సంపాదకీయం

గోరక్షణ చేయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవంశ పరిరక్షణకు సమగ్రమైన బిల్లును రూపొందించి, పార్లమెంటుకు సమర్పించి చట్టం చేసినట్టయితే ప్రజలు సంతోషిస్తారు, ప్రకృతి సంతోషిస్తుంది, వ్యవసాయ భూమి పరిపుష్టం అవుతుంది. ఆవులను దూడలను కోడెలను పెయ్యలను ఎద్దులను పెంచడం వల్ల వ్యవసాయానికి కావలసిన సహజమైన ఎఱువులు లభిస్తాయి. ఫలితంగా వ్యవసాయ భూమి నిరంతరం పరిపుష్టం అవుతుంది. వ్యవసాయం విష రసాయనాల ఎఱువుల నుంచి, కాలుష్యం నుంచి విముక్తం అవుతుంది. రసాయన విషపుటెఱువుల వాసనలతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రకృతి మళ్లీ సహజమైన ఎఱువుల పరిమళాలను పీల్చుకోగలుగుతుంది. స్వచ్ఛత ఏర్పడుతుంది. ఇది పరిసరాల స్వచ్ఛత. గోమయం- ఆవుపేడ- గవ్యాలు- ఆవునుంచి లభించే పాలు తదితర ఉత్పత్తులు- ఎఱువులుగా పండిన భూముల పంటలు తినడం వల్ల మానవుల ఆరోగ్యం పెంపొందుతుంది. ఎండోసల్ఫాన్ వంటి క్రిమిసంహారకాలు వాడిన భూమినుంచి లభించే కూరగాయలు, ధాన్యాలు భోంచేస్తున్నవారు చిత్ర విచిత్ర రోగాలకు గురవుతున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ధ్రువపడిన వాస్తవం. ఎండోసల్ఫాన్ వంటి విషాలకు ప్రత్యామ్నాయం గోమూత్రం- ఆవు పంచితం-! ఈ ‘సురభి జలం’ సోకిన పంటలు తెగుళ్లనుంచి విముక్తం కావడం చరిత్ర. బ్రిటన్ దురాక్రమణ ఫలితంగా ‘గవ్యాలు’ ఎఱువులుగాను, క్రిమినాశక ఔషధాలుగాను వాడే వ్యవసాయ వ్యవస్థ నశించింది. రసాయన విషాలు ఎఱువులుగా రంగప్రవేశం చేశాయి. మానవ ఆరోగ్య స్వచ్ఛత, ప్రకృతి స్వస్థత చెడిపోవడానికి ఇదీ కారణం. స్వచ్ఛ్భారత్ పునర్ నిర్మాణ ప్రక్రియ విజయవంతం కావడానికి ఆవులను, గోసంతతిని, పాడి పశువులను పరిరక్షించి వాటి సంఖ్యను పెంపొందించడం అనివార్యం. ఈ అనివార్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ‘పాడి పశువుల రోగ నిరోధక జాతీయ పథకం’- నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్- శుభారంభానికి పూర్వరంగం- ఈ దేశవ్యాప్త పథకాన్ని ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బుధవారం ప్రధాని మోదీ ఆరంభించడం గో, పశు పరిరక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. గోపరిరక్షణ భారతీయ జీవన విధానం. ఈ సాంస్కృతిక జీవన వాస్తవం. ఆర్థిక, భౌతిక ప్రగతికి కూడ దోహదకరం కావడం తరతరాల చరిత్ర..
