సంపాదకీయం

మతం.. జాతీయతత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలో రఘురాముడు జన్మించిన స్థలం దశాబ్దులపాటు, శతాబ్దులపాటు వివాదగ్రస్తం కావడం ‘ప్రతీక’ మాత్రమే. ‘జాతీయత’ను ‘మత’మని భ్రమించడం వౌలికమైన అనభిజ్ఞత! ఈ ‘అనభిజ్ఞత’- ఇగ్నోరెన్స్- కారణంగా దేశంలో ఏడు దశాబ్దులకు పైగా అనేకానేక అర్థరహిత వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ ‘భ్రమ’ను ఈ ‘అనభిజ్ఞత’ను బ్రిటన్ దురాక్రమణదారులు రెండు శతాబ్దులపాటు పథకం ప్రకారం మన దేశంలో వ్యవస్థీకరించిపోయారు. మన విద్యావంతులలోను మేధావులలోను రాజకీయ వేత్తలలోను అత్యధికులు ఇప్పటికీ ఈ ‘భ్రమ’కు ఈ ‘అనభిజ్ఞత’కు గురైఉన్నారు. ‘భ్రమ’తొలగిన ‘అభిజ్ఞత’కలిగినవారు చెబుతున్న జాతీయ వాస్తవాలను ఆ మేధావులు, విద్యావంతులు, రాజకీయవేత్తలు విశ్వసించడం లేదు. బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశపు యుగయుగాల అద్వితీయ జాతీయతను ఒక ‘మతం పరిధి’లో ఇరికించిపోయారు. మతాలు, భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు, ఆలోచన రీతులు, విద్యలు, వాణిజ్య వ్యవసాయ వ్యవస్థలు, ఆహార ఆహార్య అలంకరణలు ఇంకా ఎనె్నన్నో వైవిధ్యాలు అనాదిగా మన ‘జాతీయత’లో వికసించాయి. ఇవన్నీ ‘జాతీయత’లో భాగం! అనేక వైవిధ్యాల సర్వసమగ్ర సంపుటమైన అద్వితీయ జాతీయత మనది. మతాలు తదితరాలు అనేకం ఉన్నప్పటికీ అనాదిగా మన ‘జాతీయత’ఒక్కటే, జాతీయ సంస్కృతి ఒక్కటే! ఈ జాతీయత పేరు ‘సనాతనం’ ‘అజనాభం’, ‘ భారతీయత’, ‘హిందుత్వం’! వివిధ సమయాలలో మన జాతీయత ఈ పేర్లతో ప్రసిద్ధికెక్కింది. వీటిలో చివరిది గత రెండు వేల ఏళ్లుగా ప్రసిద్ధికెక్కినది ‘హిందుత్వం’. ‘హిందుత్వం’కాని ‘ భారతీయత’కాని పర్యాయపదాలు! అవి ఈ దేశపు జాతీయ వౌలిక అస్తిత్వం పేర్లు. ప్రపంచ చరిత్ర విశ్వవ్యవస్థ చరిత్ర భూగోళ ప్రజలందరికీ సమానం. కానీ చారిత్రక స్మృతి విషయంలో ప్రపంచంలోని వివిధ జాతుల మధ్య తేడా ఉంది. కొన్ని జాతుల స్మృతి వందల ఏళ్లకు పరిమితమై ఉంది. మరికొన్ని ప్రపంచ దేశాల జాతుల చారిత్రక స్మృతి వేల ఏళ్లకు పరిమితమై ఉంది. భారత జాతి లేదా హైందవ జాతి చారిత్రక స్మృతి ఆద్యంత రహితంగా విస్తరించి ఉంది. యుగాలుగా, మన్వంతరాలుగా, కల్పాలుగా అనంతంగా అనాదిగా కొనసాగుతున్న చరిత్ర భారత జాతిది లేదా హైందవ జాతిది! ఈ చరిత్రను మనం యుగాలుగా వ్రాసుకున్నాము. గుర్తుపెట్టుకున్నాము. ఈ చారిత్రక క్రమంలో మొదట మన జాతి పేరు సనాతన- శాశ్వతమైన- జాతి! ‘అజనాభం’అని అంటే సృష్టిలో మానవులు మొదట ఏర్పడిన చోటు. తొలి మానవుడు మన దేశంలో నివసించాడు. అందువల్ల మనది ‘అజనాభ’ జాతి అయింది! మన దేశం నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు జనం వలస వెళ్లారన్నది యుగయుగాల చారిత్రక వాస్తవం. తొలి రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రం మన దేశం. తొలి పాలకుడు ‘మనువు’. ‘‘పాలకుడు ప్రజలను భరిస్తాడు. అందువల్ల అతడు భరతుడు’’- భరణాత్ చ ప్రజానాం వై మనుః భరత ఉచ్యతే-అన్నది మన చరిత్రకారుల మాట. అలా తొలి పాలకుడైన ‘స్వాయంభువ మనువు’ తొలి భరతుడు. అతడు సరస్వతీ నదీ ప్రాంతంలో నివసించాడు. అతని- ఆ భరతుని- పేరుతో ఇది భరతజాతి, భారతదేశం..
