను మావోయిస్టులు సాగిస్తున్నారు. కానీ నేపాల్ సాధారణ ప్రజలుమాత్రం మన దేశంలో మైత్రిని వాంఛిస్తున్నారు. అందువల్లనే ప్రభుత్వ నిర్వాహకులు ఎవరు అయినప్పటికీ మన దేశంతో అనుసంధాన్ని పెంచుకొనడం అనివార్యం అవుతోంది!