ఈ చరిత్రను విదేశీయ బర్బర బీభత్సకారులు చెఱచిపోయారు. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది నుంచి మన దేశంలోకి చొఱబడిన ‘జిహాదీ’ బీభత్సకారులు- ఆరబ్బులు, తురుష్కులు, మంగోలీయ ముష్కరులు, మొఘలులు-, పదహేనవ శతాబ్ది చివరి నుంచి దురాక్రమించిన ఐరోపా గోమాంస భక్షకులు ఆవులను, పశువులను, వన్యమృగాలను, వనాలను హత్యచేయడం వల్ల దేశంలో పశుసంపద క్షీణించింది. కలియుగ ఆరంభంలో అంటే ఐదువేల నూట ఇరవయి ఏళ్లకు పూర్వం మన దేశంలో దాదాపు రెండువందల ‘తెగ’ల ఆవులు ఉండేవట. కానీ ప్రస్తుతం దేశంలో ఇరవై తొమ్మిది ‘తెగల’ ఆవులు మాత్రమే మిగిలి ఉన్నాయట. జిహాదీలు, ఆంగ్లేయులు నేర్పించిన ‘గోహనన’ కార్యక్రమం బ్రిటన్ విముక్త భారతదేశంలోనూ యథావిధిగా కొనసాగింది. ఫలితంగా 1947లో నూట ఇరవై మూడు కోట్ల గోవులు-ఆవులు కోడెలు దూడలు- ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం పదహైదు కోట్లు. 1947లో సగటున ప్రతి మనిషికీ నాలుగు గోవులు దేశంలో ఉండేవి, అప్పటి జనాభా ముప్పయి కోట్లు కాబట్టి.. ప్రస్తుతం జనాభా నూట ఇరవై ఎనిమిది కోట్లు. అంటే ప్రతి ఎనిమిది మందికీ కేవలం ఒక ‘ఆవు’మాత్రమే ఉంది. ఇలా జనం పెరిగి గోసంతతి దారుణంగా తగ్గడానికి కారణం యాంత్రిక పశువధశాలలు. దేశంలో కేవలం నాలుగు శాతం మంది ఆవు మాంసం తింటున్నారన్నది అనేక అధ్యయనాల-సర్వేలు- ద్వారా ధ్రువపడిన వాస్తవం. వీరిలో కూడ ఒకటిన్నర శాతం మాత్రమే నియతంగా ఆవుమాంసం తింటున్న వారట. అందువల్ల గోమాంస భక్షకులవల్ల గోసంతతికి పెద్దగా ప్రమాదం సంభవించడం లేదు. మన దేశంలోని ఆవులు విష రసాయనాలు సోకని అడవి గడ్డి తినడం యుగయుగాల కథ. మన దేశపు సరిహద్దులకు ఆవల ఉన్న దేశాలలోని గోమాంస భక్షకులకు భారతీయ గోమాంసం మిక్కిలి రుచికరమట. యాంత్రిక వథశాలలలో వందల వేల గోసంతతిని హత్యచేసి మాంసాన్ని డబ్బాలలో భద్రపరచి విదేశాలకు ఎగుమతి చేయడం ఆరంభమైంది. ఫలితంగా ఏడు దశాబ్దులలోనే కోట్లకొలది ఆవులు, పాడి పశువులు హత్యలకు గురై అంతరించిపోయాయి..
గోవధ నిషేధ ఉద్యమాలు కొనసాగుతుండడానికి ఇదీ నేపథ్యం. గోవధను నిషేధించడానికి, ఆవులను దూడలను ఇతర పాడి పశువులను పరిరక్షించడానికి సమగ్ర చట్టం చేయాలని రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణం నిర్దేశిస్తోంది. ఈ మార్గదర్శక సూత్రానికి అనుగుణంగా జాతీయస్థాయిలో చట్టం ఏనాడో రూపొంది ఉండవలసింది. రూపొందకపోవడం ఏడు దశాబ్దుల ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల క్రూరమైన నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం పాడి పశువులను బలిగొనింది, ఈ నిర్లక్ష్యం వ్యవసాయ భూమిని, ప్రకృతిని కాలుష్యవంతం చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అరవై కోట్ల పాడి పశువులకు రోగ నిరోధక ‘టీకా’లను