ప్రస్తుత కలియుగం మొదలైన తరువాత ఐదువేల నూట ఇరవై ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం ఐదువేల నూట ఇరవై ఒకటవ సంవత్సరం నడుస్తోంది. కలియుగం ముప్పయి రెండవ శతాబ్దిలో ప్రమర వంశపు శాలివాహనుడు నూతన శకాన్ని స్థాపించాడు. శాలివాహన శకం ప్రస్తుతం మన జాతీయ శకం, ఇది శాలివాహన శకంలో పంతొమ్మిది వందల నలబయి ఒకటవ సంవత్సరం. శాలివాహనుడు మన దేశానికి హిందూ దేశం అని పేరుపెట్టాడని- హిందుస్థానం ఇతి జ్లేయం- అని మన చరిత్రకారులు చెప్పారు. అలా గత రెండువేల ఏళ్లు మన దేశం ‘హిందూ జాతి’గా, మన ప్రజలు ‘హిందువు’లుగా కొనసాగుతుండడం చరిత్ర. ఈ దేశంలోని అన్ని మతాలవారు, భాషా సముదాయాలవారు, అన్ని ప్రాంతాలవారు- హిందువులే! అందరూ ఒకే జాతివారు! ఈ జాతీయ వాస్తవాన్ని శతాబ్దులపాటు విదేశీయులు కూడ గుర్తించారు. బ్రిటన్ దురాక్రమణదారులు దుర్బుద్ది పూర్వకంగా ఈ వాస్తవాన్ని చెఱచిపోయారు. ‘జాతీయత’ అయిన ‘హిందుత్వాన్ని’ కేవలం ఒక ‘మతం’గా ప్రచారంచేసి మన బుర్రలకు ఎక్కించి వెళ్లారు. ఈ భావదాస్యం వదలకపోవడం ‘రామజన్మభూమి’ వివాదం మాత్రమేకాక అనేకానేక విచ్ఛిన్నకర వివాదాలు తలెత్తడానికి కారణం!
‘జాతీయత’ను ‘మతం’గా ప్రచారం చేయడం బిందువుల సమాహారమైన సింధువును కేవలం బిందువని చెప్పడం వంటిది, అనేక గదులున్న భవనాన్ని ఒక గదిగా చిత్రీకరించడం వంటిది, వివిధ వృక్ష సమాహారమైన వనాన్ని కేవలం ఒక చెట్టు అని భ్రమించడం వంటిది. బ్రిటన్ ‘దొరలు’ ఇలా వక్రీకరించిపోయారు. సకల భారతీయుల సమష్టి జాతీయత అయిన హిందుత్వం కేవలం మతమని ఇప్పటికీ చాలా మంది మేధావులు విద్యావంతులు భ్రమిస్తున్నారు. జాతీయత మతం స్థాయికి దిగజారడంతో జాతీయ సంస్కృతిని మతతత్త్వంగా భావించడం- భ్రమించడం మొదలైంది. అన్ని మతాల, అన్ని భాషల, ప్రాంతాల వారికి సమానమైన జాతీయ సంస్కృతిని కొన్ని మతాలవారు తమదికాదని భావించే దుస్థితి దాపురించింది. జాతీయ మహాపురుషులను కేవలం ఒక మతానికి పరిమితంచేసి అవమానిస్తున్న వికృతి వ్యాపించింది. అనాదిగా ఈ దేశంలో జన్మించి ఈ మాతృభూమి హితం కోసం, మాతృ జాతీయుల అభ్యుదయం కోసం కృషిచేసిన వేలాది మహనీయులు జాతీయ మహాపురుషులు. వీరు ఈ జాతికి చెందిన అన్ని మతాలవారికీ సమానంగా పూర్వులు, సమానంగా