వేయించడానికి జాతీయ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఇందుకోసం దాదాపు పదమూడు వేల కోట్లరూపాయలను ప్రభుత్వం ఖర్చుచేస్తుందట. ఆరోగ్యంతో ఆహ్లాదకరంగా జీవించే పాడి పశువులు ప్రధానంగా ఆవులు హత్యకు గురికాకుండా నిరోధించడం ఇంతకంటె ప్రధానం. ఆవుల ఆరోగ్యం పెంపొందేకొలదీ హంతకుల నోళ్లు మరింత ఊరవచ్చు. బ్రిటన్ దుండగులకు, జిహాదీ హంతకులకు ఇలా నోళ్లు ఊరడం చరిత్ర. క్రీస్తుశకం పదమూడువందల ఇరవై మూడవ సంవత్సరంలో విదేశీయ జిహాదీ దుండగులు వంచనతో ఓరుగల్లు కోటను ధ్వంసం చేశారు, కాకతీయ సామ్రాజ్యాన్ని హత్యచేశారు. వెంటనే తెలుగునేలపై జిహాదీలు భయంకర అత్యాచారాలు జరిపారు, ప్రధానమైనది గోవధ... నడిబజారులలో ‘జిహాదీ’లు కోడెలను పెయ్యలను చిత్రవధ చేసి హత్యచేసిన దృశ్యాలు చరిత్ర పుటలను రక్తసిక్తం చేసిన భయంకర విషాద ఘట్టాలు. ‘పాలకుల’ పేరుతో చెలామణి అయిన ‘జిహాదీ’లు భారత జాతీయ సంస్కృతిని కించపరచడంలో భాగంగా శతాబ్దులపాటు ‘గోహత్య’లను ప్రోత్సహించారు. పదిహేడవ శతాబ్దినాటి ఛత్రపతి శివాజీ గోవధ పట్ల కలత చెందడానికి నిరసించడానికి ఇదంతా నేపథ్యం...
‘‘జనకా! నామతమున్ వచించెద
హరిశ్చంద్రాది రాజన్యులే
లిన ఈ భారతభూమి ‘గోహనన’
మాలిన్యంబులన్ బాసి ప్రా
క్తన జాతీయతనందగావలెను
‘‘సుల్తానైన’’ నేటి పా
లన సూత్రమ్ముల మార్చివేయవలె
కల్యాణంబు మ్రోయన్ వలెన్!’’
..అని తన తండ్రికి వ్రాసిన ఉత్తరంలో పనె్నండేళ్ల బాలుడైన ఛత్రపతి శివాజీ గోవధ నిషేధం అమలు జరగాలని స్పష్టం చేశాడు. మహాకవి గడియారం వేంకట శేషశాస్ర్తీ తన శివభారతంలో దర్శించిన దృశ్యమిది. 2014నుంచి ప్రభుత్వం గోరక్షణ నియమావళిని రూపొందించింది. కానీ గోహంతకుల ఒత్తిడికి లొంగి దానిని పదేపదే సడలించి వేసింది. గోపరిరక్షణ నిష్ఠను ప్రధాని మోదీ బుధవారం పునరావిష్కరించడం ముదావహం. నిష్ఠ నిజరూపం ధరించాలి. దేశ హితకరమైన విప్లవాత్మక నిర్ణయాలను గత మూడునెలలుగా కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇదే స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సర్వసమగ్ర గోవధ నిషేధ చట్టాన్ని వెంటనే రూపొందించి అమలు చేయాలి.
ఇది గాంధీ మహాత్ముని సార్థశత జయన్తి సంవత్సరం. గోపరిరక్షణ మహాత్ముని జీవన విధానంలో ప్రధానమైన అంశం! హత్యకు గురైన ఆవు చర్మంతో చెప్పులను కుట్టించుకోరాదన్నది గాంధీ ఆచరించి చూపిన జీవన సూత్రం. సహజంగా మరణించిన ఆవుచర్మాన్ని, గోసంతతి చర్మాన్ని మాత్రమే గాంధీ, ఆయన అనుచరులు ఉపయోగించుకున్నారు. మహాత్ముడు ఈ సంగతిని స్వయంగా ప్రకటించి ఉన్నాడు. ‘వార్థా’ ఆశ్రమంలో ఇలాంటి ‘సహజ మృత గోచర్మాన్ని’వాడి చెప్పులు, సంచులు తయారుచేసేవారట! అందువల్ల సంపూర్ణ గోవధ నిషేధ చట్టం ‘సార్థశత జయన్తి’- నూట యాబయ్యవ జయన్తి- వత్సరంలో మహాత్మునికి నిజమైన నివాళి కాగలదు!!