సమ్మాననీయులు, ఆరాధ్యులు, అనుసరణీయులు. బ్రిటన్ దుండగులు హిందుత్వాన్ని ‘మతం’గా ముద్రవేసిన తరువాత బ్రిటన్ దురాక్రమణ పూర్వ జాతీయవీరులు, జాతీయ మహాపురుషులు మత నాయకులుగా మారిపోయారు. కేవలం బ్రిటన్ వ్యతిరేక సమరాన్ని, ఉద్యమాన్ని నడిపినవారు మాత్రమే జాతీయ నాయకులన్న భ్రాంతి ప్రబలింది. రఘురాముడు, యదుకుల కృష్ణుడు వంటి జాతీయ మహాపురుషులను కొన్ని మతాలవారు వ్యతిరేకిస్తుండడానికి ఇదీ నేపథ్యం..
ప్రస్తుతం అయోధ్య రామజన్మభూమి వివాదం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. న్యాయస్థానం తీర్పుచెప్పనుంది. ఈ వివాదం, వివాద పరిష్కారం విస్తృత సమస్యలో ఒక అంశం మాత్రమే! ‘జాతీయత’ కేవలం ఒక మతం కాదని వివిధ మతాల, సకల వైవిధ్యాల సమాహారమని ఎప్పుడైనా అందరూ గుర్తించాలి! ఇప్పుడు గుర్తించవచ్చు. విస్తృత వైపరీత్యం తొలగడానికి ఈ గుర్తింపు అనివార్యం! అనాదిగా మన దేశంలో అనేక మతాలు వికసించాయి, పాత మతాలు కొన్ని అంతరించాయి. కొత్త మతాలు పుట్టాయి. అనాదిగా ఉన్న మతాలు కొన్ని రూపాంతరం చెందాయి. ఈ మతాలన్నింటికీ ప్రాతిపదిక వేద విజ్ఞానం. వేద విజ్ఞాన ప్రామాణ్యాన్ని అంగీకరించని మతాలు కూడ ఈ దేశంలో పరిఢవిల్లాయి. దేవుడు ఉన్నాడన్న మతాలు, దేవునితో నిమిత్తం లేని మతాలు, దేవుడు లేడన్న మతాలు! ఇలా ఎన్నో వైదిక అవైదిక మతాలు పరిఢవిల్లాయి, పరిఢవిల్లుతున్నాయి. శైవ, వైష్ణవ, శాక్తీయ, సౌర, గాణాపత్య, స్కాంద, స్మార్త, మాధ్య, అద్వైత, బౌద్ధ, జైన, సిక్కు, ఆర్యసమాజ, చార్యాక వంటివి ఈ దేశంలోని మతాలలో కొన్ని మాత్రమే! ఈ మతాలవారు తమ మతం ఈ ‘జాతి’లో భాగమని భావించారు, తమ మతం ప్రత్యేక ‘జాతి’అని భావించలేదు. ఈ మతాలన్నీ అనాదిగా ’హిందూజాతి’లో భాగం! విదేశాలనుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలను స్వీకరించిన హిందువులకు సైతం ఈ ‘జాతీయతా’సూత్రం సమానంగా వర్తిస్తోంది. అనాదిగా ఉన్న తోటలోకి రెండు కొత్త మొక్కలు వచ్చాయి, ఆ కొత్త మొక్కలు కూడ ఆ తోటలో భాగమే, తోటనుంచి వేఱుకాదు! ఇస్లాం, క్రైస్తవం సహా ఈ దేశంలోని అన్ని మతాలవారూ హిందూ జాతీయులే! ఈ వాస్తవం వెలిగిననాడు వివాదాలు తొలగిపోగలవు. జాతీయ మహాపురుషుల పరంపరను అన్ని మతాలవారూ సమానంగా ఆదరించగలరు...